ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ/వేసవిసెలవులు
కూడ నుండెడిది. ఆకళాశాల కనుబంధముగ మంచిపొలము లుండెడివి. పెద్దపెద్దయావులు వర్ధిలుచుండెడివి. స్వచ్ఛముగనుండు నచటియావు పాలును, ఆపొలములలో పైరగు కూరగాయలును మేము కొనుక్కొను చుండెడివారము. ఆవైపునకు షికారు పోవునపుడెల్ల నిర్మలవాయువును బీల్చుచు, మనోహరములగు పూలమొలకలను జూచుచు నుండెడివారము.
సైదాపేట యెంతటి చక్కని నిశ్శబ్దప్రదేశమైనను, మే మచటి సౌకర్యముల ననుభవింప వలనుపడకుండెను. కళాశాలాదినములలో మే మెచటికిని కాలు గదుపుటకు వ్యవధానమె లేదు. నేను అఱవ పూటకూళ్ల వారియతిథిని, అచటివంటకములు మొదట కొన్ని దినములు చోద్యముగ నుండినను, పిమ్మట నోటికి వెగ టయ్యెను. చప్పనికూరలు, సారహీనములగు పప్పుపచ్చడులును, నేయిలేని యన్నమును, అనుదినమును భుజించి, నానాలుక బరడుగట్టిపోయెను ! అఱవవారిసాంప్రదాయములు, ద్రావిడాచారములును జూచి, మా తెలుఁగుకన్నులు కాయలుగాచిపోయెను ! ఎపుడు పాఠశాల గట్టివేయుదురా యని మేము రోజులు లెక్కించుకొనుచుంటిని. తుదకు 11 వ మేయి తేదీని మిత్రులయొద్ద వీడుకో లొంది, నేను రెయిలులో రాజమంద్రి బయలుదేరితిని.
46. వేసవిసెలవులు
నేను రాజమంద్రికి వచ్చుటయే తడవుగా, మరల నచటిసమాజముకొఱకు పాటుపడితిని. "సత్యసంవర్థని"కి వ్యాసములు రచింపఁ బూనితిని. కనకరాజు నేనును సమాజపుస్తకములను సరిదితిమి. నే నాతనితో "ఆస్తికపాఠశాల"నుగూర్చి ముచ్చటించునపుడు, సానుభూతి నగఁబఱచి, మిత్రులమనస్పర్థలు పోఁగొట్ట నాతఁడు ప్రయ త్నింతు ననెను. పాపయ్యగారితోను, నాపూర్వగురువులగు వెంకటప్పయ్యగారితోను, పాఠశాలనుగూర్చి ప్రస్తావింపఁగాఁ, ఆమోదము చూపి సహాయము చేసెద మనిరి.
మే మిట్లు రాజమంద్రిలో "ఆస్తికపాఠశాలా" స్థాపనమును గూర్చిన ప్రయత్నములమీఁద నుండఁగా, ఆ విద్యాలయమును గుఱించి మేము ఔదాసీన్యము వహించియుంటిమని మృత్యుంజయరావు మామీఁద నుత్తరములు గుఱిపించుచుండెను !
మా కుటుంబమునకై మే మిదివఱకు వేఱువేఱుచోట్ల చేసిన యప్పులన్నియుఁ దీర్చివైచుటకై, ఇపుడు గోటేటి రామభద్రిరాజుగారియొద్ద పెద్దఋణము తీసికొని, ఆయనకు మాతండ్రియు నేనును గలసి పత్రము వ్రాసియిచ్చితిమి. ఆసందర్భమున వివిధప్రదేశముల నుండుబంధువులు జూచి వచ్చితిని.
కొంతకాలమునుండి "వివేకవర్థని" ప్రచురింపఁబడుచుండుట లేదు. వీరేశలింగముగారు దాని నిపుడు పునరుద్ధరింప నెంచి, తాను దొరతనమువారికొలువున నుండుటచేత, ఆపత్రిక కొకసంపాదకుని గుదుర్చుట కాలోచించుచుండిరి. నేనిపుడు పట్టపరీక్షలోఁ దేఱి, పత్రికాసంపాదకత్వమునఁ గొంత యనుభవము సమకూర్చుకొనుటచేత వారికన్ను నామీదఁ బడెను. ఈగౌరవమునకు హర్ష మందినను, పత్రికాధిపత్యమునకు నేను సమ్మతింపలేదు. సైదాపేటలో విద్యార్థిగ నుండు నేను రాజమంద్రిలోని వారపత్రికకు సంపాదకుఁడనగుట సమంజసమా యని నాప్రశ్నము. నామకార్థము నేను పత్రికాధిపతి నైనచో, రాజమంద్రిలో తానే పని నంతయుఁ జక్క పెట్టుదు నని పంతులసమాధానము. నూతనపత్రికను తమప్రహసనములతో నింపివేసి, పంతులు నన్నుఁగూడ నభియోగములపాలు చేయు నని నాభయము. తనయం దీమాత్రపు విశ్వాస ముంచనేరని నాబోటివారలతోఁ గలసి సమాజసంస్థలలోఁ దా నెట్లు పని చేయ నేర్తు నని పంతుల బెదరింపు. పెద్దవాఁడగు పంతులమాట శిరసావహింపుమని కనకరాజుని హితోపదేశము. అహంభావ స్వార్థపరత్వముల ప్రేరణమున నే నిట్లు మిడిసి పడుచుంటి నని వా రిరువురు న న్నంత నిందించిరి. అంత్యనిష్ఠురమున కంటె నాదినిష్ఠురమే మేలని నేను స్థిరత్వముఁ బూనియుంటిని. ఆపత్రిక నొకన్యాయవాది నడపుట కంగీకరించె నని తెలిసి, నా కీగండము తప్పుటకు నే నంత సంతోషమందితిని !
11 వ జూన్ తేదీని, ఆఱు నెలలపిల్ల యగు మాచిన్న చెల్లె లేకారణముననో విడువక యేడువ నారంభించెను. దేహముమీఁద దానికి పొక్కులు గానిపించి, బాధ యతిశయించెను. శస్త్రము చేసినయెడల కురుపులు నిమ్మళించు నని నామిత్రుఁడు రంగనాయకులునాయఁడు గారి యభిప్రాయము. దీనికి మాతలిదండ్రులు పెద్దతమ్ముఁడును సమ్మతింపలేదు. శస్త్రము చేయించినఁగాని రోగి జీవింపదని నానమ్మకము. అంతకంతకు రోగి కడు బలహీనయై వేదన నొందుచుండుటచేత మా కెల్లరకు మనస్తాపము గలిగెను. బంధువులప్రేరణమువలన మా తలిదండ్రులు బాలిక నంతట సావరము గొనిపోయి, అచటివైద్యునిచే మం దిప్పించిరి.
"ఆస్తికపాఠశాల"స్థాపనమునుగూర్చి నేను మిత్రులును బాగుగ సంభాషించుకొంటిమి. మృత్యుంజయరావు భార్యను దీసికొని సైదాపేటనుండి యిక్కడకు వచ్చెను. పాఠశాలస్థాపనమునుగుఱించి యతని కెక్కువయలజడి గలిగెను. ఈవిషయమై కళాశాలాధ్యక్షులగు మెట్కాఫ్‌దొరను జూచి మాటాడుట ముఖ్య మని మాకుఁ దోఁచెను. కాని, "వివేకవర్థని" పత్రికాధిపత్యమునుగుఱించి నేజూపిన యసమ్మతిని గంటకించిన వీరేశలింగముపంతులుగారు మాతో వచ్చుట కిష్టపడలేదు. కావున కనకరాజు నేనును మెట్కాఫ్‌దొరదగ్గఱకు వెళ్లి మా నూతనపాఠాశాలనుగుఱించి సవిస్తరముగ మాటాడితిమి. దొరతనమువా రిఁక ముందు రాజమంద్రిలో నున్నతపాఠాశాలావిద్యను తమ చేతులలోనికే తీసికొందురనియు, కావున మాపాఠశాల కచట నవకాశము లే దనియు, ఆయన చెప్పివేసిరి ! మఱునాఁడు నాలుగవ జూలై తేదీని, మే మిరువురమును పంతులుగారి కీవార్త తెలిపితిమి. ఎన్ని కష్టముల నైన సహించి, పాఠశాలను స్థాపించి, అందు మేమందఱమును పని చేసెదమని పంతులుగారితోఁ జెప్పివేసితిమి.
6 వ జూలై తేదీని, మద్రాసు ప్రయాణము తలపెట్టుకొంటిమి. ఈమాఱు భార్యతో నే నచటికి బయలుదేఱితిని. గంగరాజు కామేశ్వరరావులు వారిపత్నులతోఁ బ్రయాణ మయిరి. గోదావరి దాటుటకు మే మందఱమును స్టీమరురేవునకు వచ్చునప్పటికి, మాకు వీడుకోలొసంగుటకు పంతు లచటికి వచ్చి వేచియుండెను. ఆస్తికవిద్యాలయములోఁ బని చేయుదు నని జెప్పినపు డాయన మిగుల సంతోషభరితుఁ డయ్యెను.
మిత్రు లందఱమును గూడి పోవుచుంటిమి గాన, మాకుప్రయాణ కష్టము గానఁబడలేదు. కంభము సమీపమందలి గుహలు వనములు పర్వతములు మున్నగు సుందరదృశ్యములు మా కనులకుఁ బండుగు చేసెను. ఎనిమిదివతేదీని మద్రాసు చేరితిమి. భార్యతో సైదాపేటలోఁ గాపుర ముండి, అన్న గారికి భోజనసదుపాయము చేయవలె నని కామేశ్వరరావు అదివఱకు సంకల్పించుకొనియుండెను. గంగరాజు నాకంటెను నిదాన మెఱుఁగని వేగిరపాటు గల మనుష్యుఁడు. ఇపు డాతని యాలోచనచొప్పున, గంగరాజు కామేశ్వర రావుగార్లు పరశువాకములో బుచ్చయ్యపంతులుగారియింటఁ గలసి కాపురము చేయునట్టుగను, సైదాపేటలోఁ గాపురముండు నేను మృత్యుంజయరావునకు భోజనసౌకర్యము చేయుటకును, ఏర్పాటు లయ్యెను ! సహాధ్యాయుఁడు కొల్లిపర సీతారామయ్యగారు సకుటుంబముగ నుండు నింటిభాగమున మేము సైదాపేటలోఁ గాపుర మేర్పఱుచుకొంటిమి. కురుపులబాధతో మాకడగొట్టుచెల్లెలు చనిపోయెనని తెలిసి మిగుల విషాద మందితిమి.
47. వ్యాధిగ్రస్తత
నేను సైదాపేటలో పాదము పెట్టుటయే తడవుగ నాశరీరమున మరల వ్యాధి యంకురించెను. జ్వరముతో నారంభించినరోగము మెల్లగ నజీర్ణవ్యాధిగఁ బరిణమిల్లెను. నా జఠరము మిగుల బలహీన మయ్యెను. మద్రాసునందలి మిత్రుఁడు నారాయణస్వామినాయఁడు గారు మంచిమందు లిచ్చెనేగాని, రోగములొంగక లోలోననే రగులు చుండెను. నీరసము హెచ్చెను. కొంచెము నెమ్మదిగ నుండినపుడు పాఠాశాలకుఁ బోయి విద్య గఱపుచును, బజారువెచ్చములకై యెండలోఁ దిరుగుచును నుంటిని. ఈమధ్యగ నొకటిరెండుసారులు నాభార్యయు జబ్బుపడెను. ఎటులో నా పనులు చేసికొనుచు, నేను దినములు గడుప నెంచితిని.
"లంకణములలో మనుగుడుపు" అనునట్టుగ, కష్టపరిస్థితులందు నాభార్యకుఁ జదువు చెప్పుటకును, ధర్మసూత్రములు బోధించుటకును నేను బూనుకొంటిని ! నాసహచరుఁడు సీతారామయ్యగారిసతియు జననియు చెల్లెండ్రును నాభార్యయం దమిత ప్రేమానురాగములు గలిగి వర్తించిరి.