1_2_211 మత్తేభము

అతివేగకులచిత్తులై పడి రుదాత్తాశీవిషాగ్నుల్ సితా

సితపీతారుణవర్ణదేహులు నవాసృగ్రక్తనేత్రుల్ మహో

న్నతు లేక త్రిక పంచ సప్త నవ నానా మస్తకుల్ పల్వు రు

ద్ధత నాగేంద్రులు బ్రహ్మదండహతి నార్తధ్వానులై వహ్నిలోన్.

(వేగంగా వచ్చి అగ్నిలో పడ్డాయి.)


1_2_212 కందము

తడఁబడఁ బడియెడు రవమును

బడి కాలెడు రవముఁ గాలి పలుదెఱఁగుల వ్ర

స్సెడు రవమును దిగ్వలయము

గడుకొని మ్రోయించె నురగకాయోత్థితమై.

(ఆ పాములు అగ్నిలో పడే శబ్దం, పడి కాలే శబ్దం, కాలి బ్రద్దలయ్యే శబ్దం దిక్కుల్లో మారుమోగింది.)


1_2_213 వచనము

అంత.

(అప్పుడు.)


1_2_214 కందము

తక్షకుఁ డతిభీతుండై

యాక్షణమున నరిగె సురగణాధిప నన్నున్

రక్షింపుమ రక్షింపుమ

రక్షింపుమ యనుచు న ప్పురందరుకడకున్.

(తక్షకుడు భయపడి రక్షించమంటూ ఇంద్రుడి దగ్గరకు వెళ్లాడు.)


1_2_215 వచనము

పురందరుడును దొల్లి కమలజువాక్యంబున వాసుకిప్రముఖసర్పకులముఖ్యులకు సర్పసత్త్రభయంబు లేమి యెఱింగినవాఁడు గావున వాని నోడకుండుమని చేకొనియుండె నిట వాసుకియు జనమేజయసమారబ్ధసర్పసత్త్రపరిత్రస్తుండై ద్వియోజనత్రియోజనాయామస్థూలవ్యాళనివహంబులు నిజవంశ భ్రాతృవంశజనితంబు లయినవి జననీవాగ్దండపీడితంబు లయి యగ్నికుండంబునబడుటకు శోకించి తనచెలియలి జరత్కారువుం జూచి యిట్లనియె.

(బ్రహ్మ వరం వల్ల వాసుకి మొదలైన సర్పశ్రేష్ఠులకు సర్పయాగం చేత ప్రమాదం లేదన్న విషయం తెలిసిన ఇంద్రుడు తక్షకుడిని భయపడవద్దని చెప్పి ఆదరించాడు. ఇక్కడ వాసుకి సర్పయాగానికి భయపడి, నాగులు అగ్నిలో పడటం చూసి దుఃఖించి, తన చెల్లెలైన జరత్కారువుతో ఇలా అన్నాడు.)


1_2_216 కందము

ప్రస్తుత ఫణిసత్త్రభయ

త్రస్తాత్ముల మైన యస్మదాదుల కెల్లన్

స్వస్తి యొనర్పఁగ నవసర

మా స్తీకున కయ్యె నిప్పు డంబుజనేత్రా.

(సర్పయాగం వల్ల కలిగిన ప్రమాదం నుండి పాములను నీ కుమారుడైన ఆస్తీకుడు కాపాడే సమయం వచ్చింది.)


1_2_217 కందము

విమలతపోవిభవంబున

గమలజు నట్టిండ విగతకల్మషుఁ డాస్తీ

కమహాముని యీతని వచ

నమున మహాహికులరక్షణం బగుఁ బేర్మిన్.

(ఆస్తీకుడి మాటలు పాములకు రక్షణ కలిగిస్తాయి.)


1_2_218 వచనము

బ్రహ్మవచనంబు నిట్టిద కా విని యేలాపుత్త్రుండు మాకుఁ జెప్పె జరత్కారు మహామునికి నిన్ను వివాహంబు సేయుటయు నేతదర్థంబ యింకొక్కనిమేషజంబేని యుపేక్షించిన సకలసర్పప్రళయం బగుం గావున నాస్తీకుండు జనమేజయమహీపాలుపాలికిం బోయి సర్పయాగం బుడిగించి రక్షింపవలయుననిన నయ్యగ్రజువచనంబులు విని జరత్కారువు గొడుకుమొగంబు సూచి భవన్మాతులనియోగంబు సేయు మనిన నాస్తీకుం డిట్లనియె.

(అతడు జనమేజయమహారాజు దగ్గరకు వెళ్లి సర్పయాగం మాన్పించి పాములను రక్షించాలి అని చెప్పగా అన్న మాటలు విని జరత్కారువు ఆస్తీకుడిని అలాగే చేయమన్నది. అతడు ఇలా అన్నాడు.)


-:ఆస్తీకుఁడు సర్పయాగము నివారించుట:-


1_2_220 వచనము

అని యాస్తీకుండు వాసుకిప్రముఖుల నాశ్వాసించి సకలవేదవేదాంగ పారగులయిన విప్రవరులతో జనమేజయసర్పసత్త్రసదనంబునకుం జనుదెంచి స్వదేహకాంతి సభాంతరం బెల్ల వెలుంగుచుండ స్వస్తివచనపూర్వకంబుగా నిట్లని స్తుతియించె.

(అని చెప్పి ఆస్తీకుడు సర్పయాగశాలకు వచ్చి జనమేజయుడిని ఇలా కీర్తించాడు.)


1_2_221 మత్తేభము

రజనీనాథకులై కభూషణుఁడవై రాజర్షివై ధారుణీ

ప్రజ నెల్లన్ దయతోడ ధర్మచరితం బాలించుచుం దొంటి ధ

ర్మజు నాభాగు భగీరథున్ దశరథున్ మాంధాతృ రామున్ రఘున్

విజయుం బోలితి సద్గుణంబుల జగద్విఖ్యాత పారీక్షితా.

(మహారాజా! నువ్వు పూర్వం ప్రసిద్ధులైన రాజులకు సమానమైనవాడివి.)


1_2_222 తరలము

కువలయంబున వారి కోరిన కోర్కికిం దగ నీవు పాం

డవకులంబు వెలుంగఁ బుట్టి దృఢంబుగా నృపలక్ష్మితో

నవనిరాజ్యభరంబు దాల్చినయంతనుండి మఖంబులం

దివిరి యిష్టధనంబు లిచ్చుటఁ దృప్తులైరి మహాద్విజుల్.

(పాండవుల వంశం వెలిగేలా పుట్టి, భూభారం వహించి, యజ్ఞాలు చేస్తూ, ద్విజులకు ధనం ఇవ్వటం వల్ల వారు తృప్తులయ్యారు.)


1_2_223 ఉత్పలమాల

అమ్మనుజేంద్రుఁడైన నలుయజ్ఞము ధర్మజురాజసూయయ

జ్ఞమ్ముఁ బ్రయాగఁ జేసిన ప్రజాపతియజ్ఞముఁ బాశపాణియ

జ్ఞమ్మును గృష్ణుయజ్ఞము నిశాకరుయజ్ఞము నీమనోజ్ఞయ

జ్ఞమ్మును నొక్కరూప విలసన్మహిమం గురువంశవర్ధనా.

(నీ యజ్ఞం పూర్వం జరిగిన ప్రసిద్ధమైన యజ్ఞాలతో సమానమైనది.)


1_2_224 చంపకమాల

వితతమఖ ప్రయోగవిధివిత్తము లుత్తమధీయుతుల్ జగ

న్నుత సుమహాతపోధను లనుగ్రహనిగ్రహశక్తియుక్తు లీ

క్రతువున ఋత్విజుల్ కమలగర్భసమానులు పూర్వదిక్పతి

క్రతువున యాజకోత్తములకంటెఁ బ్రసిద్ధులు సర్వవిద్యలన్.

(నీ సర్పయాగాన్ని చేసే ఋత్విక్కులు ఉత్తములు.)


1_2_225 శార్దూలము

విద్వన్ముఖ్యుఁడు ధర్మమూర్తి త్రిజగద్విఖ్యాతతేజుండు కృ

ష్ణద్వైపాయనుఁ డేగుదెంచి సుతశిష్యబ్రహ్మసంఘంబుతో

సద్వంద్యుండు సదస్యుఁ డయ్యె ననినన్ శక్యంబె వర్ణింప సా

క్షాద్విష్ణుండవ నీవు భూపతులలోఁ గౌరవ్యవంశాగ్రణీ.

(వ్యాసుడే తన కుమారులతో వచ్చి పాలుపంచుకుంటున్న ఈ యజ్ఞాన్ని చేస్తున్న నువ్వు రాజులలో సాక్షాత్తుగా విష్ణుమూర్తివే.)


1_2_226 ఉత్పలమాల

ఆర్తిహరక్రియాభిరతుఁడై కృతసన్నిధియై ప్రదక్షిణా

వర్తశిఖాగ్రహస్తముల వహ్ని మహాద్విజదివ్యమంత్రని

ర్వర్తితహవ్యముల్ గొనుచు వారిజవైరికులేశ నీకు సం

పూర్తమనోరథంబులును బుణ్యఫలంబులు నిచ్చుచుండెడున్.

(అగ్ని నీకు పుణ్యఫలాలు అందించుగాక.)


1_2_227 వచనము

అని జనమేజయు నాతనియజ్ఞమహిమను ఋత్విజులను సదస్యులను భట్టారకు ననురూపశుభవచనంబులఁ బ్రస్తుతించిన నాస్తీకున కందఱును బ్రీతు లయి రంత జనమేజయుం డాస్తీకుం జూచి మునీంద్రా నీ కెద్ది యిష్టంబు దానిన యిత్తు నడుగు మనినఁ గరంబు సంతసిల్లి యాస్తీకుం డిట్లనియె.

(ఇలా ఆస్తీకుడు పొగడగా జనమేజయుడు ఆనందించి అతడిని ఇష్టమైనదాన్ని కోరుకొమ్మన్నాడు. ఆస్తీకుడు ఇలా అన్నాడు.)


1_2_228 ఉత్పలమాల

మానితసత్యవాక్య యభిమన్యుకులోద్వహ శాంతమన్యుసం

తానుఁడవై దయాభినిరతస్థితి నీవు మదీయబంధుసం

తానమనోజ్వరం బుపరతంబుగ నాకుఁ బ్రియంబుగా మహో

ర్వీనుత సర్పయాగ ముడిగింపుము కావుము సర్పసంహతిన్.

(మహారాజా! ఈ యాగాన్ని ఆపి పాములను కాపాడు.)


1_2_229 చంపకమాల

అనిన సదస్యు లందఱుఁ బ్రియంబున నిట్టి విశిష్టవిప్రము

ఖ్యునకు మహాతపోధనునకుం దగుపాత్రున కెద్ది యిచ్చినన్

ఘనముగ నక్షయం బగును గావున నీద్విజనాథుకోర్కిఁ బెం

పున వృథ సేయఁగాఁ దగదు భూవలయేశ్వర యిమ్ము నెమ్మితోన్.

(అని అడగగా సదస్యులందరూ, "ఆస్తీకుడి కోరిక వ్యర్థం చేయకూడదు కాబట్టి అతడు అడిగింది ఇవ్వండి")


1_2_230 వచనము

అనిన సర్వజనానుమతంబుగా జనమేజయుం డాస్తీక ప్రార్థనంజేసి సర్పయాగం బుడిగించె నయ్యవసరంబున.

(అని చెప్పగా జనమేజయుడు అతడి కోరికను అనుసరించి సర్పయాగాన్ని మాన్పించాడు. అదే సమయంలో.)


1_2_231 మత్తేభము

అతులోర్వీసురముఖ్యమంత్రహుతమాహాత్మ్యంబునన్ వాసవ

చ్యుతుఁడై ముందర తక్షకుం డురువిషార్చుల్ దూల వాత్యారయో

ద్ధతి నుద్ధూతవివర్దితాయతబృహద్దావాగ్నివోలెన్ విచే

ష్టితుఁడై మేఘపథంబులం దిరుగుచుండెన్ విస్మితుల్ గా జనుల్.

(తక్షకుడు హోమమంత్రాల ప్రభావం వల్ల ఇంద్రుడి నుండి విడివడి, చేష్టలుడిగి, విషాగ్నులు చలిస్తుండగా, ఆకాశంలో పరిభ్రమించసాగాడు. ప్రజలు ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంతో చూడసాగారు.)


1_2_232 కందము

అతని నత్యుగ్రానల

పాతోన్ముఖుఁ డైన వానిఁ బడకుండగా నో

హో తక్షక క్రమ్మఱు మని

యాతతభయుఁ గ్రమ్మఱించె నాస్తీకుఁ డెడన్.

(హోమగుండంలో పడటానికి సిద్ధంగా ఉన్న ఆ తక్షకుడిని ఆస్తీకుడు అగ్నిలో పడకుండా మధ్యలోనే మరల్చాడు.)


1_2_233 మత్తేభము

జననీశాపభయప్రపీడితమహాసర్పేంద్రులన్ సర్పయా

గనిమిత్తోద్ధతమృత్యువక్త్రగతులం గాకుండఁగాఁ గాచె నం

చును నాస్తీకమునీంద్రు నందుల సదస్యుల్ సంతసం బంది బో

రనఁ గీర్తించిరి సంతతస్తుతిపదారావంబు రమ్యంబుగగన్.

(సర్పవినాశనాన్ని ఆపిన ఆస్తీకుడిని అందరూ స్తుతించారు.)


1_2_234 కందము

ఒనర జరత్కారుమునీం

ద్రునకు జరత్కారునకు సుతుండైన మహా

మునివరు నాస్తీకుని ముద

మున దలఁచిన నురగభయముఁ బొందదు జనులన్.

(అందువల్ల జరత్కారుడికీ, జరత్కారువుకూ పుట్టిన ఆస్తీకుడిని స్మరిస్తే పాముల వల్ల భయం కలగదు.)


1_2_235 వచనము

మఱియు నయ్యాస్తీకుచరితంబు విన్నవారికి సర్వపాపక్షయం బగు నని.

(అదీగాక ఆస్తీకుడి కథ విన్నవారి పాపాలన్నీ తొలగిపోతాయి.)


1_2_236 కందము

రాజమహేంద్రకవీంద్రస

మాజసురక్ష్మాజ రాజమార్తాండ ధరి

త్రీజననుత చారిత్ర వి

రాజితగుణరత్న రాజరాజనరేంద్రా.

(రాజరాజనరేంద్రా!)


1_2_237 వసంతతిలకము

వీరావతార సుకవిస్తుత నిత్యధర్మ

ప్రారంభ శిష్టపరిపాలనసక్త రాజా

నారాయణాఖ్య కరుణారసపూర్ణ వీర

శ్రీరమ్య రాజకులశేఖర విష్ణుమూర్తీ.

(రాజకులశేఖరా!)


1_2_238 గద్యము

ఇది సకల సుకవిజన వినుత నన్నయభట్ట ప్రణీతంబయిన శ్రీమహాభారతంబునం దాదిపర్వంబున నాగ గరుడోత్పత్తియు సముద్రమథనంబును నమృతసంభవంబును సౌపర్ణాఖ్యానంబును జనమేజయ సర్పయాగంబును నాస్తీకు చరితంబును నన్నది ద్వితీయాశ్వాసము.

(ఇది నన్నయకవి రచించిన మహాభారతంలోని ఆదిపర్వంలో - నాగుల పుట్టుక, గరుడుడి పుట్టుక, సముద్రమథనం, అమృతసంభవం, గరుడోపాఖ్యానం, సర్పయాగం, ఆస్తీకుడి చరితం ఉన్న ద్వితీయాశ్వాసం.)