ఆనందం మనిషైనవాడు/సంపాదకుని మాట

సంపాదకుని మాట

జీవితచరిత్రలు, ఆత్మకథలు సామాజిక చరిత్రను నిర్మించడంలో, ఒక ప్రాంతపు సంస్మృతిని అర్ధం చేసుకోవడంలో చాలా బాగా ఉపకరిస్తాయి. భవిష్యత్ తరాలవారు ఒక ప్రాంతం, కాలం ఆత్మను అవగాహన చేసుకోవాలంటే విశిష్టమైన వ్యక్తిత్వం, విస్తృతమైన కార్యరంగం ఉన్న వ్యక్తుల జీవితగాథలు అవసరం. ఉత్తమ ఉపాధ్యాయుడుగా, మంచి నాటక కళాకారుడిగా, విశిష్టమైన రచయితగా, అన్నింటికి మించి నిజాయితీ, నిబద్ధత, సమర్ధతలాంటి విలువలు కలిగిన వ్యక్తిగా మా నాన్నగారు - సూరంపూడి వెంకటరమణగారి జీవితం అలాంటి అధ్యయనానికి, అవగాహనకి పనికివస్తుందని నా నమ్మకం. నా నమ్మకానికి ఫలితమే ఈ పుస్తకం.

ఆయన షష్టిపూర్తికి ఓ పుస్తకాన్ని ప్రచురించాలని అనుకున్నప్పుడు సాధారణంగా షష్టిపూర్తులకు వేసే సావనీర్ వంటిది ప్రచురిద్దామని సన్నిహితులు, బంధువులు సలహాఇచ్చారు. అయితే ఆసక్తికరమైన సంఘటనలు, కాలగతిని పట్టి ఇచ్చే విశేషాలు. ఎందరికో స్ఫూర్తిదాయకం కాగల లక్షణాలు కలగలిసిన ఆయన జీవితాన్ని వ్యక్తీకరించడానికి అటువంటి సాధారణమైన ప్రయత్నాలు చాలదనిపించింది.

కరణీకం కులవృత్తిగా కలిగిన ఓ దిగువ మధ్యతరగతి కుటుంబంలో ఆయన జీవితం ప్రారంభమైంది. చిన్నతనంలోనే తండ్రి మరణం, ఆస్తులు హరించుకుపోవడం, అన్నలు చేస్తున్న కరణీకం రెవెన్యూ సంస్కరణల పేరిట తొలగించడం, ఉమ్మడి కుటుంబ బాధ్యతలువంటివి ఆయన తొలినాళ్ల జీవితంలోనే ఎదురుకావడంతో కష్టాన్ని ఇష్టపడే మనిషి అయ్యారు. సినిమాథియేటర్‌లో ఈవినింగ్, సెకండ్ షోలకు టిక్కట్టు కౌంటర్‌లో పనిచేయడం, రోజుకు ఒక ఇడ్లీకోసం ట్యూషన్ చెప్పడం, ఆగ్రోన్ సంస్థలో ఎరువులు అమ్మడం మొదలుకొని ఎన్నో పనులు చదువుతూనే చేసారు. నిజాయితీగా సంపాదించు కొనేందుకు పనికివచ్చే ఏ వృత్తినైనా గౌరవించడం ఆయనకు అవి నేర్పాయి. అదే సమయంలో మా గ్రామం కంచుమర్రులో నాటకాలు వేసేందుకు కొందరు మిత్రులతో "జైహింద్ నాటక కళాసమితి" ఏర్పాటు చేశారు. నిత్యం ఇంటిలో ఉపయోగపడేందుకు దొరికే ఏ వస్తువునైనా బాధ్యతగా తీసుకొచ్చేవారు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల భవిష్యత్తు బాగుండాలని తపించేవారు. ఇన్ని చేస్తున్నా ఆయన విశ్వవిద్యాలయం స్థాయిలో తెలుగులో మొదటి స్థానంలో ఉత్తీర్ణులయినారు. 100% అటెండెన్స్‌కిగాను ఇచ్చిన సర్టిఫికెట్‌లు మా ఇంటిలో ఇంకా ఉన్నాయి. ఇవి ఆయన చిన్నతనం గురించి ఎవరెవరో చెప్పగా నాకు తెలిసిన విశేషాలు. ఈ లక్షణాలనే భావి జీవితం అంతా నిక్కచ్ఛిగా అమలు చేశారు.

ఉపాధ్యాయునిగా, కళాకారునిగా, గ్రంథాలయోద్యమంలో, వివిధ సంస్థలలో బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఎన్నెన్నో పాత్రలు పోషించారు. ఇన్నిటిమధ్య తనదైన వ్యక్తిత్వం, ప్రత్యేకత నిలుపుకొన్నారు. అటువంటి వ్యక్తి జీవితంలోని ఆసక్తికరమైన ఘట్టాలు, ప్రత్యేకతలు ఆయననుంచి స్ఫూర్తి పొందినవారు, ఆయనతో పనిచేసినవారు వ్రాస్తే అదొక విశిష్టమైన జీవితచరిత్ర అవుతందనే భావనతో ఈ పుస్తకాన్ని తయారుచేసాను.

'బహుముఖ ప్రజ్ఞాశాలియైన ఆయన జీవితంలో ఎన్నో కోణాలు ఉన్నాయి. వాటి నుంచి గొప్ప ఉపాధ్యాయునిగా, మంచి నాటక కళాకారునిగా, కళా, సాహిత్య సంస్థలలో ముఖ్యునిగా, గొప్ప వ్యక్తిత్వమున్న మనిషిగా, అవధానాల్లో అప్రస్తుత ప్రసంగానికి పేరుపొందిన పృచ్ఛకునిగా ఆయనలోని పాత్రలను ఆవిష్కరించేలా ఉండాలని నిర్ణయించుకున్నాము. ఈ అంశాలపై ఒక్కో వ్యక్తితో ఒక్కో వ్యాసం రాయించాము. ఆ వ్యక్తులను ఎంపికచేయడంలోనూ ఒక పద్ధతి పాటించాను. ఆయనకు ఎందరో ప్రఖ్యాత వ్యక్తులతో పరిచయం ఉన్నా, మరెందరో ఆత్మీయులు ఉన్నా సంబంధిత వివరాలు ఆ వ్యక్తికి ఎంతవరకూ తెలిసి ఉండొచ్చు అన్న ప్రశ్న వేసుకుని ఆ క్రమంలోనే ఎంచుకున్నాను. ఆయా రంగాల్లో ఆయనతో కలిసి పనిచేయడం, ఆయనను గమనించగల సాన్నిహిత్యం కలిగివుండడం, కొందరి విషయంలో ఆయనను స్ఫూర్తిగా తీసుకొని జీవితాన్ని దిద్దుకోవడం వంటివే ప్రమాణాలుగా తీసుకున్నాను. వారితో వ్యాసాలు రాయించుకోవడంలోనూ ఎన్నో ప్రయత్నాలు చేశాను. స్వతహాగా రచయితలైన కొందరు నేరుగా వ్యాసాలు అందిస్తే, మరికొందరు సంఘటనలు, అభిప్రాయాలు రాసి ఇచ్చి వ్యాసంగా ఎడిట్ చేస్తే చూసి అంగీకరించారు. ఒకరిద్దరి విషయంలో వారితో సమయాన్ని గడిపి వారి మాటలు ఏరుకుని వారి భావాలు పేజీలపై పెట్టినవీ ఉన్నాయి. రెడ్డప్ప ధవేజీగారు, నామాల మూర్తిగారు ఏకంగా ప్రసంగంగా ఫోనులో ఏకపాఠంగా, ఆశువుగా చెప్పెయ్యడం విశేషం. వీరందరితోనూ మాట్లాడి, వారితో తెలిసినవీ, తెలియనివీ ఎన్నో కలబోసుకోవడంలో మా నాన్నగారి గురించి తెలియనివి ఎన్నో తెలుసుకున్నాను. ఆయన మేనల్లుడు శ్రీనివాసన్ చెప్పిన విశేషాలైతే ఆయనను సరికొత్తగా అర్ధం చేసుకునేలా చేశాయి. ప్రిజంలో చూస్తే తెల్లని సూర్యకాంతి ఏడు రంగులుగా కనిపించినట్టు వీరందరి మాటల్లో ఆయన వ్యక్తిత్వం వేయి రూపాలుగా కనిపించింది.

ఎన్నో విధాలుగా ఈ సంపుటిని జాగ్రత్తగానే తయారుచేసినా కొన్ని కోణాలు మరచిపోయి ఉండొచ్చు. ఆయనకు మాత్రమే తెలిసినవీ ఉంటాయి. మొదట పేర్కొన్న ప్రణాళిక పరిపూర్ణం కావాలన్నా, ఆయన అనుభవాలు, ఆయన కాలం, ఆయన తత్త్వం పూర్తిగా అందాలన్నా తప్పనిసరిగా ఆయన తన అనుభవాలు తాను రాసుకోవాలి. జ్ఞాపక శకలాలుగానో, అనుభవాల మాలగానో కాగితంపై పెట్టాలి. నేను ప్రారంభించిన ఈ ప్రణాళిక ఆయన తన ఆత్మకథాత్మక వ్యాసాలు రాసి పరిపూర్ణం చేస్తారని ఆశిస్తున్నాను.

సూరంపూడి పవన్ సంతోష్

సంపాదకుడు