ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ/ముత్తుస్వామిశాస్త్రి విపరీతవిధానము
కష్టసుఖములను సమత్వమున వా రనుభవించుట న్యాయ మనియును నేను జెప్పివేసితిని.
మా దీర్ఘ సంభాషణ ఫలితముగఁ దేలినసంగతులు నేను దినచర్య పుస్తకమున నిట్లు విమర్శించితిని : - "మా జనకుఁడు జనాభిప్రాయమును శిరసావహించెడిభీరుఁడు; నే నన్ననో, స్వబుద్ధి సూచించిన సత్యపథమునఁ బోయెడిధీరుఁడను. ఆయన, పామరజనాచారములను గౌరవించి యనుసరించువాఁడు; నేను, వానిని నిరసించి నిగ్రహహించెడి వాఁడను. వే యేల, మా నాయన పూర్వాచారపరాయణుఁడు; నేను నవనవోన్మేషదీధితుల నొప్పెడి సంస్కారప్రియుఁడను !" పాఠకులు నా యౌవనమునాఁటి యహంభావమునకు వెఱ గంద కుందురు గాక !
21. ముత్తుస్వామిశాస్త్రి విపరీతవిధానము
ముత్తుస్వామిశాస్త్రి నాసహవాసు లందఱిలోను విద్యాధికుఁడును, మేధాశక్తిసంపన్నుఁడును. ఒక్కొకసరి యాతఁడు సంఘ సంస్కారవిషయములందు చోద్యములగు సూత్రములు సిద్ధపఱచు చుండువాఁడు. ఆయేప్రిలు 10 వ తేదీని నేను మృత్యుంజయరావుతోఁ గలసి, శాస్త్రిదర్శనమున కార్యాపుర మేగితిని. మే మనేకసంగతులను గుఱించి మాటాడుకొంటిమి. అంత మాసంభాషణము సంస్కరణములదెసకు మరలెను. "ఏటి కెదు రీదినంతమాత్రమున మనము సంస్కారులము కాఁజాలము. పూర్వాచారపరాయణులవలెనే మనమును కర్మ కలాపమును విసర్జింపక, నిరర్థక మని నమ్మినయాచారకాండ ననుష్ఠానమునకుఁ దెచ్చి, సంఘమును మెల్ల మెల్లగ మనవైపునకుఁ ద్రిప్పుకొనవలెను." అనునాతనిమాటలు మాకు హాస్యాస్పదములుగఁ దోఁచెను. "ఈపద్ధతి నవలంబించినచో, జనులలో నిరసించెడి కాపట్యమును మనమె పూనుచుండుటలేదా ?" అని నే నడిగితిని. అట్లు కాదని యాతఁడు సమాధానము చెప్పుచు, "పూర్వాచారపరులకంటె మనమె మంత్రతంత్రములు బాగుగ పఠించి, కర్మకాండ జరుపుట యందు ప్రవీణుల మైతిమేని, ఇపుడు వారిదెసకుఁ బ్రవహించెడి ద్రవ్య వాహినిని మనవైపునకు మరలించుకొనవచ్చును. ఇట్లు మనము జనులను సంతృప్తిపఱచి, సంస్కరణపథమునకు మెల్లగ వారిచిత్తములఁ ద్రిప్పవచ్చును" అని శాస్త్రి బోధించెను. ఇట్లు పై కెంతో మంచివిగఁ దోఁచెడియెత్తు లాతఁడు వేయుచుండువాఁడు. పిమ్మట నేను వీరేశలింగముపంతులుగారితో నీసంగతి ప్రస్తావింపఁగా, "శాస్త్రిప్రణాళిక నవలంబించినయెడల, ఇప్పటి వైదికబృందమువలెనే మనమును తిండిపోతులముగను కుక్షింభరులముగను బరిణమించి, వట్టి భ్రష్టులమైపోయెదము !" అని యాయన వక్కాణించెను.
మే మాతనిని గలసికొని మాటాడినపు డెల్ల, శాస్త్రిలో నేదో యొకవింతమార్పును గనిపెట్టుచుండెడివారము ! భూపతనము నొందు పాదరసమువలెను, సంగీతపాటకునినోట 'సరిగమపదనిసల'వలెను, అతని మనస్సు సదా పలుపోకలు పోవుచుండెడిది ! ఉచితజ్ఞత యనునది యాతనిలో లేనేలేదు ! ఊహకు నూహకును గల పరస్పరసంబంధము కనిపెట్టి మఱి మాటాడుట కతని కోపికయె లేదు. కావుననే, స్థిరత్వము లేని చపలస్వభావుఁ డను నపయశస్సు ఆతని కావహిల్లెను. వివిధములు పరస్పరవిరుద్ధములు నగు విధానములఁ బన్నఁగలట్టియు, ఒరులనవ్వులు దుమదుమలును లెక్కసేయక తన విపరీతభావసందోహమును సమర్థింపఁగలట్టియు శక్తి శాస్త్రియందు మూర్తీభవించెను ! కాని, ఆతనియాలోచనలు మామిత్రుల కావశ్యకము లయ్యెను. దైవము గలఁ డని యొకమాఱును లేఁ డని యొకమాఱును సిద్ధాంతరాద్ధాంతములతోఁ గూడిన హేతువాదనలతో నాతఁడు మాయెదుట వాదించు చుండును ! గట్టిప్రయత్నములు చేసి దేశక్షేమంకరములగు సంస్కారములు నెలకొల్పుట విద్యాధికులధర్మ మని యొకతఱియును, మానుష ప్రయత్నము నిష్ప్రయోజన మనియు, కాలప్రవాహమునఁ బడి లోకము శక్తివీడి గొట్టుకొనిపోవుచున్న దని యొకతఱియును, అతఁడు వాదించుచుండును ! వీనిలో ప్రతియొకవాదనయు సహేతుకముగఁ గానవచ్చినను, ఇట్టి వన్నియు నొకపుఱ్ఱెలోనే పుట్టి, ఒక నోటనె బయలువెడలుట గాంచిన యువకుల మగు మేము విభ్రాంత చేతస్కుల మగుచుందుము !
22. జనకుని విచిత్ర చిత్తవృత్తులు
ఇంతలో కళాశాలకు వేసవికాలపుసెలవు లిచ్చిరి. విద్యార్థులగు హితు లెవరిగ్రామమునకు వారు వెడలిపోయిరి. మాకుటుంబముకూడ రాజమంద్రి విడిచెను. మా తమ్మునివివాహ మిపుడు నిశ్చయమయ్యెను గాన, మేము ముందుగ వేలివెన్ను పోయి, అచటినుండి రేలంగి వెళ్లితిమి. అక్కడనుండియె మేము పెండ్లికి తరలిపోవలెను. వివాహమునకు వలయుసన్నాహ మంతయు జరుగుచుండెను.
వివాహమునకు ముందలిదినములలో నింట మాతండ్రి వెనుకటివలెనే సంస్కరణవిషయములనుగూర్చి నాతోఁ జర్చలు సలుపుచుండెడివాఁడు 22 వ ఏప్రిలురాత్రి భోజనసమయమున మా తండ్రి మాటాడుచు, పోలవరముజమీందారు క్రైస్తవుఁ డయ్యె నని మాకువినవచ్చినవార్తమీఁద వ్యాఖ్య చేసి, మతభ్రష్టత్వమును గర్హించి మితిమీఱిన కోపావేశము గనఁబఱచెను. "జాతిబాహ్యుఁడైపోకుండ