ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/"జనానాపత్రిక"
మునకును, ఏకపత్నీత్వముమున్నగు నీతినియమములను సముద్ధరించిన జీససునకును నెంతయో యంతరము గలదు !
నా మనస్సునకుఁ గళవళపాటు కలిగించిన యొకవిషయమును గూర్చి యిచటఁ బ్రస్తావించెదను. ఇపుడు మా కెన్నియో చిల్లర యప్పులుండెను. ఇవియన్నియుఁ దీర్చివేయుటకై యెచటనైన మూఁడువేలరూపాయల పెద్దయప్పునకు మేము ప్రయత్నించితిమి. నా స్వల్పశక్తితో నీ ఋణము నెట్లు తీర్చివేయఁగలనా యని నేను తల్ల డిల్లితిని. ఋణవిముక్తుఁడనై మఱి చనిపోవునటు లనుగ్రహింపు మని పరమేశ్వరునికి మ్రొక్కులిడితిని. జూన్ 19 వ తేదీని యీ యప్పు సంగతి రంగనాయకులునాయఁడుగారితోఁ బ్రస్తావింపఁగా, కొంచెము వడ్డికి నా కీసొమ్ము లభించునట్టుగ ధనికులగు తమస్నేహితులతోఁ జెప్పెదనని యాయన వాగ్దానముఁజేసెను.
4. "జనానాపత్రిక"
నా పూర్వ గురువులగు మల్లాది వెంకటరత్నముగారు 1893 వ సంవత్సరము జూలై నెలలో స్త్రీవిద్యాభివృద్ధి నిమిత్తమై "తెలుగు జనానాపత్రిక" యనునొక మాసపత్రికను నెలకొల్పి, యొక సంవత్సరము నడిపి, అది యిపుడు విరమింప నుద్యమించి, నే నద్దానినిఁ గైకొని సాగింతునా యని, మెయి 28 వ తేదీని నాకు వ్రాసిరి. "సత్యసంవర్థని" ని గుఱించి మొగము తిరిగిన నాకు, "జనానాపత్రిక" వంటి వేఱొకపత్రిక చేతనుండుట కర్తవ్యమని తోఁచెను. ఆ జూను మొదటి వారమున జబ్బుగనుండు మాముత్తవతల్లిని జూచుటకు వేలివెన్ను వెళ్లియుండునపుడు, బావమఱది వెంకటరత్నముతో నూతన పత్రికను గుఱించి నేను ముచ్చటించితిని. మిత్రులతోడి తగవులకుఁ గారణమైన సత్యసంవర్థనిని నేనిఁక విడిచివైచి, జనానా పత్రికను జేపట్టుట యుక్తమని నా కాతఁ డాలోచనఁ జెప్పెను. అంత నేను రాజమంద్రి తిరిగి వచ్చిన పిమ్మట, సోదరుని యాలోచనఁ గూడఁ గైకొని, 6 వ తేదీని మల్లాది వెంకటరత్నముగారికి జాబు వ్రాసితిని. నా సంపాదకత్వమున జరుగు జనానాపత్రికకుఁ దాము నిర్వాహకులుగ నుండి కొంతకాల మది నడపుచుందు మని వెంకటరత్నముగారు ప్రత్యుత్తరమిచ్చిరి. నే నపుడు వ్రాసిపంపిన "పూవుల"ను గుఱించినదియె యాపత్రికలో నామొదటి వ్యాసము.
చిన్ననాఁడు నాకెంతో సంతోషదాయకముగ నుండిన "డాన్ క్విగ్జోటు" నవల నీవేసవిని మిగుల తమకమునఁ జదివితిని. నే నీకాలమున నమితముగఁ జదువుచుండుటవలననే కనులకును శరీరమందును బలహీనత హెచ్చిపోయెను.
ఈకాలమున నా దైవభక్తిని గుఱించియు ప్రార్థనలరీతిని గుఱించియు నొకింత తెలుపవలెను. నేను నిత్యవిధిగ వ్రాసెడి దినచర్య పుస్తకములందు నా ప్రార్థనానుతాపముల పోకడలు నానాఁట సూచితమగుచుండెను. శత్రుమిత్రులు నాలోపము లెన్ను చుండిరని నే నొక్కొక్కప్పుడు కటకటఁబడుచుంటిని కదా. ఇతరుల కన్నులకుకంటె నాచక్షువులకే నాలోపపాపముల మిగుల స్ఫుటముగఁ దోఁచుచుండెను. ఆత్మోపాలంభనములో పరుల దోషారోపణము లొకవీసమైన కఱకు లేకుండెను ! నా పాపచింతనమునకును కుటిల వర్తనమునకును, నేను సంతతానుతాపానలమున దగ్ధుఁడ నగుచుండియు, మరల నీవక్రచర్యలకే గడంగుచుందును ! స్వకీయపాపలేకమునుఁ బరిశోధించుటయందును, లోపముల వివరములను గుర్తెఱుంగుటయందును, న న్నెవరును మించియుండరు ! కాని, యీ పాప పరిశీలనాశక్తియును, అనుతాపతీవ్రతయును, అపరాధములు చేయకుండు నా బుద్ధినేల యరికట్టనేరకుండెనని యచ్చెరువొందు చుందును. నాకుఁ గల యమిత మతాభినివేశము, అపార దైవభక్తియును, మనస్సును అన్యాయపథమునుండి యేల మరలింపఁజాల కుండెనో గ్రాహ్యము గాకుండెను !
జూన్ 8 వ తేదీని నేనును, మృత్యుంజయరావును, రెయిలు స్టేషనుకుఁ బోయి బెజవాడలో జరిగెడి కేష్ణామండలసభ కేగుచుండు వెంకటరత్నము నాయఁడుగారిని సందర్శించితిమి. బెజవాడ వీడవలదనియు, ఎమ్. ఏ. పరీక్షకుఁ జదువుమనియు నాయుఁడుగారు నాకు సలహా నిచ్చిరి. వారు రాజమంద్రి వచ్చి జూన్ 15, 16 తేదీలలో నచట నుండిరి. 16 వ తేదీని మేము చేయించిన బహిరంగసభలో, "సువిశాల మిదం విశ్వం" అను శీర్షికతో నాయఁడుగా రొక యాంగ్లోపన్యాస మిచ్చిరి.
తలిదండ్రులయొద్దను బంధుమిత్రులయొద్దను సెలవుఁగైకొని, 20 వ జూనున బెజవాడకు ప్రయాణమై, మధ్యాహ్నమున కచటఁ జేరి, నా వస్తువులు, పుస్తకములును, సరదికొంటిని. ఉపాధ్యాయ మిత్రుఁడగు దేవసహాయముగారితోఁ గలసి మాటాడునప్పుడు, ఈపాఠశాలలోనే నేను రాఁబోవు సంవత్సరమునఁ గూడ నుండి, ఆయన ఖాళీచేయఁబోవు ద్వితీయోపాధ్యాయపదవి నలంకరింపఁగల ననెడి యాశను నా కాయన గలుగఁజేసిరి.
5. మరల బెజవాడ.
బెజవాడ పాఠశాలలో పని జూన్ 21 వ తేదీని మరల ప్రారంభ మయ్యెను. మఱునాఁడు ఉపాధ్యాయులసభ జరిగెను. అందు