వోలం సురేష్ కుమార్


తరలము. తనువు మీన్పొల వల్చు జాలరిదాన నట్లును గాక యే ననఘ కన్యకఁ గన్యకావ్రత మంతరించిన నెట్లు మ జ్జనకునింటికిఁ బోవనేర్తుఁ బ్రసాదబుద్ధి యొనర్పు స న్మునిగణోత్తమ నాకు దోషవిముక్తి యెట్లగు నట్లుగన్. 40

వ. అనిన నమ్మునివరుండు గరంబు సంతసిల్లి నాకు నిష్టంబు సేసిన దాన నీ కన్యాత్వంబు దూషితంబు గా దోడకుండు మని దానికి వరం బిచ్చి నీవు వసువను రాజర్షి వీర్యంబునం బుట్టిన దానవు గాని సూతకుల ప్రసూతవు కావని చెప్పి దాని శరీరసౌగంధ్యంబు యోజనంబునం గోలె జనులకు నేర్పడు నట్లుగాఁ బ్రసాదించిన నది గంధవతి యనియు యోజనగంధి యనియుఁ బరగి తత్ప్రసాదంబున ననేకదివ్యాంబరాభరణభూషిత యై యమునానదీ ద్వీపంబున నోడ చేర్చి. 41

తే. ఎల్లవారును జూడంగ నిట్టిబయల నెట్లగు సమాగమం బని యింతి యన్న నమ్మునీంద్రుఁడు గావించె నప్పు డఖిల దృష్టిపథరోధి నీహారతిమిర మంత. 42

- శ్రీ వేదవ్యాస మునీంద్రుని యవతారము - సం. 1-57-79

క. పరమేష్ఠి కల్పుఁడగు న ప్పరాశరు సమాగమమునఁ బరమగుణైకా భరణకు ననవద్యమనో హరమూర్తికి సత్యవతికి నమ్మునిశక్తిన్. 43

క. సద్యోగర్భంబున నహి మద్యుతితేజుండు వేదమయుఁ డఖిలమునీం ద్రాద్యుఁడు వేదవ్యాసుం డుద్యజ్ఞానంబుతోడ నుదితుం డయ్యెన్. 44

క. ఆ యమునా ద్వీపమున న మేయుఁడు కృష్ణుం డయి పుట్టి మెయిఁగృష్ణద్వై పాయనుఁ డనఁ బరగి వచ శ్శ్రీయుతుఁడు తపంబునంద చిత్తము నిలిపెన్. 45

వ. పరాశరుండును సత్యవతి కోరినవరంబు లిచ్చి నిజేచ్ఛ నరిగె నంతఁ గృష్ణద్వైపాయనుండును గృష్ణాజినపరిధానకపిలజటా మండలదండకమండలు మండితుండై తల్లి ముందట నిలిచి కరకమలంబులు మొగిచి మ్రొక్కి మీకుం బని గల యప్పుడ నన్నుం దలంచునది యాక్షణంబ వత్తు నని సకలలోక పావనుఁ డఖిలలోక హితార్థంబుగాఁ దపోవనంబునకుం జని యందు మహా ఘోరతపంబు సేయుచు. 46

ఉ. సంచితపుణ్యుఁ డంబురుహసంభవునంశము దాల్చి పుట్టి లో కాంచితు డైన వాఁడు నిఖిలాగమపుంజము నేర్పడన్ విభా గించి జగంబు లందు వెలుఁగించి సమస్తజగద్ధితంబుగాఁ బంచమవేద మై పరగు భారతసంహితఁ జేసె నున్నతిన్. 47

- భీష్మాది వీరులు దేవదానవాదుల యంశంబువలనఁ బుట్టుట - సం. 1-58-3

వ. మఱియు దేవదైత్యదానవ మునియక్షపక్షిగంధర్వాదుల యంశావతారంబులు దాల్చి భీష్మాది మహావీరులు భారతయుద్ధంబు సేయ ననేకులు పుట్టిరి వారల కొలంది యెఱుంగచెప్ప ననేకకాలం బనేక సహస్రముఖంబుల వారికైన నలవిగా దనిన విని జనమేజయుండు వైశంపాయనున కిట్లనియె. 48

క. అమరాసురముఖ్యుల యం శములను మహిఁ బుట్టి సకలజనపాలకసం ఘములకు భారతరణరం గమునను లయ మొంద నేమి కారణ మనినన్. 49

వ. జనమేజయునకు వైశంపాయనుం డిట్లనియె. 50

సీ. పరశురాముండు భీకరనిజకోపాగ్ని నుగ్రుఁడై యిరువదియొక్కమాఱు ధాత్రీతలం బపక్షత్త్రంబు సేసినఁ దత్క్షత్త్రసతులు సంతానకాంక్ష వెలయంగ ఋతుకాలముల మహావిప్రుల దయఁ జేసి ధర్మువు దప్పకుండఁ బడసిరి పలువురఁ గొడుకులఁ గూఁతుల నిప్పాటఁ దత్క్షత్ర మెసఁగి యుర్విఁ

ఆ. బర్వి రాజధర్మపద్ధతి ననఘ మై జారచోర దుష్టజనుల బాధఁ బొరయ కుండ నిఖిలభూప్రజాపాలనఁ జేయుచుండె శిష్యసేవ్య మగుచు. 51

వ. ఇట్లు బ్రాహ్మణవీర్య ప్రభవు లయిన క్షత్త్రియులు ధర్మమార్గంబునం బ్రజాభి రక్షణంబు సేయుటంజేసి వర్ణాశ్రమ ధర్మస్థితులు దప్పక ప్రవర్తిల్లుటయు బ్రహ్మక్షత్త్రంబుల కాయుర్వర్ధనంబును ననవరతయాగతర్పిత పర్జన్య ప్రసాదంబునం గోరిన యప్పుడు వానలు గురియుచు సకలసస్యసమృద్ధియుఁ బ్రజావృద్ధియు నైన భుదేవి ప్రజాభారపీడిత యై సురాసురమునిగణపరివృతులై యున్న హరిహరహిరణ్యగర్భులకడకుం జని యిట్లనియె. 52

క. భూరి ప్రజానిరంతర భారము దాల్చు టిది కరము భారము దయతో మీ రీభారమునకుఁ బ్రతి కారము గావించి నన్నుఁ గావుం డనినన్. 53

క. వనజాసను ననుమతమున వనరుహనాభుండు వాసవ ప్రముఖసుప ర్వనికాయాంశంబులతోఁ దనరఁగఁ బుట్టించె నుర్విఁ దనయంశమ్మున్. 54

క. దితిసుత దానవ యక్ష ప్రతతుల యంశములఁ బుట్టి ప్రజలకు విహితా హితు లగుచుండి రనేకులు జితకాశులు ధరణిపతులు శిశుపాదుల్. 55

చ. అతులబలాఢ్యు లైన యమరాంశసముద్భవు లెల్ల బాండుభూ పతిసుతపక్ష మై సురవిపక్షగణాంశజు లెల్ల దుర్మదో ద్ధతకురురాజపక్ష మయి ధారుణిభారము వాయ ఘోరభా రతరణభూము నీల్గిరి పరస్పర యుద్ధము సేసి వీరులై. 56

వ. అనిన విని జనమేజయుండు వైశంపాయనున కిట్లనియె. 57

క. ఆదిత్య దైత్యదానవు లాదిగఁ గల భూతరాశి దగు సంభవమున్ మేదినిఁ దదంశముల మ ర్త్యోదయములు నాకుఁ జెప్పు మొగి నేర్పడఁగన్. 58

- దేవదానవ ప్రముఖుల యుత్పత్తి క్రమము - సం. 1-59-9

వ. అనిన విని జనమేజయునకు వైశంపాయనుం డిట్లని చెప్పెఁ దొల్లి సకలజగ దుత్పత్తినిమిత్తభూతుం డైన బ్రహ్మకు మానసపుత్త్రు లైన మరీచియు నంగీరసుండును నత్రి.యుఁ బులస్త్యుండును బులహుండును గ్రతువును నను నార్వురు పుట్టి రందు మరీచికిఁ గశ్యప ప్రజాపతి పుట్టెఁ గశ్యపు వలన జరాచర భూతరాశియెల్ల నుద్భవిల్లె నెట్లనిన బ్రహ్మదక్షాణాంగుష్ఠంబున దక్షుండును వామాంగుష్ఠంబున ధరణియను స్త్రీయునుం బుట్టిన యయ్యిరువురకును, 59

క. సుతు లనఘులు వేవురు దమ యుతులై యుదయించి సాంఖ్యయోగాభ్యాసో న్నతిఁ జేసి ముక్తులై భూ రితేజు లందఱును నూర్ధ్వరేతసు లైనన్. 60

వ. పదంపడి యేఁబండ్రు గూఁతులుం బుట్టిన వారల నెల్ల దక్షుం డపుత్త్రకుండు గావునఁ బుత్త్రీకరణంబు సేసి యందుఁ గీర్తి లక్ష్మీ ధృతి మేధా పుష్టి శ్రద్ధా క్రియా బుద్ధి లజ్జా మతులను వనితలఁ బదుండ్రను మనువున కిచ్చె నశ్విన్యాదులైన యిరువదేడ్వురను జంద్రున కిచ్చె నదితి దితి దను కాలానాయు స్సింహికా ముని కపిలా వినతా క్రోధా ప్రాధా క్రూరా కద్రువలను పదమువ్వురను గశ్యపున కిచ్చె నం దదితి యనుదానికి ధాతృ మిత్రార్యమశక్ర వరుణాంశు భగవివస్వత్పూష సవితృ త్వష్టృ విష్ణు లనంగా ద్వాదశాదిత్యులు పుట్టిరి మఱియును. 61

క. దితి యనుదానికి నప్రతి హతబలుఁడు హిరణ్యకశిపుఁ డనఁ బుట్టె సుతుం డతనికి నేవురు పుట్టిరి ప్రతాపగుణయుతులు సుతులు ప్రహ్లాదాదుల్. 62

వ. ఆ ప్రహ్లాద సంహ్లా దానుహ్లాద శిబి బాష్కళుల యందుఁ బ్రహ్లాదునకు విరోచన కుంభ నికుంభ లనంగా మువ్వురు పుట్టి రందు విరోచనునకు బలి పుట్టె బలికి బాణాసురుండు పుట్టె దను వను దానికి విప్రచిత్తి శంబర నముచి పులోమాసి లోమకేశి దుర్జయాదు లయిన దానవులు నలువండ్రు పుట్టిరి వారల పుత్త్రపౌత్రవర్గం బసంఖ్యాతంబై ప్రవర్తిల్లెఁ గాల యను దానికి వినాశన క్రోధాదులెనమండ్రు పుట్టిరి. 63

ఆ. అజితశక్తి యుతుల నాయువ యనుదాని కజరు లధికవీరు లతులభూరి భుజులు శక్రరిపులు పుట్టిరి నలువురు విక్షర బల వీర వృత్రు లనఁగ. 64

వ. మఱియు సింహిక యను దానికి రాహువుపుట్టె ముని యనుదానికి భీమసేనోగ్రసేనాదు లయిన గంధర్వులు పదార్వురు పుట్టిరి కపిల యనుదానికి నమృతంబును గోగణంబును బ్రాహ్మణులును ఘృతాచీ మేనకాదు లయిన యప్సరసలును బుట్టిరి వినత యనుదానికి ననూరుండును గరుడండును బుట్టి రం దనూరునకు శ్యేని యనుదానికి సంపాతిజటాయువులు పుట్టిరి క్రోధ యనుదానికిఁ గ్రోధవశగణంబు పుట్టఁ బ్రాధ యనుదానికి సిద్ధాదులు పుట్టిరి క్రూర యనుదానికి సుచంద్ర చంద్రహంత్రాదులు పుట్టిరి కద్రువ యనుదానికి శేషవాసుకి పురోగ మానేక భుజంగముఖ్యులు పుట్టిరి. 65

సీ. మఱి యంగిరసుఁ డను మానసపుత్త్రున కయ్యుతథ్యుండు బృహస్పతియును సంవర్తుఁడును గుణాశ్రయయోగసిద్ధి య న్కూఁతురు బుట్టి రక్కొడుకులందు విభుఁడు బృహస్పతి వేల్పుల కాచార్యుఁ డై లోకపూజితుఁడై వెలింగె మానుగా నత్రి యన్మానసపుత్త్రున కు ద్భవించిరి ధర్మయుత చరిత్రు

ఆ. లఖిలవేదవేదు లార్యు లనేకులు దీప్త రవిసహస్రతేజు లనఘ లధికతరతపో మహత్త్వ సంభృతవిశ్వ భరులు సత్యపరులు పరమమునులు. 66

వ. మఱియుఁ బులస్త్యుం డను మానసపుత్త్రునకుఁ ననేక రాక్షసులు పుట్టిరి పులహుం డను మానస పుత్త్రునకుఁ గిన్నర కింపురుషాదులు పుట్టిరి క్రతువను మానస పుత్త్రునకు సత్యవ్రత పరాయణులైన పతంగ సహచరులు పుట్టిరి పైతామహుండైన దేవుండను మునికిఁ బ్రజాపతి పుట్టె వానికి ధూమ్రా బ్రహ్మవిద్యా మనస్వినీ రతా శ్వసా శాండిలీ ప్రభాత లనంగా నేడ్వురు భార్యలై రందు ధూమ్రకు ధరుండును బ్రహ్మవిద్యకు ధ్రువుండును మనస్వినికి సోముండును రతకు నహుండును శ్వసకు ననిలుండును శాండిలికి నగ్నియుఁ బ్రభాతకుఁ బ్రత్యూష ప్రభాసు లనంగా నెనమండ్రు వసువులు బుట్టి రందు ధరుండను వసువునకు ద్రవిణుండను హుతహవ్యవహుండునుం బుట్టిరి ధ్రువుండను వసువునకుఁ గాలుండు పుట్టె సోముండను వసువునకు మనోహర యనుదానికి వర్చసుండును శిరుండును బ్రాణుండును రమణుండును బృధయను కూఁతురునుం బుట్టిరి పృధకుఁ బదుండ్రు గంధర్వపతులు పుట్టిరి యహుండను వసువునకు జ్యోతి పుట్టె ననిలుండను వసువునకు శివ యను దానికి పురోజవుండును నవిజ్ఞాతగతియునుం బుట్టిరి యగ్న యను వసువునకుఁ గుమారుండు పుట్టెఁ బ్రత్యూషుం డను వసువునకు ఋషి యైన దేవలుండు పుట్టెఁ బ్రభాసుం డను వసువునకు బృహస్పతి చెలియ లైన యోగసిద్ధికి విశ్వకర్మ పుట్టె. 67

క. ఆ విశ్వకర్మ నిర్మిత దేవవిమానుండు నిఖిలదివ్యాభరణ శ్రీ విరచన పరితోషిత దేవుఁడు శిల్ప ప్రజాపతియు నై నెగడెన్. 68

వ. మఱియు స్థాణునకు మానసపుత్త్రులైన మృగ వ్యాధ శర్వ నిరృ త్యజైక పాద హిర్బుధ్న్య పినాకి దహనేశ్వర కపాలి స్థాణు భవు లనంగా నేకాదశ రుద్రులు పుట్టిరి మఱి బ్రహ్మదక్షిణ స్తనంబున ధర్ముండను మనువు పుట్టె వానికి శమ కామ హర్షు లనంగా మువ్వురు పుట్టిరి యా మువ్వురకుఁ గ్రమంబునఁ బ్రాప్తి రతి నందు లనంగా మువ్వురు భార్య లైరి సవితృనకు బడబా రూపధారిణి యైన త్వాష్ట్రికి నశ్వినులు పుట్టిరి బ్రహ్మహృదయంబున భృగుండు పుట్టె వానిఁకి గవి పుట్టె వానికి శుక్రుండు పుట్టి యసురుల కాచార్యుండయ్యె వానికిఁ జండామర్క త్వష్టృ ధరాత్త్రు లనంగా నలువురు గొడుకులు పుట్టిరి వా రసురులకు యాజకు లైరి మఱియును. 69

సీ. విగతాఘుఁ డైన యాభృగునకుఁ బుత్త్రుఁ డై చ్యవనుండు పుట్టె భార్గవవరుండు జనవంద్యుఁ డతనికి మనుకన్యకకుఁ బుట్టె నూరుల నౌర్వుండు భూరికీర్తి యతనికి నూర్వురుసుతులు ఋచీకాదు లుదయించి రఖిలభూనిదితతేజు లందు ఋచీకున కొందంగ జమదగ్ని యను ముని పుట్టె నాతనికిఁ బుట్టి

ఆ. రలఘుమతులు సుతులు నలువురు వారిలో బరశురాముఁ డాదిపురుషమూర్తి దండితాహితుండు గొండుక యయ్యును దద్ద గుణములందుఁ బెద్ద యయ్యె. 70


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com