ఆనందం మనిషైనవాడు/గురుబ్రహ్మ
గురుబ్రహ్మ
పెదిరెడ్డి తిరుపతిరావు
ఉపాధ్యాయులు, లింగారాయుడుగూడెం
తాడేపల్లిగూడెం మండలం
సాధారణంగా ఏ స్కూల్లోనైనా హెడ్మాస్టారు వస్తున్నారంటే పిల్లలు గడగడలాడి పోతారు. ఒక పక్కన ఉన్న వాళ్లు తాము ఉండాల్సిన చోటుకోసం మరో పక్కకు పరిగెడతారు. విగ్రహాల్లా భయంలో నిలబడిపోతారు. మా స్కూల్లో మాత్రం హెడ్మాస్టారు బండి మీద వస్తున్నారంటే స్కూలు మొదలుకాక ముందు అక్కడక్కడ ఉన్న పిల్లలంతా స్కూలు గేటు దగ్గరికి పరుగులు పెట్టుకుంటూ వచ్చేవారు. ఆయన చేతులు, వేళ్ళూ పట్టుకునేవాళ్ళు కొందరు, అతుక్కుపోయేవాళ్ళు కొందరు, కబుర్లు, విశేషాలు అన్నీ ఏకరువు పెట్టేవారు. ఆయన తెచ్చిన సంచీ పట్టుకోవడానికి పోటీలు పడి వంతులు వేసుకునేవాళ్ళు. ఆ ఐదు నిమిషాలు మా స్కూల్లో ఏదో సంబరం జరిగినట్టే ఉండేది. ఆ వచ్చిన వారు రమణ మాష్టారు. అందరికీ సూరంపూడి వెంకటరమణగా తెలిసిన మా మాష్టారు.
ఒక్కరోజు మాస్టారు స్కూలుకు రాకపోతే "ఎందుకు రాలేదు", "రేపు వస్తారు కదండీ..." అంటూ స్కూలు పిల్లలు వేసే ప్రశ్నలకు అంతే ఉండేది కాదు. వాళ్ళందరి మనసులోనూ ఏదో వెలితి... ఊరుకు వెళ్ళిన తండ్రి రాకపోతే పిల్లలు బాధపడే చందంగా. ఒకసారి మాస్టారికి ప్రమాదం జరిగి ఒక్కనెలపాటు మెడికల్ లీవ్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీలున్నంత వరకూ స్కూలుకు వచ్చే ప్రయత్నం చేసినా ఆయనకు రెస్ట్ అవసరమని డాక్టర్లు గట్టిగా చెప్పి కట్టడి చేసారు. ఆ సమయంలో స్కూలు పిల్లల స్థితి చూస్తే ఆశ్చర్యం కలిగేది. దిగులుగా, ఏదో కోల్పోయిన వారిలా ఉండేవారు. ప్రతి పాఠశాలలోనూ ఇద్దరు, ముగ్గురు విద్యార్ధులు కాస్త కలివిడితనం లేకుండా ఉంటారు. అలాంటి వాళ్లకు మాత్రం ఆయన తోడిదే పాఠశాల అన్నట్టుగా ఉండేది. ఆయన రాని ఆ నెల వాళ్ళ దిగులు, బాధ చెప్పనలవి కాదు. కొన్ని రోజులు ఓపిక పట్టి ఆయనకే నేరుగా రూపాయి కాయిన్ బాక్స్ నుంచి పిల్లలంతా కలిసి ఫోన్ చేసేవారు. ఇటుపక్క వీళ్ళు కళ్ళనీళ్ళ పర్యంతం కావడమూ, అటుపక్క ఆయన సముదాయించి వచ్చేస్తానని ధైర్యం చెప్పడమూ గొప్ప దృశ్యమది. సుదీర్ఘ విరామం తర్వాత ఆయన స్కూలుకు వచ్చేసరికి పట్టరాని ఆనందంతో చెంగు చెంగున దూకే లేడి పిల్లల్లా, తవ్వాయిల్లా స్కూలంతా ఓ బృందావనం అయిపోయింది. ఆయన పిల్లలకి చదువు చెప్పే తీరులోనే ఆ ఆకర్షణ ఉంది. ఎంతో ప్రేమగా, అభిమానంగా ఆయన వ్యవహరించే తీరుకు పిల్లలంతా అభిమానంతో ఉండేవారు. భయంతో చదివించలేక పోవచ్చుకానీ ప్రేమతో, ఉత్సాహంతో చదివించలేనిది ఉండదన్నదే ఆయన సిద్దాంతం.
పశ్చిమగోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం మండలంలోని గొల్లగూడెం, లింగారాయుడుగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠాశాలల్లో ఆయన హెడ్మాస్టరుగా పనిచేసిన స్కూళ్ళలో నేను ఆయన వద్ద అసిస్టెంట్‌గా పనిచేసాను. ఆయన చాన్నాళ్ళు నిత్యం నా బండిమీదే స్కూలు వచ్చి పోయేవారు. దానితో ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకున్నాను. ఇలాంటి ఎన్నెన్నో అపురూపమైన దృశ్యాలు చూడగలిగాను. మేము కొలీగ్స్ అయినా మా మధ్య ఉన్నది గురుశిష్య సంబంధం. టిటిసి పూర్తిచేసి 2000 సంవత్సరంలో మా స్వస్థలం శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాన్ని వదిలిపెట్టి తాడేపల్లిగూడెం ప్రాంతానికి ఉద్యోగంపై వచ్చిననాడు ప్రారంభమైన మా బంధం అపురూపమైనది.
దార్శనికుడు : - తాడేపల్లిపల్లిగూడెం మండలంలోని లింగారాయుడుగూడెం పాఠశాలలో పనిచేసేటప్పుడు ఓ కుర్రాడు ఊళ్ళో ఖాళీగా తిరిగేవాడు. అతని పేరు నారాయణమూర్తి. ఎప్పుడూ నాలుగు కాళ్ళ స్టాండ్ పట్టుకునే నడిచేవాడు. ఎప్పుడో చిన్నతనంలో అతనికి యాక్సిడెంట్ అయి దెబ్బలు తగిలాయి. కొన్నాళ్ళపాటు వాడేందుకు ఆ స్టాండ్ ఇచ్చారు డాక్టర్. అతనికి మాత్రం తాను వికాలాంగుణ్ణి అయిపోయానన్న భయం పట్టుకుంది. మానసికంగా ఈ విషయం గట్టిగా నమ్మడం, అలానే నాలుగు కాళ్ళ స్టాండ్ సాయంతో తిరగడంతో అలా ఊళ్ళోకూడా వికలాంగుడనే నమ్మేవారు. అతనికి మానసికంగా కాళ్ళపై పట్టుకోల్పోయినట్టు అయింది. ఈ వ్యధలో అతను చదువు వదిలి పెట్టేశాడు. ఇదంతా నేను, మాస్టారు ఆ ఊరి పాఠశాలకు రావడానికి ఎన్నో ఏళ్ళ ముందు జరిగింది. మాష్టారు పాఠశాలకు వచ్చేసరికి ఆ అబ్బాయి ఎక్కడ కనిపించినా గ్రామస్తులు, యువకులు వెక్కిరింతగా "తిన్నావా ఊరిమీద పడ్డావు" అంటూ అవమానకరంగా మాట్లాడేవారు. అతని పేరుతో పిలవడం మాని వైకల్యాన్ని వెక్కిరించేవారు.
మా హెడ్‌మాష్టారు రమణగారికి ఈ విషయంపై కొంత అనుమానం ఉండేది. అతను నడవగలడేమో బహుశా ఆత్మవిశ్వాసం లేక నడవడం లేదేమోనని. అతనితో మెల్లిగా పరిచయం పెంచుకుని ఓ రోజు ఆ స్టాండ్ పక్కకి తీసేసి నడవమన్నారు. మొదట అతను కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఉండిపోయాడు. స్టాండ్ లేకుండా నేను నడవలేనండీ అంటూ వారించాడు. మాస్టారు మాత్రం నీకు పోలియో లాంటీ వ్యాధి ఏమీ రాలేదు, జరిగిన యాక్సిడెంట్ తాలూకు దెబ్బలు తగ్గాయి. మరేమిటీ నీ భయం. నడచి చూడవోయ్ పడిపోకుండా మేమంతా ఉన్నామని ధైర్యం చెప్పారు. ఆశ్చర్యకరంగా అతను నడిచి కొద్ది తప్పటడుగులు వేసి ఆపైన సాధారణంగానే నడిచేశాడు. ఊరందరికే కాదు ఈ పరిణామం అతనికే ఆశ్చర్యమయ్యింది. మాస్టారిపై నమ్మకం పెంచుకున్నాడు.
ఆపైన మాస్టారు అతనిని చదివిద్దాం అనుకున్నారు. నాలుగో తరగతిలోనే చదువు మానేసి పదిహేడేళ్ళ వయస్సు వచ్చేశాక ఇంకేం చదువు అని అతను ఆ ప్రయత్నాలకు ఒప్పుకునేవాడు కాదు. అతన్ని స్కూలుకు వచ్చి సరదాగా పిల్లలతో మాట్లాడుతూండమని చెప్పారు. తీరా స్కూలుకు వచ్చాకా రెండు, మూడు తరగతుల చదువు పునశ్చరణ (రివిజన్) చేయించేశారు. ఆ క్రమంలో అతను స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్‌డే వంటి కార్యక్రమాల ఏర్పాట్లలో ఉత్సాహంగా పాల్గొనేవాడు. మా పాఠాశాలలో ప్రతి ఏటా నిర్వహించే వార్షికోత్సవాలలో నాటకాలు, డాన్స్‌లు వేసేవాడు. ఇంకుడు కుండీల తవ్వకం, మొక్కల పెంపకం, ఆటలు వంటి ఏ కార్యక్రమమైనా ముందే ఉండేవాడు. నారాయణమూర్తిని అంతకుముందు చూసినవారంతా ఆశ్చర్యపడుతూ మాట్లాడితే అతని ఆత్మవిశ్వాసం పెరిగింది. చివరకు అతనే చదువుతానని మాష్టారి దగ్గర ఒప్పుకున్నాడు. అతనితో మిగిలిన క్లాసులు చదువుకూడా పూర్తిచేయించి క్రమేణా పదో తరగతి ప్రైవేటుగా కట్టించారు. పట్టుదల, కృషి ఆ పాఠాల మీద పెట్టిన నారాయణమూర్తి చివరకు పరీక్షల్లో పాసయ్యాడు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ మాధవరం ప్రభుత్వ కళాశాలలో చేర్పించి చదివించబోతే అతను మళ్ళీ చదవలేకపోయాడు. నేను ఆపైన మెకానిక్ షాపులో చేర్చాను. మెకానిక్ వర్కు వేగంగా నేర్చుకున్న అతను విదేశాలకు వెళ్ళి అక్కడ పనిచేస్తూ సంపాదించుకుంటూ తన కాళ్లమీద నిలబడ్డాడు. అలా మాస్టారు తనను తాను అంగవికలునిగా భావించిన కుర్రాడిలో ఆత్మ విశ్వాసాన్ని నింపి, చదివించి ఓ స్థాయికి చేర్చారు. ఇప్పటికి అతన్ని కొన్నేళ్ళ క్రితం చూసినవారికి ఎవరికైనా ఇది గొప్ప ఆశ్చర్యమే. ఇది ఆయన 30 ఏళ్ళ సర్వీసులోనూ, మా 14 ఏళ్ళ సాన్నిహిత్యంలోనూ ఒక సంఘటన మాత్రమే. ఇటువంటి ఎందరో విద్యార్ధుల జీవితాలను మార్చిన వ్యక్తి ఆయన.
దూరదృష్టిగల దిక్చూచి : - రమణమాష్టారి ఆలోచనలు, అభివృద్ధి ఇతర పాఠశాలలు, ప్రభుత్వం అమలు చేయడానికి ఎన్నో సంవత్సరాల ముందే కార్యరూపంలోకి తీసుకు వచ్చేవారు. గొల్లగూడెం పాఠాశాలలో (2000 నుంచి నాలుగైదేళ్ళు మేమిద్దరం ఆ పాఠశాలలో పనిచేశాం) కొందరు దాతల సహాయం తీసుకొని బేబీ చైర్స్ (చిన్న పిల్లల సైజుకు సరిపోయే కుర్చీలు) కొనిపెట్టారు. ఆ కుర్చీలకు ముందు భూమికి అర అడుగు ఎత్తులో ఉండే బల్లలు ఉండేవి. ఒక్కసారిగా రంగురంగుల కుర్చీలు వచ్చేసరికి పిల్లల సంబరం చెప్పనలవి కాదు. అప్పటి దాకా ఆలస్యంగా వచ్చేవాళ్ళు. స్కూలుకి రావడం మానేసినవాళ్ళూ రావడం మొదలుపెట్టారు. బడికి దూరంగా ఉన్న పిల్లలు కూడా వచ్చి బడిలో చేరడం మొదలుపెట్టారు. దాంతో కొంతమంది పిల్లలకు కుర్చీలు సరిపోయేవి కాదు. ఓ ఐదు, పది మందికి తక్కువయ్యేది. మాస్టారితో "వేరే దాతను అడిగి అందరికీ సరిపోయేలా కొందాం" అని చెప్పాను. ఐతే మాస్టారు మాత్రం అలా వద్దని పిల్లలందరికీ ఎవరు ముందు వస్తే వారికే కుర్చీలు అని చెప్పారు. దాంతో రోజూ కుర్చీల కోసం, కావలసిన రంగు కుర్చీల కోసం చాలామంది అందరికన్నా ముందు వచ్చేసేవారు. ఆఖరున వచ్చి కొద్దిమంది బల్లలమీద కూర్చుంటే మరుసటి రోజు వాళ్ళే ముందు వచ్చేవారు. అలా చిన్న చిన్న ఆలోచనలతోనే పాఠశాలలో ఉత్సాహభరితమైన పరిస్థితులు కల్పించేవారు. మా పాఠశాలలో ఈ పద్ధతిని గమనించి ఎం.ఇ.ఓ. గారు పై అధికారులకు సిఫార్సు చేయగా సందర్శనకు వచ్చిన డి.ఇ.ఓ. ఇందుకూరి ప్రసాదరాజుగారికి ఈ పద్ధతి బాగా నచ్చింది. తరువాత ఈ స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖ ప్రతీ ప్రాథమిక పాఠశాలలోనూ విద్యార్ధులకు స్కూలు నిధులనుంచి కుర్చీలు కొనమని ఆదేశాలు జారీచేసింది.
2000లో నేను శ్రీకాకుళం నుంచి ఈప్రాంతానికి వచ్చి ఏ పాఠశాల కావాలో ఎంచుకునేందుకు కౌన్సిలింగ్‌లో పాల్గొన్నాను. అప్పుడు మాస్టారు అక్కడికి వచ్చారు. నాకు అక్కడ ఉన్న ఎవరూ తెలియదు. గొల్లగూడెం ఐతే తేలికగా వస్తుందని అన్నారు. ఇంతకూ గొల్లగూడెం స్కూలు బావుంటుదా? అక్కడి హెడ్‌మాస్టారు ఎలాంటి వారు? అని ఆయననే అడిగాను. అంతా బావుంటుంది మీరు సంతకం పెట్టేయండి అని ఆయన చెప్పారు. కొంత సేపటికి మండల విద్యాధికారి (ఎం.ఇ.ఓ.) గారు ఈయనే మీ హెడ్‌మాస్టారు అని పరిచయం చేసాక తెలిసింది సలహా ఆయననే అడిగానని. నేను అడగకపోతే ఏం చేసేవారు మాస్టారు అంటే "మీరు కరెక్ట్ అని నేను కాసేపటిలోనే అంచనా వేశాను తిరుపతిరావుగారూ. అదృష్టవశాత్తూ మీరే అడిగారు. లేకుంటే నేను కచ్చితంగా గొల్లగూడెం పాఠశాలకే రమ్మని అడిగేవాణ్ణి. నేను వచ్చిందే ఎవరు సరైనవారో చూసుకోవడానికి" అని చెప్పారు. ఆపైన మా ఇద్దరి మధ్య సఖ్యత కారణంగా పాఠశాల అభివృద్ధి పెరిగింది. ఆయన స్నేహం, సాన్నిహిత్యంలో ఎంతో నేర్చుకున్నాను. చిన్ననాటి నుంచి కళల పట్ల ఆసక్తి ఉన్న నన్ను నేరుగా నాటకాల్లో నటునిగా చేసేశారు. ఆయనకు నాకూ కొద్దికాలం బదిలీల వల్ల విడిగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ విడివిడిగా ఉండలేక మళ్ళీ ట్రాన్స్‌ఫర్ ఆయన స్కూలుకు పెట్టు కున్నాను. మాస్టారు ఇంత గట్టి అనుబంధాన్ని ఐదు నిమిషాల వ్యవధిలో గమనించి నేనే తగిన వ్యక్తినని నిర్ణయించుకోగలగడం చాలా గొప్ప విషయం.
పసివాళ్ళ హృదయాల్లో చెదరని స్థానం : - ఆయన పనిచేసిన పాఠశాలలో మాస్టారు రిటైర్ అయ్యాకా కూడా నేను పనిచేస్తున్నాను. కొందరు పిల్లలు వెనుకబడి ఉంటే వారిని ఆయన లాలనగా చదివించేవారు. అటువంటివారిలో లింగారాయుడుగూడెం గ్రామంలోని ప్రసాద్ (గణపతి) అనే మూగ పిల్లాడు ఒకడు. వాడికి రమణ మాస్టారు తోడిదే లోకం. ఆయన రానిరోజు వాడు ముసురు పట్టిన రోజులా ఉండేవాడు. ఆయన వస్తే పండగే. అలాంటి స్థితిలో ఆయన రిటైర్ అవ్వడం ఆ పసివాడి మనసులో పెద్ద ముల్లులా దిగింది. స్కూలుకు రావడం తగ్గించేశాడు. ఒకప్పుడు స్కూలుకు రాకపోవడమే ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు వాణ్ణి స్కూలుకు తీసుకురావడం సాధ్యమే కావట్లేదు. చివరకు మంచి పుష్టిగా ఉండే పిల్లాడు సన్నగా అయిపోయాడు. ఇలాంటి పిల్లలకోసం రిటైర్ అయ్యాకా కూడా కొన్నిసార్లు మాస్టారు బడికి వచ్చినా ఆ లోటు తీరలేదు. అంత ప్రేమకు కారణం ఆయన సుమధురమైన వ్యక్తిత్వమే. ఆయనకు పనిచేసిన స్కూల్లోని పిల్లలే సర్వస్వంగా గడిపారు. ఆయన స్థానం ఎంత ప్రత్యేకం అంటే ఆయన పనిచేసిన పాఠశాలల్లో హెడ్మాస్టరుగా వేరేవాళ్ళు వచ్చినా ఆయన ఇప్పుడు రిటైర్ అయిపోయినా పిల్లలు ఆయననే "హెడ్మాస్టారు" అని పిలుస్తారు. ఎందరైనా మాస్టార్లు రావచ్చు గానీ పిల్లల మనసులో హెడ్మాస్టారు స్థానం ఆయనదే. ఆయన రిటైర్ అయ్యారని తెలియక కాదు తెలిసినా వాళ్లకు తేడా ఏమీ కనబడదు.
సృజనాత్మకత, సమర్ధతల కలయిక : - అప్పటికే మాస్టారు దాతల సహకారంతో కుర్చీలు ఏర్పాటు చేసిన విషయం అధికారులు దృష్టిలో పెట్టుకొని కొత్తగా స్కూలుకు పర్మినెంటు సిమెంటు జారుడుబల్లలు వంటికి తక్కువ ఖర్చులో సమకూర్చే చైల్ద్ ఫ్రెండ్లీ స్కూల్ పథకానికి గొల్లగూడెం పాఠశాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. దాన్ని ఛాలెంజ్‌గా స్వీకరించిన మా హెడ్మాష్టారు, మేము ప్రణాళికాబద్ధంగా పని మొదలుపెట్టాము. కొమ్ముగూడెం సొసైటీ అధ్యక్షుడు కీ. శే. వట్టికూటి గుర్రాజును సంప్రదించగా ఆయన ఐదువేలు సొసైటీ తరుపున ఇచ్చారు. నేనూ, హెడ్మాష్టారు రమణగారు సాయంత్రాలు ఎక్కువసేపు ఉండి మేస్త్రితో చర్చించి పనులు చేయిస్తూంటే సర్పంచి కోరశిఖ హరనాథ్ స్పందించారు. "మీరే ఇంతగా మా పిల్లల కోసం తాపత్రయ పడుతూంటే మేము మీకు సాయం చేయాలి కదా" అంటూ మిగతా ఖర్చులు భరించి మొత్తం 15 వేలతో నిర్మించారు. ఆయన స్వయంగా పర్యవేక్షిస్తూ సిమెంటు అవసరమైన పాళ్లలోనూ, పని పక్కాగానూ చేసేలా కృషిచేశారు. మొత్తానికి తన పట్టుదలతో తోటి టీచర్లనే కాక ఊరివాళ్లను కూడా కదిలించి విజయవంతంగా, పటిష్టంగా నిర్మించారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు దానితో సంతృప్తిచెంది రాష్ట్రవ్యాప్తంగా ఆ పథకాన్ని అమలుచేశారు. ఆ తర్వాత మేమిద్దరం పనిచేసిన లింగారాయడుగూడెంలో మరో పరిస్థితి. పాఠశాలకు రెండో అంతస్థు ఉండడంతో రమణగారి సృజన మరోలా పనిచేసింది. సాధారణంగా సిమెంటు జారుడుబల్లకు మధ్యలో నిర్మించే స్థంభం ఒకవైపు ఎక్కేందుకు మెట్లు, మరోవైపు జారేందుకు జారుడుబల్ల ఉంటాయి కదా. లింగారాయడు గూడెంలో ఉన్న రెండో అంతస్థుకు వెళ్ళే మెట్లు మలుపుతిరిగే చోట సైడ్‌వాల్‌కు అనుబంధంగా జారుడుబల్ల నిర్మించారు. దీనివల్ల ఎక్కేందుకు కట్టాల్సిన మెట్లు, మధ్యలో నిలువునా ఉండే స్థంభాలుగా సహజంగా రెండో అంతస్థుకు వెళ్ళే మెట్లు ఉపయోగపడ్డాయి. పిల్లలకు కూడా ఈ మోడల్ విపరీతంగా నచ్చింది. వాళ్ళు నేరుగా పై అంతస్థునుంచి వెళ్తూనే సగం మెట్లు దిగి మలుపులో ఈ జారుడుబల్ల ద్వారా కిందికి వెళ్ళిపోయేవారు. లింగారాయుడుగూడెంలో సర్పంచి స్వంత నిధులతో కట్టారు. గొల్లగూడెంలో జారుడుబల్ల నిర్మించిన నాలుగైదేళ్ళకు లింగారాయుడుగూడెం జారుడుబల్ల కట్టారు. ఐతే నిర్మాణవ్యయం చాలా పెరిగింది. కానీ మాస్టారి ఆలోచన వల్ల నిర్లాణం తగ్గడంతో 10 వేలకే పూర్తయ్యింది. ఎవరినీ అభ్యర్ధించనక్కర లేకుండా సర్పంచి స్వయంగా తన నిధుల నుంచి నిర్మించేశారు. ఈ పద్ధతి కూడా ప్రభుత్వ ఉన్నతోద్యోగులకు నచ్చి దాన్ని కూడా స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగానే కాక రాష్ట్రంలోని అంతటా ఈ మోడల్‌ను ప్రచారం చేశారు. ఆయన సృజన, ఆయన సమర్ధత ఆయనకే సాధ్యం.
గ్రామస్థులతో మమేకం : - మేము లింగారాయుడుగూడెం పాఠశాలకు వెళ్ళే సరికి అక్కడి గ్రామస్థులకు పాఠశాల అన్నా, ఉపాధ్యాయుల అన్నా సానుకూల అభిప్రాయం ఉండేది కాదు. రమణ మాస్టారు వెళ్ళేసరికి గ్రామస్థులతో జాగ్రత్తగా ఉండాలి, చాలా ప్రమాదం. తాగివచ్చి గొడవ చేస్తారు. అనే మాటలు వినిపించేవి. అలాంటి పేరున్న గ్రామంలో, అదే గ్రామస్తులతో మమేకమై స్కూలుకి, ఉపాధ్యాయులకు మంచిపేరు తెచ్చారు. కొన్నాళ్ళకే పాఠశాలలో ఏ పని ప్రారంభించినా గ్రామస్తులు అందరూ ముందుకు వచ్చి సాయం చేసే స్థాయికి చేర్చారు. నిత్యం బడి రాని పిల్లలను ఇళ్ళకు వెళ్ళి మరీ తీసుకువచ్చేవారు.
స్కూలు విషయంలో అపర భగీరధుడే : - పాఠశాలకు ఏం కావాలన్నది ఆలోచించడం, ఆ కావాల్సింది ఎంత కష్టమైనా ఏదోలా సాధించడం వంటి విషయాలలో ఆయన అపర భగీరధుడే అనిపిస్తుంది. గొల్లగూడెంలోని మా పాఠశాలకు మూడు వైపులా కాంపౌండ్ వాల్ ఉన్నా ఒకవైపు మాత్రం ఉండేది కాదు. ఈ సమస్య ఎలాగైనా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళాలని ఆయన ఆలోచన, ఎప్పుడైనా సమావేశాల్లో ప్రస్తావిద్దామంటే అటువంటి పాఠశాలలు ఎన్నో ఉన్నాయని, మా పాఠశాల ఉన్నంతలో చాలా బాగున్నదని ఎవరైనా అనే అవకాశం ఉంటుంది. అది నిజమే కూడా. అలాగని వదిలేసే సమస్య కాదు. ఏదోవిధంగా ప్రజల సహకారంతో నిర్మిద్దామంటే పెద్దపని. అప్పుడు తాడేపల్లిగూడెంలోని సైన్స్‌ఫెయిర్‌ను ఉపయోగించుకోవాలని ప్రణాళిక వేసారు. అందులో ప్రదర్శించేందుకు మా స్కూలు మోడల్, నిర్మించబోయే పోలవరం ప్రణాళిక మోడల్ తయారుచేస్తున్నాము. మా పాఠశాల మోడల్ తయారుచేసినప్పుదు ఆయన కొన్ని సూచనలు ఇచ్చారు. దాన్ని అమలుచేసాక తప్పకుండా మన సమస్య కలెక్టర్‌గారి దృష్టిలోపడుతుంది చూడండి అని ధీమాగా చెప్పారు. కలెక్టర్ మా మోడల్ చూసి చాలా ఇంప్రస్ అయ్యారు. బాగుందే. స్కూలు ఇలానే ఉంటుందా అని అడిగారు. ఎం. ఇ. ఓ. గారు అవును, అచ్చంగా అలాగే ఉంటుందని ఉత్సాహంగా బదులు ఇచ్చారు.
ఎం. ఇ. ఓ. అవునండీ మూడు వైపులే పక్కాగోడ ఉంది అన్నారు.
వెంటనే కలెక్టర్‌గారు ఆ నాలుగో వైపు గోడ నిర్మించమని, ఈ రకంగా తన దృష్టికి సమస్యను తీసుకువచ్చినందుకు మమ్మల్ని అభినందించారు. ఆ సమయంలోనే స్కూలు అభివృద్ధికి మరికొన్ని అడిగితే అవీ వెంటనే చెయ్యమని ఆదేశించారు. ఆ విధంగా కరెంటు కూడా తెచ్చారు. ఇంతకీ ఈ రమణ మాస్టారు ఇచ్చిన సూచన ఏమిటంటే, ఈ మోడలు తయారుచేసి, నాలుగోవైపు కొబ్బరిఈను పల్లలతో దడిలా కట్టించారు మోడల్లో. అంతే ఫలించింది
గొల్లగూడెం పాఠాశాలకు ప్రభుత్వ నిధులు కాక కైండ్‌నెస్ సొసైటీ అధ్యక్షులు గట్టిం మాణిక్యాలరావుగారి సహకారంతో బేబీ కుర్చీలు, వట్టికూటి గుర్రాజుగారి సాయంతో జారేబల్ల, లయన్స్‌క్లబ్ వాళ్ల సహకారంతో నీళ్ళడ్రమ్ము వంటివి ఏర్పాటుచేశాం. లింగారాయుడుగూడెం పాఠశాలకు గండికోట రాజేంద్రగారి సహకారంతో కంప్యూటర్, ఆటవస్తువులు, బ్యాగులు, వాసవీక్లబ్‌వారి సహాయంతో చెప్పులు, పుస్తకాలు, నేర్పరి సేవాసంస్థ ద్వారా మొక్కలు, వాసవీక్లబ్ సాయంతో గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలు, గ్రామస్తులు, ఇతర దాతల సహాయంతో వార్షికోత్సవాలు, ఇతర కార్యక్రమాల కోసం స్టేజి నిర్మాణం వంటివి ఎన్నో చేశారు.
ప్రకృతి ఆరాధకుడు : - రమణ మాస్టారు నిత్యం తనచుట్టు ఉన్న పరిసరాలను చాలా లోతుగా పరిశీలించే తత్త్వం కలవారు. ఆయన అంత ఖాళీలేని నిత్య సంఘర్షణమయమైన జీవితం గడుపుతూన్నా చిన్న చిన్న విషయాల్లోనే ఆనందం వెతుక్కుంటారు. ఇద్దరం బండిమీద స్కూలుకు వెళ్ళివస్తూంటే దారిలో పక్షుల వరుస చూసి ఆనందభరితులవుతుంటారు. ఆ సంబరం నాకూ చూపించి పంచుకునేవారు. ఆకాశంలో మారే రంగులు, కాలానుగుణంగా ఏర్పడే రకరకాల మబ్బులు, వర్షపు నీటిగుంతలు, ప్రవహించే పిల్ల కాలువలు, పచ్చని చేలు ఇలా ప్రతీ చిన్న వివరం గమనిస్తూ వాటిలోని అందాలను ముచ్చటిస్తారు. వినాయకచవితి సమయంలో గణపతికి ఇష్టమైన పత్రి ఆయనతోపాటుగా సేకరించడం ఒక చక్కని అనుభూతి. ప్రతి మొక్కనీ పేర్లు చెప్పి, చిన్నతనంలో తన సొంతూరు కంచుమర్రులో ఆయా మొక్కలు, చెట్లతో ఉండే అనబంధం మాట్లాడుతూ, వృక్షాలకు సంబంధించిన ఎన్నో వివరాలు చెప్తూ చాలా ఆసక్తికరమైన అనుభవం చెప్పేవారు. ఇద్దరం ఎన్నో రకాల పత్రులు
సేకరించేవాళ్లం. పక్షులు, జంతువుల అంటే ఆయనకు ఎంతో ప్రేమ, అంతకన్నా దయ. ఎప్పుడైనా వర్షం పడితే ఆ వర్షాన్ని ఆస్వాదిస్తూనే, పాపం కాకులు, పిచ్చుకలు గూళ్ళు లేకుండా అయిపోతాయని బాధపడేవారు. రోజూ తాను తినగా కొంత అన్నం, కూర మిగిల్చి గోడలపై వేసి ముందుగా పెట్టుకున్న ఓ బుల్లి గిన్నెలో నీళ్లుపోసి వచ్చేవారు. కాకులు, ఇతర పక్షులు తింటే ఆనందించేవారు. ఉడతలు, పిచ్చుకలు ఏం తింటాయో ఆయనకు తెలుసు. అటువంటి దినుసులే వేసి అవి తింటూంటే చూసి సంబరపడేవారు. ఆయన చేసే కొన్ని పనులు చూస్తే ఇంత సున్నితమైన ఆలోచన చేయవచ్చా అని ఆశ్చర్యపరిచేవారు. మొన్నామధ్య ఓ పూర్వ విద్యార్ధి కనిపిస్తే మాటల సందర్భంలో హెడ్‌మాష్టారు పక్షులకి, జంతువులకి కూడా అన్నం వేసేవారు కదండీ అంటూ గుర్తుచేసుకున్నాడంటే ఆయన ప్రభావం అలాంటిది. ఏ స్కూలుకు వెళ్ళినా ఆ ఆవరణ నందవనం అవ్వాల్సిందే. ఎన్నో రకాల పూలమొక్కలు, ఆకుకూరలు, కూరగాయల మొక్కలు వేసి అవన్నీ పండించేవారు. పిల్లలు కూడా స్కూలు అయిపోయాకా మాతో ఉండి వద్దన్నా మొక్కల సంరక్షణ చూసేవారు. కాయగూరలు కోసి అందరికీ పంచినా తాను స్వయంగా పూలు కోయడానికి మాత్రం చాలవరకూ ఇష్టపడరు. ఎందుకంటే నవ్వులు చిందించే పువ్వులు కోయడానికి మనసు రాదు మాస్టారూ అని సమాధానం ఇచ్చేవారు. ఆయనకు అంతి ప్రశాంతర బహుశా ఈ ప్రకృతి పరిశీలన, ఆరాధనల వల్లనే వచ్చిందేమో.
హాస్యప్రియులు : _ ఆయన ఉన్నచోట ఆహ్లాదం వెల్లివిరుస్తుంది. ఎవరినీ నొప్పించకుండా చక్కని జోకులు వేసి నవ్వించడం ఆయన సొంతమైన వరం. ఆడే మాటలోనూ, చేసే పనిలోనూ హాస్యాన్ని మేళవిస్తారు. చాలా వేదికలపైన ఎన్నో లఘు హాస్య నాటికలు వేసి సెభాష్ అనిపించుకున్నారు. నాలో ఉన్న నటుడిని వెలికితీసిన వ్యక్తి మాస్టారే. సభలు, సమావేశాల వేదికమీద ఆయన ఉన్నారంటే చాలు, ఆ వేదిక ఆహ్లాదభరితమే.
ఆయన మాటే మంత్రం : - కుటుంబ సమస్యలు, ఇతర సమస్యలు, చదువులో సమస్యలు, భవిష్యత్ ప్రణాళికల్లో అయోమయం వంటివి ఆయన చిన్న ఆలోచనతో పరిష్కరించారు. అలానే చదువులో నిరాసక్తత, జీవితంలో నిరాశ ఏర్పడినవారికి తన మాటలతో ఉత్సాహం కలిగించగలరు. ఆయన ఎందరో విద్యార్ధుల జీవితాలు ఒక్కమాటతో మలుపు తిప్పారు. ఆయన మాటతో స్పూర్తిపొంది రామలక్ష్మి అనే పేద విద్యార్ధిని ఆంధ్రవిశ్వవిద్యాలయం క్యాంపస్‌లో సీటు సాధించి మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది. బాగా వెనుకబడిన కుటుంబానికి చెందిన నాగమణి అనే అమ్మాయి "నువ్వు నాలా టీచర్ కావాలి" అన్న మాస్టారు మాటను నిజం చేసేందుకు అడ్డంకి కాకుండా తన భర్తను డిగ్రీ చేయించింది, ఆ తర్వాత తాను ప్రభుత్వ ఉపాధ్యాయిని అయి, అలానే తమ్ముణ్ణి కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా మలిచిందంటే ఆయన మాటలలోని శక్తి తెలుస్తుంది. డి. కుముదవల్లిలో పందులను కాసుకునే కుర్రాడు మాష్టారి ప్రోత్సాహంతో ఉపాధ్యాయుడయ్యాడు. ఆయన శిష్యులు ఉపాధ్యాయులుగా, రక్షణశాఖ ఉద్యోగులుగా, మరెన్నో గౌరవనీయమైన ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. ఆయనే మార్గదర్శి : - రమణ మాస్టారితో ఏ కొద్ది పరిచయం ఉన్న వ్యక్తైనా ఆయన వ్యక్తిత్వానికి ఆకర్షితుడు కాకుండా ఉండలేరు. ఇక గాఢమైన అనుబంధం ఉన్న కుటుంబసభ్యులు, మిత్రులు ఆయననే చాలా విషయాల్లో మార్గదర్శిగా తీసుకుంటారంటే ఆశ్చర్యం కాదు. నాతో చాలామంది అనేవారు - మీ గురువుగారు (రమణ మాష్టారు)ని అనుకరిస్తావు, అనుసరిస్తావు అందరి దగ్గరా మంచిపేరు తెచ్చుకుంటున్నావని. అది అక్షరసత్యం. నాతో వ్యక్తిగతంగా ఒకసారి ప్రముఖ అధ్యాపకుడు, కళాకారుడు సైమన్‌పాల్ ఆయన వ్యక్తిత్వాన్ని గురించి మంచిమాట చెప్పారు. "రమణగారు సరళంగా ఆలోచిస్తారు. తాను ఏది ధర్మం అని నమ్ముతారో దాన్నే ఆచరిస్తారు. ఏది ఆచరిస్తారో అదే ఎవరికైనా బోధిస్తారు" అని. ఐతే అరవై ఏళ్ళపాటు నిత్యం మనసు, మాట, చేత ఒకటి కావడం అంత సామాన్యమైన విషయం కాదుకదా. ఆయన ఏ పని అనుకున్నా రాగద్వేషాలకు అతీతంగా ఆలోచించి నిర్ణయించుకుంటారు. ఒక్కసారి నిర్ణయించుకున్నాకా ఆచరించడంలో పట్టుదల, కార్యదక్షతలతో సమయ పాలనతోనూ అనుకున్నది అనుకున్న సమయానికి చేస్తారు. ఏ పని చేసినా ఇదే పద్ధతిలో చేస్తారు కానీ అన్ని పనుల్లోనూ స్కూలు పనులకు, పిల్లల అభివృద్ధికే ముందు స్థానం ఇస్తారు. మిగిలిన విషయాల్లో ఆయన ప్రతిభ చూసినవారే ఆశ్చర్యపోతే స్కూలు పనుల్లో ఆయన పట్టుదల, కలుపుకుపోయే తత్త్వం. కార్యదక్షత చూస్తే దానికి వందరెట్లు ఆశ్చర్యపోతారు.
ఎందరితో ఎన్ని రకాలుగా వ్యవహరించాల్సి వచ్చినా అజాత శత్రువుగా నిలిచారు. స్కూలు కోసం, పిల్లల కోసం ఎలాంటి సమస్యనైనా నిబ్బరంగా ఎదిరించగలరు. కాలానికి కొన్ని విడిచిపెట్టేయాలనే విజ్ఞత కల మనిషి. కష్టంలోనే సుఖం వెతుక్కునే కష్టజీవి. కుటుంబాన్నీ, సమాజాన్నీ సమతుల్యం చేసుకున్న కుటుంబపెద్ద.
నాకు ఆదర్శమూర్తి, గురువు, ఆరాధ్యుడు అన్నీ తానే అనిపించిన వ్యక్తి ఈ ప్రకృతిలో ఆయన ఒక్కరే.
_________________________________________________________________________
వ్యాసకర్త లింగారాయుడుగూడెంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు. వెంకటరమణతో 2000 సం. నుండి రమణతో పనిచేశారు. కళాకారునిగా స్వచ్చంద కార్యకర్తగా పేరుతెచ్చుకొంటున్న తిరుపతిరావు వాటి వెనుక రమణస్ఫూర్తి ఉన్నట్టు చెబుతూఉంటారు. "సం"గతులు
అన్నంపెట్టే పిల్లలు
అది కొన్నేళ్ల క్రింత మాట. ఓరోజు రాత్రి నాన్నగారు పెద్ద పెద్ద సంచులతో ఇంటికి వచ్చారు. హుషారుగా ఎదురెళ్ళి చిన్న చిన్న సంచులు తీసుకొని ఇంట్లోకి తెచ్చాం. మా కోసం ఏం తెచ్చారు అంటూ అన్ని ప్యాకెట్లూ విప్పి చూడడం మొదలుపెట్టాం. తీరా చూస్తే అందులో అన్నీ నోట్ పుస్తకాలు, పలకలు, బలపాలు, పెన్సిళ్లు ఇతరమైన సామాగ్రి ఉన్నాయి. "ఇవి అన్నీ మాకు అంతకుముందే కొనేశారుగా ఇవి ఎవరికి నాన్నగారూ అన్నాం". మా స్కూల్లో పిల్లలు ఇవన్నీ కొనుక్కోలేరు కదమ్మా అందుకని వాళ్లకోసం కొన్నాను అన్నారు. ఈలోపుమా కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ ఓ ప్యాకెట్ కనపడింది. తీసి చూస్తే ఉండేదానికన్నా పెద్ద సైజులో పెద్ద పెద్ద పెన్నులు ఉన్నాయి. అవి ఎంతో ఆకర్షణీయంగా కనపడటంతో అవి తీయబోయాం. ఈలోపు నాన్నగారు వారించారు. "అవి మీకోసం కాదమ్మామా పిల్లల కోసం తెచ్చాను" అన్నారు. "ఇదేంటి మేమే కదా మీ పిల్లలం నాన్నగారు" అనటంతో ఆయన నవ్వేసి "నేను అన్నం పెడితే తినే పిల్లలు మీరు, మనకి అన్నం పెట్టే పిల్లలు మా బళ్ళో ఉన్నారమ్మా మీ కోసం వేరేగా తెచ్చాగ" అంటూ వేరే ప్యాకెట్లోవి తీసి ఇచ్చారు. అపుడు అర్ధం అయింది మాకు పనిని దైవంగా భావించడం అంటే ఏమిటో...
సూరంపూడి మీనా గాయత్రీ
రెబ్బాప్రగడ శ్రీ నాగవల్లి
డి. కుముదవల్లి పాఠశాల
వార్షికోత్సవంలో విద్యార్ధినులతో రమణ
రవణావతారాలు:
తమ్మా సత్యనారాయణ
ఆపద్బాంధవుడు
తే. బందువుల పాలి - సహకార సింధువితుడు,
మాతృ సేవయె బ్రతుకైన మాన్యుడితడు,
తాను ఎదుగుచు, తనవారి ఘనులజేసి -
అందరికి "బంధుతీపి"ని అందజేసె!!
తల్లి, అన్నలు, చిన్న కుమార్తెతో రమణ (1995)