ఉత్పలమాల.
తేజితబాణహస్తు ద్రుఢదీర్ఘ మలీమసకృష్ణదేహుఁ గృ
ష్ణాజినవస్త్రు నస్త్రవిషయా స్తవిషాదుఁ నిషాదుఁ జూచి యా
రాజకుమారు లందఱుఁ బరస్పరవక్త్రువిలోకనక్రియా
వ్యాజమునం దదీక్షణవివారితు లై రతిమత్సరంబునన్. 1_5_235
వచనము.
అక్కుమారులు వాని శరలాఘవంబునకు మెచ్చి నీ వెవ్వండ వెవ్వరిచేత
విలువిద్యఁ గఱచి తని యడిగిన వారికి నయ్యెఱు కి ట్లనియె. 1_5_236
కందము.
వినుఁ డే హిరణ్యధన్వుం
డనువనచరనాథుకొడుక నాచార్యుఁడు ద్రో
ణునకున్ శిష్యుఁడ నెందును
ననవద్యుఁడ నేకలవ్యుఁ డనువాఁడ మహిన్. 1_5_237
వచనము.
అనిన విని కురుకుమారు లందఱు మగుడివచ్చి ద్రోణున కంతయుఁ జెప్పి
రంత నర్జునుం డేకాంతంబ యొక్కనాఁ డాచార్యున కి ట్లనియె. 1_5_238
కందము.
విలువిద్య నొరులు నీ క
గ్గలముగ లేకుండ నిన్నుఁ గఱుపుదు నని మున్
బలికితిరి నాక కా దీ
త్రిలోకముల కధికుఁ జూచితిమి యొక యెఱుకున్. 1_5_239
కందము.
నాకంటెను మీకంటెను
లోకములో నధికుఁ డతిబలుండు ధనుర్వి
ద్యాకౌశలమున నాతఁడు
మీకుం బ్రియశిష్యుఁ డటె యమిథ్యావచనా. 1_5_240
వచనము.
అనిన విని ద్రోణుం డదిరిపడి వానిం జూతుము ర మ్మని యర్జునుం దోడ్కొని
యనవరతశరాసనాభ్యాసనిరుతం డయి యున్న యేకలవ్యు కడ కేఁగిన
నెఱింగి వాఁడు నెదురు పఱతెంచి ద్రోణునకు మ్రొక్కి తనశరీరంబుసర్వ
స్వంబును నివేదించి యేను మీశిష్యుండ మి మ్మారాధించి మీప్రసాదంబున
నివ్విలువిద్యఁ గఱచితి నని కరంబులు మొగిచియున్న జూచి ద్రోణుం డట్లేని
మాకు గురుదక్షిణ యి మ్మనిన సంతసిల్లి వాఁడిట్లనియె. 1_5_241
కందము.
యిది దేహం బిది యర్థం
బిది నా పరిజనసమూహ మిన్నిటిలో నె
య్యది మీ కిష్టము దానిన
ముద మొదవఁగ నిత్తుఁ గొనుఁ డమోఘం బనినన్. 1_5_242
కందము.
నెమ్మిని నీదక్షిణహ
స్తమ్మున పెనువ్రేలు దునిమి దక్షిణ ఇమ్మి
ష్ట మ్మిది నా కనవుడు విన
యమ్మున వాఁడిచ్చె దాని నాచార్యునకున్. 1_5_243
తేటగీతి.
దక్షిణాంగుష్ఠ మిచ్చిన దానఁ జేసి
బాణసంధానలాఘవభంగ మయిన
నెఱుకు విలువిద్యకలిమికి హీనుఁ డయ్యెఁ
బార్థునకును మనోరజ పాసె నంత. 1_5_244
కందము.
విలువిద్య నొరులు నీ క
గ్గలముగ లేకుండ నిన్నుఁ గఱపుదు నని మున్
బలరిపుసుతునకుఁ బలికిన
పలు కప్పుడు గురుఁడు సేసెఁ బరమార్థముగన్. 1_5_245
మత్తకోకిలము.
భూపనదను లివ్విధంబున భూరిశస్త్రమహాస్త్రవి
ద్యోపదే్శపరిగ్రహస్థితి నున్న నందఱయందు వి
ద్యోపదేశము దుల్య మైనను నుత్తమోత్తముఁ డయ్యె వి
ద్యాపరిశ్రమకౌశలంబున దండితారి నరుం డిలన్. 1_5_246
కందము.
అనిలాత్మజుబలమును న
ర్జునుకార్ముకకౌశలంబు శూరగుణంబుల్
మనమున సహింప నోపక
వనరుచు ధ్రుతరాష్ట్రసుతులు వందిరి తమలోన్. 1_5_247
-: ద్రోణుఁ డస్త్రవిద్యం దనశిష్యులఁ బరీక్షించుట :-
సం. 1_123_15
వచనము.
అక్కుమారుల ధనుర్విద్యాకౌశలం బెఱుంగ వేఁడి యొక్కనాఁడు ద్రోణుండు కృత్రిమం బయిన భాసం బను పక్షి నొక్కివృక్షశాఖాగ్రంబున లక్ష్యంబుగ రచియించి దాని నందఱుకుఁ జూపి మీ మీ ధనువుల బాణంబులు సంధించు నాపంచని యప్పుడ యిప్పక్షితలఁ దెగ నేయుం డే నొకళ్ళనొకళ్ళన పంచెద నని ముందఱ ధర్మనందనుం బిలిచి యీ వృక్షశాఖాగ్రంబుననున్న పక్షి నిమ్ముగా నీక్షించి మద్వచనానంతరంబున శరమోక్షణంబు సేయు మనిన నతండును వల్లె యని గురువచనంబు సేసియున్న నయ్యుధిష్ఠిరునకు ద్రోణుం డి ట్లనియె. 1_5_248
తేటగీతి.
వృక్షశాఖాగ్రమున నున్న పక్షిశిరము
దెల్లముగఁ జూచితే మహీవల్లభుండ
యనిన నిమ్ముగఁ జూచితి ననిన వెండి
యును గురుఁడు డర్మజున కిట్టు లనియెఁ బ్రీతి. 1_5_249
కందము.
జననుత యామ్రానిని న
న్నును మఱి నీ భ్రతృవరులనుం జూచితె నీ
వనవుడుఁ జూచితి నన్నిటి
ననఘా వృక్షమున నున్న యవ్విహగముతోన్. 1_5_250
వచనము.
అనిన విని ద్రోణుండు ధర్మజుం బదరి నీదృష్టి చెదరె నీవు దీని వేయనోపవు పాయు మని యవ్విధంబున ధుర్యొద్గనాదు లైన ధార్తరాష్ట్రులను భీమసేన నకులసహదేవులను నానాదేశాగతు లయిన రాజపుత్త్రులను గ్రమంబున నడిగిన వారలు ధర్మనదనుచెప్పినట్ల చెప్పిన నందఱ నిందించి పురందర నందనుం బిలిచి వారి నడిగినయట్ల యడిగిన నాచార్యునకు నర్జునుం డి ట్లనియె. 1_5_251
కందము.
పక్షిశిరంబు దిరంబుగ
నీక్షించితి నొండు గాన నెద్దియు ననినన్
లక్షించి యేయు మని సూ
క్ష్మేక్షణు ద్రోణుండు పనిచె నింద్రతనూజున్. 1_5_252
కందము.
గురువచనానంతరమున
నరుఁ డప్పుడు శరవిమోక్షణము సేయుఁడుఁ జె
చ్చెరఁ బక్షిశిరము దెగి త
ద్ధరణీరుహశాఖనుండి ధారణిఁ బడియున్. 1_5_253
వచనము.
ఇట్లశ్రమంబునఁ గృత్రిమబక్షితలఁ దెగనేసిన యర్జునునచలితదృష్టికి లక్ష్య వేధిత్వంబునకు మెచ్చి ద్రోణుం డాతనికి ధనుర్వేదరహస్యంబు లుప దేసించె నంత. 1_5_254
-: అర్జునుఁడు ద్రోణుని మొసలినుండి విడిపించుట :-
కందము.
మనుగ రాకుమారుల
తో నొక్కట నొక్కనాఁడు ద్రోణుఁడు గంగ
స్నానార్థ మరిగి యందు మ
హానియమస్థుఁ డయి నీళ్ళ నాడుచునున్నన్. 1_5_255
కందము.
వెఱచెఱవ నీరిలో నొ
క్కెఱగా నొక మొసలి చూడ్కికి నగోచర మై
పఱతెంచి కుంభసంభవు
చిఱుదొడ వడిఁ బట్టికొనియె శిష్యులు బెదరన్. 1_5_256
కందము.
దాని విడిపింప ద్రోణుఁడూ
దా నపుడు సమర్థుఁ డయ్యు దడయక పనిచెన్
దీని విడిపింపుఁ డని నృప
సూనుల శరసజ్యచాపశొభితకరులన్. 1_5_257
శార్దూలం.
దానిన్ నేరక యందఱున్ వివశు లై తా రున్న నన్నీరిలోఁ
గానంగాని శరీరముం గల మహోగ్రగ్రాహమున్ గోత్రభి
త్సూనుం డేనుశరంబులన్ విపులతేజుం డేసి శక్తిన్ మహా
సేనప్రఖ్యుఁడు ద్రోణుజంఘ విడిపించెన్ విక్రమం బొప్పఁగన్. 1_5_258
వచనము.
అమ్మహోగ్రగ్రాహంబు పార్థబాణపంచకవిభిన్నదేహం బయి పంచత్వంబు బొందినం జూచి ద్రోణుం డర్జునుధనుఃకౌశలంబునకుఁదనయం దతిస్నేహంబునకు మెచ్చి వీనిచే ద్రుపదుండు బంధుసహితంబు పరాజితుండగు నని యర్జునుకొండుకనాఁటి పరాక్రమగుణసంపదలు వైశంపాయనుండు జనమేజయునకుంజెప్పెనని. 1_5_259.
ఆశ్వాశాంతము
కందము.
వ్యససవివర్జితమాన
వ్యసగోత్రపవిత్ర విష్ణువర్ధననృప స
ప్తసముద్రముద్రితఖిల
వసుధాజన గీతకీర్తి వాసవమూర్తీ. 1_5_260
వనమయూరము.
రాజకులశేఖర పరంతపవివేక
భ్రాజిత జగద్వలయభాసురసముద్య
త్తేజ నిరవద్య యువతీమదన వీరో
గ్రాజివిజయా త్రిభువనాంకుశ నరేంద్రా. 1_5_261
గద్యము.
ఇది సకలసుకవిజనవినుత నన్నయభట్ట ప్రణీతంబైన శ్రీమహాభారతంబునం
దాదిపర్వంబున ధ్రుతరాష్ట్రపాడురాజుల వివాహంబును
బాండురాజదిగ్విజయంబును బాండవ ధార్తరాట్రసంభవంబును
గుమారాస్త్రవిద్యాగ్రహణంబును నన్నది.
పంచమాశ్వాశము.