ఆనందం మనిషైనవాడు/అత్తిలికి అయ్యంకి మా వెంకటరమణ

అత్తిలికి అయ్యంకి మా వెంకటరమణ

ముదునూరి వేణుగోపాలరాజు

విశ్రాంత గ్రంధ పాలకులు,

హౌసింగ్‌బోర్డు కాలని, తాడేపల్లిగూడెం

పుస్తకం సమాజ హితాన్ని కోరుతుందని నమ్మిన మా ప్రియమిత్రులు సూరంపూడి వెంకటరమణ. ఉపాధ్యాయునిగా, కవిగా, రచయితగా, కళాకారునిగా, అన్నింటినీమించి కుటుంబ పెద్దగా ఎంత హడావుడు ఉన్నా ఆయనకు గ్రంథాలయం అంటే ప్రాణం. అందువల్లనే ఆయన గ్రంథాలయాల అభివృద్ధికి విశేష కృషిచేశారు. ముఖ్యంగా నేను 1979 లో అత్తిలి గ్రంధాలయం అధికారిగా పదవీ బాధ్యతలు స్వీకరించినపుడు రమణ ఎన్నో విధాల గ్రంధాలయానికి సహకరించడం తెలుసుకున్నాను.

అయ్యంకి వెంకటరమణయ్య అవార్డుతో రమణ బృందం

(కుడివైపునుండి మూడవవారు)

చిత్రంలో నాటి గ్రంథాలయాధికారులు తమ్మయ్య, కృష్ణారావు,

సంఘం ఉపాధ్యక్షులు సురేష్ బాబ్జి, ప్రధాన కార్యదర్శి హనుమంతరావు,

సంయుక్త కార్యదర్శి సత్యనారాయణ, రవికిషోర్, కె. వి. సత్యనారాయణ

అపుడు గ్రంధాలయోధ్యమ నాయకులు పెమ్మరాజు బాపిరాజు అధ్యక్షునిగా, నేటి ప్రముఖ సినీ హాస్యనటుడు బ్రహ్మానందం ఉపాధ్యక్షునిగ, వెంకటరమణ ప్రధాన కార్యదర్శిగా గ్రంధాలయ అభివృద్ధి సంఘం ఏర్పాటుచేశాం. అనంతరం రమణ ఆధ్వర్యంలో ప్రముఖ అవధాని రావూరి వెంకటేశ్వర్లుని రప్పించి అత్తిలిలో అవధానసభ నిర్వహించారు. అప్రస్తుత ప్రసంగ పృచ్ఛకునిగా రమణ ఆహుతులను కడుపుబ్బ నవ్వించారు. ఆ విధంగా గ్రంధాలయంలో ఎందరో ప్రముఖుల్ని రప్పించి కార్యక్రమాలు చేశారు. పెద్దల సాయంతో గ్రంధాలయాన్ని అభివృద్ధి చేశారు. ఆ గ్రంధాలయం 25 వ వ్యవస్థాపక దినోత్సవానికి వారం రోజులు సభలు నిర్వహించారు. రజతోత్సవ సంచిక విడుదలచేశారు. పాలి ప్రసాద్‌ జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షునిగా ఉండగా ఉత్తమ సేవలు అందించిన గ్రంధాలయ సేవకులకు అయ్యంకి వెంకటరమణయ్య అవార్డు ఇస్తామని ప్రకటించారు. ఈ అవార్డుకు సూరంపూడి వెంకటరమణను ఎంపికచేసి జిల్లా సభలో ఘనంగా సన్మానించి, పురస్కారం అందజేశారు. ఇది అత్తిలి గ్రంధాలయ చరిత్రలో అపురూప విషయం. అత్తిలి గ్రంధాలయ అభివృద్ధి విషయంలో రమణ ఎంతో కృషిచేశారు. దీనితో ఆ ప్రాంత గ్రంధాలయాల అభివృద్ధికి తనవంతు సహకారం అందించారు. తాడేపల్లిగూడెంలో కూడా గ్రంథాలయ అభివృద్ధికి ఎంతో కృషిచేశారు. పెమ్మిరాజు బాపిరాజు ఆధ్వర్యంలో రమణను ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ఉపాధ్యక్షులుగా విజయవాడలో ఎన్నుకోవడం ఆయన కార్యదీక్షకు వారిచ్చిన కితాబుగా చెప్పవచ్చు. గ్రంథాలయోద్యమ నాయకులు వావిలాల గోపాలకృష్ణయ్యను అత్తిలి తీసుకు వచ్చిన ఘనత రమణకు దక్కుతుంది. గ్రంథపాలకులందరికీ ఆయన ఎంతో సహకారం అందించారు. గ్రంథాలయ వారోత్సవాలు ప్రతీఏటా ఘనంగా జరపడానికి రమణ తన మిత్రులు వాసాభక్తుల హనుమంతరావు, హెచ్. వి. సురేష్ బాబ్జి, పెమ్మరాజు శ్రీనివాస్, జి. వి. వి. సత్యనారాయణ తదితులతో కలసి విశేష కృషిచేశారు. అందుకే ఆయన్ని అత్తిలికి "అయ్యంకి" మా వెంకటరమణ అని అంటాం. సాయిలక్ష్మి దంపతుల భావి జీవితం వైభవంగా సాగాలని ఆకాంక్షిస్తున్నాను.


  • వ్యాసకర్త అనేక ప్రభుత్వ గ్రంథాలయాలలో పనిచేసి, ఉద్యోగ విరమణ చేశారు. సాహిత్య సంస్థలలో చురుకైన పాత్ర వహించారు.

"సం"గతులు

పిల్లలతో సైకిల్ ఫీట్లు

భార్యా పిల్లల్ని సుఖపెట్టాలంటే మేడలూ, మిద్దెలు, ఏసీకార్లు, జేబునిండా డబ్బు, తీరిక సమయం ఉండాలి అనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. దీనికి వ్యతిరేకి మా బావగారు రమణ. ఆయన్ని బావా అనటానికి రెండు కారణాలున్నాయి. ఆయన ఆత్మీయంగా అందరిలో కలిసిపోవటం ఒకటైతే మేమిద్దరం "ఫ్రీడం పైటర్" నాటికలో నటించడం మరో కారణం. అందులో ఫ్రీడం పైటర్ (కూనిరెడ్డి శ్రీనివాస్, సినీ నిర్మాత) కుమారునిగా రమణ నటిస్తే, ఆయనకు బావగా నేను వేశాను. ఆ రకంగా అనేక వేదికలపై మేము బావా, బావమరుదులుగా ప్రేక్షకుల మనసుల్లో మిగిలాం. ఇక ఉపాధ్యాయినిగా, రచయితగా, కళాకారునిగా ఆయన ఎంత బిజీగా ఉన్నా తన కుటుంబాన్ని మాత్రం విస్మరించలేదు. నేను భీమవరంలో ఈనాడు విలేఖరిగా పనిచేసినపుడు అక్కడికి 16 కి. మీ దూరంలో ఉన్న కంచుమర్రు గ్రామం నుంచీ సైకిల్‌పై వచ్చేవారు. అలా ఒంటరిగా వస్తే అది మామూలు విషయమే. ఆయనకున్న ముగ్గురు సంతానంలో సంతోష్‌ను క్యారేజీపైన, వల్లీని ముందు కడ్డీపైన, గాయత్రిని భుజాలపైన కూర్చోపెట్టుకుని అంతదూరం నుంచీ సైకిల్ తొక్కుతూ, కబుర్లు, కథలు చెప్తూ, పాటలూ, పద్యాలు పాడుతూ వచ్చేవారు. ఈ దృశ్యం చూసిన నేను, నా సహచర మిత్రులూ ఈ ఆనంద కోటీశ్వరుడికి మనసులోనే దణ్ణాలు పెట్టేవాళ్ళం. ఆ విధంగా ఎన్నోసార్లు భీమవరం తీసుకొచ్చి పిల్లలకు నాటకాలు, సాహితీసభలు, సినిమాలు చూపించేవారు. ఈనాడు ముగ్గురు పిల్లలు సంస్కారవంతులుగా, సాహిత్యం అభిలషించేవారిగా తయారయ్యారంటే ఆ నాటి విత్తనాలే కారణంగా అనుకుంటాను.

...పైలు శ్రీనివాస్

జయహో పత్రికా సంపాదకులు

పిళ్ళై పాత్రలో రమణ