ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ/గోపాలపురము
నా కీరంగుభేదములను గూర్చి కల విపరీతపుఁబట్టుదల, చదువు పుస్తకములు మొదలు వేసికొను వలువలు, ఆడుకొను వస్తువుల వఱకును, బాల్యమున వ్యాపించియుండెను ! ఎఱ్ఱనిచేలములు నాకుఁ బ్రియములు, శోణకుసుమము లత్యంతమనోహరములు. రంగులందువలెనే, రుచులందును నాకు గట్టిపట్టుదల యుండెను. కమ్మనికూరలు తియ్యనిఫలములు నాకు రుచ్యములు. పులుపు ఆగర్భశత్రువు. కారము మధ్యస్థము.
2. గోపాలపురము
వెనుకటి ప్రకరణమునందలి సంగతులు, ఐదారేండ్ల వయసునను, అంతకుఁ బూర్వమందును సభవించి నాకు జ్ఞప్తి నున్న ప్రత్యేకానుభవములు. సూత్రమునఁ గట్టిన పుస్తకమురీతిని, జలపూరితమగు నదీప్రవాహముఁబోలెను, నా కింకను జీవితము స్థాయిభావము నొందిన యనుభవసముదాయము గాకుండెను.
మా తండ్రి సర్వేశాఖలో మరల నుద్యోగము సంపాదించి, ఈమాఱు అమలాపురము తాలూకా గ్రామములలో నివసించెను. అందలి చిన్న గ్రామములలో 'ఈతకోట' యొకటి. ఈమధ్య నే నచటికిఁ బోయి చూడఁగా, అది వట్టి కుగ్రామముగఁ గ్రుంగిపోవుటకును, చిన్ననాఁటి నా యాటపట్టు లన్నియు స్వల్పప్రదేశములుగ సంకుచితము లగుటకును, విస్మయవిషాదముల నొందితిని ! నా యాఱవయేట, గొన్ని నెలలు మే మచట నుంటిమి. అప్పటికి నా తమ్ముఁడు వెంకటరామయ్య రెండుసంవత్సరములవాఁడు. మా యింటిముందలి చావడిలోనే గ్రామపాఠశాల యుండెను. అందు చేరి నేను రెండవపాఠ పుస్తకము చదువుచుంటిని. ఆ పాఠములందలి ప్రకృతివర్ణనావైచి త్ర్యము, శైలిసౌకుమార్యమును నా మనస్సున కమితానందము గొలిపెను. నా సహపాఠులగు బాలకులు నన్ను దమయిండ్లకుఁ గొనిపోయి, నాకు 'పెప్పరుమింటు'బిళ్లలు నూడిద లిడుచుండువారు. ఈ నూతనోపహారవస్తువులలోఁగూడ నా బుద్ధికి విపరీతభేదములు పరికల్పితములయ్యెను. గాటుగానుండు తెల్లని బిళ్లలకంటె, చక్కెఱపా లధికమై కంటి కింపగు నెఱ్ఱనిరూపమునను, ఇంచుక గులాబితావితోను నొప్పారెడి రంగుబిళ్ల లే నాకు రుచ్యములుగ నుండెను !
అది వేసవికాల మగుటచేత, అచట మామిడిపండ్లు ముమ్మరముగ నుండెను. ఉద్యోగవ్యాజమున మా తండ్రికిఁ గానుకలుగ సమర్పింపఁబడిన ఫలాదు లన్నియు నొకచీఁకటిగదిలోఁ జేర్పఁబడుచుండెను. గదితలుపు తీయునప్పటికి, పండ్ల నెత్తావులమొత్తము నాసికను మొత్తుచుండెడిది. రాత్రి భోజనానంతరమున మా తండ్రికోరిక చొప్పున పొరుగుబ్రాహ్మణుఁ డొకడు పనసపండ్లు కోసి తినలు విడఁదీయుచుండును. మా తలిదండ్రు లవి యచట నుండువారికిఁ బంచిపెట్టుచుందురు. మా మాతామహునకుఁ బుత్రవత్సలతయు మధురఫలాపేక్షయు మిక్కుటము. మమ్ముఁ జూచిపో వచ్చినయాయన, ఇరువురు మనుమలమీఁది ప్రేమమాధుర్యమునకును, మిగుల మాగినపండ్ల తియ్యదనమునకును జొక్కి, యా వేసవి మా చెంతనే గడపివై చెను !
ఈతకోటలో నా యనుభవమున ముఖ్యముగ రెండుసంగతులు కన్పట్టెను. అచట నొకగృహస్థునికి భార్యయు పుత్రుఁడును గలరు. తండ్రి మిగుల పొడుగుగను, తల్లియు తనయుఁడును కడు కుఱుచగను నుండుట నా కెంతో చోద్యముగ నుండెను. మా తల్లి కీసంగతి పలుమా రాశ్చర్యమునఁ జెప్పుచుండువాఁడను. మా పొరుగున నొకబీదవాని కుటీరము గలదు. ఆతని కొక కుంటికూఁతురు తప్ప మఱి యెవ్వ రును లేరు. పాప మెంతో భయభక్తులతో బగ లెల్ల పరిచర్యలు చేసి యలసిన యాబాలికను, ఏదో మిష పెట్టి తండ్రి రాత్రులు మోదు చుండును ! అంత వినువారి గుండె లవియునట్టుగ బాలిక రోదనము చేయుచుండును. లోక మనఁగ నిట్టి విపరీతవైషమ్యములతో నిండి యుండునట్టిదియే కాఁబోలని తలపోసి, రాత్రి పానుపు చేరి, నా విస్మయ విషాదములను గాఢసుషుప్తియందు విస్మరించుచుండువాఁడను !
అచ్చటినుండి మా తండ్రి నరేంద్రపురమునకు మార్పఁబడెను. మే మక్కడకుఁ బోయిన కొలఁదిదినములకే జరిగిన యొక యుత్సవ సందర్భమున నచటివారును పొరుగూళ్ల వారును "ప్రభలు" గట్టి రాత్రి యూరేగించిరి. ఆ యూరను చుట్టుప్రక్కలను ద్రావిడులు మెండుగ గలరు.
అచ్చట నొకచావడిలో జరుగు పాఠశాలలో నేను జేరి, మూఁడవపాఠపుస్తకము చేతఁ బట్టితిని. ఆ పుస్తకమందలి "శ్రీరామ పట్టాభిషేకవర్ణనము" మిగుల మనోహరముగ నుండెను. నా సహచరులలో సూర్యచంద్రు లను నిరువురు సోదరులు గలరు. చంద్రుఁడు తను కాంతితో విలసిల్లెడి సుందరాకారుఁడె కాని, సూర్యునిమోము కాల మేఘము లావరించిన సూర్యబింబమె ! వారు నివసించు నింటి యజమానునికి కురూపి యగు నేకపుత్రుఁడు కలఁడు. ఆ యువకుని సతి యన్ననో చక్కనిచుక్క. మగనిచెంత మసలెడి యా మగువ, కాఱు మబ్బునడుమ తళుకొత్తు మెఱఁపుఁదీఁగయె ! ఇట్టి విపర్యయముల కాశ్చర్యపడియెడి నా కప్పటి కాఱుసంవత్సరములు పూర్తి గాకుండెను.
1877 వ సంవత్సరపు వేసవిని నా రెండవ తమ్ముఁడు కృష్ణమూర్తి మా యిరువురివలెనే వేలివెన్నులో జననమయ్యెను. మే మంతట గోపాలపురము వెళ్లితిమి. అచట జరిగినసంగతులు నా మనో వీథిని మఱింత స్ఫుటముగ గోచరించుచున్నవి. మొదట నే నందు పల్లెబడులలో గాలము గడిపి, పిమ్మట పాఠశాలఁ బ్రవేశించితిని. మూఁడవపాఠపుస్తకము మరల నా కరము లలంకరించెను. నా కిచటఁ గొందఱు బాలురు నెచ్చెలు లైరి. గోదావరీనదీగర్భమందలి రెల్లు దుబ్బులు నిసుకతిన్నెలును మిత్రులతోఁ జుట్టివచ్చుచును, వరదకాలమున నొడ్డువఱకును వ్యాపించిన యేటి పోటుపాటులను దమకమునఁ గనుగొంచును, నేను బ్రొద్దు పుచ్చుచుండువాఁడను. ఆ సంవత్సరమున వరదలు మిక్కుటముగ నుండెను. మేము నివసించెడి యింటి చుట్టు గోడదగ్గఱ పోఁతగట్టు నానుకొనియె దినములకొలఁది గౌతమీనది భయంకరాకారమునఁ బ్రవహించుచుండెను. ఏటఁ గొట్టుకొనివచ్చిన యొకమొసలి యా గ్రామమున కనతిదూరమున నివాస మేర్పఱచుకొని, నీళ్లు చొచ్చిన మేఁకలను దూడలను వేఁటాడుచుండెను. ఒక యడవి పందిని అప్పుడే తెగటార్చిన యచ్చటి రాజకుమారుఁడు, ఒక నాఁడా మకరిని బట్టి వధించి తెచ్చెను. అంత దానిపొట్టఁ గోసి చూడఁగా, ఉంగరములు, బంగారుపోగులు నందు గాననయ్యెను అవి, రెండు రోజులక్రిందటనే ప్రమాదవశమున దానినోటఁ బడిన పసులకాపరి యగు నొక యర్భకునివి ! పుత్రశోకార్త యైన వానితల్లి యవి చూచి గోలుగోలున నేడ్చెను.
ఏడవయేటనుండియే నాకు నెచ్చెలుల సావాసము మరగి నునుట యలవా టయ్యెను. నాయీడు బాలురు మా యింట నెవరును లేరు. నా రెండవతమ్ముఁడు వట్టిశిశువు. పెద్దవాఁడగు వెంకటరామయ్య మూఁడేండ్లు వయస్సు కలవాఁడు. ఐనను, వచ్చియురాని మాటలతో నుండి, తప్పుటడుగులు వేయుచుండెడి యా పసివానికిని, సతతము స్నేహితులతోడి సుఖసంభాషణములకుఁ జెవి కోసికొనుచు, ఇంటఁ గాలు నిలువక చెంగుచెంగునఁ బెత్తనములకుఁ బరుగు లిడు నాకును సఖ్యము సమకూరకుండుటచే, బయటిసావాసులే నాకు శరణ మగుచుండిరి. ఎప్పుడును ఏవింతలో చూచుచును, ఏవార్తలో వినుచును, ఏపనియో చేయుచును నుండినఁగాని నాకుఁ బ్రొద్దు పోయెడిదికాదు. సుజనులో దుర్జనులో సావాసులతో నుండుటయె నా కప్పటి యభ్యాసము ! చెలికాండ్ర చెలిమి గోరువారికి విరోధులతోడి వైరము కూడ నేర్పడుచుండును. ఇదిగాక, సదా మిత్రులతోఁ గలసిమెలసి యుండువాఁడు, సమయానుగుణ్యముగఁ దాను వారిని నాలుగు కొట్టుటయు, వారిచే నాలుగు పడుటయును సామాన్యముగ సంభవించుచుండును. శైశవదశ నుండు నా పెద్దతమ్ముని కీ స్నేహసారస్య మేమియెఱుక ? చీటికి మాటికి నేను జేయు చిన్న దండయాత్రలలో నన్ను వాఁడు చేరఁగోరి, వల్లె యనినను వల దనినను నాపాలిఁటి విధి దేవతవలె నన్ను వెన్నాడుచు, సమీపించినచోఁ దన్ని పోవుదు నను భయమున దూరమున నుండియే వాఁడు మా చిన్న కలహముల నుపలక్షించి, నా యుద్ధకౌశల మావంతయు మెచ్చుకొనక, నా జయాపజయము లైన బాగుగఁ బరిశీలింపక, వాయువేగమున నింటికిఁ జని, మహాప్రసాద మని యా వార్త తలిదండ్రులకు నివేదించుచుండువాఁడు ! అంత మా నాయన యింట నుండినచో, నా కానాఁడేదియో మూఁడినదే ! శత్రుని పిడికిలి పోటులు శరీరమున శమింపకమున్నే, పండ్లు కొఱికి వచ్చెడి పితరుని తాడనపీడకు మరల నా దేహము తావలము గావలసినదే ! ఒక్కొకప్పుడు పలాయితు లగు శత్రుమిత్రులును నా వలెనే మా జనకుని యాగ్రహానలమున కాహుతి యగుచుందురు.
నా కానాఁడు లభించిన యొక సావాసుని గుఱించి యిట నొకింత ప్రస్తావింపక తీరదు. ఆతఁడు నాకంటె నైదాఱేండ్లు పెద్దయై, పొడుగుగ నుండెడివాఁడు. అ గ్రామనివాసియు ననుభవశాలియు నగు వానివాక్కులు నాకు వ్యాసప్రోక్తములు! నీట రాళ్లు రువ్వి కప్పగంతులు వేయించుట, కొయ్యతెరచాప లమర్చిన కాకియోడలను ప్రవాహమున కెదురుగ నడిపించుట, మా పెంపుడుకుక్కను రాజుగారి సీమకుక్కమీఁద కుసికొలిపి దానిని గఱిపించుట, - ఇవి నా కనులు మిఱిమిట్లు గొనునట్టుగ నా మహనీయుఁడు దినదినమును ప్రదర్శించెడి విచిత్రవ్యాయామములు! అట్టి మేటినాయకుని నూఁతగఁగొని, వాని యడుగుజాడలనే నడువఁబూనుటయం దేమి యాశ్చర్యము? నేను విశ్వసించెడి రామరావణులు వట్టి క్షుద్రు లనియు, వీరికి మిన్న యగి వేలుపు గలఁ డనియు నతఁడు సూచించి, నాచెవులు చిల్లులు పడునట్టుగ నతని పేరు "అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుఁ" డని నుడివినపుడు, నే నెట్లు వానిని గౌరవింపకుందును? ఇతఁడు వేవేగమే నాకు మార్గప్రదర్శకుఁడును నయ్యెను! పొగచుట్టయొక్క ప్రాశస్త్య వర్ణన మాయనయొద్ద నేను విని, అద్దాని కర్మకాండవిషయమై యాతనియొద్దనే మంత్రోపదేశముఁ గైకొంటిని. అంత మూఁడుదినముల వఱకును నే నేమి తినినను త్రాగినను, వమనము చేసికొనుచు వచ్చితిని. ఇట్టికష్టముల కోర్చి పట్టువిడువక యలవాటు చేసికొనినచో, చుట్ట కాల్చుటయందు తనవలెనే నే నాఱితేఱి సుఖింతు నని యతఁడు నా కుద్బోధించెను. కాని నా యీ నూతనవిద్యారహస్యము, మా తమ్ముని వలన విని, మా తల్లి యానాఁడు త్రాటితోఁ గొట్టిన దెబ్బలు, అర్ధశతాబ్దము గడచినవెనుకఁగూడ నా వీపున చుఱ్ఱు మనుచునే యున్నవి. చుట్ట గాని, దాని చిన్ని చుట్టము లెవ్వి గాని పిమ్మట నెపుడును నా దరిచేరకుండుట యందలి రహస్యము, బాల్యమం దానాఁడు మా జనని ప్రయోగించిన దివ్యౌషధప్రభావమె యని నేను బలుమారు తలపోసితిని!