సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా ప్రఖ్యాతి వహించిన విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం ఈ "ఆముక్తమాల్యద" గ్రంథం. దీనికే "విష్ణుచిత్తీయం" అని మరోపేరు. ఇది తెలుగు సాహిత్యంలో పంచకావ్యాలు లో ఒకటిగా ప్రసిద్ధిచెందినది.
ఆముక్తమాల్యదలోని మొట్టమొదటి పద్యములో శ్రీవేంకటేశ్వరుని స్తుతించి కావ్యనియమములను అనుసరించి నమస్క్రియతో మరియు 'శ్రీ' శబ్దం తో కావ్యామారంభించినాడు.
- శ్రీ కమనీయ హారమణి
- జెన్నుగ దానును, గౌస్తుభంబునం
- దాకమలావధూటియును
- దారత దోప పరస్పరాత్మలం
- దాకలితంబు లైన తమ
- యాకృతు లచ్ఛత బైకి దోపన
- స్తోకత నందు దోచె నన
- శోభిలు వేంకట భర్త గొల్చెదన్.
సాధారణంగా శార్దూల విక్రీడములతో కావ్యములు ప్రారంభించుట పరిపాటియై యుండగా, ఈ కావ్యము ఉత్పలమాలతో ప్రారంభమైనది. మహాలక్ష్మి, శ్రీవేంకటేశ్వరులు, ఇరువురి వక్షస్థలములందు పరస్పరము రూపములు ప్రతిఫలించుట ద్వారా కావ్యకథలోని ఆముక్తమాల్యద, రంగనాయకుల పరిణయ వృత్తాంతమును సూచించి రాయలు వస్తు నిర్దేశము గావించెను.
శ్రీవేంకటేశ్వరుని ప్రస్థావన
మార్చు
కావ్య ప్రారంభంలో ప్రస్తావన తర్వాత చాలా చోట్ల శ్రీవేంకటేశ్వరుని పలు విధాలుగా ప్రశంసించాడు. విష్ణుమూర్తి శయనించిన శేషుని వర్ణన, శ్రీదేవిని కనుమరుగు పరచి శ్రీవేంకటేశ్వరునికి భూదేవితో క్రీడించుట కవకాశము కల్పించిన శేషుని రాయలు స్తుతించినాడు. రాయలు తరువాతి పద్యములలో చాల భాగము తిరుమల నంతయు సాక్షాత్కరింపజేసినాడు.
తిరుమల బ్రహ్మోత్సవాలు జరిగే సందర్భము లేదా ఇతర పూజా సందర్భాలలో, ధ్వజారోహణ గావించి శుభారంభము చేసే సందర్భాలలో విశ్వక్సేనుని పూజించుట నేటికీ పరిపాటి. ఈ ఆచారాన్ని రాయలు ఆముక్తమాల్యదలో సైన్యపతి యొక్క కాంచనవేత్రము (బంగారు దండము) కదలనిదే లోకవ్యవహారమే జరుగదని ఇలా వర్ణించాడు:
- పూని ముకుందునాజ్ఞగనుబొమ్మనె
- కాంచి యజాండభాండముల్
- వానను మీద బోవ నడు
- వ న్గొనెదన్నననగ్రనిశ్చల
- త్వానుచలత్వనిష్ఠలె స
- మస్తజగంబుల జాడ్యచేతనల్
- గా నుతి కెక్కు సైన్యపతి
- కాంచనవేత్రము నాశ్రయించెదన్.
హరి పాంచజన్యమును పూరించినంతనే ఆ ధ్వని మాత్రము చేతనే రాక్షసుల ప్రాణములు హరీయన్నవని వర్ణించాడు. పాంచజన్యపు రాకా పున్నమినాటి చంద్రుని తెల్లని కాంతి గలదైన హరి శంఖము వెలుగులీనుచు కళ్యాణ సమృద్ధిని కూడ ఒనగూర్చునని రాయల శుభాసంసన.
- హరిపూరింప దదాస్య మారుత సుగం
- ధాకృష్ణమై నాభిపం
- కరుహక్రోడమిళిందబృంద మెదు రె
- క్కందుష్క్రి యాపంక సం
- కరదైత్యాసు పరంపరం గముచు రే
- ఖం బొల్చురాకానిశా
- కరగౌరద్యుతి పాంచజన్య మొసగుం
- గళ్యాణసాకల్యమున్.
శంఖు చక్ర గదాధరుడని శ్రీవేంకటేశ్వరుని స్తుతి కదా. కానీ రాయలు ఆముక్తమాల్యదలో చక్రమునకే పెద్దపీట వేసి తరువాత శంఖువు గదలను వర్ణించినాడు. శ్రీవారి నందక ఖడ్గం పాపములనెడి తీగలయొక్క శ్రేణిని పటాపంచలు చేయగల సామర్ధ్యము కలదని వర్ణించాడు:
- ప్రతతోర్ధ్వాధరభాగపీఠయుగళీ
- భాస్వత్త్సరు స్తంభ సం
- స్థితి దీండ్రించెడుజాళువా మొసలివా
- దీప్తార్చిగా గజ్జలా
- న్వితధూమాసితరేఖ పైయలు
- గుగా విజ్ఞానదీపాంకురా
- కృతి నందం బగు నందకం బఘలతా
- శ్రేణిచ్ఛిదం జేయుతన్.
ఆముక్త మాల్యద ఒక అధ్బుత కావ్యచంద్రిక.
శ్రీ వైష్ణవ మతాచార్యులైన పన్నిద్దరాళ్వారులను రాయలు ఇలా కీర్తించాడు:
- అలపన్నిద్దఱు సురులందును సము
- ద్యల్లీలగా పన్నవె
- గ్గల ప్రందాపము బాపునా నిజమనః
- కంజాతసంజాతపు
- ష్కలమాధ్వీకఝరి న్మురారి నొగియం
- గా జొక్కి ధన్యాత్ములౌ
- నిలపన్నిద్దఱుసూరులందల తు
- మోక్షేచ్ఛామతిందివ్య్రులన్.
రాయలు ఆముక్తమాల్యదను శ్రీకాకుళాంధ్రదేవుని ఆనతిమీద శ్రీవేంకటేశ్వరునికి అంకితమిచ్చాడు. అనేక ప్రబంధ రాజములను కృతిభర్తగా శ్రీకృష్ణదేవరాయలు లోకైకనాధుడు శ్రీవేంకటేశ్వరునికి ఈ క్రింది విధంగా ఆముక్తమాల్యదను సమర్పించాడు:
- అంభోధికన్యకాకుచ
- కుంభోంభితఘసృణమసృణ గురువక్షునకున్
- జంభారిముఖాధ్యక్షున
- కంభోజాక్షునకు సామిహర్యక్షునకున్.