ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ/పట్టపరీక్ష
గుఱించి బోధించి, వారి కాలోచనలు చెప్పి, వారి చిక్కులు విడఁదీసి పరిణయము జరిగించినవారు మృత్యుంజయరావు, ఆతని సతీతిలక మగు మాణిక్యాంబయును.
అచట జరిగిన యింకొక వివాహసందర్భమునఁగూడ మా స్నేహితులే యధ్వర్యము చేసిరి. ఆసమయమున నచటికి వచ్చిన పెద్దలను మేమె సన్మానించితిమి. వివాహదినములలో వధూవరులను జూచి పోవుటకు కళాశాలాధ్యక్షులగు మెట్కాపు దొరయును ఆయన సతీమణియు వేంచేసిరి. ఇంటిచూరు పొట్టిగ నుండుటచేత, ఆసమయమున దొరగారికి ముఖముమీఁద కొంచెము గాయమయ్యెను.
విద్యార్థులతోఁ గిటకిట మనుచుండు మా మేడ చూచి పోవుటకు పిన్నలుపెద్దలు వచ్చుచుందురు. నాతమ్ములు చెల్లెండ్రును నన్నుఁ జూచి మాటాడు నెపమున తఱచుగ నా బసకు వచ్చుచు, మేడ మీఁదినుండి చుట్టుపట్టుల యిండ్లు చెట్లును జూచి వినోదించుచుందురు. దూరమునందలి యీ మేడగదిలో నేనుండుట, ఈనిశ్శబ్ద ప్రదేశమున విద్యాపరిశ్రమము చేయుటకుఁ గాక, ఇచ్ఛావిహారము సల్పుటకె యని బాల్యమున నుండువా రనుకొనుచు వచ్చిరి ! నేను రాజాది రాజుల భోగము ననుభవించుచుంటి నని మాపెద్దచెల్లె లానాఁ డను చుండెడిది !
43. పట్టపరీక్ష
నే నిపుడు పట్టపరీక్షకుఁ జెన్నపురి పోవలసియుండెను. తేమ యుబుకుచుండెడి మా పర్ణ కుటీరమునుండి కుటుంబమును ఎదురుగ నుండెడి యింటికిఁ జేర్చినఁగాని నాకుఁ దోఁచలేదు. స్నేహితులతోఁ గలసి నే నంత పట్టణమునకుఁ బ్రయాణ మైతిని. మార్గమధ్యమున పడ వలో "సత్యసంవర్థని"కి వ్యాసములు వ్రాయుచుంటిని. గుంటూరిలో మృత్యుంజయరావునకు బంధువు లుండుటవలన మే మందఱము నచట నొకదినము నిలిచి చెన్నపురి ప్రయాణ మైతిమి. స్నేహితులతో నాడుచు పాడుచుండుటచేత, ఆ దీర్ఘ ప్రయాణమువలని బడలిక నా కగఁబడలేదు. లింగి సెట్టివీథిలో నుండు రామలింగయ్య పూఁటకూళ్ల యింటి మేడలో నామిత్రుఁడు గంగరాజు నివసించెను. అది నా కతఁ డిచ్చి, శీతకాలపు సెలవులకుఁ దాను నర్సాపురము వెళ్లిపోయెను. మృత్యుంజయరావు, అతని భార్యయును, పరశువాకము వెళ్లి, అచ్చట మన్నవ బుచ్చయ్య పంతులుగారియింట బసచేసిరి. నాకుఁ జేరువనె సాంబశివరావు మున్నగు స్నేహితులు విడిసిరి. నా ప్రాఁతస్నేహితులగు వెంకటరత్నము నాయఁడుగారిని, నారాయణస్వామి నాయఁడుగారిని గలసికొని, వారితో సంభాషణములందు తీఱికకాలమును గడుపుచుంటిని. నే నిచట శ్రద్ధతోఁ జదువుచుంటిని. రాజమంద్రి స్నేహితుఁడు పానుగంటి అప్పారావుగారితోఁ దఱచుగ నేను ప్రాఁత పాఠములు తిరుగవేయుచుండువాఁడను.
నా సహాధ్యాయుఁడు రామారావుగారు పరశువాకములో జబ్బుపడుటచేత, అతని నాబసకుఁ గొనివచ్చి, వైద్యుఁడు నారాయణస్వామి నాయఁడుగారిచే మందిప్పించితిని. అతనికి నాకును నాయఁడుగారు తమ సహజకృపావిశేషముతో మందు లిచ్చుటవలన మాకు స్వస్థత గలిగెను. డిశంబరు చివరభాగమున చెన్నపురి బ్రాహ్మమందిరములో "ఆస్తికసమావేశము," బ్రాహ్మసమాజ వార్షికసభలును జరిగెను. సమాజ పత్రికయగు "ఫెల్లోవర్కరు" పత్రికను పున నుద్ధరించుటకు వెంకటరత్నము నాయఁడుగారు సమాజమిత్రులును నిశ్చయించిరి. నేనును వ్రాయుచుందు నని వాగ్దానము చేయకుండినను, నాచేతనైనసాయము చేయ నుద్దేశించుకొంటిని.
మద్రాసులో నేను పలుమాఱు వెంకటరత్నము నాయఁడుగారిని సందర్శించి, ఆత్మోజ్జీవనమును గుఱించియు, దుష్టసంకల్పముల నరికట్టి మనస్సును ఋజుమార్గమున నడిపించు విషయమును గూర్చియు, వారి యమూల్యాలోచనములను గొనుచువచ్చితిని. వైద్యుఁ డయ్యును నారాయణస్వామి నాయఁడుగారికి మత ధర్మములను గుఱించి మంచి యనుభవము గలదు. పలికెడి పలుకులందుకంటె చేసెడి కార్యములందాయన సౌజన్యము బాగుగఁ గానవచ్చు చుండెను. ఏమాత్రము విసివి కొనక, నాకోరికచొప్పున నామిత్రుల కెల్ల నాయన యుచితముగనే వైద్యసహాయము చేయుచుండువారు.
చెన్నపురియందుఁగూడ నేను ఆరోగ్య విషయమున మిగుల జాగరూకతతో నుండువాఁడను. మిగుల మితముగఁ జదువుచు, సాయంకాలమున సముద్రతీరమునఁ జాలసేపు చల్లనిగాలి ననుభవించుచు, నేను దినములు గడపుచువచ్చితిని. దేహమున పుష్టి గలుగుటకును, కనులకుఁ జలువ చేయుటకును నేను వలసిన మందులు సేవించుచుండువాఁడను.
ఎట్టకేలకు పరీక్షాదినములు వచ్చెను. మొదటి పరీక్షాపత్రము చేత నందుకొనిన పావుగంటవఱకును నందలి విషయములు నామనస్సున కెక్కలేదు ! నేనీ పరీక్షయందు తప్పినచో ముందు కుటుంబపోషణ నెట్లు జరుగునా యని నే నాలోచింపఁ దొడంగితిని. అంత నేను మనసును పరీక్షాప్రశ్నల దెసకు మరలించుకొంటిని. పరీక్ష రెండవనాఁడు ప్రొద్దుననే, న న్నదివఱకు సంవత్సరముల కొలఁది వేదించుచు వచ్చిన నేత్రమాంద్యచిహ్నములు గానఁబడెను. వ్యాధి యీనాఁడు పొడసూపెనా, రోజంతయు నాకు దృష్టిమాంద్యము, తలనొప్పియుఁ గలిగి మిగుల బాధపడియెడివాఁడను ! అట్టి పరిస్థితులలో నే నెట్లు ప్రశ్నములకు సమాధానములు వ్రాయనేర్తును ? అందుచే నేను మిగుల వగచితిని. విచారావేశముచే జనించిన దైన్యమున దేవదేవుని సాహాయ్యము నేను వేఁడికొంటిని. ఆదయామయుని యనుగ్రహమున నా కీజబ్బు రా దనియె నేను గట్టిగ నమ్మితిని. నా యాశ్చర్య మేమని చెప్పను ? భగవంతుని పరిపూర్ణానుగ్రహమునను, ఉద్రేక సమయమందలి సంకల్ప బలమునను, చూచుచుండగనే వ్యాధి పలాయిత మయ్యెను. ఇంతియ కాదు. ఈశత్రువుమీఁద సమగ్రవిజయ మీతరుణముననే నాకుఁ జేకూరెను. అప్పటినుండి నేఁటివఱకు మరల నెన్నఁడును నేనీ రుగ్ణతబారిఁ బడలేదు.
ఇంగ్లీషులో మొత్తముమీఁద నేను బాగుగ వ్రాసినను, ఆంధ్ర సాహిత్యమునందు ప్రశ్నలు మిగుల కఠినముగ నుండుటచేత, నే నందపజయ మొందుదు నని భయ మందితిని. కాని, నాస్నేహితులు సాంబశివరావు నరసింహరాయఁడుగార్లవలె నేను పరీక్షలోని రెండవ భాగమును వదలిపెట్టక, మఱువారమునం దాపరీక్షకుఁగూడఁ బోయితిని. 25 వ జనవరినాఁటితో నా పట్టపరీక్ష పూర్తి యయ్యెను. ఆ సాయంకాలమున వ్యాయామమున కొకమిత్రునితోఁ బోయి, గుజిలీ బజారు చూచి, అచట నొకపుస్తకము కొని తెచ్చికొంటిని. ఐనను, నేను పూర్తియగు విరామము నాలుగుదినము లైన ననుభవింప నోఁచు కొననైతిని! సైదాపేటలోని బోధనాభ్యసనకళాశాల యదివఱకె తెఱచిరి. అందుఁ జేరి, యల్. టి. పరీక్షకుఁ జదువవలె నని మృత్యుంజయరావు నేనును ఉద్యమించుకొంటిమిగదా. ఆమఱునాఁడె మేము భయులమును సైదాపేట పోయితిమి. యల్. టి. తరగతి కిటకిట మను చుండెను. పెద్దగుమాస్తాను జూచితిమి. మాయిద్దఱికి నచట ప్రవేశము దొరకఁగల దని యాయన యాశ కలిగించెను. అధ్యక్షుఁడు నాఁడు కళాశాలకు రాకుండినందున, ఆయనను జూచి, తరగతిలోఁ జేరుటకై 30 వ తేదీ సోమవారము తిరిగి వచ్చెద మని మద్రాసు వెడలి పోయితిమి.
కళాశాలలోఁ జేర్చుకొనుటకు అధ్యక్షుఁ డిష్టపడినచో, మమ్మొకవైద్యుఁడు పరీక్షింపవలెను. ఆవిషయమై మాకు సాయము చేయుదు నని వైద్యుఁడు నారాయణస్వామినాయఁడుగారు చెప్పిరి. ఆదివారమునాఁడు సత్యసంవర్థని క్రొత్తసంచికకుఁ గొన్ని వ్యాసములు వార్తలును వ్రాసి, ఇపుడు రాజమంద్రి వెడలిపోవుచుండు స్నేహితులచేత కవి యిచ్చి పంపితిని.
సోమవారము మరల మృత్యుంజయరావు నేనును సైదాపేట పోయితిమి. అచట మమ్ముఁజేర్చుకొనుట కధ్యక్షుఁ డంగీకరించి, మమ్ముఁ బరీక్షింపు మని రాయపేట వైద్యాధికారికి జాబు వ్రాసెను. మఱునాఁడు వైద్యాధికారియొద్ద కేగితిమి. మే మెంత భయపడినను, మే మారోగ్యవంతులమనియె వైద్తుఁడు వ్రాసివేసెను. ఆదినమె మేము సైదాపేట పోయి, అచట కొన్ని పాఠములు బోధించితిమి. జీవితకాల మంతయు విద్యావృత్తిలో నుందు నని నిశ్చయించుకొనియె నే నాకళాశాలలోఁ జేరితిని.
44. ఉపాధ్యాయవృత్తి
రాజమంద్రికళాశాలలోఁ జదువుకాలమున నపుడపుడు భావి కాలమున నే నవలంబింపవలసిన వృత్తినిగుఱించి యాలోచించుచుండె డివాఁడను. సంస్కరణావేశమునకు లోనగునప్పటినుండియు నా కీ విషయమునఁ గొన్ని నిశ్చితాభిప్రాయములు గలిగెను. న్యాయవాదివి కమ్మని మాతల్లిదండ్రులు హితవు చెప్పుచువచ్చిరి. నే నావృత్తి చేకొనినచో, మిక్కటముగ ధనయశస్సంపాదనము చేయుదు నని మాజనకుని తలంపు. కాని, కీర్తిధనాదులమీఁద నాదృష్టి లేదనియు, న్యాయమార్గమున నడచుటకు న్యాయవాది కవకాశము లేదనియు నేను వాదించుచుండువాఁడను. అటు లైనచో నేను కలెక్టరుకచేరిలోఁ గాని మఱియే కచేరీలోఁగాని యుద్యోగము సంపాదించుట మంచి దని మాతండ్రి చెప్పుచుండువాఁడు. దొరతనమువారికొలువున లంచములు పుచ్చుకొనవలసివచ్చును గాన నా కది బొత్తిగ నిష్టము లే దని నే జెప్పివేయుచుండువాఁడను. సర్కారుకొలువున నన్యాయముల కొడి గట్టకయె వ్యవహరింపవచ్చుననియు, శ్రమపడినంతకాలము చాలినంత జీతమును, వార్ధకమున పింఛనును బడయవచ్చుననియు, మాతండ్రి పలుకుచుండువాఁడు. కాని, మతసంఘసంస్కరణోద్యమములఁ బనిచేయుటకు న్యాయవాదుల కవకాశమును, సర్కారు ఉద్యోగులకు స్వాతంత్ర్యమును లభింప దని నేను దలంచి, ఈరెండువృత్తులనుండియు పెడమొగము పెట్టివేసితిని. నాస్నేహితుఁడు కాంతయ్యగారు, రిజిష్ట్రేషను శాఖలో కావలసినంత తీఱికయు స్వతంత్రతయు నుండుట చేతఁ దా నందుఁ బ్రవేశించి, అందు లభించు కొంచెముజీతముతోనే తృప్తినొందెద నని చెప్పుచుండువాఁడు. దొరతనమువారికొలు వనఁగనే యన్యాయమున కెడము గలుగు నని నానమ్మిక. కావున నెవ్విధమునఁ జూచినను, ఉపాధ్యాయత్వమె యుత్తమవృత్తిగ నాకుఁ దోఁచెను. ఈవృత్తిని నాగురువర్యులగు వీరేశలింగముగారును స్వీకరించి ధన్యజీవితు లగుచుండిరికదా ! సంఘసంస్కరణాది విషయములందు వారి