1_3_61 వచనము

పదంపడి యేఁబండ్రు గూఁతులుం బుట్టిన వారల నెల్ల దక్షుం డపుత్త్రకుండు గావునఁ బుత్త్రీకరణంబు సేసి యందుఁ గీర్తి లక్ష్మీ ధృతి మేధా పుష్టి శ్రద్ధా క్రియా బుద్ధి లజ్జా మతులను వనితలఁ బదుండ్రను ధర్ముండను మనువున కిచ్చె నశ్విన్యాదులైన యిరువదేడ్వురను జంద్రున కిచ్చె నదితి దితి దను కాలానాయు స్సింహికా ముని కపిలా వినతా క్రోధా ప్రాధా క్రూరా కద్రువలను పదుమువ్వురను గశ్యపున కిచ్చె నం దదితి యనుదానికి ధాతృ మిత్రార్యమశక్ర వరుణాంశు భగవివస్వత్పూష సవితృ త్వష్టృ విష్ణు లనంగా ద్వాదశాదిత్యులు పుట్టిరి మఱియును.

(దక్షుడికి యాభైమంది కుమార్తెలు పుట్టారు. వారిలో పదిమందిని ధర్ముడికి, ఇరవై ఏడుమందిని చంద్రుడికి ఇచ్చాడు. అదితి, దితి, దనువు, కాల, అనాయువు, సింహిక, ముని, కపిల, వినత, క్రోధ, ప్రాధ, క్రూర, కద్రువ అనే పదమూడు మందిని కశ్యపుడికి ఇచ్చాడు. వారిలో అదితికి ద్వాదశాదిత్యులు జన్మించారు.)


1_3_62 కందము

దితి యనుదానికి నప్రతి

హతబలుఁడు హిరణ్యకశిపుఁ డనఁ బుట్టె సుతుం

డతనికి నేవురు పుట్టిరి

ప్రతాపగుణయుతులు సుతులు ప్రహ్లాదాదుల్.

(ఇంకొక కుమార్తె అయిన దితికి హిరణ్యకశిపుడు పుట్టాడు. అతడికి ప్రహ్లాదుడు మొదలుగా అయిదుగురు కుమారులు పుట్టారు.)


1_3_63 వచనము

ఆ ప్రహ్లాద సంహ్లా దానుహ్లాద శిబి బాష్కళుల యందుఁ బ్రహ్లాదునకు విరోచన కుంభ నికుంభ లనంగా మువ్వురు పుట్టి రందు విరోచనునకు బలి పుట్టె బలికి బాణాసురుండు పుట్టె దను వను దానికి విప్రచిత్తి శంబర నముచి పులోమాసి లోమకేశి దుర్జయాదు లయిన దానవులు నలువండ్రు పుట్టిరి వారల పుత్త్రపౌత్త్రవర్గం బసంఖ్యాతంబై ప్రవర్తిల్లెఁ గాల యను దానికి వినాశన క్రోధాదులెనమండ్రు పుట్టిరి.

(ప్రహ్లాదుడికి పుట్టిన ముగ్గురు కుమారులలో ఒకడైన విరోచనుడికి బలి, బలికి బాణాసురుడు జన్మించారు. దనువు అనే కుమార్తెకు విప్రచిత్తి మొదలైన నలభైమంది దానవులు పుట్టారు. వారి సంతానం లెక్కించటానికి శక్యం కానిది. కాల అనే కుమార్తెకు ఎనిమిదిమంది పుట్టారు.)


1_3_64 ఆటవెలది

అజితశక్తియుతుల నాయువ యనుదాని

కజరు లధిక వీరు లతుల భూరి

భుజులు శక్రరిపులు పుట్టిరి నలువురు

విక్షర బలవీర వృత్రు లనఁగ.

(అనాయువు అనే ఆమెకు ఇంద్రుడి శత్రువులైన నలుగురు కుమారులు జన్మించారు.)


1_3_65 వచనము

మఱియు సింహిక యను దానికి రాహువుపుట్టె ముని యనుదానికి భీమసేనోగ్రసేనాదు లయిన గంధర్వులు పదార్వురు పుట్టిరి కపిల యనుదానికి నమృతంబును గోగణంబును బ్రాహ్మణులును ఘృతాచీ మేనకాదు లయిన యప్సరసలును బుట్టిరి వినత యనుదానికి ననూరుండును గరుడండును బుట్టి రం దనూరునకు శ్యేని యనుదానికి సంపాతిజటాయువులు పుట్టిరి క్రోధ యనుదానికిఁ గ్రోధవశగణంబు పుట్టెఁ బ్రాధ యనుదానికి సిద్ధాదులు పుట్టిరి క్రూర యనుదానికి సుచంద్ర చంద్రహంత్రాదులు పుట్టిరి కద్రువ యనుదానికి శేషవాసుకి పురోగ మానేక భుజంగముఖ్యులు పుట్టిరి.

(సింహికకు రాహువు, మునికి పదహారుమంది గంధర్వులు, కపిలకు అమృతం, గోవులు, బ్రాహ్మణులు, అప్సరసలు జన్మించారు. వినతకు అనూరుడు, గరుడుడు పుట్టారు. క్రోధకు క్రోధవశగణం, ప్రాధకు సిద్ధాదులు, క్రూరకు సుచంద్రాదులు జన్మించారు. కద్రువకు శేషుడు, వాసుకి మొదలైనవారు పుట్టారు.)


1_3_66 సీసము

మఱి యంగిరసుఁ డను మానసపుత్త్రున

కయ్యుతథ్యుండు బృహస్పతియును

సంవర్తుఁడును గుణాశ్రయయోగసిద్ధి య

న్కూఁతురు బుట్టి రక్కొడుకులందు

విభుఁడు బృహస్పతి వేల్పుల కాచార్యుఁ

డై లోకపూజితుఁడై వెలింగె

మానుగా నత్రి యన్మానసపుత్త్రున

కుద్భవించిరి ధర్మయుతచరిత్రు


ఆటవెలది

లఖిలవేదవేదు లాద్యు లనేకులు

దీప్త రవిసహస్రతేజు లనఘ

లధికతరతపో మహత్త్వ సంభృతవిశ్వ

భరులు సత్యపరులు పరమమునులు.

(అంగీరసుడనే మానసపుత్రుడికి ఉతథ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు, యోగసిద్ధి అనే కూతురు జన్మించారు. వారిలో బృహస్పతి దేవగురువు అయ్యాడు. అత్రి అనే మానసపుత్రుడికి చాలా మంది మునులు జన్మించారు.)


1_3_67 వచనము

మఱియుఁ బులస్త్యుం డను మానసపుత్త్రునకు ననేక రాక్షసులు పుట్టిరి పులహుం డను మానస పుత్త్రునకుఁ గిన్నర కింపురుషాదులు పుట్టిరి క్రతువను మానస పుత్త్రునకు సత్యవ్రత పరాయణులైన పతంగ సహచరులు పుట్టిరి పైతామహుండైన దేవుండను మునికిఁ బ్రజాపతి పుట్టె వానికి ధూమ్రా బ్రహ్మవిద్యా మనస్వినీ రతా శ్వసా శాండిలీ ప్రభాత లనంగా నేడ్వురు భార్యలై రందు ధూమ్రకు ధరుండును బ్రహ్మవిద్యకు ధ్రువుండును మనస్వినికి సోముండును రతకు నహుండును శ్వసకు ననిలుండును శాండిలికి నగ్నియుఁ బ్రభాతకుఁ బ్రత్యూష ప్రభాసు లనంగా నెనమండ్రు వసువులు బుట్టి రందు ధరుండను వసువునకు ద్రవిణుండును హుతహవ్యవహుండునుం బుట్టిరి ధ్రువుండను వసువునకుఁ గాలుండు పుట్టె సోముండను వసువునకు మనోహర యనుదానికి వర్చసుండును శిబిరుండును బ్రాణుండును రమణుండును బృథయను కూఁతురునుం బుట్టిరి పృథకుఁ బదుండ్రు గంధర్వపతులు పుట్టిరి యహుండను వసువునకు జ్యోతి పుట్టె ననిలుండను వసువునకు శివ యను దానికి మనోజవుండును నవిజ్ఞాతగతియునుం బుట్టిరి యగ్ని యను వసువునకుఁ గుమారుండు పుట్టెఁ బ్రత్యూషుం డను వసువునకు ఋషి యైన దేవలుండు పుట్టెఁ బ్రభాసుం డను వసువునకు బృహస్పతి చెలియ లైన యోగసిద్ధికి విశ్వకర్మ పుట్టె.

(పులస్త్యుడనే మానసపుత్రుడికి రాక్షసులు జన్మించారు. మిగిలినవారికి కిన్నరులు మొదలైనవారు జన్మించారు. ప్రభాసుడనే వసువుకు బృహస్పతి సోదరి అయిన యోగసిద్ధి భార్య. వారికి విశ్వకర్మ జన్మించాడు.)


1_3_68 కందము

ఆ విశ్వకర్మ నిర్మిత

దేవవిమానుండు నిఖిలదివ్యాభరణ

శ్రీ విరచన పరితోషిత

దేవుఁడు శిల్ప ప్రజాపతియు నై నెగడెన్.

(విశ్వకర్మ దేవతలకు విమానాలను నిర్మించినవాడు. అతడు శిల్పప్రజాపతిగా ప్రసిద్ధికెక్కాడు.)


1_3_69 వచనము

మఱియు స్థాణునకు మానసపుత్త్రులైన మృగవ్యాధ శర్వ నిరృత్యజైక పాద హిర్బుధ్న్య పినాకి దహనేశ్వర కపాలి స్థాణు భవు లనంగా నేకాదశ రుద్రులు పుట్టిరి మఱి బ్రహ్మదక్షిణ స్తనంబున ధర్ముండను మనువు పుట్టె వానికి శమ కామ హర్షు లనంగా మువ్వురు పుట్టిరి యా మువ్వురకుఁ గ్రమంబునఁ బ్రాప్తి రతి నందు లనంగా మువ్వురు భార్య లైరి సవితృనకు బడబా రూపధారిణి యైన త్వాష్ట్రికి నశ్వినులు పుట్టిరి బ్రహ్మహృదయంబున భృగుండు పుట్టె వానికిఁ గవి పుట్టె వానికి శుక్రుండు పుట్టి యసురుల కాచార్యుండయ్యె వానికిఁ జండామర్క త్వష్టృ ధరాత్త్రు లనంగా నలువురు గొడుకులు పుట్టిరి వా రసురులకు యాజకు లైరి మఱియును.

(బ్రహ్మ శరీరభాగాలనుండి పుట్టినవారిలో హృదయంనుండి పుట్టిన భృగుడికి కవి, ఆ కవికి శుక్రుడు జన్మించారు. శుక్రుడు రాక్షసులకు గురువు అయ్యాడు.)


1_3_70 సీసము

విగతాఘుఁ డైన యాభృగునకుఁ బుత్త్రుఁ డై

చ్యవనుండు పుట్టె భార్గవవరుండు

జనవంద్యుఁ డతనికి మనుకన్యకకుఁ బుట్టె

నూరుల నౌర్వుండు భూరికీర్తి

యతనికి నూర్వురు సుతులు ఋచీకాదు

లుదయించి రఖిల భూవిదిత తేజు

లందు ఋచీకున కొందంగ జమదగ్ని

యను ముని పుట్టె నాతనికిఁ బుట్టి


ఆటవెలది

రలఘుమతులు సుతులు నలువురు వారిలోఁ

బరశురాముఁ డాదిపురుషమూర్తి

దండితాహితుండు గొండుక యయ్యును

దద్ద గుణములందుఁ బెద్ద యయ్యె.

(భృగువు వంశంలో జమదగ్ని, అతడికి పరశురాముడు జన్మించారు.)


1_3_71 వచనము

మఱియు బ్రహ్మకు ధాతయు విధాతయు ననంగా నిద్దఱు మనుసహాయులై పుట్టిరి వారితోడను లక్ష్మి పుట్టె లక్ష్మికి మానసపుత్త్రు లనేకులు పుట్టిరి వరుణునకు జ్యేష్ఠకు బలుండును సురయను కూఁతురునుం బుట్టిరి సురయం దధర్ముండు పుట్టె నా యధర్మునకు నిరృతికి భయ మహాభయ మృత్యువు లనఁగా మువ్వురు పుట్టిరి మఱియుఁ దామ్రకుఁ గాకియు శ్యేనియు భాసియు ధృతరాష్ట్రియు శుకియు నన నేవురుకన్యలు పుట్టిరి యందుఁ గాకి యనుదానికి నులూకంబులు పుట్టె శ్యేని యను దానికి శ్యేనంబులు పుట్టె భాసి యనుదానికి భాసగృధ్రాదులు పుట్టె ధృతరాష్ట్రి యనుదానికి హంసచక్రవాకంబులు పుట్టె శుకియను దానికి శుకంబులు పుట్టె మఱియుం గ్రోధునకు మృగియు మృగమందయు హరియు భద్రమనసయు మాతంగియు శార్దూలియు శ్వేతయు సురభియు సురసయు ననఁ దొమ్మండ్రు పుట్టి రందు మృగి యనుదానికి మృగంబులు పుట్టె మృగమంద యనుదానికి ఋక్ష చమర సృమరాదులు పుట్టె హరి యనుదానికి వానరగణంబులు పుట్టె భద్రమనస యనుదానికి నైరావణంబు పుట్టె నైరావణంబునకు దేవనాగంబులు పుట్టె మాతంగి యనుదానికి గజంబులు పుట్టె శార్దూలి యనుదానికి సింహవ్యాఘ్రంబులు పుట్టె శ్వేత యనుదానికి దిగ్గజంబులు పుట్టె సురభి యనుదానికి రోహిణియు గంధర్వియు ననలయు ననం బుట్టి రందు రోహిణికిఁ బశుగణంబులు పుట్టె గంధర్వి యనుదానికి హయంబులు పుట్టె ననలకు గిరి వృక్షలతా గుల్మంబులు పుట్టె సురసకు సర్పంబులు పుట్టె నిది సకలభూతసంభవప్రకారంబు.

(ఇంకొందరికి జంతువులు, కొండలు, చెట్లు మొదలైనవి పుట్టాయి. సకలజీవాలూ ఇలా పుట్టాయి.)


1_3_72 చంపకమాల

దివిజ మునీంద్ర దానవదితి ప్రభవాదిసమస్తభూతసం

భవముఁ గృతావధాను లయి భక్తిమెయిన్ వినుచున్న పుణ్యమా

నవులకు నిక్కువం బగు మనఃప్రియ నిత్యసుఖంబులుం జిరా

యువు బహుపుత్త్రలాభవిభవోన్నతియున్ దురితప్రశాంతియున్.

(దేవదానవులు, మునులు మొదలైనవారి పుట్టుకను గురించి విన్నవారికి మంచి జరుగుతుంది.)


-:దేవదానవాద్యంశములచే భూమియందుఁ బుట్టిన వారి క్రమము:-


1_3_73 వచనము

మఱియు మర్త్యలోకంబునందు దేవదైత్యదానవుల యంశావతారంబుల వివరించెద వినుము.

(దేవదైత్యదానవుల అంశలతో పుట్టినవారి గురించి వివరిస్తాను వినండి.)


1_3_74 కందము

యాదవవంశంబున జగ

దాదిజుఁ డగు విష్ణుదేవునంశంబున ను

త్పాదిల్లెఁ గృష్ణుఁ డపగత

ఖేదుఁడు వసుదేవ దేవకీదేవులకున్.

(విష్ణువు అంశతో శ్రీకృష్ణుడు యాదవవంశంలో దేవకీవసుదేవులకు జన్మించాడు.)

1_3_75 కందము

శ్రీవెలుఁగ రోహిణికి వసు

దేవున కుదయించె విష్ణుదేవాంశమునన్

భూవంద్యుఁ డనంతుఁడు బల

దేవుండు ప్రలంబ ముఖ్యదితిజాంతకుఁ డై.

(ఆదిశేషుడు బలదేవుడనే పేరుతో రోహిణీవసుదేవులకు జన్మించాడు.)


1_3_76 వచనము

మఱియు లక్ష్మియంశంబున రుక్మిణి యుదయించె సనత్కుమారు నంశంబునఁ బ్రద్యుమ్నుండు పుట్టె నప్సరసల యంశంబులఁ గృష్ణునిషోడశసహస్రాంతఃపురవనితలు పుట్టి రయ్యయి వేల్పుల యంశంబులు యదువృష్ణి భోజాంధక వంశంబుల వీరు లనేకులు పుట్టిరి మఱియు.

(లక్ష్మి రుక్మిణిగా, సనత్కుమారుడు ప్రద్యుమ్నుడిగా, ఇతరుల అంశలతో శ్రీకృష్ణుడి పదహారువేలమంది స్త్రీలు, యాదవవీరులు జన్మించారు.)


1_3_77 కందము

ముదమునఁ బ్రభాసుఁ డను నెని

మిది యగు వసునంశమునను మేదిని భీష్ముం

డుదయించె సర్వవిద్యా

విదుఁ డపజిత పరశురామ వీర్యుఁడు బలిమిన్.

(ప్రభాసుడనే ఎనిమిదో వసువు అంశతో భీష్ముడు జన్మించాడు.)


1_3_78 కందము

అనఘుఁడు సురగురునంశం

బునను భరద్వాజుకలశమునఁ బుట్టె శరా

సనవిద్యాచార్యుఁడు భూ

వినుతుఁడు ద్రోణుండు నిఖిలవేదవిదుం డై.

(బృహస్పతి అంశతో ద్రోణుడు పుట్టాడు.)


1_3_79 కందము

అలఘుఁడు కామక్రోధా

దుల యేకత్వమునఁ బుట్టె ద్రోణునకు మహా

బలుఁ డశ్వత్థామ రిపు

ప్రళయాంతకుఁ డస్త్రశస్త్రపరిణతుఁ డగుచున్.

(ద్రోణుడికి మహాబలుడైన అశ్వత్థామ పుట్టాడు.)


1_3_80 వచనము

మఱియు నేకాదశరుద్రులయంశంబునఁ గృపుఁడు పుట్టె సూర్యునంశంబునఁ గర్ణుండు పుట్టె ద్వాపరాంశంబున శకుని పుట్టె నరిష్టాపుత్త్రుండయిన హంసుడను గంధర్వ విభుండు ధృతరాష్ట్రుండయి పుట్టె మతియను వేల్పు గాంధారియై పుట్టె నయ్యిద్దఱకుం గలియశంబున దుర్యోధనుండు పుట్టెఁ బౌలస్త్యభ్రాతృవర్గంబు దుశ్శాసనాది దుర్యోధనానుజశతంబై పుట్టె హిరణ్యకశిపుండు శిశుపాలుండై పుట్టె సంహ్లాదుండు శల్యుండై పుట్టె ననుహ్లాదుండు ధృష్టకేతుండై పుట్టె శిబి యనువాఁడు ద్రుమసేనుండై పుట్టె బాష్కళుండు భగదత్తుఁడై పుట్టె విప్రచిత్తి యను దానవుండు జరాసంధుండై పుట్టె నయశ్శిరుండును నశ్వశీర్షుండుసు నయశ్శంకుండును గగనమూర్ధుండును వేగవంతుండును ననువా రేవురు దానవులు గేకయరాజు లయి పుట్టిరి కేతుమంతుం డమితౌజుండై పుట్టె స్వర్భానుండుగ్రసేనుండై పుట్టె జంభుండు విశోకుండై పుట్టె నశ్వపతి కృతవర్మయై పుట్టె వృషపర్వుండు దీర్ఘప్రజ్ఞుండై పుట్టె నజరుండు మల్లుండై పుట్టె నశ్వగ్రీవుండు రోచమానుండై పుట్టె సూక్ష్ముండు బృహద్రథుండై పుట్టెఁ దుహుండుఁ డనువాఁడు సేనాబిందుండై పుట్టె నేకచక్రుండు ప్రతివింధ్యుండై పుట్టె విరూపాక్షుండు చిత్రవర్మయై పుట్టె హరుండును నహరుఁడును సుబాహుబాహ్లికులై పుట్టిరి చంద్రవ్ర్రక్తుండు ముంజకేశుండై పుట్టె నికుంభుండు దేవాపియై పుట్టె శరభుండు సోమదత్తుండై పుట్టెఁ జంద్రుండు చంద్రవర్మయై పుట్టె నర్కుండు ఋషికుండై పుట్టె మయూరుండు విశ్వుండై పుట్టె సుపర్ణుండు క్రోధకీర్తియై పుట్టె రాహువు క్రోధుండై పుట్టెఁ జంద్రహంత శునకుండై పుట్టె నశ్వుండనువాఁ డశోకుండై పుట్టె భద్రహస్తుండు నందుండై పుట్టె దీర్ఘజిహ్వుండు గాశిరాజై పుట్టెఁ జంద్రవినాశనుండు జానకియై పుట్టె బలీనండు పౌండ్రమత్స్యుండై పుట్టె వృత్రుండు మణిమంతుండై పుట్టె గాలాపుత్త్రులెనమండ్రు క్రమంబున జయత్సేనాపరాజిత నిషాదాధిపతి శ్రేణిమన్మహౌజోభీరు సముద్రసేన బృహత్తులై పుట్టిరి క్రోధవశగణంబు వలన మద్రక కర్ణవేష్ట సిద్దార్థ కీటక సువీర సుబాహు మహావీర బాహ్లిక క్రథ విచిత్రసురథశ్రీమన్నీల చీరవాసో భూమిపాల దంతవక్త్ర రుక్మి జనమేజయాషాఢ వాయువేగ భూరితేజ ఏకలవ్య సుమిత్ర వాటధాన గోముఖ కారూషక క్షేమధూర్తి శ్రుతాయు రుద్వహ బృహత్సేన క్షేమాగ్రతీర్థ కుహర మతిమదీశ్వరాదులనేకులు పుట్టిరి కాలనేమి కంసుండై పుట్టె స్త్రీపుంసరూపధరుం డైన గుహ్యకుండు శిఖండియై పుట్టె మరుద్గణాంశంబునఁ బాండురాజు పుట్టె.

(పైన చెప్పిన విధంగా చాలామంది జన్మించారు.)


1_3_81 కందము

మరుతులయంశంబునఁ బు

ట్టిరి మువ్వురు వివిధరణపటిష్ఠబలులు సు

స్థిరయశులు ద్రుపదసాత్యకి

విరాటభూపతులు భువనవిశ్రుతచరితుల్.

(మరుత్తుల అంశలతో ద్రుపదుడు, సాత్యకి, విరాటుడు జన్మించారు.)


1_3_82 కందము

మాండవ్యుం డను మునివరు

చండతరక్రోధజనితశాపంబున ధ

ర్ముం డఖిలధర్మతత్త్వ వి

దుం డగు విదురుఁ డనఁ బేర్మితో నుదయించెన్.

(మాండవ్యముని శాపం వల్ల యముడు విదురుడిగా జన్మించాడు.)


1_3_83 కందము

ప్రియ మొనరఁగ సిద్ధియు బు

ద్ధియు నను దేవతలు వసుమతిని గుంతియు మా

ద్రియు నై పుట్టిరి పాండు

ప్రియపత్నులు నిఖిలజగదభీష్టచరిత్రల్.

(సిద్ధి, బుద్ధి అనే దేవతలు కుంతిగా, మాద్రిగా పుట్టి పాండురాజుకు భార్యలయ్యారు.)


1_3_84 సీసము

యమునంశమునఁ బుట్టె నధిపతి ధర్మజుం

డనిలాంశమునఁ బుట్టె ననిలజుండు

శక్రాంశమున ధనంజయుఁ డుదయించె నా

శ్వినుల యంశముల నూర్జితులు నకుల

సహదేవు లనవద్యచరితులు పుట్టిరి

శ్రీమూర్తి యై యాజ్ఞసేని పుట్టె

నగ్నియంశమున జితారి ధృష్టద్యుమ్నుఁ

డనఁ బుట్టె ద్రుపదరాజాన్వయమున


ఆటవెలది

ననఘ యిది సురాసురాంశావతారకీ

ర్తనము దీని వినినఁ దవిలి భక్తిఁ

జదివినను సమస్త జనులకు నఖిలదే

వాసురాదు లిత్తు రభిమతములు.

(యముడి అంశతో ధర్మజుడు, వాయుదేవుడి అంశతో భీముడు, ఇంద్రుడి అంశతో అర్జునుడు, అశ్వినుల అంశతో నకులసహదేవులు పుట్టారు. లక్ష్మి అంశతో ద్రౌపది, అగ్ని అంశతో ధృష్టద్యుమ్నుడు ద్రుపదుడికి జన్మించారు. ఓ రాజా! ఇది దేవాసురుల అంశలతో పుట్టినవారి కీర్తనం, ఇది విన్నవారికి మంచి కలుగుతుంది.)


1_3_85 వచనము

అనిన విని జనమేజయుండు వైశంపాయనున కిట్లనియె.

(జనమేజయుడు వైశంపాయనుడితో ఇలా అన్నాడు.)


1_3_86 సీసము

అభ్యస్తవేదవేదాంగులు విధిదత్త

దక్షిణాప్రీణితధరణిదేవు

లనవరతాశ్వమేధావభృథస్నాన

పూతమూర్తులు కృతపుణ్యు లహిత

వర్గజయుల్ ప్రాప్తవర్గచతుష్టయుల్

సత్త్వాదిసద్గుణజన్మనిలయు

లా భరతాది మహామహీపాలకు

లిద్ధయశోర్థు లెందేనిఁ బుట్టి


ఆటవెలది

రట్టి కౌరవాన్వయంబుఁ బాండవనృప

రత్నములకు వారిరాశియైన

దాని వినఁగ వలతుఁ దద్దయుఁ బ్రీతితో

విప్రముఖ్య నాకు విస్తరింపు.

("భరతుడివంటి గొప్పవారు పుట్టిన కౌరవవంశం పాండవులు అనే రత్నాలకు సముద్రం వంటిది. అలాంటి కౌరవవంశం గురించి వివరంగా చెప్పండి, వినాలని ఉంది")


1_3_87 వచనము

అని యడిగిన జనమేజయునకు వైశంపాయనుం డిట్లనియె.

(వైశంపాయనుడు ఇలా అన్నాడు.)


-:కౌరవ వంశ వివరణము:-


1_3_88 చంపకమాల

నిరుపమధర్మమార్గపరినిష్ఠితు లై మహి యెల్లఁ గాచుచుం

బరఁగిన తొంటి పూరు కురు పాండు మహీశుల పేర్మిఁ జేసి భూ

భరవహనక్షమం బగుచుఁ బౌరవ కౌరవ పాండవాన్వయం

బురుగుణసంపదం బెరిఁగి యొప్పె సమస్త జగత్ప్రసిద్ధమై.


(పూరు, కురు, పాండురాజుల గొప్పతనం వల్ల పౌరవ, కౌరవ, పాండవ వంశాలు ప్రసిద్ధమయ్యాయి.)


1_3_89 వచనము

అది యెట్లనినం దొల్లి దాక్షాయణి యైన యదితికిఁ గశ్యపునకుం బుట్టిన వివస్వంతునకు వైవస్వతుం డను మనువును యముండును శనైశ్చరుండును యమునయుఁ దపతియు ననం బుట్టి రందు వైవస్వతుం డను మనువువలన బ్రహ్మక్షత్రియ వైశ్యశూద్రాదులైన మానవులు పుట్టిరి మఱియు వానికి వేన ప్రముఖులైన రాజు లేఁబండ్రు పుట్టి వంశకరులై తమలోన యుద్ధంబు సేసి మడిసిరి మఱియు నమ్మనుపుత్త్రియైన యిల యనుదానికి సోమపుత్త్రుండైన బుధునకుఁ బురూరవుఁడు పుట్టి చక్రవర్తియై.

(కశ్యపుడి కుమారుడైన వివస్వంతుడికి వైవస్వతమనువు పుట్టాడు. అతడి కుమారులు యాభైమంది తమలో తాము పోరాడి మరణించగా, అతడి కూతురైన ఇలకూ, చంద్రుడి పుత్రుడైన బుధుడికీ పురూరవుడు జన్మించాడు.)


1_3_90 కందము

ఇమ్మహిఁ ద్రయోదశద్వీ

పమ్ములు దనశౌర్యశక్తిఁ బాలించి మదాం

ధ్యమ్మున విప్రోత్తమవి

త్తమ్ములు దా నపహరించె ధనలోభమునన్.

(పురూరవుడు భూమిని పాలిస్తూ లోభంతో విప్రుల ధనాన్ని అపహరించాడు.)