10_1_211 ఉ.
తావెసఁ బోవునప్డు బలదర్పసమగ్రులు పాండుపుత్రు ల
చ్చో వసియింపకున్కిఁ దనచూచినకార్య మతం డొనర్చె దే
వావలికైన నత్తెఱఁగు నాక్రమలీలలు సెల్ల నేర్చునే
భూవర వార లున్న విధిపోకలఁ బోవుట గాక యంతయున్.


10_1_212 వ.
అని చెప్పి విను మట్లు కృపకృతవర్మలచేత సంభావితుండై కుంభసంభవసంభ
వుండు వారలతోమన మిఁక మనుజపతికడకుఁ దడయక పోవలయుఁ బుణ్యం
బున మనము వోవునంతకుం బ్రాణంబులు గలిగియుండెనేని యిత్తెఱం గెఱిం
గింత మనుటయు వార లట్ల కాక యని యచ్చోట గదలి యమ్మువ్వురును భూ
వల్లభసల్లాపకుతూహలంబున రయంబునం జనుదెంచి.


- అశ్వత్థామాదిరథికత్రయంబు దుర్యోధనుం గనుంగొనుట -


10_1_213 తే.
రక్తసంసిక్తమైనధరాతలమున,నార్తిఁ బొరలుచు నూర్పు లందంద సంద
డింప జీవంబు వెడల నుంకింపఁ జేష్ట,లొయ్యనొయ్యన యడఁగంగ నున్న యధిపు.


10_1_214 మహాస్రగ్ధర.
కని శోకం బాత్మలం దగ్గలముగ రథముల్ గ్రక్కునన్ డిగ్గి భూమిన్
ధనువుల్ వోవైచి బాష్పోద్గమము వొదువువక్త్రంబులన్ విప్రలాపం
బును దైన్యం బావహిల్లం బొరలుచుఁ బొరి నాభూవిభున్ శాంతదృష్టిం
గనుఁగొంచుం జేరి కేలంగముపయి నిడుచుం గౌఁగిటం జేర్చికొంచున్.


10_1_215 చ.
పురపురఁ బొక్కి యానృపతిపుంగవుచుట్టును నుండి యక్కటా
ధరణి సమస్తమున్ భవదుదారమహాజ్ఞకు లోను సేసి యి
ప్పరుసున నీవు దీనతకు భాజన మైతి విధాత కెందు దు
ష్కర మగుకార్యముం గలదె కౌరవనాయక మ మ్మెఱుంగుదే.


10_1_216 క.
అన నప్పలుకులు వెడవెడ,విని యావిభుఁ డల్లఁ గన్ను విచ్చిన వదనం
బునఁ జూడ్కి నిలిపి కలశజ,తనయుం డి ట్లనియె గద్గదగళుం డగుచున్.


10_1_217 చ.
అమితబలంబు దర్పమును నద్భుతధీరతయున్ గదాపరి
శ్రమముఁ బొగడ్త కెక్కునినుఁ జక్క నెదర్చుట గాక పోర రం
ధ్రము గని యొక్కఁ డుద్ధతి గదం దెగటార్చుట గల్లె నట్టె యిం
క మగల కెట్టివారలకుఁ గల్గ దపాయము దైవ మల్గినన్.


10_1_218 చ.
దురమునఁ బెంపుఁ జేవయును దుర్దమలీల వెలుంగుచుండ సు
స్థిరత శమంతపంచకవిశిష్టతలంబునఁ బోరి సద్గతిన్
బొరసెదు నీకు నై వగపు వుట్టదు బంధులు రాజు దేవులుం
దిరియుదు రింక వారి దగుదీనత కోర్వక యమ్మలించెదన్.


10_1_219 ఉ.
సీరి యనారతంబుఁ దనశిష్యులలోపల నెల్ల నిన్ను దు
ర్వారపరాక్రమాఢ్యుఁ డని వర్ణన సేయుట గేలి చేసి యా
మారుతికిన్ జయం బొసఁగె మాలవిధాతృఁడు వానిగెల్పుకో
లేరికి సమ్మతం బగునె యిట్టిది దీనను బెంపు గల్గునే.


10_1_220 చ.
కురువర నీమగంటిమియుఁ గోల్తలయున్ బలముం జలంబు దు
స్తరగతిఁ బేర్చి భీమునకుఁ జావక పోవఁగ రానియట్టిదై
నరు బెదరించి కేశవుమనంబు గలంచి యధర్మవృత్తికిం
జొరుఁ డని పంచె దీని దివిజుల్ గని రిం కిట వేయు నేటికిన్.


10_1_221 ఉ.
ధర్మము మాని యూరులు గదం బొడి సేసినయంతఁ బోక దు
ష్కర్ముఁడు వాయుజుం డెడమకాల శిరం బటు దన్నెఁ జూచి యా
ధర్మసుతుండు శాస్తిఁ దగ దానికిఁ జేయఁడ యాతఁ డెప్డు నం
తర్మదదుష్టుఁ డీ గెలుపు దైన్యము సేయదెకీర్తిమాయదే.


10_1_222 క.
కౌరవనాయక నీదుగ,దారణగౌరవము సకలధరణీజనచె
తోరంజన మైనిర్మల,సారయశోధనము నీకు సంపాదించెన్.


10_1_223 వ.
అని పలికి తనమానుషంబు తెఱంగూహించి.


10_1_224 చ.
కుడువఁగఁ గట్ట బంధులకుఁ గోటివిధంబులఁ బెట్ట జన్నము
ల్నడుప ననేకధర్మవిధులం బొగ డొందఁగఁ జాలునట్టియె
క్కుడుసిరి యిచ్చి పేర్మి నొకడొండగ మన్చిననీవు సావఁగా
నొడ లిటు లోమితిం గురుకులోత్తమ యే నొకసేవకుండునే.


10_1_225 వ.
అని తన్ను దాన నిందించుకొనుచుమఱియు.


10_1_226 ఉ.
న్యాయము దప్పకుండఁగ రణం బొనరించి దివంబు గైకొనం
బోయెద వందు రాఁ దగినపుణ్యము సేయుట లేదు గాని మా
చేయు మనంబునుం దనియఁ జెందఁగఁ బడ్డవిరోధివర్గమున్
నీయెడ కిం పొనర్పఁగ గణింపఁగ బాగ్యము గల్గె భూవరా.


10_1_227 ఆ.
పుణ్యలోకమునకుఁ బోయినయప్పుడు,ద్రోణుఁ గాంచి నీకు ద్రోహియైన
జనవినింద్యచరితుఁ జెంపె ధృష్టద్యుమ్ను, ననఘ నీతనూజుఁ డనుము తొలుత.


10_1_228 వ.
అని నామాఱుగా నమస్కరించి కౌఁగిలించికొనుము మఱియు వలయుసల్లాపం
బులు సేయుము బాహ్లికసోమదత్తభూరిశ్రవస్సైంధవప్రముఖభవదీయబాం
ధవజనంబులతో నాచేసిన కుశలప్రశ్నంబుగా సంభావింపు మది య ట్లుండె
రేయింటితెఱం గెఱింగించెద.


10_1_229 సీ.
అమృతంబునింపు కర్ణములకు నొసఁగెడుమాట లాకర్ణింపు మనుజనాథ
శాత్రవశిబిరంబు సౌప్తికవేళఁ బ్రవేశించి నీచుఁ గిల్బిషమయాత్ముఁ
దొలుత ధృష్టద్యుమ్నుఁ ద్రుంచితిఁ బశుమరణంబుగాఁ దదనంతరంబు కవిసి
వానిబంధుల నెల్ల వరుస గీటడఁగించి ద్రౌపదీసుతుల నందఱను బొదివి


తే.
మిడుకమిడుకంగఁజంపి యప్పుడమియెల్లఁ,దునియపెంటగఁ గరివాజిమనుజతతుల
నెల్ల నఱికితిఁ బాండవులేవురును ము,రారియును సాత్యకియును నాబారిఁ బడరు.


10_1_230
అని చెప్పి.


10_1_231 ఉ.
ఏమటు పోక శౌరి మది నేర్పడ మున్ గని డాఁగురించెనో
యేమిటి కెందుఁ బోయిరొ నరేంద్ర యెఱుంగను ధర్మదూష్యసం
గ్రామవిధంబులం జయము గల్గియు వారికి దక్కదయ్యెవా
రే మయి రేమి మాకెలస మెక్కె నెఱుంగుము మమ్ము మువ్వురన్.


10_1_232
అని కలిపికొని పలికి కృపకృతవర్మలవలనుం జూపి.


10_1_233 క.
వీరపెనుబ్రాపు వడసినఁ,గౌరవకులనాథ యేన కా దరయంగాఁ
జీరికిఁ బోవనివారును,వైరుల సమయంగఁ జేయ వలఁతుల కారే.


10_1_234 వ.
అనిన నమ్మాటలు మనఃప్రియంబులై నాలుకకు లావిచ్చిన నాభూవరుం
హీసురవరున కి ట్లనియె.


10_1_235 క.
నీవును నీయోధవరులు, నావైరులఁ బఱిచినంత యాచార్యుండున్
దేవవ్రతుండుఁ బఱిచిరె,భావింపఁగ దుష్కరంపుఁబని యిది యనఘా.


10_1_236 ఆ.
కర్ణు మనము పెద్దగాఁ గొనియాడుదు,మతనికంటె శల్యుఁ డధికుఁ డందు
రతఁడు నతఁడు నిట్టియాక్రమంబున నాకుఁ,బ్రియము సేయఁజాలిరో మహాత్మ.


10_1_237 వ.
అని యమ్మువ్వురమొగంబులు గలయం గనుంగొని మీరు కృతకృత్యులరుసు
ఖులురై యుండుఁడు పునర్దర్శనంబు త్రిదివంబున నయ్యెడుఁ గాక వగలు మా
ని పొండని పల్కిప్రాణంబులు విడిచిన వార లవ్వసుమతీపతిఁ గౌఁగిలించుకొని
వలగొని వచ్చి మరలి మరలి చూచుచు నరదంబు లెక్కి యరిగి రంత నుదయ
గిరిశిఖంబు ఖరకరుండు వచ్చె నేను నిత్తెఱంగు నీ కెఱింగింప వచ్చితి నా
హవప్రకారం బంతయు నీకు వినిపించుటకు నాఁడు మునీశ్రరుండు నన్నుఁ బనిచి
యొసంగినదివ్యదర్శనత్వంబు నీకొడుకుతోడిద యయ్యె నని యిట్లు సంజయుం
డు ధృతరాష్ట్రునకు నశ్వత్థామాదిరథికత్రయవ్యాపారకథనపూర్వకంబుగా దు
ర్యోధనులోకాంతరగమనంబు సెప్పె ననిన విని యటమీఁదఁ బాండునందను
లెవ్విధంబునం బ్రవర్తించి రని యడుగుటయు.


10_1_238 మహాస్రగ్ధర.
పరమజ్ఞేయస్వభావా భవభయహరణప్రౌఢనామానుభావా
కరఖేలచ్చక్రశూలా కలుషహృదయసాంగత్యవైముఖ్యశీలా
కరుణాయత్తాంతరంగా కమలభవమనఃకంజసంవాసభృంగా
దురితధ్వాంతప్రదీపాతులనిరసనసంస్తుత్యనిర్భాసరూపా.


10_1_239 క.
పరిణామగమ్య నిగమా,పరనిష్ఠాసంపదచలభావనరమ్యా
నిరుపమసౌందర్య తప,శ్చరణనిరతహృదయకమలసముదితసూర్యా.


10_1_240 మాలిని.
చరణయుగళకాంతిస్ఫారలీలానిరూఢా
దురసుఖమయయుక్తాధర్మశీలానురక్తా
సురసముదయరక్షా సువ్రతాసంగహేలా
కరమహిమకటాక్షా గాఢసర్వానుపేక్షా.


10_1_241 గద్యము.
ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్త్ర బుధారాధనవిరా
తిక్కనసోమయాజిప్రణీతం బయినశ్రీమహాభారతంబున సౌప్తికపర్వంబునంద
బ్రథమాశ్వాసము.