ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ/పత్రికాయౌవనము

నటుఁడు, పాత్రానురూపమగు నభినయము చేయకతీఱునా ? బ్రదుకు తెఱవెఱిఁగిన నాసహపాఠులలోఁ బలువురు, బోధనసమయమున లేని వికాసమును చుఱుకుఁదనమును దెచ్చుకొని, మృదుమందహాసములతో బోధనకార్యము నెఱపి, కృతకృత్యు లగుచువచ్చిరి. ఇట్టి కపటనటన మయోగ్యమని యెంచిన నేను, నాబోధనమును తగినంత సొగసుగను సారవంతముగను జేయ ప్రజ్ఞానుభవములును, కనీసము వాంచాబలమైనను లేక, బోధనకార్యమం దపజయము గాంచుచుంటిని ! ఈకారణముననే, అదివఱ కే పరీక్షలోఁగాని పరాజయ మెఱుంగని నేను, యల్. టీ. పరీక్షలోని బోధనభాగమున పిమ్మట ముమ్మాఱు తప్పి, వృత్తిలో నాకుఁ జేకూరెడి లాభమును జాలభాగము గోలుపోయితిని !

50. పత్రికాయౌవనము

ద్వితీయసంవత్సరప్రారంభముననే సత్యసంవర్థనికి యౌవన దశాసంప్రాప్త మయ్యెను. దీని కొకచిహ్నముగ, రెండవసంపుటము నుండియు మాపత్రిక, ముప్పదిరెండుపుటలు రంగుకాగితపు ముఖపత్రమునుగల రమ్యపుస్తకరూపమున విలసిల్లెను. బాహ్యవేషముతోనే పత్రికమిసమిసలు తుదముట్టలేదు. నా యాంగ్ల వ్యాసములందును, కనకరాజునియాంధ్రరచనములందును, చక్కని యభివృద్ధి గాన వచ్చెను. 1892 సంవత్సరము జూలైనెలసంచికలో నే నాంగ్లమున వ్రాసిన "మానవజీవితమందలి త్రివిధశోధనముల"లోనె పత్రికయౌవనపుఁబోకడలు గనఁబడెను. అప్పటినుండియు నా సత్యసంవర్థనీ వ్యాసములు వెనుకటివానివలె మొండిముక్కలు గాక, నిడుదలై, భావవిస్ఫురణ వాక్యసౌష్ఠవములతో విరాజిల్లుచుండెను. ఆ సెప్టెంబరుసంచికలోని నా "అనుష్ఠానికధర్మము"నం దీసంగతి విస్పష్ట మయ్యెను. 93 వ సంవత్స రారంభమునుండి నాయింగ్లీషువ్యాసము లింకను దీర్ఘములై భాషాసారస్యమున నొప్పారుచుండెను. ఆసంపుటములో నేను వ్రాసిన "అంతరంగికమతము." "ఈశ్వరధ్యానము", జాగ్రన్మోక్షము", "స్త్రీస్వాతంత్ర్యము" మున్నగువ్యాసములలో విద్యానుభవములందు దినదినాభివృద్ధి నొందెడి మనశ్శక్తుల వికాసము విస్పష్టమయ్యెను. ఆంగ్లసాహిత్య మనస్తత్త్వశాస్త్రములలో నాకుఁ దెలిసిన నూతనాంశములను, నేను విశ్వసించిన పరిశుద్ధాస్తిక మత సిద్ధాంతములతో సమన్వయము చేసికొని, నా యభిప్రాయములను వ్యక్తీకరించితిని. నాశైలి యిపుడు పొంకమును గాంభీర్యమును దాల్చియుండెను.

సత్యసంవర్థనియందలి యితర రచయితల వ్యాసములందును, అభివృద్ధి గాననయ్యెను. వీరేశలింగముపంతులుగా రదివఱకె విఖ్యాతిఁ జెందినగ్రంథకర్త లైనను, సత్యసంవర్థనికిఁ దఱచుగ వ్రాయుకొలఁది వారివ్రాఁతలును నునుపెక్కెను. 1893 వ సంవత్సరమున వీ రాపత్రికలో, "వర్ణము", "విద్యాధికులధర్మములు" నను దీర్ఘోపన్యాసములు వ్రాసిరి. ఇవి వారియుపన్యాసములలో నెల్ల ప్రథమగణ్యములు. మొదటిది విషయబాహుళ్యముచేతను, రెండవది వాదన పటుత్వమునను, లలితవాక్యసంఘటనమునను బేరెన్నిక గన్నది. మాతమ్ముఁడు వెంకటరామయ్య, 93 మే సంచికలో వ్రాసిన "కేశవచంద్రబ్రహ్మానందులు", 94 వ సంవత్సరరాంభమున వ్రాసిన "నీతిమతములు"ను, అపుడె రమ్యవ్యాసరచన మాతనికిఁ బట్టుపడుటను సూచించుచున్నవి. అందఱి కంటెను కనకరాజుని వ్రాఁతలలోని యభివృద్ధి మిగుల స్పష్టముగ నుండెను. వ్యాసరచనమందును, గ్రంథవిమర్శనమునను, అతనికలము కఱకుఁదనము గాంచియుండెను. 93 జూనులోఁ బ్రచురింపఁబడిన "శ్రీవడ్డాదిసుబ్బరాయకవి విరచిత ప్రబోధచంద్రోదయ విమర్శన" మాతని రచనమె. ఇపు డీతనివ్రాతలు వీరేశలింగముగారి రచనములఁ బోలియుండెను. సామాన్యపఠితల కీయిరువురు రచయితల వ్రాఁతలకును భేదము గానిపించెడిది కాదు !



ఆత్మచరిత్రము

ద్వితీయ భాగము

ఆత్మచరిత్రము

ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ

1. బెజవాడ

1893 వ సంవత్సరము మార్చి 9 వ తేదీని నేను బెజవాడ కేగి, నాకు లభించిన యుద్యోగమునఁ బ్రవేశించితిని. నా కనుల కపుడు, విజయవాడయె కాక, జగతీరంగమంతయు నూతనకాంతులతో విలసిల్లెను. ఇదివఱకు తలిదండ్రుల పోషణమున నుండి, వారి చెప్పుచేతలకు లోనై, వినమ్రభావమున, నేను మెలంగితిని. నాహృదయమున గోదావరినదివెల్లువలవలె సంస్కరణవిషయములను గుఱించిన మహాశయము లుప్పొంగుచున్నను, కార్యస్వాతంత్ర్యము లేమింజేసి వాని నెల్ల నిరోధించి, లేనియోపికను దెచ్చుకొని మసలవలసినవాఁడనైతిని. ఇపుడన్ననో, నేను విద్యముగించి, వృత్తిఁ జేకొని, సంసారసాగరమును స్వతంత్రముగ నీదఁజొచ్చితిని. లోకమును గుఱించి వట్టి యూహా పోహములతోనే నే నిదివఱకుఁ గాలము గడిపితిని. ఇప్పుడొ, జీవిత మందలి కష్ట సుఖములు, మేలుకీడులును క్రమముగ నా కనుభవగోచరము కాఁజొచ్చెను.