ఆదరణలేని రామమంత్ర పఠనమద్రిజ ఏమనిచేసెను రామా అదెనీకు నామీద ముదమొప్ప దయయున్న అదె తెలిపి మాటాడవా శ్రీరామా

పరమద్రోహిని నిన్ను పతితపావనుడని ప్రహ్లాదుడెటువలె తలచెనో పరమపావనసతి నడవికి పంపిన పాపకర్మునకెటు దయవచ్చునో రామా || ఆదరణలేని ||

ఆది పరబ్రహ్మమనుచు నిను పరమేష్టి ఏరీతి ప్రస్తుతి చేసెనో వద్దు పరసతులనక స్త్రీల భంగపరచినవాని వరలక్ష్మి ఎటుమెచ్చెనో రామా || ఆదరణలేని ||

ఎన్నగ శబరియెంగిలి భక్షించిన తిన్నని నడత లేనివాడవు నిన్ను నమ్మరాదు నిన్నుదైవమనరాదు నిజము నామాట రామా || ఆదరణలేని ||

ఆదరణలేని రామమంత్రము ఆడితిని నినుదూరితిని ముద్దుమాటలుగాని మూర్ఖవాదముగాదు మురహర ననుగావుమీ రామా || ఆదరణలేని ||

ముద్దుమోముజూపి ముదమొప్ప రక్షించు భద్రశైల పరిపాలకా వద్దురా కృపనేలు రామదాసునిమీద వైరమా వైదేహిసహిత శ్రీరామా || ఆదరణలేని ||

"https://te.wikisource.org/w/index.php?title=ఆదరణలేని&oldid=25804" నుండి వెలికితీశారు