ఆబ్రహాము లింకను చరిత్ర/పదునాఱవ ప్రకరణము

తండ్రిగారి కీజాడ్యమునుండి విముక్తి గలుగు గాకని యెప్పుడు దైవమున కెరగుచున్నాను. అయిన నెట్లుండి యెట్లువచ్చినను దండ్రిగారిని దయా సముద్రుండును, సర్వాంతర్యామియు, సర్వ శక్తుడును నగు నాపరమాత్మను మఱువక యారాధించి యతని మఱుగు జొరు మనుము ........ఇప్పుడు నేనును దండ్రిగారును నొకరిని నొకరు చూచుకొనుట యిద్దఱికి మిక్కిలి దు:ఖప్రదముగనే యుండునుగాని సంతస మియ్యజాలదు. దైవానుగ్రహము తప్పి యత డిపుడు పరలోకమున కేగవలసివచ్చిన నిదివఱ కటకుబోయిన ప్రియబాంధవుల సంతోషముతో గలసి కొన గల్గును. అచిరకాలములోనే నిలువయుండు మేమును నీశ్వరాజ్ఞచే నా యానంద మనుభవింతుము గాక."

________

పదునాఱవ ప్రకరణము

గౌరవాధిక్యతం కెందుట.

లింకను న్యాయవాదిత్వమున నుండి సంపాదించిన ప్రజా ప్రతినిధి సభ్యత్వాది విషయముల గుఱించి విశేషము వ్రాయ బనిలేదు. అతడు దేశాధ్యక్షతకు నేమింపబడువఱకు గ్రమక్రమముగ వృద్ధిబొందుచు వచ్చెను. జనుల కందఱ కాతని సద్గుణసంపద విదిత మగుట నెల్లరును దమతమ స్వల్పభేద ముల గణింపక యతనినె విశ్వసించి యతనినే బహుకార్యస్థానముల కేర్పఱచుచు వచ్చిరి.

అతని యౌన్నత్యమునకు గారణభూతము లైనవిషయములు గొన్నికలవు. బానిసవ్యాపారనిర్మూలనంబుకై యతడు దన శక్తి నంతయు నుపయోగించి పాటుపడెను. అతని వాక్ఛక్తియు వాదమహిమయు బ్రతిమనుజుని సత్స్వభావంబును క్షణక్షణ ప్రవర్థమానపటుత్వముతో గొల్లగొని యాశాపాశబద్ధులై న్యాయచింతనకు బహుదూరు లగు ప్రతిపక్షము వారిని బానిస వ్యాపారమం దుత్సాహులమాత్ర మంతకంతకు గనలజేసెను. గొప్పగొప్ప సభల వైరు లతని బీదపుట్టుక నుపన్యసించి హేళనము సేయుటగూడ దటస్థించెను. అయిన నది యతని కవమానకారి గాక వారి నీచత్వమునే వెల్లడిచేసెను. ఏనుగుం జూచి కుక్క లఱచిన నేరికి లోకువ యను లోకోక్తి వృథ యగునే?

లింకను దుష్టసమరము నొకదానిని నివారింప మిక్కిలి పాటుపడియెను. అయ్యది భానిసవ్యాపార వృద్ధికై యొకానొక సీమను లో బఱచుకొన జరపబడియెను. 'ఘోర కర్మలచే నిండియున్న యిట్టి దేశ మెన్నడైన నొకదినము దేవుని యాగ్రహ మనెడి యనలమున బడి భస్మము గాగలదు. దాస్యము ప్రబల జేయుటకొఱ కొకసీమను నిర్బంధిచుట యాసురంబగు" నని యతడు మంట లెగయుమాటల విను వారల మనముల జ్వలింప జేయుచు ఖండన మొనర్చెను.

సీమ ప్రతినిధి సభ్యత్వమునకు బెనగుచు నచ్చటచ్చట నిత డిచ్చిన యుపన్యాసములు మహాద్భుతవిధమున లోకుల డెందముల కానందంబిచ్చి యితనియందలి గౌరవభావముం బెంచుచుండెను. ఒకనా డిత డుపన్యసించి ముగించిన తరువాత ననేకు లొక్కటిగ నితని భుజములపై నెక్కించుకొని కడుదూర ముత్సాహముతో గేకలు వైచుచు మోసుకొని పోయిరట. మఱియొకతఱి నొక ముదుసలి ప్రతిపక్షము వాడు లింకను వాక్యామృత మంతయు గ్రోలి తుట్టతుదకు మనస్సార జేతులుచఱచి యాహ్లాదమున మునిగితేలి తనపక్షము జ్ఞప్తికి దెచ్చుకొని,

"ఇతడు సెప్పు నంశముల నొక్కటైన నే నమ్మను. అయిన నితని వాక్సుధాలహరి కేను సంతసించి మెచ్చి తీర వలసి యున్నది. అది యేమిచిత్రమోగాని యీతని భాషణము లింతసొంపుగ నున్నవి." యనె నట.

ఇట్లున్నపదవి కేతెంచు కాలమున లింకను గుణముల జూపు విషయములు రెంటి నిందు గమనింపవలసి యున్నది.

ఒకదిన మతడు రాజకీయోద్యోగ స్థలము నుండి దిగి వచ్చుచు మెట్లమీద దన కక్షిదారు నొకని బొడగాంచి, "ఓ! కాడ్గల్ల" ని మన:పూర్వకముగ హస్త మొసగి "మీ రీమధ్య పెద్ద దురదృష్టము పాల బడితిరని వింటినే" యనెను. కాడ్గల్‌తుపాకిమం దాకస్మికముగ గాలుటవలన నొక చేయి గోలుపోయి యుండెను. కావున "అవును. కొంతవఱ కద్రుష్టహీనుడనె! ఇంతకంటె నెక్కువ యపాయము గలిగి యుండవచ్చును. అది తప్పిన"దనెను.

"సరియె. అది వైరాగ్యమార్గ మయ్యెను. మీ వ్యాపారమైన జక్కగ జరుగుచున్నదే" యని లింకను ప్రతి పల్కెను.

"చెడవలసినంత చెడినది. వ్యవహారమున సున్న యగుటయె గాక కాయస్థితినిగూడ నణగద్రొక్క బడినాడను."

"మీ గతిజూచిన జాల విషాదము గల్గెడిని. అయ్యో! పాపమ" ని లింకను శోకార్ద్రహృదయముతో నొడివెను.

"తమకు నే నియ్యవలసిన ద్రవ్యమువిషయము యోచించుచుంటి"నని కాడ్గల్ విన్నదనమున బల్కెను.

లింకను సగము నవ్వుచు "దానికేమి? మీ రావిషయమిక దల పెట్టకుడ" ని యనుచు దన చేతిపుస్తుకమునుండి యా పత్రము దీసియిచ్చెను.

సీమ ప్రతినిధి సభ్యత్వ మొకమాఱు ముగురు కోరు చుండిరి. అం దొకడు లింకను. రెండవవాడు ట్రంబ లను దాస్యనిరాసకుడు. మూడవవాడు బానిస వ్యాపారుల తెగకు జేరినవాడు. అయిన నీ మూడవవాని దిగవిడచి యాపక్షమువారు మాథిస ననువాని బానిస వ్యాపార విషయమున నుపేక్షకుని నియమింప బ్రయత్నించిరి. మూడు సమ్మతులు సేరిన జయమందుకాల మతనికి సంప్రాప్త మాయెను. అది చూచి లింకను బానిస వ్యాపారులు విజృంభించి విజయము నొందుదురని తెలిసికొని తనపక్షమువారు దనకు సమ్మతులియ్యవలదనియు ట్రంబలున కియ్యవలసిన దనియు వేడెను. అయిన నతని పక్షమువా రతనికి నిచ్చెదమని పట్టుపట్టిరి. దానిమీద నతడు మిక్కిలి స్థైర్యముపూని "మీ రట్లు చేసి తీరవలసినది. వేరుమార్గము లేదని" గంభీరస్వనమున శాసించెను.

అతని కక్షవారు గొందఱు మిక్కిలి చింతిల్లి యేడ్వగడగినను నతనిమాట జవదాట రైరి. రెండుకక్షలవారు సేరుటచే ట్రంబలు సీమ ప్రతినిధి సభ్యు డాయెను. ఈ తరుణమున లింక నౌదార్యము బయలుపడినట్లు మఱియెప్పుడును బయలుపడ దయ్యెను. అప్పు డాతని గొప్పతన మచటిజనుల మనస్సీమ యందు స్థిరముగ నాటబడెను. దేశసంరక్షణమున కిట్టి యౌదార్యమేగదా యనేకపర్యాయములు గావలసి యుండును. అదియు మనదేశమున నిప్పటి స్థితిలో మనకు ముఖ్యతమము గదా! చట్టనిర్మాణసభకు నేను ప్రతినిధి గావలె నేను ప్రతినిధి గావలె ననుట మాని మనవా రెన్నడు లింకను గఱపినతెఱగున 'నేరు ప్రతినిధి యైన నేమి? దేశక్షేమమునకు బాటుపడుదము గాక' యందురు?

ఉపోద్ఘాతమున దేశాధ్యక్షులు నిర్వాచకుల సమ్మతులచే నేమింపబడు చుందురని వ్రాయబడియెనుగదా. అయిన నా నిర్వాచకులకు గూడ దారిసూపువారు దేశజనులే యగుదురు. భిన్నాభిప్రాయము లెక్కడను గలుగక మానవు. ముఖ్య విషయముల నట్టి భిన్నాభిప్రాయము లొక దేశమున గలిగినచో నా యభిప్రాయముల ననుసరించి కక్ష లేర్పడు. ప్రజాపరిపాలిత దేశముల నీకక్షల ముఖ్యాధికారము వహించును. ఏ కక్ష యభిప్రాయము జనసాన్యమునకు సమ్మతం బగు నా కక్షయ శాసించుట కర్హత నందుచుండును. * రాజ్యాధికారుల ______________________________________________________________

  • ఇంగ్లాండునందును నిదేవిధము. మనకు లార్డు కర్జను ప్రభువుగా నుండినపుడు కాంజర్వెటివు కక్షవారు రాజ్యాంగము నడపుచుండిరి. ఎల్ల ప్రజలకు సంపూర్ణ స్వాతంత్ర్య మియ్యగూడదనుట వారి యభిప్రాయము. స్వలాభము గణించుటయే వారి ముఖ్యోద్దేశము. కావుననే మన మప్పుడు గుడిచిన యిడుమలు మనల నిప్పటికిని వీడకున్నవి. ఇప్పు డన్ననో లిబరల్ కక్షవారు (అనగా నందఱకు స్వాతంత్ర్య మిచ్చుటయే యెల్లరకు లాభదాయియను కక్షవారు) రాజ్యాంగము నడపుచున్నారు. కావున మనదేశమునకు మంచిరోజులు మరలవచ్చిన వనియు మన మెక్కుడు శ్రద్ధ బుచ్చుకొని నియమింపబడుటకు మున్నా కక్షవా రొక గొప్పసభ జేర్చి తమ కిచ్చవచ్చినవానిని బేర్కొందురు. అతడ సర్వసాధారణముగ జయ మందును.

లింకను దేశాధ్యక్షతకు బెనగునప్పటి కిట్టి కక్ష లట మూ డుండెను. అందు రిపబ్లికను (అనగా ప్రజలుగాని, వారి ప్రతినిధులుగాని రాజ్యము నడపవలె ననియు నందఱకు జాతి మతభేదము లెంచక స్వాతంత్ర్యము గలుగజేయ వలె ననియు నను) కక్షయె మహాబలవంతముగ నుండెను.

ఆ రిపబ్లిక్ జాతీయసభ 1860 వ సంవత్సరము జూను నెల పదునాఱవతేదీన చికాగాలో జరుపబడెను. దూరాగత ప్రజలకును వారి ప్రతినిధులకును గూర్చొనుటకు దగినవిధమున నొక పెద్దపందిరి నిర్మించియుంచిరి. సభనా డచ్చట నిరువది యైదు వేలజను లాసీనులైరి. ఆకక్షవారిచే నేమింపబడతగినవారు లింకనుతో నెనిమిదిగు రుండిరి. అందు గొందఱు లింకనున కంటె నెక్కుడు ప్రసిద్ధిగాంచినవారు. అయినను వారిలో వారికి సమ్మతు లెచ్చుతక్కువ లైనతఱి వారివారుగూడ లింకనునకే సమ్మతు లిచ్చిరి. కావున నాసభవారిచే లింకను దేశాధ్యక్షతకు బేర్కొనబడియెను. లింకను దేశాధ్యక్షతకు _____________________________________________________________ పాటుపడిన ఫల మందుదుమనియు మనలో ప్రాముఖ్యులు నొక్కి వక్కాణించుచున్నారు. నుడువ బడినతోడనె జనులు గనుపఱచిన సంతోషము వర్ణింప దరముగాదు. ఒక్కెడ సభాసదుల కరాస్పాలనంబును, నొక్కెడ మహోత్సుకుల జయజయారావంబులును, వేరొక్కెడ 'లింకను పేర్కొనబడియెను. ఫిరంగుల మ్రోయించు' డను సేవకుల యార్భాటములును, మఱొక్కెడ తెరతెరలై వచ్చు ఫిరంగి శబ్దంబులును మిక్కుటముగ పిక్కటిలి యుత్సాహోదధి మితిమీఱి వెల్లివిరియుటం దెల్లము సేసెను.

ఈ విషయము దంత్రీవార్తమూలముగ స్ప్రింగుఫీల్డున విననాయెను. అచ్చటివారు మిక్కిలి యలరి లింకనునకు బూర్వాచారానుసరణముగ గొన్ని యుత్తమ సారాయిదినుసుల గొని కానుకగ నంపిరి. అతడు వానినెల్ల మరల బంపుచు మా యింట నిట్టి పదార్థ నెప్పుడు నుంచుకొనమని మీ రెఱుగుదురు గాదే" యని ప్రత్యుత్తరము నిచ్చెను.

ఆగౌరవమునకు బ్రతీకారముగ దనయింటికి గొందఱు ప్రముఖు లాథిత్య మంగీకరింప బ్రార్ధితు లైరి. అతడు దనకు సహజమగు సుస్వభావముచే వారి కెల్లరకు స్వాగతం బిచ్చి తన గృహమున దయామయుం డగు నీశ్వరు డిచ్చిన శుద్ధోదకమునకన్న బలవంతంబగు బానీయము లేదని పల్కి వారి యాయురారోగ్యములు దేవుడు హెచ్చించుగాత యని ప్రార్థించుచు నొక గిన్నెడు తేటనీళ్లు స్వీకరించెను. * సమయానుగుణముగ దన యభిప్రాయముల లింకను మార్చుకొనునని జను లనుకొనిరి గాని యత డెప్పుడును మంచిమార్గము వదలడాయెను. లింకను బానిసంబు నెంత బలముగ నెదిరించు ద్రాగుటను నంతియ బలమున ఖండించును. జనులు దేశాధ్యక్షుడు గౌరవార్థము ద్రాగుట ముఖ్యమని తలంచి యుండినను లింకను దనకార్యములచే నట్టిదాన గౌరవము లేదనియు దేవు డిచ్చిన స్వచ్ఛోదకమునకంటె బలిష్ఠమగు పానీయంబు మఱొండు లేదనియు బహిరంగముగ జాటెను.

లింకను పేర్కొనబడియె ననువార్త పర్వగానే బద్ధ సీమలయం దుద్భవించిన రోషజ్వాలలు నింగిముట్టెను. సంయోగమునుండి వీడిపోయెదమని కొన్నిసీమలు జంకించెను. నవంబరు నెలలో లింకను నిర్వాచకులచే నేమింపబడునప్పటికి దక్షిణ సీమలేడు దాము మిక్కిలి పనిచేసి యొక నూతనసంఘ మేర్పఱచుకొని రాబోవు మహోత్పాతముల సూచించు గొఱకొఱలు వినిపించెను.

కడుదూరమున శాత్రవజలదములు గుమిగూడుచుండెను. వాని యుఱుములును గొంచెముగా విననాయెను. నెమ్మది ______________________________________________________________

  • మనము మంత్రాక్షతల గైకొని యాశీర్వదించు తెఱగున బాశ్చాత్యు లేదేని యొక పానీయముం బుచ్చుకొనుచు నాశీర్వదింతురు. ఆశీస్సు నందు వారు మనయందువలె సమ్ముఖమున నుండవలెనను నిర్భంధము లేదు. మార్గముల నోటువడి గుండుదెబ్బలచే జయింతముగాకని బద్ధసీమలు బద్ధవైరముం బూనిరి. యుద్ధము తప్పక తటస్థించుననుట తెల్లమాయెను.

పేర్కొనబడినదాదిగ లింకను సమ్ముఖమున కనేకులు వచ్చిపో గడంగిరి. గొప్పవా రనక, నీచు లనక, ముదుక డనక, బాలు డనక, బీద లనక, భాగ్యవంతు లనక యెల్లరును నా మహనీయుని జూడ వచ్చుచుండిరి. ఇట్లుండ నొకనా డిద్దఱుబాలు రతని కార్యస్థానము ముంగల నఱ్ఱాడుచుండిరి.

వారి సత్యాదరమున డాసి లింకను,

"నాయనలారా! సౌఖ్యంబున నున్న వారలే? మీ కే నేమి సేయవలయు? రండు. కూర్చొను" డనియెను.

వారిలో గుఱుచటివాడు "మేము గూర్చొనరాలే" దనెను.

"మీ కేమి గావలయునో యడుగు" డని లింకను వారి జంకు నుడువువిధమున బల్కెను.

దాని కా చిన్నవాడు "నేనును నాస్నేహితుడును మీపొడవునుగుఱించి వివాదపడితిమి. తాను మీపొడుగున్నాడని నుడువుచున్నా" డనెను.

అదివిని లింకను మొగమున చిఱునగ వంకురింప "ఆలాగా? ఆ చిన్నవాడు నిశ్చయముగా బొడవుగనే యున్నాడు. చూతముగదా" యనుచు వెడలి తన కఱ్ఱం దెచ్చి "ఎవ్వరు పొడవైనది చూతము రమ్మ"ని జాగ్రత్తగ నా పిల్లవాని పొడగు లెక్కించి తనపొడవును లెక్కింపజేసి యిద్ద ఱొక్కటె పొడుగగుట గాంచి,

"అవును నిజమ. మే మిరువుర మొక్కటియ. అత డీవిషయమును సూక్ష్మముగ గ్రహించె" నని పొట్టిబాలునకు జెప్పి వారి తగవుదీఇర్చి మంచిమాటలతో వారిని బుజ్జగించి పంపివేసెను.

ఘనత ఘనత యని మౌఢ్యముపూని యజ్ఞానులపై మండిపడెడు మహానుభావు లీ లింకను నడత గమనింతురు గాక!

అతడు న్యాయవాదిగ నున్నప్పుడు తన భ్రమణముల నొకానొక ముసలాపె యింట భుజించుచుండును. ఆమె యతని దర్శింప నేతెంచెను. కొన్నివిషయములను స్మరింపజేసినతరువాత నామెను గుర్తించి సంతసమున స్వాగతమిచ్చి కుశల ప్రశ్న లడిగెను. అందుమీద నామె,

"నాడు మీ కేనుబెట్టిన బీదయుపభోజనము జ్ఞప్తియం దున్నదా?" యనెను.

"లేదు. మీయింట నే నెప్పుడును భోజనమున లోపమనుభవింప లేదు." "ఒకరోజు మే మెల్లరమును గుడువ బదార్థము లెల్లయు గర్చుపడి యుండెను. అట్టి తరుణమున మీ రేగుదెంచితిరి. కొంచెము రొట్టెయు బాలునుమాత్రమునే మీ కొసంగితిని. మీ రది స్వీకరింపుచుండగ నే మన్నన వేడ 'జింతిలనేల. ఈయాహారము దేశాధ్యక్షున కైనం జాలదా' యంటిరే" యని యావృద్ధనారి సౌహృదయముగ బల్కెను.

లింకను దానికి నవ్వి యా స్వల్పాహారము జ్ఞప్తికి దెచ్చుటకై స్నేహభావమున నెనిమిదిమైళ్లు నడచివచ్చిన యవ్వం గొనియాడెను.

చికాగో పట్టణమున లింకనును గారవింప నొక గొప్ప సభ జరిగెను. ఆసమయమున నొక చిన్నపిల్ల భయపడుచు లింకనును జేరవచ్చు చుండెను. లింక నది గనిపెట్టి చేసైగచే దానిం బిలిచి "అమ్మాయీ! నీ కేమి కావలయు దెల్పు" మని యడిగెను. సంకోచవృత్తి నాకన్నె "మీపేరు గావలె" నని వేడెను. ఇంతలో మఱికొందఱు గన్యలు వచ్చుట గాంచి లింకను "ఇక్కడ నింకను గొందఱుపడుచు లున్నారు. నీ కొక్కదానికె నా నామమిచ్చిన వా రెల్లరు నసంతుష్టు లగుదురుగదా" యనెను.

"మొత్తము మే మెనిమిదిగు రున్నారము. మాకందఱకు మీ పేరియ్యవలయు నని" యా శిశువు వల్కెను.

"అయిన నెనిమిదిముక్కలు కాగితమును, సిరాయు, నొక లేఖినియు గొనిరం" డని జనులచేఁ గ్రిక్కిరిసిన యా గదియంద యొకచోఁ గూర్చొని తనపేరు వ్రాసియిచ్చెను.
నవంబరునెల 6వ తేదీ లింకను జనసామాన్యులచేతను నిర్వాచకులచేతను సభాధ్యక్షతకు నియమింపఁబడెను. స్ప్రింగు ఫీల్డువిడిచి దేశాధ్యక్షత వహించుటకు వాషింగ్టనుకుఁ బోవుటకుముందు లింకను తల్లిని నితరచుట్టములను దర్శింప వెడలెను. తల్లికిని నతనికిని జరిగిన సంభాషణ వారి పరస్పరానురాగమును వెల్లడిపఱచుచున్నది. ఆమె స్వంత కుమారుల బోలె నతనిఁ గారాబమునఁ జూచుచుండును. అతఁడును దన తల్లినింబోలె నామెను గారవించుచుండును. లింక నామెదగ్గర సెలవుపుచ్చుకొనుతఱి వారి యనుభవము శోకము పుట్టించెడిని. తల్లి యతనిఁ గట్టిగఁ గౌగలించుకొని "నాయనా! పోయివచ్చెదవే. నిను మరలఁ జూడఁజాలనని నామనము గంపించుచున్నది. నీశత్రువులు నినుఁ బొరికొల్పెదరని భయమగుచున్న"దని యశ్రువులు నించెను. లింకను గద్గదస్వనమున "మాతా! అట్లెన్నటికిని భీతిల్లకుము. దైవానుగ్రహ ముండిన నంతయుఁ జక్కపడఁగలదు. మఱల మన మిరువురమును జూచుకొందుముగాక"ని యామె నోదార్చి యామె సెలవుఁబొంది 1861వ సంవత్సరము ఫిబ్రవరినెల 11వ తేది స్ప్రింగుఫీల్డు

వదలి వాషింగ్టనునకు దరలెను. అతడు దనస్నేహితులకు నొడవిన వాక్యములో దనకు దైవము సహాయపడవలె గాక తా నొక్కడ యేమిసేయుటకు ననర్హుడయని దేవునిపై భారమువైచి న్యాయమార్గముపై దృష్టి సారించుట వెల్లడించెను.

అతనిని శత్రువులు చంపుదురేమో యని దిగులొందిన దతని జననిమాత్రము గాదు. స్ప్రింగుఫీల్డునందలి స్నేహితు లెల్లరును నట్లే వ్యాకుల మందుచుండిరి.

అతడు వాషింగ్టను సేరుమార్గమున నందిన గౌరవ మంతింతనరాదు. త్రోవయందు బ్రతిపట్టణమువారును నత నింజీరి మహోత్సాహమున మర్యాదలు సలిపి యాతని వాగమృతము గ్రోలుచు వచ్చిరి. ఎచట జూచినను గరాస్ఫాల నంబులును, జయజయారావములును, మంగళధ్వానములును, జెవుల కానంద మొసగుచుండెను. చిత్రతోరణంబులును, బహువిధ పతాకములును, సర్వజన సమూహములును నతని దారి నలంకరించుచుండెను. ఇట్లనన్యసామాన్య వైభవంబున మహావీరుండువోలె లింకను ఫిలడెల్పియా సేరవచ్చునప్పటి కాతని జంప జేయబడిన ప్రయత్న మొండు గనిపెట్టిరని వార్త దెచ్చిరి. కావున మఱుసటిదినము మధ్యాహ్నము బహిరంగముగ వైభవమున బోవుట మాని నాటిరాత్రి యేరికి దెలియక లింకను ప్రయాణముసలిపి వాషింగ్టను సేరెను.