ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ/రంగనాయకులు నాయఁడు గారు
పూఁటకూటిదానిని బరిహసించుట సిగ్గులచేటని నొక్కిచెప్పితిని. వీరి మధ్యనుండు సాంబశివరా వంత నందుకొని, నే నందఱిలోను మొనగాఁడ ననుకొని మిడిసిపడుచుంటి ననియు, ప్రార్థనసమాజమునకు నిరంకుశాధికారి నని భావించుకొనుచుంటి ననియు, తానుమాత్రము నన్నావంతయు లెక్కసేయ ననియుఁ జెప్పి వెడలిపోయెను ! ఇది జరిగిన యొకటిరెండు మాసములవఱకును నాతో నతఁడు మాటాడక, సదా మౌనమున నుండువాఁడు ! చనవరియు సరసుఁడునునగు సాంబశివరావే యిట్లు నాతో మాటాడకుండుటకు నేను వగచి, ఒకనాఁ డాతని బిలిచి, "జలపాత"సందర్భమున నే వాడిన నిష్ఠురోక్తులకు నన్ను మన్నింపు మంటిని. నాచెలికాఁ డంత పసిపాపవలె గోలుగోలున నేడ్చి, నామాటలకుఁ దా నేమియు తప్పుపట్టలే దనియును, తనజిహ్వ నరికట్టుటకే తా నీదీర్ఘమౌనవ్రతమవలంబించి ప్రవర్తనమున లాభ మందు చుంటి నని చెప్పెను ! పిమ్మట మే మిరువురమును వెనుకటివలెనే, మనసుగలసిన నేస్తుల మైతిమి.
కాని, యెల్లరును సాంబశివరావు వంటి నిష్కాపట్యహృదయులు గారు. మితిమీఱిన గర్వము నహంభావమును ప్రేరించుటచేతనే నే నిట్లు పెద్దమాటలు చెప్పుచున్నా నని యెంచి, ప్రార్థనసామాజికులలోఁ బలువురు నన్ను లోలోన ద్వేషించిరి. దీనిపర్యవసానము, కొంతవఱకు, కళాశాలాంత్యదినములలో నాకుఁ గానఁబడెను.
35. రంగనాయకులు నాయఁడు గారు.
నేను చెన్నపురి పోయి వచ్చినను, నా నేత్రములబాధ నివారణము గాలేదు. ఎక్కువసేపు చదివినను వ్రాసినను, కనులు మండుచుండును. "పెండ్లికి వెళ్లుచు పిల్లిని వెంటఁగోనిపోయిన" వానికివలె, మద్రాసు పోయి వచ్చినప్పటినుండియు నాకు వ్రాతఁపని వెంటఁబడెను ! అందువలనఁ గనులమంటలు హెచ్చెను. 4 - 6 - 91వ తేదీని నేను వీరేశలింగముపంతులుగారి యింటికిఁ బోయి, రాజ్యలక్షమ్మగారు జబ్బుగ నుండి రని తెలిసి, ఆమెను జూచితిని. అపుడె శరీరము నెమ్మదిపడుచుండెడి యాయిల్లాలు కుశలప్రశ్నము చేయఁగా నా కనుల సమాచారము తెలిపితిని. దీని కామె విచారపడి, పెద్దచెరసాలలో వైద్యులగు రంగనాయకులనాయుఁడుగారు కంటివైద్యములో మంచి సాధకులని పలికి, పంతులుగారి ద్వారా వారి నెఱుకఁజేసికొని వారిసాయము పొందు మని నా కాలోచన చెప్పిరి.
ఆనెల 17 వ తేదీని నేను పంతులుగారిని సందర్శించినపుడు, ఆయన తన "ఆంధ్రకవుల చరిత్రము"ను పూర్తిచేయుటకై యాఱు నెలలు సెలవుతీసికొని చెన్నపురిలో నుందు మని చెప్పిరి. ఆసందర్భమున నాకనులసంగతి వారితోఁ బ్రస్తావించి, రంగనాయకులు నాయఁడు గారియొద్దకు నన్నొకమాఱు కొనిపొం డని వారిని గోరితిని. అందుకు వారు సమ్మతించిరి.
21 వ జూలై తేదీని పంతులుగారు నేనును కారాగారమునొద్దకుఁ బోయితిమి. అపుడు నాయఁడుగారు రోగులకు మందుచీ ట్లిచ్చుచుండిరి. కుర్చీ కొకపెడ నిలిచి, ఖైదీ యొకఁడు విసనకఱ్ఱ వేయుచుండెను. నాయఁడుగారు స్థూలకాయులును, మంచి యొడ్డుపొడుగు గలవారును. మందహాసము చేయునపుడు, సహజసౌజన్యము వారి వదనకమలము నుండి వెల్లి విఱిసి నలుదెసలను బ్రసరించునటు లుండెను. ఆయన పంతులుగారిని ప్రేమపూర్వకముగ సమ్మానించెను. కుశలప్రశ్నము లైనపిమ్మట, వీరేశలింగముగారు నన్ను గుఱించి నాయుఁడుగారితోఁ జెప్పిరి. నాకనులు చూచి, నేను కొంతకాలము చదువు విరమించుట శ్రేయ మని వైద్యుఁడు వక్కాణించెను. అప్పటినుండియు నేను నాయుఁడుగారిని జూచుచు, వారొసఁగు మందులు సేవించుచు, కొంచెముకొంచెముగ లాభము నొందుచుంటిని
కొంతకాలమునకు రంగనాయకులు నాయుఁడుగారిని నగరవైద్యశాలలోనికి మార్పఁగా, పట్టణమధ్యమునకు వారు కాపురము వచ్చిరి. సహజసౌజన్యమహిమమున నాయుఁడుగారు శీఘ్రకాలములోనే జనానుమోదము నొందిన వైద్యు లను కీర్తిఁ గాంచిరి. దయా స్వభావు లగు వారికి ధర్మసంస్థలం దమితప్రీతి. ఆయన సద్భావయుతుఁడగు సంస్కరణాభిమాని. నాయుఁడుగారును, వారిధర్మపత్ని జానకీబాయిగారును, సహృదయులు; జీససు మహనీయునియం దధిక విశ్వాసము గలవారలును. పెరిఁగెడి సంసారబాధ్యత నౌదలఁ గలవారగుటచేత వారు బహిరంగముగ క్రైస్తవులు గాకపోయినను, సామాన్యక్రైస్తవులకంటె నెన్నిమడుంగులో ఈశ్వరభక్తి సంపన్నులును, సదాచారనిష్ఠాసమన్వితులును. పలుమాఱు తమయింటికిఁ బోయి తమతో సంభాషించుచుండు నామీఁద, ఆదంపతు లిరువురు సవ్యాజ సోదరభావము గలిగియుండిరి. నాయందలి వత్సలతచేత నాయుఁడుగారు నా బంధుమిత్రులకును దయచూపి, ఉచితవైద్యసాహాయ్య మొనరించుచుండువారు. ఆదినములలో నేను పెద్దబజారునకు వెళ్లి వచ్చునపు డెల్ల, పెద్దరస్తాప్రక్క నొకబీదముసలిది బిచ్చ మడుగుచుండెడిది. అంతకంతకు, వార్ధక్యము ముదిరి, దృష్టి తప్పి, అది కూర్చుండుచోటనుండి కదలలేకపోయెడిది ! దానికి వేవేగమే మతికూడ తప్పిపోవుచుండెను. తూష్ణీంభావులగు జనుల మధ్యమం దీనుసలి దాని దైన్యము నిస్సహాయతయును జూచినపు డెల్ల, నాగుండె నీ రగు చుండెడిది. ఈస్త్రీ సమాచార మొకటి రెండుమాఱులు నాయుఁడు గారితో నేను బ్రస్తావింపఁగా, దురవస్థ నుండు నిట్టివారిసంరక్షణ కే ధర్మసంస్థయు నేర్పడక యుండుట కాయన వగచి, తా నే సాయమైనఁ జేతు నని చెప్పెను. జను లందఱివలెనే నాయుఁడుగారును దిక్కుమాలిన యాముసలిదాని సంగతి మఱచిపోయి రని నేను దలంచితిని.
ఒకనాఁడు నేను రంగనాయకులునాయుఁడుగారిని జూచి వచ్చుటకు వైద్యాలయమున కేగితిని. ఆయన నాతో సంభాషించుచు, కొంత సేపటికి నా కొకచిత్రము చూపింతు నని చెప్పి, వైద్యశాల వెనుక నున్నయొక మాఱుమూలకు నన్నుఁ గొనిపోయెను. నాయుఁడుగా రొసంగిన తెల్లనివలువ దాల్చి, ఆబీదగ్రుడ్డిముసలిది, పెండ్లికూఁతునివలె నచటఁ గులుకుచుఁ గూర్చుండెను ! వార్ధక్య దారిద్ర్యములు తప్ప వేఱు వ్యాధి లేని యాముదుసలి, నాయుఁడుగారి దయచే వైద్యాలయమున రోగిగఁ జేరి, సువార మారగించుచుండెను ! దిక్కు లేక బాటప్రక్క గాసిల్లుగ్రుడ్డిది, వైద్యాలయమందలి సౌకర్యములచే నిపుడు నునుపెక్కి, తేటమొగమున నుండుట చూచి, మాయిరువురకును గనుల నీరు గ్రమ్మెను. నాయుఁడుగారిమాట వినఁబడి, వృద్ధురాలు దండముపెట్టి, ఆయనను జేరువకుఁ బిలిచి, ఏదో మాటాడెను. ఆయన చిఱునవ్వు నవ్వుచు, "దీనికి నల్ల మందు అలవాటు. కాని, అది వైద్యశాలలో నెవరికిని వాడము. దానికి మాఱుగ నేదో సరది యిచ్చెదను లెండి!" అని నాతో ననెను. నాయుఁడుగారిని దలంచుకొనినపుడు "తల్లి దండ్రుల భంగి ధర్మవత్సలతను, దీనులఁ గానఁ జింతించువాఁడు" అను ప్రహ్లాదుని గుఱించిన కవివచనము నాకు స్ఫురణకు వచ్చు చుండును. 36. సత్యసంవర్థని
ఏ వార్తాపత్రికనైన నెలకొల్పుటకుఁ బూర్వమే సంస్థాపకునికి స్వేచ్ఛ యుండును గాని, పిమ్మట కాదు. అది యారంభ మైనప్పటినుండియు క్రమము తప్పక నడుచుచుండవలసినదే. పత్రికాధిపతి వట్టి కీలుబొమ్మవలెను, గడియారపు యంత్రమువలెను, విసుగు విరామము లేక పని చేయవలె ననియే పాఠకజనులయుద్దేశము ! సత్యసంవర్థని మాసమున కొకతూరి ప్రచుర మగు చిన్న పత్రిక యైనను, చేయవలసినపనిమాత్ర మెక్కువగ నుండెను. సాయము చేతునని మొదట వాగ్దానముచేసిన సమాజమిత్రులు, ఏదో యొకమిష పెట్టి, సాకు చెప్పి, తప్పించుకొనుచువచ్చిరి. వ్యాసరచన తమ కభ్యాసము లే దని కొందఱును, తమరచనములు ప్రచురము కాలేదని కొందఱును. వానియందు మార్పులు చేసి రని కొందఱును, మొఱవెట్టి, యీవ్యాజమునఁ దమ వాగ్దానములను తుదముట్టించుచువచ్చిరి ! వీరేశలింగముపంతులు కనకరాజుగార్లు ప్రతినెలయును పత్రికకు వ్రాయుచునేయుండిరి. పెద్దవారగు పంతులుగారికిఁ గాని, పరీక్షకుఁ జదువు కనకరాజునకుఁ గాని, పత్రికను గూర్చిన కనులకుఁ గానఁబడని యెన్నియో చిన్నపను లప్పగించుట యనుచితముగదా. కావున మిగిలిన వ్యాసములువ్రాసి, చిత్తులు దిద్ది, పత్రికను ముద్రింపించి, చందాదారులతో నుత్తరప్రత్యుత్తరములు నేనే జరుపవలసివచ్చెను. అందువలన నా కనులబాధ విస్తరిల్లెను.
పూర్వాచారపరులగు మా కళాశాలాధ్యాపకు లొకరు, పాపఁపుప్రార్థనసమాజములోఁ జేరినకారణమున నాకనులు పోవుచుండె నని పలికిరి ! సత్యసంవర్థనీ కార్యభారముననే నా నేత్రదృష్టి ధ్వంస మగు