ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ/పత్రికాస్థాపనము
నుండెడివి. ఇట్టి వాక్శక్తి లోపమువలన, హృదయమున లేని కాఠిన్యమునకును, మనసున లేని కాపట్యమునకును, నేను ఉత్తరవాది నగుచు వచ్చితిని.
నిశబ్ద మగుచోటఁ గూర్చుండి కలము చేతఁ బట్టినప్పుడు, ఉపన్యాసవేదికమీఁదను సభామధ్యమునను నాకుఁ గానవచ్చెడి తొట్రుపాటులు తొలఁగిపోయెడివి. భావమును వ్యక్తపఱిచెడి భాషయు, అభిప్రాయముల కనువగు పదసంఘటనమును, వ్రాఁత లభింపఁజేసెడిది. కలము చేతఁ బూనినపుడు, అవమాన మేమియుఁ గలుగకుండ మన తలంపులు మనము మార్చుకొనవచ్చును. మిత్రుల పరిహాసములకును, వైరుల వ్యాఖ్యానములకును నెడ మీయకుండ వెనువెంటనే మన వాక్యములు మనము సరిచేసికొనవచ్చును. కావున నన్ని విధములను వ్రాఁతపనియె నాకుఁ గర్తవ్యముగఁ గానఁబడెను.
32. పత్రికాస్థాపనము
"సత్యసంవర్థని"ని బ్రచురింప వీరేశలింగముగారు మిత్రులును సమ్మతించిరి కాన, ఆ పత్రికాస్థాపనవిషయమై వలయు ప్రయత్నములు నేనంతట చేసితిని. "వివేక వర్థనీ"పత్రికకు వెనుకటి వ్యవహారకర్త యగు శ్రీరాములుగారితో నేను జూలై 2 వ తేదీని కలసి మాటడఁగా, పత్రికను నడుపురీతిని నా కాయన చెప్పి, తానే యాపని చేసిపెట్టెద ననెను. పత్రికను టపాలో నంపువిషయమై మాటాడుట కానాఁడె నేను టపాలాకచ్చేరికిఁ బోయితిని. సబుకలెక్టరువొద్ద కేగి, నేను "సత్యసంవర్థనీ" పత్రికాప్రచురణకర్త నని కాగితముమీఁద సంతకముచేసి వచ్చితిని. సత్యసంవర్థనిని తమపత్రికఁగా ప్రార్థనసమాజము అంగీకరించుట యావశ్యకము గాన, ౫-వ తేదీని సమాజప్రత్యేకసభ నొకటిఁ గూర్చితిమి. సమాజపునరుద్ధరణము జరిగినపిదప, పత్రికాప్రచురణమున కందఱు నొప్పుకొనిరి. ఎవరికిఁ దోఁచినచందాలు వారు వేసిరి. అంతట సమాజము చేసికొనిన తీర్మానములచొప్పున, పత్రికానిర్వహణకార్యము మాలో నైదుగురు సభ్యుల కొప్పగింపఁబడెను. వీరిలో శ్రీరాములుగారు పత్రికావిలేఖకులు నిర్వహకులును; నేను ప్రచురణ కర్తను, కోశాధికారిని. సాంబశివరావు పత్రికను జందాదారుల కందఁజేయుకార్యము నిర్వహించువాఁడు.
నే నిట్లు పత్రికాప్రచురణమును గుఱించి ప్రయత్నించు చుండఁగా, 17-వ తేదీని వీరేశలింగముగారు నాతో మాటాడుచు, జనసామాన్యమున కుద్దేశింపఁబడిన యాపత్రికలో తెలుఁగు వ్యాసములే యుండవలె నని చెప్పిరి. ఇంతియ కాదు. ప్రార్థనసమాజము పేరిట నీపత్రిక ప్రచుర మగుటయె యుక్తము కాదనిరి. నేను గారణ మడుగఁగా, సమాజసభ్యులలోఁ బలువురు విద్యార్థులె యగుటచేత, పత్రికయందు మంచివ్యాసము లుండవనియు, చేతఁగాని వ్రాఁతలవలన సమాజమునకును అధ్యక్షులగు తమకును నపకీర్తి యాపాదించుననియు, కావున నాపేరిటనే పత్రిక వేయుట యుక్తమనియు పంతులుగారు చెప్పిరి!
ఇది నాకు సమంజసముగఁ గనఁబడలేదు. పత్రికాప్రకటనము, సమాజాదర్శముములను బ్రకటించుటకే కాని, నా సొంతయభిప్రాయముల నెలకొల్పుటకుఁ గా దని నేను జెప్పివేసితిని. సత్యసంవర్ధనిని సమాజపత్రికగాఁ బ్రచురింపఁ గోరితిమేని, అందుఁ దనురచనలకు ప్రాముఖ్యము గలుగవలె నని యంతట పంతులుగా రనిరి. నే నందుకు సమ్మతించితిని. ఎట్టకేలకు సత్యసంవర్ధనిని సమాజపత్రికగా పంతులుగా రంగీకరించి నన్ను పత్రికాసంపాదకునిగ నిర్ణ యించిరి.
జూలై 29 వ తేదీని పత్రికమొదటిసంచిక వెలువడెను. దీనిలో, తెలుఁగున పంతులుగారును, ఇంగ్లీషున నేనును, విజ్ఞాపనము వ్రాసితిమి. 'అనుతాపము' అను వ్యాసమునకు నేనును, 'పుణ్యపాప మార్గములు' అనుదానికి పద్మనాభరాజుగారును రచయితలము. ఇవి గాక రెండు సంగ్రహవార్తలుమాత్రమే యాసంచిక యందుఁ గలవు. మచ్చునకై యీ వ్యాసములలోని కొన్ని భాగము లిచట నుల్లేఖించు చున్నాను.
(తెలుఁగు) విజ్ఞాపనము : "మన హిందూదేశమందు సమస్తమును మతముతో సంబంధించియున్నది. మతమునం దక్రమముగ ప్రవేశించిన దురాచారములను తొలఁగింప బ్రయత్నింపనిపక్షమున, మన దేశమునం దితర విషయములయం దభివృద్ధి కలిగించుట సాధ్యము కాదు. మతమే సమస్తాభివృద్ధులకును మూలాధారము మతమే నీతి వృక్షమునకు కుదురు. కాఁబట్టి సామాన్యజనులయభివృద్ధికయి మత విషయములయిన సత్యములను, నీతిని, సద్వర్తనమును బోధించెడిపత్రిక యొక్కటి యత్యావశ్యకమయియున్నది. అట్టికొఱఁతను కొంతవఱకయినను తీర్పవలె నని యిక్కడి ప్రార్థనసమాజమువా రిప్పు డీచిన పత్రికను ప్రచురింపఁబూనుకొన్నారు."
అనుతాపము : "ప్రతిదినమును తాను జేసినయపరాధముల మనసునకుఁ దెచ్చుకొని, వానికై పరితపించుటచేత, ఎవరిదుర్గణములు వారికిఁ దెలియును. లోకములో జనులకు సాధారణముగ తమ కీలోపము లున్నవని బాగుగ తెలియవు. ఒకవేళ తెలిసినను అవి యున్న వని యెవరైనఁ జెప్పిన, అందునకు రోషపడియెదరు. అట్లుండ, ఆలోపముల నివారించుటకు వారి కెట్లు ఊహ పుట్టును ? ఎట్లు సాధ్యమగును ? పరితపించువా డన్ననో, తన కీదుర్గణశేషము లున్నవని గ్రహించి, వానిని విడనాడుటకు సర్వదా ప్రయత్నము చేయుచుండును. తన కీసుగుణములు పూర్ణముగా లేవని, సచ్చారిత్రుల నడవడి ననుసరించి, సకలకల్యాణగుణపరిపూర్ణుఁడగు ఈశ్వరుని జేర యత్నముఁ జేయుచుండును."
పుణ్యపాపమార్గములు : - "మొదటిదారి పాపమార్గము. లోకమందు పాప మాచరించుట బహుసులభము. దానివలన మొట్టమొదట ననేకఫలములు గనుపించును. శరీరాయాస మక్కఱలేకయే ప్రతిమనుజుఁడును పాపాయుధమువలన తాను వలయువస్తువు సాధింపవచ్చును. అయిన నెంతకాలము సాధింపఁగలడు ? 'కలకాలపుదొంగ దొరకఁగలఁ డొకవేళన్' అనునట్లు వానిపాపములే వానికాళ్లకు బంధములై తగులుకొన సర్వవిధముల చెడి, యజ్ఞానాంధకారమగ్నుఁడై, తుద కెన్నరానిదురవస్థల కిల్లగు నరకగృహప్రవేశంబు చేయును."
సత్యసంవర్ధనీపత్రిక నే నిట్లు ప్రారంభించి, నెలనెలయును బ్రచురించితిని. ప్రథమోత్సాహమున సభ్యులలోఁ బలువురు పత్రికకు వ్రాసెద మని చేసిన వాగ్దానమును చెల్లింపలేకపోయిరి. ఏవియో కొన్ని పంక్తులు గీకి, అవి ప్రచురింపుఁ డని కొందఱు కోరుచుండిరి. ప్రతినెలయును కార్యనిర్వాహకవర్గము కూడి, పత్రికలో ముద్రింప వలసిన వ్యాసములు నిర్ణ యింపవలయును. అధికముగ నిట్టివ్రాఁతలు రాకుండుటవలన నుండువానిలో నేవియో కొన్ని వారు పత్రికలో వేయ నిశ్చయించుచుండువారు. రానురాను, సభ్యులు సమావేశ మగు టయె దుర్లభ మయ్యెను. ఒకటి రెండు నెల లై నపిమ్మట, వీరేశలింగముగారు నాతో పత్రికనుగుఱించి మాటాడుచు, ఒకసంచికలో వేయుటకు కార్యనిర్వాహక సంఘమువా రేర్పఱిచిన వ్యాసములలో నేను వ్రాసినది యొకటి తప్ప మిగిలిన వన్నియును పనికిమాలిన వగుట చేత, వానినిఁ ద్రోసివేసితి నని యాయన చెప్పెను ! నెల నెలయును వ్యాసనిర్ణయమునకై నేను బడెడిశ్రమ నంత పంతులుగారికి నివేదించి, పత్రికమూలమున సమాజమిత్రుల యాదరణమును గోల్పోయి, వారి యసూయకుఁ బాల్పడుచుంటి నని నేను మొఱలిడితిని. పత్రికాధిపత్యము నేనె వహించితిని గాన, ఇతరులసాయ మున్నను లేకున్నను, మంచి వ్యాసములు వ్రాసి యిచ్చుచుండుట నావిధి యని పంతులు వక్కాణించెను. ఇంతియ కాదు. తమపనులు చేయ నసమర్థులగు కార్యనిర్వాహకసంఘమువారి సభలు సమకూర్చుటయందు కాలము వ్యర్థము చేయక నేనె వ్యాసనిర్ణయము చేయవచ్చు ననియు, ఈ పనిలో తమరు నాకు సాయము చేతు మనియు, పంతులుగారు చెప్పివేసిరి ! పత్రికాసంపాదకత్వమునకు వలయుస్వాతంత్ర్య మందు వలస నాకు సమకూరెను.
పత్రికలో నింగ్లీషువ్యాస లుండుటకు పంతులుగారు మొదట సమ్మతింపకున్నను, అవి లేనిచో నెవరికిని పత్రిక రుచింపదని నేను నొక్కి చెప్పుటచేత, దీనికిని వా రొప్పుకొనిరి. కావున మొదటినుండియు సత్యసంవర్థనిలో తెలుఁగు వ్యాసములతోపాటు ఇంగ్లీషురచనములును నుండుచువచ్చినవి. విద్యార్థి నగునే నాంగ్లభాషలో వ్యాసరచన చేయుటకు మొదట భయపడెడివాఁడను. మాకాంగ్లేయపండితులగు స్కాటుదొరగారు మిగుల దయతో నాయింగ్లీషువ్యాసములు దిద్దుచుండెడివారు. మొట్ట మొదట నేను రెండుభాషలలోని వ్యాసములును వ్రాయుచువచ్చినను, అంతకంత కింగ్లీషు వ్రాయుటకే నే నేర్పఱుచుకొనుటచేత, తెలుఁగువ్యాసములు మిత్రుఁడు కనకరాజు వ్రాయుచుండువాఁడు. పత్రికలో నింగ్లీషుభాగమునకు నేను బాధ్యత వహించుటచేత, వీరేశలింగము పంతులుగారు తెలుఁగు భాగము సరిచూచుచుండువారు. అందువలన కనకరాజు తాను వ్రాసిన తెలుఁగువ్యాసములు పంతులచే దిద్దించుకొనుచు, ఆయన కోపమునకు గుఱి యగుచుండెను ! ఐన నందువలననె యతఁ డాంధ్రరచనయందు శీఘ్రముగ నిపుణుఁ డయ్యెను. ఇంగ్లీషురచనలోనే మునుఁగుచుఁ దేలుచు నుండుటచేత, తెలుఁగున బెదరుతీఱి వ్రాయుటకును, ముఖ్యముగ పంతులుగారి సుశిక్షఁ బడయుటకును, ఆ బాల్యదినములలో నా కంతగ నవకాశము లేకపోయెను.
మొదట "సత్యసంవర్ధని" యెనిమిదిపుటలతో నారంభమై, క్రమక్రమముగఁ బెరిఁగి, రెండవసంపుటమునుండియు పైపత్రముగల పదునాఱుపుటల పుస్తకరూపమున వెలువడుచుండెను. పత్రికయందు నీతి మత సంఘసంస్కరణ విషయములు బాహాటముగఁ జర్చింపఁబడు చుండెను. వీరేశలింగముగారి రచనములు, విద్యార్థి సభ్యులమగు మా వ్యాసములు నందుఁ బ్రచురమగుచువచ్చెను. మాయభిప్రాయము లిపుడు లిఖితరూపముఁ దాల్చుటచేత, మే మెక్కువ జాగరూకత నలవఱుచుకొంటిమి. పత్రికాపాఠకుల నోళ్ల కెక్కి, ప్రజలవ్యాఖ్యానములకు గుఱి యగుచుండుటచేత, మాకు ధైర్యసాహసాదులు పట్టుపడెను. ఇపుడు ప్రార్థనసమాజము, వారమున కొకమాఱు ప్రార్థనలు చేసికొనుటకుఁ గూడుచుండెడి వట్టి భక్తసమావేశము కాక, ఒక శాశ్వత సంస్థక్రింద నేర్పడెను. ఆ సమాజమువారి ప్రార్థనలు నుపన్యాసములు మున్నగు కార్యక్రమమంతయును బత్రికల కెక్కుచు, లోకులవాద ప్రతివాదసంభాషణములకు నిషయమగుచుండెను ! చెన్నపురిసమాజమును జూచి వచ్చిననేను, ఆసమాజపద్ధతులను ప్రణాళికలను గొన్నిటి నిచటికిఁ గొనివచ్చితిని. కొలఁదికాలములోనే "దానపు పెట్టె" యొకటి మందిరపుగోడకు వ్రేలాడుచుండెను ! "ఆస్తికపుస్తకాలయము"న కంకురార్పణ జరిగెను. సమాజసభ్యు లింకను శాశ్వతమగు సంస్థ నొకటి స్థాపించుట కర్తవ్య మని మిత్రులము తలపోసితిమి. దీనినిగుఱించి ముందలిప్రకరణములలోఁ జెప్పెదను.
33. క్రొత్తకోడలు, క్లిష్టపరిస్థితులు
రాజమంద్రి యిన్నెసుపేటలోని మాసొంతస్థలములోఁ జిన్న పెంకుటిల్లుం డెడిది. పెద్దయిల్లు కట్టుకొనువఱకు నందె కాలము గడుపుద మని మా తలిదండ్రుల యభిప్రాయము. నేను దీని కంగీకరింపక, ఆ చిన్నయిల్లు తీయించివైచితిని. మాస్థలమున నొక తాటియాకులయిల్లు వేయించితిమి అందు మేము చదువుకొనుచుండువారము. పెద్దపెంకుటిల్లు వేయుటకు నిశ్చయించి, పునాదులవఱకుఁ గట్టించితిమి. కాని, యాసమయముననే మాస్వగ్రామమున తనయన్నలతోఁ గలసి మాతండ్రి యొక పెంకుటిల్లు కట్టించుచుండుటచేతను, రాజమంద్రిలో ముందు వేయఁబడనున్న రెయిలుమార్గము మావీథినుండియె పోవచ్చునని వదంతి కలుగుటచేతను, మారాజమంద్రి యింటిపని యంతటితో నిలిచిపోయెను.
రేలంగిలోని క్రొత్తయింటికిని, మాచదువులకును, కుటుంబపోషణమునకును చాల సొమ్ము వ్యయమై, అప్పు పెరిఁగెను. ఇట్టి కష్ట పరిస్థితులందు కుటుంబవ్యయము తగ్గింప నెంచి, రాజమంద్రిలోని మాసొంత కుటీరములోనికి 1890 అక్టోబరులోఁ గాపురమునకు వెడలితిమి. ఇంటి