ఆత్మచరిత్రము/తృతీయభాగము : ఉపన్యాసకదశ/విజయనగరనివాసము
తమరే రాజమంద్రిలోఁ బ్రచురింప మొదలిడిరి. నేనుమాత్రము ఆపత్రికకు యథా ప్రకారముగ సంపాదకునిగనుండి, వ్యాసముల నంపుచువచ్చితిని. కాని, నాకుఁ జెప్పకయే, తమ కుండెడి కొన్ని చిక్కులవలన, వారు 1907 జూలయినుండియు ఆపత్రిక ముద్రణమును విడిచిపెట్టిరి. కళాశాలలో పనియెక్కువయై, చికమకలు పడుచుండు నేను వెనువెంటనే పత్రికను వేఱొక ముద్రాలయమున కంపనుపేక్షించితిని. అంత, కొలఁదిమాసములకు నేను విజయనగరమునుండి సంసారము తరలించుట వలన, 'జనానాపత్రికా' ప్రచురణ మంతటితో నిలిచిపోయెను. ఇట్లు 12 సంవత్సరములు నాపోషణమునఁ బెరిఁగిన యాపత్రిక, పదునాలుగవయేట నకాలమరణమునకు లోనయ్యెను.
6. విజయనగరనివాసము
మొత్తముమీఁద విజయనగరము కళాశాలలోని పని నాకెంతో హర్ష దాయకముగ నుండెను. ఇపుడు నేను బోధించవలసినవి కళాశాల శాఖలోని తరగతులు మాత్రమే. దినమునకు రెండుమూఁడు గంటలు మాత్రమే నేను బనిచేయవలసివచ్చెను. నాపనితీఱిన పిమ్మట నే నింటికిఁ బోయి హాయిగ విశ్రమింపవచ్చును. కాని, తీఱిక సమయమును నేను వ్యర్థపుచ్చువాఁడనుకాను. బోధింపవలసిన సంగతులు గ్రహించుటకై సదా నేను ఉద్గ్రంథపఠనము చేయువాఁడను. పట్టపరీక్ష తరగతికి బోధించుట కై తర్కశాస్త్రగ్రంథములు సమగ్రముగఁ జదువ నారంభించితిని. ఆంగ్ల సాహిత్య బోధనమున కవసరమగు గ్రంథములును నేను బఠియించితిని. నూతనగ్రంథపఠనము నాకు నిత్యకర్మానుష్ఠానమే గాక, విశేష వ్యసనముకూడ నయ్యెను ! ఆకళాశాల కంటియుండు పుస్తక భాండాగారము మిగుల గొప్పది. నాబో ధనకార్యము పూర్తి పఱుచుకొని, నేను పుస్తకాగారమున పీఠమువేసి కూర్చుండువాఁడను. నా కన్నుల కిదివఱకుఁ గానరాని పుస్తకములందుఁ బెక్కులు గలవు. అందలి విశేషములు గ్రోలుచుండుటయే నాకు ముఖ్యకాలక్షేపము. అచ్చటనుండి నాకుఁ గావలసిన పుస్తకములు గృహమునకుఁ గొనివచ్చి, అవి ముందువేసికొని యింటఁ గూర్చుండువాఁడను. ఈ క్రొత్తప్రదేశమున నా కెక్కువమంది పరిచితులు గా కుండుటయుఁ గూడ నాజ్ఞానాభివృద్ధికి మఱింత సహకారి యయ్యెను.
ఇట్లు, నాకు జ్ఞానసంపాద్యవిషయమునను, బోధానాసౌకర్యము లొనఁగూడుపట్లను ఇదివఱకుఁ జూచిన ప్రదేశము లన్నిటి కంటెను విజయనగరమె యుత్తమముగ నుండినను, మఱియొక విధమున నది యతినికృష్టమయ్యెను. ఇక్కడ దోమలబాధ విశేషము. సాయంకాలము చీఁకటిపడుటయే తడవుగ దోమలు తేనె టీగలవలె జుంజుమ్మని మూఁగుచుండును. పట్టణమునకును రెయిలుస్టేషనుకును మధ్య నుండు పెద్దచెఱువు దోమలకుఁ బుట్టినిల్లు. పురమునందలిముఱికి కాలువలు వానికి రచ్చపట్టులు. ఏమాత్ర మలుకుడైనను నిద్రాభంగ మందుట నైజమైన నాకు, విజయనగరమున నొక్కొక్కప్పుడు రాత్రులు జాగారమే ప్రాప్తించుచు వచ్చెను. దోమతెర యీపురుగుల కడ్డముగాదు. తెరలోనుండి యెటులో లోనికిఁ దూఱినయొకటి రెండు దోమలు, తెల్లవాఱువఱకును సంగీతము వినిపించుచునే యుండును. ఇచటి దోమలు, నిద్రాసక్తులగు వారికి రాత్రి నిరతము చెవులలో మేలుకొలుపులు పాడుచు, ముక్కు పుటములలో నాట్యములు సల్పుచు, అఱికాళ్లకు గిలిగింతలు పెట్టుచు నుండును. ఈపీడనుండి తప్పించుకొన నాకు తెఱువు వెఱవులు గానఁబడ కుండెను. అంతకంతకు నాకు మశకగానము సింహగర్జన మయ్యెను. ఈబాధవలన నొక్కొకప్పుడు నాకు రాత్రి పగలును, పగలు రాత్రియును నగుచు వచ్చెను.
ఈ దోమల సంపర్కముననే యీపుర మింతరోఁత గొలిపెడి రోగముల కావాసమయ్యె నని వైద్యు లనుచువచ్చిరి. కుష్ఠము, బూరకాలు, బృహద్బీజము మున్నగు వ్యాధులచేఁ బీడితులగు ననేకులు నిత్యము నా కనులఁ బడుచుండిరి. ఈ వ్యాధులనుండి తప్పించుకొనుటకు దోమకాటు పడకుండుటయు, మంచినీరు త్రావుటయు ముఖ్య సాధనము లని వైద్యులు చెప్పుచుండిరి. ఆ కాలమున విజయనగరమునకు నీటివసతి లేదు. అచట మంచినీటికి చెఱువులే యాధారము. కాని, యాచెఱువునీరు అపరిశుద్ధముగ నుండెడిది. మంచినీళ్ల బావులు మిక్కిలి కొంచెమె. అవి పట్టణమున కతిదూరమున నుండెడివి. అందువలన విజయనగరనివాసము మాకు దుస్సహ మయ్యెను.
కళాశాలలో నాకు స్నేహితు లేర్పడిరి. అధ్యక్షులగు రామానుజాచార్యులుగారు నాయెడ సదభిప్రాయు లై యుండిరి. కళాశాలలో నేను ప్రథమసహాయోపన్యాసకుఁడ నగుటచేత, కాలనిర్ణ యపట్టికలు వేయుపనియు, విద్యార్థుల యాటల యేర్పాటుచేయు పనియు నేను జూడవలసి వచ్చెను. అధ్యక్షులు, నేనును కళాశాల తరగతులకు ఆంగ్ల భాషాధ్యాపకులము. కావునఁ దఱచుగ నే నాయనను గలసికొని మాటాడు చుండువాఁడను. ఆయనయు నూతన గ్రంథపఠనమునం దమితాసక్తి గలవారు. పుస్తకాగారమునకుఁ గ్రొత్త పుస్తకములను దెప్పించు విషయమున నేను జేసిన సూచన లాయన యంగీకరించువాఁడు. 'మనశ్శక్తి పరిశోధనాసమాజ' ప్రచురణములందు నేను జదివిన వినోదాంశము లాయనకుఁ జెప్పఁగా, యన యాశ్చర్యమున విని, ఆ పుస్తకములు తానును జదివి, వానిలోని ఆ ముఖ్యాంశములు కోటలోని రాణి సర్కారువారి కెఱిఁగించుచుండువాఁడు. సచ్ఛీలతా సుహృదయతల కామహాశయుఁ డీపట్టణమున నాదర్శప్రాయుఁ డగుటచేత, ఆయనతోడ సహవాస సంభాషణములు నా కిపు డానందసంధాయకము లయ్యెను.
నావలెనే సహాయోపన్యాసకులగు సీమనపల్లి రామయ్యగారికి నాకును వేగమే మనసు గలిసెను. ఆయన సరసుఁడు. హాస్యరసయుక్తములగుమాటలు చెప్పుటయందు మిగుల నేర్పరి. ప్రజలను గుఱించియు, పుస్తకములను గుఱించియు సారస్యములగు వ్యాఖ్యలు చేసి, సావాసులను సౌఖ్యాబ్ధి నోలలాడింపఁ గల సామర్థ్యము గలవాఁడు. కాని, తన కటువాక్యప్రయోగ మితరుల మనస్సులకు నొప్పి గలిగించె నని యాయన బాగుగ గుర్తెఱుఁగ కుండెను. వాక్సంబంధ మగు నజాగ్రత్తవలననే జనులలోఁ గొందఱితో నాయనకు వైరభావ మేర్పడెను.
కళాశాలలోని ముఖ్యోపన్యాసకు లగు వంగ మాధవరావు నాయఁడు, వి. వెంకటరాయశాస్త్రి, ఏచూరి నరసింహము పంతులు గార్లును నాకు శీఘ్రమెపరిచితులైరి. వీరిలో వెంకటరాయశాస్త్రి గారికిని నాకును సంబంధ మధికము. ఆయన తర్క మనశ్శాస్త్రము లందు ముఖ్యోపన్యాసకులు. తర్కమున నే నాయనకు సహాయకుఁడను. పాఠవిషయములను గుఱించియేగాక, నాకుఁ బ్రియములగు తత్త్వశాస్త్రవిషయములను గుఱించియు పలుమాఱు మేము సంభాషించు చుండువారము. ఆయన సాధుపురుషుఁడు; మిత భాషి; వెనుకటి యధ్యక్షులగు చంద్రశేఖరశాస్త్రిగారికి దగ్గఱ బంధువు. కళాశాలలోని యున్నతపాఠశాలకు ప్రథానోపాధ్యాయుఁ డగు పిడపర్తి సూర్యనారాయణ శాస్త్రిగారు నేనును కొంతకాలము కొత్తపేటలోఁ జేరువనే నివసించు చుండువారము. పాఠశాలా విషయములను గుఱించి మేము మాటాడుకొనువారము.
ఆకాలమున కళాశాలలోని నాలుగు తరగతులు చిన్నవిగ నుండుటచేత మేడమీఁద గదులలోఁ గూడెడివి. విద్యార్థులక్రీడలను గుఱించి రామానుజచార్యులవారు మిగుల శ్రద్ధవహించుచు వచ్చిరి. కళాశాల కంటి విశాలస్థలము లేకుండుటచేత, మైదానమందలి 'అయోధ్యకుఁబోయి, విద్యార్థులు క్రికెటు, కాలిబంతి మున్నగు నాటలాడు కొనుచుండిరి. అందఱి విద్యార్థులచేతను ఆటలాడింప నధ్యక్షులకోరిక. కావున వంతులచొప్పున సహాయోపన్యాసకులు మువ్వురును విద్యార్థుల యాటలు తనిఖీచేయుచుండవలెను. కొంతకాలమునకు విద్యార్థులచే ననుదినమును వినోద పుస్తకపఠనముచేయింప నధ్యక్షులకుఁ గుతూహలము గలిగెను. ఇది నాకును సమ్మతమే. విద్యార్థులను ఉపాధ్యాయుల గదులలోనే కూర్చుండఁబెట్టి, వారలచే నచటనే పుస్తకపఠనము చేయించుట యుక్తమని యధికారికిఁ దోఁచెను. కావున నీపనియు మామీఁదనె పడెను. అందువలన పనియెక్కువయై, అధ్యాపకులు విద్యార్థులును మూలుగసాగిరి. ఉపాధ్యాయుల నిర్బంధ సహవాస సాహాయ్యములు లేకయే, విద్యార్థులను వారిచదువు సాములు స్వేచ్ఛగ సాగించుకొననిచ్చినచో పరిస్థితులు బాగుపడునని యందఱు ననుకొనెడివారు. కాని, చదువు సాములు రెండింటిని విద్యార్థుల యిష్టమునకే వదలివేసినచో, వారవి బొత్తిగ వదలివేయుదురనియె యధ్యక్షులవారి భయము. 7. గుంటూరునందలియుద్యోగము
నేను విజయనగరమున నుండు కాలమునందే, పర్లాకిమిడి విజయనగరములలో నాశిష్యులగు శ్రీ బుఱ్ఱా శేషగిరిరావుగారి నాయకత్వమున 'ఆంధ్రవిద్యార్థుల' ప్రధమసమావేశము విజయనగరమున జరిగెను. ఇపుడు కాకినాడ కళాశాలాధ్యక్షులగు వెంకటరత్నము నాయఁడుగా రాసభ కధ్యక్షులు. ఈ సమావేశసందర్భమున విద్యార్థులలో నధికసంచలనము కలిగెను.
విద్యార్థులలో నధికసంచలనము కలిగిన యింకొకసందర్భ మానగరమునఁ గొలఁదికాలములోనే తటస్థించెను. బంగాళాదేశీయుఁడును, సుప్రసిద్ధవక్తయునగు విపినచంద్రపాలుగారు, ఈమాఱు రాజకీయోపన్యాసము లిచ్చుచు, నాంధ్రదేశసంచారము చేయుచు విజయనగర మేతెంచిరి. అచ్చటి పురపాలకోద్యానవనమునం దాయనగాటగు ప్రసంగములు కొన్ని జరిపిరి. దేశస్వాతంత్ర్యమును గూర్చియు, స్వదేశోద్యమమును గుఱించియు నుపన్యాసము లాయనచేసిరి. ఒకనాఁడు పెక్కండ్రు కళాశాలా విద్యార్థులు భావోద్రేకమున బడియెగవేసి, ప్రసంగమును వినుట కేగిరి. దీనికి వారలను శిక్షించు విషయమున రామానుజాచార్యులుగారు మిగుల జాగ్రత్తగ నుండి రని నే నాయనను కొన్ని దినముల పిమ్మట నభినందించితిని. పిమ్మట పాలుగారు రాజమంద్రి వెళ్లి యచట నుపన్యాసము లీయఁగా, రాజమంద్రి కళాశాలా విద్యార్థులు ఉద్రేకపూరితులై, 'వందేమాతర' చిహ్నములు గల బిళ్లలు టోపీలును ధరించి కళాశాల కేగినందుకై, ఆకళాశాలాధ్యక్షులగు మార్కు హంటరుగారు వారికి విధించిన కఠినశిక్షలవంటి కఠిన పద్ధతులకుఁ గడంగక, మా కళాశాలాధ్యక్షులు సమబుద్ధి నూనుట చేత నే అచట నేమియు నుపద్రవములు వాటిల్లకుండెను.