ఆముక్తమాల్యద
ప్రథమాశ్వాసము
ఇష్టదేవతాస్తుత్యాదికము
|
శ్రీకమనీయహారమణిఁ
జెన్నుగఁ దానును, గౌస్తుభంబునం
దా కమలావధూటియు ను
దారతఁ దోఁవఁ, బరస్పరాత్మలం
దాకలితంబు లైన తమ
యాకృతు లచ్ఛతఁ బైకిఁ దోఁచి, య
స్తోకత నందుఁ దోఁచె నన
శోభిలు వేంకటభర్తఁ గొల్చెదన్.
| 1
|
మ. |
సిరి నొక్కప్పుడు కన్మొఱంగి హరి ద న్జేర ల్బ్రహర్షించు ను
ద్వరకు న్వంచనఁ గూడఁగాఁ గలుగు భాస్వచ్చంద్రశాలాపరం
పర లయ్యె న్బఱ పైన యెవ్వని ఫణాపంక్తు ల్భజింతు న్నిరం
తరముం దాంతుని నయ్యనంతుని నతీతబ్రహ్మకల్పాంతునిన్.
| 2
|
సీ. |
ఖనటత్పయోబ్ధివీక్ష్యరసాతలాన్యోన్య
పిండీకృతాంగభీతాండజములు,
ధృతకులాయార్థఖండితసమిల్లవరూప
చరణాంతికభ్రమత్తరువరములు,
ఘనగుహాఘటితఝాంకరణలోకైకద్వి
దుందుభీకృతమేరుమందరములు,
చటులఝుంపాతరస్స్వనగరీవిపరీత
పాతితాశాకోణపరిబృఢములు,
|
|
తే. |
ప్రబలతర బాడబీకృతేరమ్మదములు
భాస్వదేరమ్మదీకృత బాడబములు
పతగ సమ్రాట్ పతత్ర ప్రభంజనములు
వృజిన తూలౌఘములఁ దూల విసరుఁగాత.
| 3
|
విష్వక్సేనుని బెత్తమునకు వందనము సల్పుట
ఉ. |
పూని ముకుందు నాజ్ఞఁ గనుబొమ్మనె కాంచి యజాండభాండము
ల్వానను మీఁదఁ బోవ నడువ న్గొనెఁ దన్నన నగ్రనిశ్చల
త్వానచలత్వనిష్ఠలె సమస్తజగంబుల జాడ్యచేతవ
ల్గా నుతి కెక్కు సైన్యపతి కాంచనవేతము నాశ్రయించెదన్.
| 4
|
పాంచజన్యవర్ణనము
మ. |
హరి పూరింపఁ దదాస్యమారుతసుగంధాకృష్టమై నాభిపం
కరుహక్రోడమిళిందబృంద మెదు రెక్కం దుష్క్రియాపంకసం
కరదైత్యానుపరంపరం గముచు రేఖం బొల్చు రాకానిశా
కరగౌరద్యుతి పాంచజన్య మొసఁగుం గళ్యాణసాకల్యమున్.
| 5
|
నందకవర్ణనము
మ. |
ప్రతతోర్ధ్వాభాగపీఠయుగళీభాస్వత్త్సరుస్తంభసం
స్థితిఁ దీండ్రించెడు జాళువా మొనలివా దీప్తార్చిగాఁ గజ్జ లా
న్వితధూమాసితరేఖపై యలుఁగుగా విజ్ఞానదీపాంకురా
కృతి నందం బగు నందకం బఘలతాశ్రేణి చ్ఛిదం జేయుతన్.
| 6
|
కౌమోదకీవర్ణనము
ఉ. |
యాదవసార్వభౌమ భయదాయత బాహునియుక్తిఁ జేసి యెం
దే దనుజేంద్ర సాళ్వపుర హేమమణీవరణంబు సంగతం
బై దివి నాత్మకంకణము లం దొకె కంకణ మయ్యె నట్టి కౌ
మోదకి మోదకీలిత సముజ్జ్వలకల్పకమాల్యఁ గొల్చెదన్.
| 7
|
శార్‍ఙ్గవర్ణనము
చ. |
పిడికెఁడు కౌనుఁ గొప్పుఁ గని ప్రేమ ద్రివక్ర సమాంగిఁ జేసి, తే
బిడికెఁడు కౌనుఁ గొప్పు బయిఁబెచ్చు గుణంబును గంటి నంచు, నే
ర్పడఁగ నిజత్రివక్రతయుఁ బాపఁగ మ్రొక్కెడు నా, సుమాలిపైఁ
జడిగొన నమ్ములీను హరి శార్‍ఙ్గ ధనుర్లత గాచుఁ గావుతన్.
| 8
|
సుదర్శనవర్ణనము
చ. |
అడరు గళాస్రధారలు మహాముఖ వాంత సుధాంబుధారలున్
పొడవగు వహ్నికీలములుఁ బొంగును గాఁ బెఱదైత్య కోటికిన్
బెడిదపుఁ గిన్కతో నెసరు వెట్టిన పెద్దపనంటిఁ బోలె, నె
క్కుడు వెస రాహు మస్తకముఁ గొన్న సుదర్శనదేవుఁ గొల్చెదన్.
| 9
|
పన్నిద్దఱు సూరులం దలంచుట
మ. |
అల పన్నిద్దఱు సూరులందును సముద్యల్లీలఁ గా వున్న వె
గ్గలవుం దాపముఁ బాప నా నిజమనఃకంజాతసంజాతపు
ష్కఱమాధ్వీకఝరి న్మురారి సొగియంగాఁ జొక్కి ధన్యాత్ము లౌ
నిల పన్నిద్దఱుసూరులం దలఁతు మోక్షాచ్ఛామతిం దివ్యులన్.
| 10
|
వ. |
అని యిష్టదేవతావందనంబుఁ జేసి మున్నేఁ గళింగదేశ విజిగీషామనీషం దండెత్తిపోయి విజయవాటిం గొన్నివాసరంబు లుండి శ్రీకాకుళనికేతనుం డగు నాంధ్రమధుమథను సేవింపంబోయి హరివాసరోపవాసం బచ్చటఁ గావింప నప్పుణ్యరాత్ర చతుర్థయామంబున.
| 11
|
కలలో ప్రత్యక్షమైన తెనుఁగు వల్లభరాయని వర్ణన
సీ. |
నీలమేఘముడాలు డీలు సేయఁగఁ జాలు
మెఱుఁగుఁ జామనచాయ మేనితోడ
నరవిందములకచ్చు లడఁగించు జిగి హెచ్చు
నాయతం బగు కన్నుదోయి తోడఁ
బులుఁగురాయనిచట్టుపలవన్నె నొరవెట్టు
హొంబట్టుజిలుఁగు రెంటెంబుతోడ
|
|
|
నుదయార్కబింబంబు నొఱపు విడంబంబు
దొరలంగనాడు కౌస్తుభముతోడఁ
|
|
తే. |
దమ్మికే లుండఁ బెఱకేల దండ యిచ్చు
లేము లుడిపెడు లేఁజూపులేమతోడఁ
దొలఁకు దయఁ దెల్పు చిఱునవ్వుతోడఁ గలఁ ద
దంధ్ర జలజాక్షుఁ డి ట్లని యాన తిచ్చె.
| 12
|
భగవద్వాక్యము
సీ. |
పలికి తుత్ప్రేక్షోపమలు జాతి పెం పెక్క
రసికు లౌనన మదాలసచరిత్ర
భావధ్వనివ్యంగ్య సేవధి గాఁగఁ జె
ప్పితివి సత్యావధూప్రీణనంబు
శ్రుతి పురాణోపసంహిత లేర్చి కూర్చితి
సకలకథాసారసంగ్రహంబు
శ్రోత్రఘచ్ఛటలు విచ్చుగ రచించితి సూక్తి
నైపుణి జ్ఞానచింతామణికృతి
|
|
తే. |
మఱియు రసమంజరీముఖ్య మధురకావ్య
రచన మెప్పించికొంటి గీర్వాణభాష
నంధ్రభాష యసాధ్యంబె యందు నొక్క
కృతి వినిర్మింపు మిఁక మాకుఁ బ్రియముఁ గాఁగ.
| 13
|
ఉ. |
ఎన్నినుఁ గూర్తునన్న విను మే మును దాల్చిన మాల్య మిచ్చున
ప్పిన్నది రంగంమం దయిన పెండిలి సెప్పుము; మున్ను గొంటి నే
వ న్ననదండ యొక్క మగవాఁ డిడ, నేను దెలుంగురాయఁడ
న్గన్నడ రాయ! యక్కొదువఁ గప్పు ప్రియాపరిభుక్తభాక్కథన్.
| 14
|
ఆ. |
తెలుఁ గ దేల యన్న, దేశంబు దెలుఁ గేను
దెలుఁగు వల్లభుండఁ దెలుఁగొకండ
యెల్ల నృపులు గొలువ నెఱుఁగవే బాసాడి
దేశభాషలందుఁ దెలుఁగు లెస్స.
| 15
|
క. |
అంకితమో యన నీకల
వేంకటపతి యిష్టమైన వే ల్పగుటఁ దదీ
యాంకితము సేయు మొక్కొక
సంకేతముగా కతఁడ రస న్నేఁ గానే.
| 16
|
తే. |
పొత్త మిటు సేయ నీ కుత్తరోత్తరాభి
వృద్ధి, యని పోవ, మేల్కొని, వెఱఁగుతోడి
భక్తిఁ దద్గృహగోపురప్రణతిఁ జేసి
వేగుటయుఁ గల్యకరణీయవిధులు దీర్చి.
| 17
|
వ. |
నిండోలగం బుండి దండనాథసామంతసందోహంబులం బిలిపించి బెందల
కడన మందిరంబుల కనిపి వివిధవేదాగమవిదులగు విద్యజ్జనంబులఁ గాని
పించికొని నమస్కరించి యాశుభస్వప్నంబు వినిపించిన హర్షించి వారును
సవిస్మయస్వాంతులై ‘దేవా, దేవదేవుండు విజయంబు చేసిన యాస్వప్నం
బనేకశోభనపరంపరలం దెలుపుచున్నయది. ఎట్లనిన, ప్రథమ మప్పద్మేక్షణు
స్వప్నసాక్షాత్కారం బితోధికభక్తియు, నతండు ప్రబంధనిబంధనంబుఁ
గావింపుమనుట యితోధికాగాధసారస్వతోద్బోధంబును, నతని దేవీసమాగమం
బితోధికాఖండభాండాగారసమృద్ధియు, నతని యాసతిచేతి విశదశతచ్ఛదం
బితోధికాద్వితీయసితఛత్త్రతయు, నతం డశేషనృపసేవం దత్తద్భాష లెఱుం
గవె యనుట యితోధికసమస్తసామంతసమాజసమాకర్షణంబును,
ప్రియోపభోగపరిశిష్టభోగం బింపనుట యితోధికబహుప్రేయసీప్రాప్తియు,
కృతి చెప్ప నుత్తరోత్తరాభివృద్ధి యగు ననుట యితోధికాప్తయపరమాయుర
వాప్తియు, నగు. నఖర్వమహిమాతిధూర్వహుఁడగు తుర్వసువంశంబునం
బుట్టినట్టి నీ కిట్టి శోభనపరంపర లేమద్భుతంబు, లవధరింపుము.
| 18
|
సీ. |
కలశపాథోరాశిగర్భవీచిమతల్లి
గడుపార నెవ్వానిఁ గన్నతల్లి,
యనలాక్షు ఘనజటా వనవాటి కెవ్వాఁడు
వన్నెవెట్టు ననార్తవంపుఁ బువ్వు,
సకలదైవతబుభుక్షాపూర్తి కెవ్వాఁడు
పుట్టుకామని లేని మెట్టపంట
|
|
|
కటికిచీకటితిండి కరముల గిలిగింత
నెవ్వాఁడు తొగకన్నె నవ్వఁజేయు
|
|
తే. |
నతఁడు వొగడొందు మధుకైటభారిమఱఁది
కళల నెలవగువాఁడు చుక్కలకు ఱేఁడు
మిసిమిపరసీమ వలరాజు మేనమామ
వేవెలుంగులదొరజోడు రేవెలుంగు.
| 19
|
తే. |
అనుధాధాము విభవ మహాంబురాశి
కుబ్బు మీఱంగ నందనుఁ డుదయ మయ్యె
వేదవేదాంగశాస్త్రార్థవిశదవాన
నాత్తధిషణాధురంధరుండైన బుధుఁడు.
| 20
|
క. |
వానికిఁ బురూరవుఁడు ప్ర
జ్ఞానిధి జనియించె సింహసదృశుఁడు తద్భూ
జానికి నాయువు తనయుం
డానృపతికి తనయుఁడై యయాతి జనించెన్.
| 21
|
క. |
అతనికి యదు తుర్వసులను
సుతు లుద్భటమంది రహితసూదనులు కళా
న్వితమతులు వారిలో వి
శ్రుతకీర్తి వహించెఁ దుర్వసుఁడు గుణనిధియై.
| 22
|
తే. |
వానివంశంబు తుళువాన్వయ మయ్యె,
నందుఁ బెక్కండ్రు నృపు లుదయంబు నొంది
నిఖిలభువనప్రపూర్ణనిర్ణిద్రకీర్తి
నధికు లైరి తదీయాన్వయమునఁ బుట్టి.
| 23
|
మహాస్రగ్ధర. |
ఘనుఁడై తిమ్మక్షితీశాగ్రణి శఠకమఠగ్రావసంఘాతవాతా
శనరా డాశాంతదంతిస్థవిరకిరలు జంజాటము ల్మాన్చి యిమ్మే
దిని దోర్దండైకపీఠిన్ దిరము పఱిచి కీర్తిద్యుతుల్ రోదసిన్ బ
ర్వ నరాతు ల్నమ్రులై పార్శ్వములఁ గొలువఁ దీవ్రప్రతాపంబు సూపెన్.
| 24
|
క. |
వితరణఖని యత్తిమ్మ
క్షితిపగ్రామణికి దేవకీదేవికి నం
చితమూర్తి యీశ్వరప్రభుఁ
డతిపుణ్యుఁడు పుట్టె సజ్జనావనపరుఁడై.
| 25
|
చ. |
బలమదమత్తదుష్టపురభంజనుఁడై పరిపాలితార్యుఁడై
యిలపయిఁ దొంటియీశ్వరుఁడై యీశ్వరుఁడై జనియింప రూపఱెన్
జలరుహనేత్రలన్ దొఱఁగి శైలవనంబుల భీతచిత్తులై
మెలగెఁడు శత్రుభూవరులు మేనులఁ దాల్చిన మన్మథాంకముల్.
| 26
|
సీ. |
నిజభుజాశ్రితధారుణీవజ్రకవచంబు
దుష్టభుజంగాహితుండి కుండు
వనజేక్షణామనోధనపశ్యతోహరుం
డరిహంసనంస దభ్రాగమంబు
మార్గణగణపికమధుమాసదివసంబు
గుణరత్నరోహణక్షోణిధరము
బాంధవసందోహపద్మవనీహేళి
కారుణ్యరసనిమ్నగాకళత్రుఁ
|
|
తే. |
డన జగంబుల మిగులఁ బ్రఖ్యాతిఁ గాంచె
ధరణిధవదత్తవివిధోపదోవిధాస
మార్జితశ్రీవినిర్జితనిర్జరాల
యేశ్వరుఁడు తిమ్మభూపతి యీశ్వరుండు.
| 27
|
క. |
ఆయీశ్వరనృపతికిఁ బు
ణ్యాయతమతియైన బుక్కమాంబకుఁ దేజ
స్తోయజహితు లుదయించిరి
ధీయుతులగు నారసింహ తిమ్మనరేంద్రుల్.
| 28
|
క. |
అందు నరసప్రభుఁడు హరి
చందనమందారకుందచంద్రాంశునిభా
స్పందయశస్తుందిలది
క్కందరుఁడై ధాత్రి యేలెఁ గలుషము లడఁగన్.
| 29
|
సీ. |
అంభోధివసనవిశ్వంభరావలయంబు
ఘనబాహుపురి మరకతముఁ జేసె;
కకుబంతనిఖిలరాణ్ణికరంబుఁ జరణమం
జీరంపు సాలభంజికలఁ జేసె;
మహనీయనిజవినిర్మలయశస్సరసికి
గగనంబుఁ గలహంసకంబుఁ జేసె;
నశ్రాంతవిశ్రాణనాసారలక్ష్మికిఁ
గవికందబముఁ జాతకములఁ జేసె;
|
|
తే. |
నతిశితకృపాణకృత్తమత్తారివీర
మండలేశ నకుండలమకుటనూత్న
మస్తమాల్యపరంపరామండనార్చి
తేశ్వరుండగు నారసింహేశ్వరుండు.
| 30
|
తే. |
ఆ నృసింహప్రభుండు తిప్పాంబవలన
నాగమాంబికవలన నందనులఁ గాంచె,
వీరనరసింహరాయభూవిభుని నచ్యు
తాయతాంశజు శ్రీకృష్ణరాయ నిన్ను.
| 31
|
క. |
వీరనృసింహుఁడు నిజభుజ
దారుణకరవాలపరుషధారాహతవీ
రారి యగుచు నేకాతవ
వారణముగ నేలె ధర నవారణమహిమన్.
| 32
|
క |
ఆవిభుననంతరంబ ధ
రావలయముఁ బూని తీవు రహిమై దిరుమ
ల్దేవియును నన్నపూర్ణా
దేవియుఁ గమలాబ్జముఖియు దేవేరులుగాన్.
| 33
|
సీ. |
తొలఁగెను ధూమకేతుక్షోభ జనులకు,
నతివృష్టి దోషభయంబు వాసెఁ,
గంటకాగమభీతి గడచె, నుద్ధత భూమి
భృత్కటకం బెల్ల నెత్తువడియె
|
|
|
మాసె నఘస్ఫూర్తి, మరుభూములందును
నెల మూఁడు వానలు నిండఁ గురిసె
నాబాలగోపాల మఖిలసద్వ్రజమును
నానందముగ మన్కి నతిశయిల్లెఁ
|
|
తే. |
బ్రజల కెల్లను గడు రామరాజ్య మయ్యెఁ
జారుసత్త్వాఢ్య, యీశ్వర నారసింహ
భూవిభుని కృష్ణరాయ యభ్యుదయ మొంది
పెంపుతో నీవు ధాత్రిఁ బాలింపఁగాను.
| 34
|
క. |
తునియలు తొమ్మిదియఁట! పదు
నెనమండ్రఁట మోచువా రనేకసకిటికూ
ర్మనగాహు! లేటి లావరు!
లని తావకబాహు వొకటి యవని భరించెన్.
| 35
|
సీ. |
తొలుదొల్త నుదయాద్రిశిలఁ దాఁకి కెరలు నీ
యసి లోహమున వెచ్చనై జనించె;
మఱి కొండవీ డెక్కి మార్కొని నలియైన
యల కనవాపాత్రు నంటి రాఁజె;
నట సాఁగి జమ్మిలోయఁ బడి [1]వేఁగ దహించెఁ
గోన బిట్టేర్చెఁ; గొట్టానఁ దగిలెఁ;
కనకగిరి స్ఫూర్తిఁ గరఁచె; గౌతమి గ్రాఁచె;
నవుల నాపొట్నూర రవులుకొనియె;
|
|
తే. |
మాడెములు వ్రేల్చె; నొడ్డాది మసి యొనర్చెఁ;
గటకపురిఁ గాల్చె గజరాజు గలఁగి పఱవఁ
దోఁక చిచ్చన; నౌర నీ దురవగాహ
ఖేలదుగ్రప్రతాపాగ్ని కృష్ణరాయ.
| 36
|
ఉ. |
చిత్రము, కృష్ణరాయనృపశేఖర నీ దగు ధాటి కోడి స
ర్వత్ర నిలింప కామినులవాడకుఁ గాఁపులు వోయి, రుత్కల
|
|
|
క్షత్త్రియపాత్రులెల్లఁ గసుగందని మేనులఁ దొంటిపెద్ద లే
సూత్రముఁ బన్నినారొ బలసూదనువీటికిఁ గొండవీటికిన్.
| 37
|
ఉ. |
కూరిమిఁ గృష్ణరాయ నృపకుంజర చేరెఁ గళింగరాజ్యల
క్ష్మీరమణీలలామ నిను మిన్నులు ముట్టిన మోహనాలతోఁ
గారణ మట్లు లక్ష్మి గసుగందని వేడుకఁ గృష్ణరాయనిం
జేరునకాక, వావి సెడఁ, జెందునె సోదరుఁడైన రుద్రునిన్?
| 38
|
సీ. |
కచసక్తఫణికంచుకము మౌళి వీరకే
దారంపుఁ బాగ చందంబు నొందఁ,
గలయ నంగమున మర్కటకీటకృతమైన
మగ్గంబు నేత్రసంపద వహింప,
ధ్వాంతగహ్వరశిలాతాడితాళికచిక్క
ణాస్రపంకము చంద్రవై పొసంగఁ,
దనుభృశశ్రాంతవేష్టనలగ్నబర్హిబ
ర్హంబు మువ్వన్నె చుంగై చెలంగ,
|
|
తే. |
నిద్ర మేల్కాంచి సెలయేట నీడఁ గాంచి,
గోపవేషంబు సెడి, తొంటి భూపవేష
మగుట యవ్వనమహిమగా నలికి యచటు
విడుచు గజరాజు నీధాటి వింధ్యవాటి.
| 39
|
చ. |
అభిరతిఁ గృష్ణరాయ విజయాంకము లీవు లిఖించి తాళస
న్నిభముఁ బొట్టునూరికడ నిల్పిన కంబము సింహభూధర
ప్రభు తిరునాళ్ళకుం డిగు సురప్రకరంబు కళింగమేదినీ
విభు నపకీర్తి కజ్జలము వేమఱు పెట్టి పఠించు నిచ్చలున్.
| 40
|
సీ. |
సనకాది దివిజమస్కరిఫాలగోపిచం
దనపుండ్రవల్లిక ల్నాకి నాకి
నెలపి హాహాహూహువుల దండియల తంత్రి
ద్రెవ్వ సింగిణులుగాఁ దివిచి తివిచి
సప్తర్షికృతవియజ్ఝరవాలుకాలింగ
సమితి ముచ్చెలకాళ్ళఁ జమరి చమరి
|
|
|
రంభాప్రధానాప్సరఃపృథూరోజకుం
భంబు లెచ్చటఁ గన్నఁ బట్టి పట్టి
|
|
తే. |
తిరుగు హరిపురి సురతరు సురల మరగి
బహుళ హళిహళి భృత కలబరిగనగర
సగర పురవర పరిబృఢ జవన యవన
పృతన భవ దసి ననిఁ దెగి కృష్ణరాయ.
| 41
|
మ. |
అలుక న్ఘోటకధట్టికాఖరపుటీహల్య న్ఖురాసాని పు
చ్చలు వోఁ దున్ని తలచ్చమూగజమదాసారప్లుతి న్గీర్తి పు
ష్కలసస్యం బిడి యేకధాటి బళిరా కట్టించితౌ దృష్టి కే
దులఖానోగ్రకపాలమర్థపహరిద్భూజాంగలశ్రేణికిన్.
| 42
|
చ. |
సుమతిఁ బునఃపునారచితషోడశదానపరంపరావసం
తముల ననంతవిత్తము ననంత ననంత మహాగ్రహారబృం
దమును నొసంగు ని న్నొరసి తా రెన రాక కదా నిలింప భూ
జములు వహించు దుర్యశము షట్పద కోకిల కైతవంబునన్.
| 43
|
తే. |
ప్రబలరాజాధిరాజ వీరప్రతాప
రాజపరమేశ్వరార్థదుర్గానటేశ
సాహితీసమరాంగణసార్వభౌమ
కృష్ణరాయేంద్ర కృతి వినిర్మింపు’ మనిరి.
| 44
|
వ. |
అని విన్నవించినఁ బ్రహృష్టాంతరంగుం డనై.
| 45
|
షష్ఠ్యంతములు
క. |
అంభోధికన్యకాకుచ
కుంభోంభితఘుసృణమసృణగురువక్షునకున్;
జంభారిముఖాధ్యక్షున
కంభోజాక్షునకు సామి హర్యక్షునకున్.
| 46
|
క. |
మర్దితకాళియఫణికి గ
పర్దభృదజబింబితాచ్ఛపదనఖఘృణికిన్
|
|
|
దోర్దండశార్ఙ్గికిణి కఘ
కర్దమదినమణికి దనుజకరివరసృణికిన్.
| 47
|
క. |
గుహపుష్కరిణీతట ఘన
గహనగుహాఖేటవంచక పుళిందునకున్
ద్రుహిణాండతుందున కయా
వహదీర్ఘాపాంగదృక్ కృపాస్యందునకున్.
| 48
|
క. |
బంధురరథాంగధారా
గంధవహాప్తజ్వలచ్చిఖాపటలపున
స్సంధుక్షణఘృతరాహుప
లాంధోనృక్సృతికి వేంకటాచలపతికిన్.
| 49
|
కథాప్రారంభము
వ. |
నా విన్నవింపఁ బూను నాముక్తమాల్యదామహాప్రబంధమునకుఁ గథాక్రమం
బెట్టి దనిన.
| 50
|
విలిబుత్తూరివర్ణన
మ. |
లలితోద్యానపరంపరాపికశుకాలాపప్రతిధ్వానము
ల్వలభీనీలహరిన్మణీపికశుకస్వానభ్రమం బూన్ప మి
న్నులతో రాయు సువర్ణసౌధముల నెందుం జూడఁ జెన్నొంది శ్రీ
విలుబుత్తూరు సెలంగుఁ బాండ్యనగరోర్వీరత్నసీమంతమై.
| 51
|
చ. |
మలిచి పయోజకోశముల మాడ్కి నొనర్చిన పద్మరాగపుం
గలశపు టెఱ్ఱడా ల్బొమిడికంబులతో నపరంజి యోడుబి
ల్లల నల వైజయంతముఁ జలంబున గెల్వఁగ దంశితంబు లై
నిలిచిన యట్లు మాడువు లనేకము లుల్లసిల్లు న్బురంబునన్.
| 52
|
సీ. |
పాథోధిజలయుక్తిఁ బ్రాఁచిపట్టిన దిశా
కరులు నాఁ దగు మరకతపుఁ గరులఁ,
గరులఁ దొండము సిక్కఁ గబళించి మ్రింగిన
హరులు నాఁ దొండ మొప్పగుఁ భదశ్మ
|
|
|
హరులు, దాచిన తాప లమర నేనుఁగుదోయి
నీరార్చు నపరంజి నీటివ్రాఁత
శ్రీలు, దత్పార్శ్వచిత్రితశంఖచక్రముల్
రత్నంపుఁదిన్నెలఁ బ్రతిఫలింపఁ
|
|
తే. |
బెఱపురాళి గృహశ్రీలఁ బెండ్లియాడ
భవనరాజులు గట్టిన బాసిక మనఁ
దనరు మణితోరణములతో ద్వారవితతిఁ
బరఁగు వీథులు పురి సూత్ర పట్టినట్లు.
| 53
|
చ. |
పగడపుఁ జాయ చెందిరముఁ బ్రామిన పాండ్యవధూకుచంబులన్
నగు నరుణంపు బొండ్లముల నారికెడంబులు వజ్రకుట్టిమం
బగు పథముం జెలంగు భవనాహృతశేషితరత్నరక్షక
భ్రగతరుసంతతి బ్రథమభార్యఁ బురిన్ గిఱ వుంచె వార్ధి నాన్.
| 54
|
క. |
కోరకిత నారికేళ
క్ష్మారుహములు రత్నకుట్టిమంబులఁ దోఁపన్
ద్వారము లయత్నకృతశృం
గారముఁ గను నలికి మ్రుగ్గు ఘటియించి రనన్.
| 55
|
మ. |
శయ పూజాంబుజముల్ ఘటిం దడఁబడన్ జందోయి లేఁగౌనుపై
దయఁ దప్పన్ బసుపాడి, పాగడపుఁ బాదంబొప్పఁ, జెంగల్వడి
గ్గియ నీ రచ్యుత మజ్జనార్థము గటిం గీలించి, దివ్య ప్రబం
ధయుగాస్యల్ ద్రవిడాంగనల్ నడుతు రుద్యానంపు లోత్రోవలన్.
| 56
|
మ. |
కలయ న్నీలమయంపుఁ దల్లి యొఱ దాఁకం దేటనీ రొప్పు ర
థ్యలకూపంబుల మీలఁ జూచి వలభివ్యాసంగితుంగద్రుశా
ఖలలోనుండి గుబాలునన్ లకుముకుల్ క్రిందై పడున్ లేచు మ్రు
చ్చిలి గేహేందిరద్రావిడీపరిచితిన్ జెండాడు చందంబునన్.
| 57
|
మహాస్రగ్ధర. |
న్వ నిలింపావాసదత్వాశనదతలమిథస్తారతమ్యంబు లీ రెం
డును [2]దీను ల్గాంచు నమ్మాడువులన యడుగుల డోఁగు నుద్యత్రతోన్మే
|
|
|
శనసిద్ధద్వంద్వబృందాలయబిలతటకల్యాణమంథాద్రులో నా
వనజాక్షిస్యందనద్వంద్వము లిఖితనరావాప్తదాంపత్య మొప్పున్.
| 58
|
సీ. |
సవలయధ్వని గాఁగ సారె వ్రేయు నదల్పు
యతినైన గుండె జల్లనఁ గలంప
సుడిసిన మొగమెత్తి చూడకుండు పరాకు
కుసుమబాణుని నైనఁ గువిటుఁ జేయ
శ్రీకార్య పరులఁ గాంచిన లేచి మ్రొక్కు నం
జలికి నింద్రుండు నక్కొలువుఁ గోర,
హరిగృహావసరశంఖాకర్ణనకుఁ ద్రిప్పుఁ
గడగంటి జిగి ప్రజఁ గాఁడి పాఱఁ
|
|
తే. |
గవఱ లుంకించి వ్రేయఁ గొ ప్పవియ నవలి
కరమున నమర్పఁ బైఁటతో మరుని బటువు
బిల్లక్రియఁ బట్టుగంచెల బిగువుఁ జన్ను
నిక్కఁ దిన్నెలఁ బాత్రాళి నెత్తమాడు.
| 59
|
సీ. |
వీడంపుఁ బలుకెంపు విరిసి వెన్నెల గాయ,
వరిగింజ నొకటఁ బల్వరునఁ దోమ,
నొరసి యెత్తిన మణుం గొందక మైనె ని
గ్గులు దేరఁ బను పిడి జలక మాడ,
ముదుక గాకుండఁ బయ్యెదలోనె గేలార్చి,
కలయఁ జంటను నొట్టఁ గలప మలఁద,
రతిరచ్ఛిన్నసూత్రమునఁ జిక్కక ముత్తె
ములు రాల గరగరికలు వహింపఁ,
|
|
తే. |
బొలసిననె యెట్టినరునైనఁ గులముఁ దెలియఁ
బ్రభుత నెడి పల్లవుఁడు వేద వడిన నేడ
నృపతి వెలియంతిపురముగా నెన్న మెలఁగ,
బాసఁ గృతి సెప్ప వలఁతు లప్పద్మముఖులు.
| 60
|
ఉ. |
అంచితహారవల్లి వలయాభరణంబుల తక్కఁ ద్రోయుఁ జి
ల్మంచుఁ బసిండి, యేణమద మంగముఁ జేర్చుట తక్క రోయు జి
|
|
|
డ్డంచు జవాది, ధూపితను యందుట తక్క విదుర్చుఁ బూవుఁ జె
మ్మంచు, జిలుంగెదక్క నగుయౌవత మొత్తు నటంచు నన్యమున్.
| 61
|
ఉ. |
వేవిన మేడఁబై వలభి వేణికఁ జంట వహించి విప్పఁగాఁ
బూవులు గోట మీటుతఱిఁ బోయెడు తేఁటుల మ్రోఁత కామి శం
కావహ మౌఁ గృతాభ్యసన లౌటను దంతపు మెట్ల వెంబడిం
జే వడి వీణ మీటుటయుఁ జి క్కెడలించుటయు న్సరింబడన్
| 62
|
క. |
ఆళివచఃకార్పణ్యం
బా లేమల చెవులు సోఁక దధమాన్వయ జీ
ర్ణాలావణ్యుల పిలుపున
కైలాభముఁ దెలిపెనేని నవి శ్రీలగుటన్.
| 63
|
చ. |
ద్రవిడకుటింబిను ల్పసుపు రాచిన రత్నపుఁదాపక్రింద నం
టువు దెరవాఱఁగా నిదురవోయి గరుత్తతి పచ్చబాఱినన్
భవననరోమరాళములు భర్మమయద్ఛదగుచ్ఛవిస్ఫుర
ద్దివిజధునీమరాళవితతి భ్రమఁ బూన్చుఁ బురి న్బ్రమించుచున్.
| 64
|
మ. |
తలఁ బక్షచ్ఛట గ్రుచ్చి బాతులు కేదారంపుఁ గుల్యాంతర
స్థలి నిద్రింపఁగఁ జూచి యారెకు లుషస్స్నాతప్రయాతద్విజా
వలి పిండీకృత శాటిక ల్సని దదావాసంబు జేర్పంగ రే
వుల డిగ్గ న్వెనఁ బాఱువాని గని నవ్వు న్శాలిగోప్యోఘముల్.
| 65
|
మ. |
సొరిదిం బేర్చిన తీఁగమల్లియలు ఖర్జూరంబులు న్బుష్పమం
జరులు న్మామిడిగుత్తులు న్గుసుమము ల్సంపెంగలు స్వచ్ఛగ
న్నెరులు న్బాళలు గల్గి రాజసపుఁ గాంతిం దారు ము ల్సూపి చే
లరుదార న్నగుఁ బూవుఁదోఁటల బలాకానీకదంభంబునన్.
| 66
|
చ. |
బలసిన హల్లకచ్చటలపైఁ దమ జుంజుఱుముండ్లు రాయఁగాఁ,
గలమము లుండుఁ బండి యొఱగంబడి నీ రెదలింపఁ దృష్ట లోఁ
దల కొన, వంగి మున్ జలముఁ ద్రావెడు క్రిందటివ్రేళ్ళు మీదటన్
నిలిపి, మరంద మాను కరణి న్నికటోపవనానిలాహతిన్.
| 67
|
చ. |
అడుగునఁ బండి వ్రీలి యసలై మధువుట్టఁగఁ, ద్రావఁ దేంట్లు మ
ల్లడి గొని చుట్టు రాఁ బనసల న్బొలుచు న్గలుగుండ్లతోడ నీ
|
|
|
డ్వడు పెనుఁబండ్లు, భిన్నకటపాంసురభూరిమదాంబుసేచనా
జడదృఢశృంఖలాయుతవసంతనృపద్విరదాధిపాకృతిన్.
| 68
|
ఉ. |
చాల దళంబుగాఁ బృథుల చంపక కీలనఁ బొల్చు బొందుఁ దో
మాలె లనంగఁ బండి మహిమండలిఁ జీఱుచు వ్రాలి గంధ మూ
ర్ఛాలస యైన భృంగతతి నాఁ దుదక ప్పమర న్ఫలావళు
ల్వ్రీలి గెల ల్సుగంధికదళీ వనపంక్తుల నొప్పు నప్పురిన్.
| 69
|
చ. |
మన కనురక్తి హెచ్చ నిదె మం దని కంఠముఁ గౌఁగిలించి ని
క్కిన ఫణిరాజవల్లి యెఱిఁగింపఁగ నో యనఁ బూగము ల్భరం
బునఁ బడు మట్టచేఁ జెఱకు ముత్తియము ల్చిటిలించి తద్రసం
బనిశము వండు నంతిక తలాంతికఁ జూర్ణముఁ జేయు నప్పురిన్.
| 70
|
చ. |
అలరుఁ బురంబునం దొగల నంతరదామరఁ బ్రాఁచిఁ గప్రపున్
వలపులు మీఱ, లో వలుద వాలుగ మొత్తము పోర, నీరుకా
ళ్కొల కొల మంచుఁ గ్రుంకుమెడ గుంపుల వంపులు దోఁప, మావితోఁ
పుల విరుల న్బయి న్నడువఁ బొల్చు పురాతనతీర్థకుండముల్.
| 71
|
శా. |
సాయంకాలములం దదీశమురజిత్సద్మస్వనద్దుందుభి
స్ఫాయత్కాహళికాప్రతిస్వనత దోఁప న్గుంజగర్భంబుల
న్ర్మోయుం గేళివనిం గులాయగమనప్రోత్తిష్టదన్తస్సర
స్స్థాయి శ్వేతగరు ద్గరుత్పటపటాత్కారంబుఁ గ్రేంకారమున్.
| 72
|
మ. |
పొలయుం గాడ్పు లుదఙ్మహాలయవదంభోజాక్షవక్షస్తుల
న్యలఘుస్రఙ్మకరందబిందువులఁ బణ్యారంపుఁ బుణ్యంపుఁ గం
పులఁ దాపత్రయి మీటి వీట నటన ప్రోద్యోగ సజ్జీభవ
ల్లలనావర్జిత కైశిక క్షరిత కహ్లారాళి నల్లార్చుచున్.
| 73
|
చ. |
మలయపుగాలి రేలు వనమాలివిమానపతాక ఘల్లుమం
చులియఁ బసిండి మువ్వగమి నొక్కొకమాటు గదల్ప, నుల్కి మి
న్నలము తదీయహేమవరణాంచలచంపకశాఖలందుఁ బ
క్షులు రొద సేయ, వేగెనని కూడుదు రల్కలు దీఱి దంపతుల్.
| 74
|
చ. |
కలమపుటెండుగు ల్ద్రవిడకన్యలు ముంగిటఁ గాచుచుండి, త
జ్జలరుహనాభగేహ రురుశాబము సారెకు బొక్కులాడఁ, గొం
|
|
|
డెలపయి కమ్మ గ్రామ్యతరుణీతతి డించిన పేఁపగంపలం
దల మగుచున్న చెంగలువ దండలఁ దోలుదు రప్పురంబునన్.
| 75
|
భాగవతులు
సీ. |
ఎదు రేఁగి సాష్టాంగ మెరఁగి పాద్యం బిచ్చి,
నారికేళకటాననముల నునిచి,
నునుఁబోఁకపొత్తిఁ గుట్టిన దొప్పగమితోడ
రంభవిశాలపర్ణములు వఱిచి,
శాల్యన్నసూపాజ్యకుల్యాబహువ్యంజ
నక్షీరదధు లర్పణంబు చేసి,
వార్చినపిదప సంవాహన మంఘ్రుల
కొనరిచి, తాంబూల మొసఁగి, కుశల
|
|
తే. |
మడిగి, పోయెద మన్న ద వ్వనిచి, సిరికిఁ
దగినసత్కృతి చేసి, ఖేదమున మగిడి
యర్చ గావింతు రెపుడు ని ట్లతిథులైన
భాగవతులకు నప్పురి భాగవతులు.
| 76
|
విష్ణుచిత్తుఁడు
శా. |
అం దుండుం ద్వయసద్మపద్మవదనుం డద్వంద్వుఁ డశ్రాంతయో
గాందూబద్ధమధుద్విషద్ద్విరదుఁ డన్వర్థాభిదానుం డురు
చ్ఛందోబృందతదంతవాగపఠనాసంజాతతజ్జన్యని
ష్పందద్వైతసుసంవిదాలయుఁడు నిష్ఠ న్విష్ణుచిత్తుం డనన్.
| 77
|
వ. |
అమ్మహీసురవరుండు ప్రకృతికంటెఁ బరుం డగు తన్నును, దనకంటెఁ
బరుం డగు పరమేశ్వరుం, బరమేశ్వరప్రసాదబహుజనకృతసుకృతఫల
రూప యగు నాచార్యకృప గుప్తదానంబు నిధానంబుఁ దెలిపిన గతిం దెలు
పఁగా, నాత్మీయ తదీయశేషశేషిత్వసంబంధం బనాద్యంబుగాఁ దెలిపి; “యీ
తెలివి గలిగి యఖండనిర్వృత్తిం గాంచి సుఖించు పరమయోగికి బహుక్లేశ
దంబు లగు చదువులం బని యేమి? యీ వివేకంబు లేనివాని హేతువాదంబు
ధాతువాదంబు, కాణాదంబు ప్రాణాదంబు, కాపిలంబు చాపలంబు, మీమాంస
|
|
|
హింస, వ్యాకరణం బకరణం; బటు గాక చదువ దొరకొనిన నరునకుఁ గాలంబు
నాలంబు, విఘ్నంబులు సకలోద్యమఘ్నంబు, లందులకు సామగ్రి గిటగిటన;
కొంతెఱుంగ నగు మదంబు పుటపుటన; దుదముట్టం జదివనేనియు సముత్పన్న
విజ్ఞానుండై త్రైగుణ్యవిషయంబు లగువాని నానీతధ్యానుండు నిష్పలంబైన
పలాలంబును లబ్ధమధుండు సిక్థకంబును విడుచువడువున విడువవలయుఁ,
గావున శాంతిదాంతిపరతంత్రత బరమైకాంగ నైన నాకు మొదల నివి యధిగ
మింపం దుద విసర్జింప నేమి ప్రయోజనంబు; వాదిభంజనంబు రాజరంజ
నంబును జేయుచుఁ బునర్జననంబులకు విసువని జనంబులకుఁ గానిమ్ము,
మాదృశులకుఁ దదీయఖ్యాతి యీతి, లాభంబు క్షోభంబు, పూజనం బుద్వేజనం
బని వితర్కించి యుర్వరఁబూర్వంబున సౌవీరభూరమణునకు గౌరవం
బంగీకరించి బోధించి ముక్తి కనిచిన భరతభూమిసురవతంసంబునుంబోలె
దుర్విభావ్యబోధుండై పరమపదంబునను భాగవతుల కప్రాకృతంబు లగు బహు
భద్రమూర్తులు భరియించి భగవత్పరిచర్య సేయుటయ పరమపురుషార్థం
బగుట యెఱిగి యచటి రథచరణపాణిమాలికాకరణకైంకర్యంబున కంకురిత
కౌతూహులుండై చేయుచుండె, మఱియును,
| 78
|
క. |
న్యాయార్జితవిత్తంబున
నాయోగీశ్వరుఁడు వెట్టు నన్నం బాప్రా
లేయపటీరాచలప
ద్యాయతాయాతవైష్ణవావలి కెల్లన్.
| 79
|
చ. |
గగనము నీటిబుగ్గ కెనగా జడిపట్టిననాళ్ళు భార్య కన్
బొగ సొరకుండ నారికెడపుంబొఱియ ల్దగిలించి వండ న
య్యగవల ముంచిపెట్టుఁ గలమాన్నము నొల్చినప్రప్పు నాలు గే
న్పొగపినకూరలు న్వడియము ల్వరుగు ల్పెరుఁగు న్ఘృతప్లుతిన్.
| 80
|
చ. |
తెలి నులివెచ్చ యోగిరముఁ దియ్యని చారులుఁ దిమ్మనంబులున్
బలుచని యంబళు ల్చెఱుకుపా లెడనీళ్ళు రసావళు ల్ఫలం
బులును సుగంధిశీతజలము ల్వడపిందెలు నీరుఁజల్లయు
న్వెలయఁగఁ బెట్టు భోజనము వేసవిఁ జందనచర్చ మున్నుగన్.
| 81
|
మ. |
పునుగుందావి నవోదనంబు మిరియంపుం బొళ్లతో జట్టి చు
య్యను నా దాఱని కూరగుంపు, ముకుమందై యేర్చునావం జిగు
ర్కొను పచ్చళ్లును, బాయసాన్నములు, నూరుంగాయలున్, జే సుఱు
క్కను నేయుం, జిఱుపాలు వెల్లువగ నాహారం బిడు న్సీతునన్.
| 82
|
చ. |
కదళగభీరపుష్పపుటికాచ్ఛటఁ జేతుల నిప్పపిండిపైఁ
గుదురుగ నిల్పి యోపుగతి గూనల నూనియ నించి, త్రాట
మున్నుదికిన శాటి వ్రేల, నది నొక్కొటఁ గ్రుంకిడి వత్తు రెందఱే
వదలక యాతనింట శనివారమునన్ బరదేశివైష్ణవుల్.
| 83
|
శా. |
ఆ నిష్టానిధి గేహసీమ నడురే యాలించినన్ మ్రోయు నెం
తే నాగేంద్రశయానుపుణ్యకథలుం దివ్యప్రబంధానుసం
ధానధ్వానము “నాస్తి శాక బహుతా నాస్త్యుష్ణతా నాస్త్యపూ
పో నాస్త్యోదనసౌష్ఠవం చ కృపయా భోక్తవ్య”మన్ మాటలున్.
| 84
|
తే. |
ఇవ్విధంబున నవ్వైష్ణవోత్తముండు
జాగరూకతఁ దైర్థికభాగవతుల
కితర మెఱుఁగక యెవ్వ రే మేమి వేఁడి
రలయ కవి పెట్టి సంతుష్టి సలుపుచుండె.
| 85
|
ఆశ్వాసాంతపద్యములు
శా. |
బాలార్కాంశు విజృంభితామలశరత్పద్మాక్ష! పద్మాక్షమా
నీళాజాంబవతీశ! యీశ బలభి న్నీరేరుహోద్భూత ది
క్పాలామూల్యశిరోమణిద్యుతికనత్పాదాబ్జ! పాదాబ్జఫా
లాలంకారకచావలీ మకర దీప్యత్కుండలాంచన్ముఖా.
| 86
|
క. |
జలచర కిటి హరి వటు భృగు
కుల రఘుకుల సీరి బుద్ధ ఘోటి ప్రముఖో
జ్జ్వల జనికృతజనరక్షా
యలమేల్మంగాభిధేందిరాలయవక్షా!
| 87
|
భుజంగప్రయాతము. |
బలద్విడ్వినిర్దిష్టపాథోధరోరూ
పలాసారధారాతపత్రీకృతాద్రీ
ఫలన్మూర్ధచాణూరభంగోగ్రబాహా
కలాకృత్తకంసా శిఖండావతంసా.
| 88
|
మ. |
ఇది కర్ణాటధరాధృతిస్థిరభుజాహేవాక లబ్ధేభరా
డుదయోర్వీధర తత్పితృవ్యకృత నవ్యోపాయనోష్ణీష ర
త్నదృగంచత్పద కృష్ణరాయ వసుధాధ్యక్షోదయముక్తమా
ల్యద నాశ్వాసము హృద్యపద్యముల నాద్యంబై మహింబొల్పగున్.
| 89
|