ఆ భా 10 1 121 to 10 1 150
10_1_121 క.
తెఱఁ గెట్టిదియో నామది
నెఱుఁగ మదాత్మోపహార మిచ్చెద నీకుం
గఱకంఠ వరము నాకుఁ బ
గఱఁ బరిమార్పంగ శక్తి గలుగుటయ చుమీ
10_1_122 వ.
అని ప్రార్థించి.
10_1_123 క.
అంగీరసకులజనిత మీ
యంగము శిఖియందు దీని నాహుతిగాఁ జే
యం గంటి భవద్భక్తి సు
సంగతమతితోఁగృతార్థజనుఁడనైతిన్.
10_1_124 క.
అని పలుకుచుఁ బరమేశ్వరు
మనమున నిడి యూర్ధ్వాబాహుమహితాకారుం
డును ఘనసమాధి యగుచున్
విను ముఱికెను గురుసుతుండు వేదికపైకిన్.
10_1_125 ఆ.
ఉఱికి మంటలోన నుల్లంబు తెలివొక
యింతయేనిఁ గుంద కిద్ధమూర్తిఁ
దేజరిల్ల నున్న ధిరవర్యునకుఁ బ్ర
త్యక్ష మయ్యె శివుఁడు దయ దలిర్ప.
-: అశ్వత్ధామకు శివుఁడు ప్రత్యక్షంబై ఖడ్గం బొసంగుట :-
10_1_126 వ.
ఇ ట్లెదుర నిల్చినభక్తవత్సలుం డగు భవానీవిభుండు దరహసితముఖుం
డగుచు దివ్యావలోకనామృతంబు వెల్లిగొల్బిన నవ్వేదియందుఁ గమలా
కరంబులో నున్న చందంబునఁ బ్రమోదంబు నొంది యున్న యన్న
రోత్తమునకు నారాయణ ప్రియుం డిట్లనియె
10_1_127 క.
ఇమ్మెయి నీ దగుసత్క
ర్మమ్ము విశేషమునఁ జేసి మానస మత్యం
తమ్ము ప్రియమందె నీకు వ
రమ్మొ సఁగఁగ వచ్చితిన్ ధరాసురావర్యా.
10_1_128 వ.
అనవుడు
10_1_129 తే.
తనువు పులకల ప్రోవు గా మనము గాఢ
సంభృతానందముగ శరాచార్యసుతుఁడు
వితతసంభ్రముఁ బై వేది వెడలి సాఁగి
మ్రొక్కి లేచి ఫాలంబున మొగిచెఁ గేలు.
10_1_130 వ.
అప్పుడు.
10_1_131 చ.
అతని మొగంబుమీఁద నొలయన్ మధురం బగుచూడ్కి పార్వతీ
పతి మృదురీతి నిట్టులను భవ్యము లైనతపంబు సత్యము
న్ధృతియును శౌచముం గలిగి నిశ్చలభక్తి యొనర్చుఁ గృష్ణుఁడ
ప్రతిమసపర్య నాకు ననురక్తుఁడ నౌదును నమ్మురారికిన్.
10_1_132 క.
అతనికి సన్మానము సే
యుతలంపున భూతరూపయుక్తుఁడ నైవ
చ్చితి నినుఁ బాంచాలురపై
నలిస్ఫురణం బోవ నీక యడ్డంబైతిన్.
10_1_133 తే.
తెల్లముగ నీదుచిత్తంబు తెఱఁ గెఱుంగ
వలసి దేనిట్లనేకమాయలుపొనర్చి
యస్త్రశస్త్రనిరాసంబు నాచరించి
కేలి సలిపితి వేయును నేల చెపుమ.
10_1_134 వ.
కృష్ణసన్యాసంబును గృతం బయ్యెఁ బాంచాలురకుఁ గాలంబు డగ్గఱియె
నేఁడు దెగుదురు నీవు నాయనుగ్రహంబు వడసి తని యొక్కమహనీయ
ఖడ్గం బవ్విప్రుని చేతి కిచ్చుచు నతం దెఱుంగ కుండఁ దేజోరూపంబున
నతనితనవున నావేశించె నిట్లు రుద్రుండొలసినయగ్గురునందనుం డమంద
హర్షమయమూర్తియై యతుల ప్రభ నొప్పె మున్ను భూతంబు చేత నప
హృతంబు లైనయస్త్రశస్త్రంబులును బిదపవేదియం దిడిన యాయుధంబు
నమ్మహావీరునితేరిపైఁ బూర్వప్రకారంబున నుండెనప్పుడు ప్రమథగణంబు
లదృష్టాకారంబులై యమ్మహాత్మునిఁ బరమాత్ముఁ గొలుచు చందంబున
బలసి రా రథారూఢుం డై పాండవశిబిరంబునకు నాతండు నడవందోడన
కృపకృతవర్ములు నడచి రనిన ధృతరాష్ట్రుండు సంజయున కిట్లనియె
10_1_135 చ.
అతఁ డటు లేపునం జనఁగ నాకృపుఁడుం గృతవర్మయున్ మహొ
న్నతవరలాభగర్వితమనస్కుఁడు ద్రోణసుతుండు వోవఁగా
నితని క్రియన్ బలోద్ధతి సహిష్ణుత గల్గునె యొడ్ల కంచు సం
భృతభయచిత్తవృత్తులయి పెంపఱఁ బోరు గదా పిఱిందికిన్.
10_1_136 వ.
మఱియును
10_1_137 మ.
పటువేగంబున ముట్టి ద్రోణసుతుఁ డప్పాంచాలలోకంబుఁ ద
క్కటిభూపాలుర ద్రౌపదీతనయవర్గంబున్ భుజాఖేలనో
ద్భటఖడ్గో ల్లసనంబుపా ల్పఱిచి తద్ధాత్రీతలం బెల్ల నె
త్తుట జొత్తిల్లఁగఁ జేసెనే రిపుచమూదుర్వారఘోరాకృతిన్.
10_1_138 క.
పాండవశిబిరముఁ జొచ్చి య
ఖండితపౌరుషము వెలయఁ గాఁ గలశజపు
త్రుం డది యంతయు మత్పు
త్రుండరిగెడితెరువునం దరుగఁ జేసెఁ గదే.
10_1_139 వ.
సమరప్రకారం బంతయు సవిస్తరంబుగా నెఱిఁగింపు మనుటయు నతం
డిట్లనియె
10_1_140. తే.
ఇవ్విధంబున గురుసుతుఁ డేపుమిగిలి
చనఁగఁ గృపుఁడును గృతవర్మయును దలిర్చు
కడఁక నతనితో నడచిరి గాని వారి
వలన నించుకయును నరవాయి లేదు.
10_1_141 వ.
ఇట్లు తనకెలంకుల నడచునవ్వీరుం నాలోకించి యాచార్యసుతుండు సంతో
షించి.
10_1_142 ఉ.
మీరును దెంపు సొం పెసఁగ మిక్కిలి బీరము లావు చూపఁగాఁ
గోరి కడంగి పైఁబడుటకుం దగి యుండదు వీడు మీబలో
దారత ప్రాపునం జని యుదగ్రభుజావిభవంబు పెంపు సొం
పారఁగ నవ్విరోధినిచయంబు సమస్తము నేన త్రుంచెదన్.
10_1_143 వ.
అని యిట్లు వారి నగ్గించి వాకిట నిలిపి మహనీయబాణబాణాసనంబులు
వహించి సుప్రసుప్తసకలజనం బైనయాశిబిరంబుఁ జొచ్చి తాను మున్న
గతాగతజనంబులవలనఁ బ్రసంగాధీనతంజేసి యవ్విడిదల తెఱంగును
నట్టిట్టివి వారి సన్నివేశంబు లిచ్చట నని సాభిజ్ఞానంబుగా విని యునికిక
తంబున నరసికొని పోవ నేర్చి తొలుత ధృష్టద్యుమ్నుసదనంబునకు
నరిగి బాణబాణాసన సహితం బై యున్న రథంబు డిగి రుద్రు నుద్దేశించి
మానసంబున.
10_1_144 క.
పూనితి నిష్ఠమెయి న్నిను
నానాభూతోపహారనవ్యార్చననీ
కేనొనరించెద నది యీ
శానా కైకొనుము సుప్రసన్నుఁడ వగుమీ.
10_1_145 వ.
అనుచు నరిగి.
10_1_146 తే.
అచటిజనములు పగలింటి యాహవమున
శ్రమము బొందియు నిశ్శేషశత్రునాశ
నమున నూఱటంజేసియు నమితనిద్ర
నొంది యత్యంతవివశులైయుండ నతఁడు.
10_1_147 వ.
మందగతిం బ్రవేశించి యన్వేషించి.
10_1_148 చ.
తెరయును మేలుకట్లుఁ దగు దీవియలుం జెలువొంద మేటిచ
ప్పరమునఁ జాలహృద్యమగు పాన్పున నూఱడి నిద్రవోవున
గ్గురువధకారి గాంచి కడుఁ గ్రోధము మోదము సందడింప సు
స్ఠిరతఁ బదప్రహారమునఁ దెల్పెను ద్రౌణి రణాభిరాముఁడై.
10_1_149 వ.
తెలిపినఁ గను విచ్చి తన్నుం జూచి యెఱింగియుఁ గలంగక రణదుర్మ
దుం డైన యాద్రుపదనందనుఁడు దిగ్గున లేచినం దనచేతివిల్లు విడిచి
యతనితలఁ బట్టుకొని పెడ మఱలఁ దిగిచి యబ్బలియుండు.
10_1_150 ఉ.
నేలపయిం బదం దిగిచి నిష్ఠురభంగి నురఃస్థలంబు మ్రోఁ
కాల నొగిల్చి యేపున మొగం బతిదారుణముష్టి నొంచె ని
ద్రాలసవృత్తి నంగములయందు బలంబును బుద్ధినేర్పునుం
జాలనియవ్విరోధి వివశత్వముఁ జేసె వ్రేల్మిదిన్.