ఆత్మచరిత్రము/తృతీయభాగము : ఉపన్యాసకదశ/దు:ఖోపశమనప్రయత్నములు (1)

                        మనసున నున్న యాశలటు
                                 మాయములయ్యె విధిక్రమానువ
                        వర్తనమున మందభాగ్యమునఁ
                                 దల్లికిఁ బాసిన బిడ్డ వైతిగా !
 
                    ఉ, ఒక్కొకవేళఁ బల్కు సమ
                                 యోచిత వాక్యము లాలకించి నీ
                        చెక్కిలిదోయి ముద్దుగొని
                                 చింతను బాసి ప్రమోద మందుచో
                        నెక్కడలేని నీదు బల
                                 హీనపుఁ బుట్టువు నెంచినంత నే
                        దక్కుదువో యటంచు మదిఁ
                                 దత్తరపాటు ఘటిల్లు నక్కటా !

17. దు:ఖోపశమనప్రయత్నములు (1)

పిల్లవాఁడు చనిపోయిన వెంటనే మేము మా బావమఱఁదితోఁ గూడి, వారి స్వగ్రామ మగు వెలిచేరు వచ్చి యచ్చటఁ గొన్నిరోజు లుంటిమి. బాలకుని మరణవార్త వినిన మాతమ్ముఁడు వెంకటరామయ్య, తన కప్పుడె గుంటూరినుండి వచ్చిన పిల్లవాని చాయాపటపుఁ బ్రతులు నాకుఁ బంపెను. వెనుక కొన్ని నెలల క్రిందట నాపరిచితు లొకరు గుంటూరిలో మాయింటికి వచ్చి, మా పిల్లవానిని గుర్చీమీఁదఁ గూర్చుండఁ బెట్టి, వాని చాయాపటము తీసిరి. దాని ప్రతులు సిద్ధముచేసి పిమ్మట నాకుఁ బంపెద మని యాయన చెప్పిరి. కాని, నేనాసంగతియె మఱచిపోయితిని. నాఁడామిత్రుఁడు దైవికముగ పటము తీసి యుండనిచో మా యర్భ కుని యాకారము బాహ్యప్రపంచమున రూపు మాసిపోయెడిదియె ! ఇపు డామిత్రుఁడు చేసిన సాయమునకు నే నమితకృతజ్ఞుఁడనై, యనుదినమును బాలకుని పటము చూచుకొని కాలక్షేపము చేయుచుంటిని. దీనివలన నా దు:ఖమునకు శమనోద్రేకములు రెండును గలుగుచు వచ్చెను.

మేము వెలిచేరులో నుండునపుడు మాతమ్ము లచటికి వచ్చి, మమ్మోదార్చిరి. తాను రాఁజాలనందుకుఁ జింతిల్లుచు, తన సంతాపము తెలుపుచు మా చెల్లెలు లేఖ వ్రాసెను. నా మేనమామలు మున్నగు బంధువులు సానుభూతిని దెలిపిరి. ప్రస్తుతము కన్నులకు మఱుఁగై యున్నను, కొన్ని దినములైన పిమ్మట పిల్లవాఁ డెచటి నుండియో తిరిగివచ్చు నని నేను భ్రమపడుచుండువాఁడను. ఇపు డేమిచేయుటకును, ఎచట నిలుచుటకును నాకుఁ దోఁపకుండెను. కావున నింకను సెలవుదినము లుండినను, మే మాయెండలలోనే గుంటూరు వెడలివచ్చితిమి. ఆ కష్టకాలమున మమ్ముఁ గనిపెట్టుటకై మాయత్తగారు మాతో వచ్చి గుంటూరిలోఁ గొన్నిదినము లుండిరి.

గుంటూరులో మేము నివసించు నింట నెచటఁ జూచినను, పిల్లవాని యాటవస్తువులె కానవచ్చెను. అవి కంటఁబడునపుడు, మాకు దు:ఖము పొంగి వచ్చుచుండెడిది. బాలకుని విహారమునకై నేను కలకత్తానుండి ప్రత్యేకముగఁ దెప్పించిన త్రోపుడు బండిని బాలరోగుల కుపయోగింపుఁ డని కుగ్లరు వైద్యాలయమునకుఁ బంపి వేసితిని. బాలకుని దుస్తులు నలంకారములును నాభార్య పరుల కిచ్చి వేసెను. కనుల కగపడకున్నను నా మనోనేత్రము ముందట మాపసివాని రూపము తాండవించుచునే యుండెను. ఇది కారణముగ నాకున్మాదము గలిగినఁ గలుగవచ్చు నని నే ననుకొంటిని. నా కాసమయమున దు:ఖోపశమనము గావింపఁ బ్రయత్నించిన మిత్రులలో శ్రీ కొండ వెంకటప్పయ్య న్యాపతి హనుమంతరావు గార్లు ముఖ్యులు. పొరుగుననుండు వీరు సదా నాసేమము గనిపెట్టుచు, నా దృష్టిని దు:ఖవిషయమునుండి మరలింప నుద్యమించుచుండిరి.

కొలఁది దినములలో కళాశాల తీసిరి. నాయొద్దనుండి చదువుకొనుటకై మా పెద్ద మేనమామ రెండవకుమారుఁడు సూర్యనారాయణ వచ్చి, కళాశాలలో మొదటితరగతిలోఁ జేరెను. నాబావమఱఁది పెద్దకుమారుఁడు నరసింహము వచ్చి చిన్న పాఠశాల చేరెను. ఇపుడు విద్యాశాలలోని పనులవలన నాదు;ఖమునకుఁ గొంత విరామము గలిగెను. అనుదినము నొంటరిగఁ జాలదూరము నడచిపోయి ,ప్రకృతి దృశ్యములు చూచుచుఁ బ్రొద్దుపుచ్చు చుండువాఁడను. కాని, తప్పించుకొన నేనెన్ని యుపాయములు చేసినను, దు;ఖము నాహృదయమును జలగవలె నంటిపట్టియుండెను. మనస్సే దు;ఖవిషయము దెసకుఁ బరుగులెత్తునపుడు, విచారమును బాఱఁద్రోల నెట్లు సాధ్యమగును ? మనస్సున కేదేని వ్యాపృతి గలిపించుటకై, నాప్రాఁత దినచర్య పుస్తకములు నేను తిరుగవేయఁజొచ్చితిని. ఇది నెపముగా, బాల్యము నుండియు నేను వ్రాసియుంచిన దినచర్య పుస్తకము లామూలాగ్రముగ నే నాదినములలోఁ జదివి, మరల నేను భూతకాలమున జీవించునట్టుగ భ్రమించి దు:ఖపుఁబుట్టును గొంత సడలింప యత్నించితిని.

నా చెల్లెలియొక్కయు, దాని సంతతియొక్కయు మరణ విషయమును తేప తేపకు నాకు స్ఫురింపఁజేసి, జీవితమును దుర్భరముగఁ దోఁపించుచుండెడి యీ గుంటూరుపురమునుండి వెడలిపోయి, ఏ క్రొత్తదేశమునకైన నేగి, క్రొత్తయుద్యోగమునఁ బ్రవేశించినచోఁ నాకుఁ గొంత దు:ఖోపశమనముఁ గలుగవచ్చునని నమ్మితిని. అంతియ కాని నా కీకాలమున గుంటూరునఁగాని, యిందలి యుద్యోగస్థానమునఁగాని కలిగిన ప్రత్యేక కష్టనష్టము లెవ్వియును లేవు.

ఇటీవలఁ గొన్నియేండ్లనుండి గుంటూరు కళాశాలాధ్యక్షులుగ నుండిన స్ట్రాకుదొరగారు స్వదేశసందర్శనార్థ మేగు సందర్భమున నాయన కొక వీడుకోలుపత్రము సమర్పింప నుపాధ్యాయులము నిశ్చయించుకొంటిమి. ఆ విజ్ఞాపనమును నన్నే సిద్ధము చేయుమని మిత్రులు కోరిరి. 13 వ జూలయిని స్ట్రాకు దంపతులకు మేము వీడుకో లొసంగితిమి. నూతనాధ్యక్షుఁడగు రూప్లేదొరగారు కొంత కఠినుఁడనుకొంటిమి. కాని, ఆయనతో నేను రెండు మూఁడుసారులు ప్రసంగింపఁగా, ఆయనయు మనసిచ్చి మాటాడి, సహాధ్యాపకులందు సానుభూతి గనఁబఱిచిరి. సేలము కళాశాల కధ్యక్షుఁడు కావలసి వచ్చె నని తెలిసి నే నాయుద్యోగమునకు దరఖాస్తు చేయఁగోరఁగా, నాయర్జీని రూప్లేదొరగారు తమ సిఫారసుతో నంపిరి. మిత్రుల యాలోచనల చొప్పున నేనంత చెన్నపురికేగి, చెన్నాప్రెగడ భానుమూర్తిగారి ద్వారా కొంత ప్రయత్నము చేసివచ్చితిని.

ఇటీవల కొన్ని నెలలనుండి బెజవాడలో నుపాధ్యాయుఁడుగ నుండిన బంగారయ్య నన్నుఁ జూచుటకు 5 వ ఆగష్టున గుంటూరు వచ్చి తన సమాచారములు తెలిపెను. లాహూరు నగరమున నాతని కిటీవల దయాళసింగు కళాశాలలో ముఖ్యాంగ్లోపన్యాసక పదవి యొసగఁబడినను అది స్వీకరింపక, ఆపురమునందె దయానంద వేద కళాశాలలో నధ్యాపకోద్యోగమును అతఁడు 250 రూపాయిల వేతనముమీఁద జేకొనెను. ఆనెల 15 వ తేదీని గుంటూరు వచ్చిన బ్రాహ్మమత ప్రచారకుఁడు హేమచంద్రసర్కారుగారు కొన్నిదినము లచట నుండిరి. వారొకనాఁడు నాతో సంభాషించుచు, ఆస్తికమతసంస్థ యగు దయాళసింగు కళాశాలలోని యుద్యోగము నేను గైకొందునా యని యడిగి, నాసమ్మతిమీఁద పంజాబులోని తమ మిత్రులకు నన్నుఁ గూర్చి వ్రాసిరి. సర్కారుగారు మున్నగు మిత్రుల సాహాయ్యమున నా కిపుడు లాహూరు ప్రాంతములందుఁ గొందఱు పరిచితులయిరి.

ఇపుడు సేలము లాహూరు కళాశాలలందలి యుద్యోగప్రయత్నముల యలజడిలో నాదు:ఖము కొంత మఱుఁగుపడెను. 15 వ అక్టోబరున సేలము పురపాలకాధ్యక్షునియొద్దనుండి నాకొక లేఖ వచ్చెను. నన్నును, మఱికొందఱు దరఖాస్తుదార్లను, చెన్నపురి రాజధానీ కళాశాలలో సమావేశమగు కొందఱు పెద్దమునుష్యులయొద్దకు రమ్మని వారు కోరిరి. ఇంతలో నేను పంజాబునందలి యుద్యోగమును 250 రూపాయిల జీతముమీఁద స్వీకరింతునాయని యా కళాశాల కార్యదర్శి నన్నడిగెను. ఆజీతము నాకు సరిపడలేదు. లాహూరు మిత్రు లొకరు నాకు జాబు వ్రాసి, వెంకటరత్నమునాయఁడుగారు నన్ను లాహూరుపదవికి సిఫారసు చేసినచో, నాకు లాభము కలుగునని చెప్పిరి. ఆ నవంబరు 17-18 తేదీలలో బందరులో జరిగిన బ్రాహ్మ సమ్మేళనమునకు గుంటూరు మిత్రులతో నేను బోయి, నాయఁడుగారిని జూచి మాటాడితిని. ఆయన నన్ను గుఱించి సిఫారసు చేసిరి.

23 వ తేదీని నేను చెన్నపురి కేగితిని. సేలము కళాశాలోద్యోగమునకై ప్రయత్నించెడి మఱియిద్ద ఱభ్యర్థులు నా కగఁబడిరి. వారిలో నొకరు విజయనగరకళాశాలలో నాతోడిసహాయాధ్యాపకు లగు సుబ్బరాయభట్టుగారు. ఆయన కీ యుద్యోగ మగునని నేనును , నాకె యగునని యాయనయును అనుకొంటిమి. కాని మా యిద్దఱకునుగాక, మా యుభయులకంటెను వేతనానుభవములందు వెనుకఁబడి యుండు నొక తమిళబోధకుని కీ యుద్యోగ మొసఁగఁబడెను.

చెన్నపురిలోనుండు రెండుదినములలోను నేను రెండుపనులు పెట్టుకొంటిని. నా పూర్వవిద్యార్థియగు నొక పెద్దమనుష్యుఁడు పిల్లలతల్లి యగు తన సతిని విసర్జించి యొంటరిగ మద్రాసున నుద్యోగము చేయుచుండెను. నా పూర్వశిష్యులయిన యా సుదతి సోదరుల కోరిక ననుసరించి నే నిపుడు నాయనుంగుశిష్యునితో సంధిమాటలు జరిపితిని. ఈవిషయమునఁ దప్పంతయు తన సతిదె యని యాతఁడు చెప్పి, సామమార్గమున కంగీకరింపక, భావోద్రేకమున నామ్రోల విలపించెను. నేనాతనిని వదలివేసి, రెండవసంగతి చూచుకొనుటకుఁ బోయితిని. రెండవ మిత్రుఁడును నా పూర్వశిష్యవర్గములోనివాఁడె. కోపమున భర్తను వీడిన యొకవిదుషీమణికి, భార్యను వీడిన యీ విద్యాధికుఁ డాతిథ్య మిచ్చుచుండెను. ఇది పాడిగాదని వారలకు నేను హితముచెప్పి, యాకారణమున నాయువతీయువకుల దూషణోక్తులకు గుఱియై, మోమున ముసుఁగువైచికొని, యింటికి వెడలివచ్చితిని !

ఇంతలో లాహూరు ఉద్యోగమును గుఱించి నాకు జాబులు వచ్చియుండెను. ఆయుద్యోగమును గుఱించి వచ్చిన దరఖాస్తులు విమర్శించుట కొక యుపసంఘమును కళాశాలాపాలకు లేర్పఱిచి రనియు, ఆ చిన్న సంఘమువారు అందఱిలోను నన్నును, కలకత్తా విశ్వవిద్యాలయములో మొదటితరగతిని మొదటివాఁడుగ జయమందిన యొక యువకుని నెన్నిరనియును తెలిసెను. కావున మా కిరువురికి నిపుడు పోటీపడెను. పరీక్షావిజయ విషయమున నన్నుమించిన బంగాళీయువకునికంటె నధికానుభవముగల నాకే యాయుద్యోగమగునని యిపుడు లాహూరునగరము పోయి తన యిద్యోగమునఁ బ్రవేశించిన బంగారయ్య వ్రాసెను. ఎట్టకేలకు నెలకు 275 రూపాయిల జీతము మీఁద నా కాయుద్యోగ మిచ్చిరి. వెంటనె వచ్చి పనిలోఁ బ్రవేశింపుఁ డని యిపుడు పరిచితుఁడైన యచటి కళాశాలాధ్యక్షుఁడు యస్. శి. రాయిగారు నన్నుఁ గోరిరి. నాకు లాహూరుపరిస్థితులు కళాశాలా వ్యవహారములును బాగుగఁ దెలియకుండుటవలన, ఆవిషయమై సవిస్తరమగు నుత్తరము వ్రాయుమని బంగారయ్య నిదివఱకే వేఁడితిని. నా కాతఁడీ ప్రత్యుత్తర మిచ్చెను : -

లాహూరు, 21 - 12 - 1916

"ప్రియమిత్రమా,

"మీరు ప్రశ్నలు తరుచుగ అడుగుచున్నను, సంధిగ్ధములుగా జవాబులువ్రాసి, కాలక్షేపము చేసియున్నాను. ఊరకుండుటకు వీలు లేనందున జవాబు వ్రాయుచున్నాను.

"ఇచట జీతము వృద్ధి అంటే యేమిటో బాగా తెలిసినట్టు కనబడదు. ప్రతి సంవత్సరాంతమున ఉపాధ్యాయుల జీతములు హెచ్చింపబడవు. ఎంతజీతముపైని ఎవరిని తీసికొనివచ్చెదరో, మామూలుగా ఆజీతముమీదనే వాని నుంచెదరు !

"ఉపాధ్యాయుడు గొప్పవాడని విద్యార్థుల మూలముగా తెలియవలెను. విద్యార్థులు ఎంతచెపితే అంత అధికారులు నమ్మెదరు! "దయాళసింగు కాలేజికి ధనము బాగానున్నది. లాహూరు కాలేజీలలో నిదియె మిగుల ధనవంతమైనది.

"నే నున్నానను ధైర్యముతో మీరు రావలె ననుకొనుచున్నారు...సాధ్యమైనంత త్వరలో నేను మనవైపు రావలెనని యున్నది. ఇక్కడ శీతలము ఉష్ణము అతి విశేషము. కూరలు మంచివి దొరకవు. చచ్చు బెండకాయలు, బటాణీలు, గోబీపువ్వు, కందచేమలును తప్ప మరేమి దొరకవు. నేయి అతిప్రియము. నోటబెట్ట నసహ్యము ! పాలుమాత్రము చౌక. నీటివసతి బాగా లేదు.. ప్రశస్తమైన గుంటూరుపని వదలి, ఇంతదూరము మీ వయస్సులో వచ్చుట అసమంజసము....భ బంగారయ్య."

మిత్రుని యుత్తరమువలన నా సంశయవిచ్ఛేద మయ్యెను. మేము స్థానము వీడుట నాభార్య కసమ్మతము. మమ్ముఁజూచిపోవుట కిపుడు గుంటూరువచ్చిన మాతమ్ముఁడు వెంకటరామయ్యకూడ నిష్టపడలేదు. పర్యవసానము, నా కీయుద్యోగ మక్కఱలేదని మాఱు తంతి నిచ్చివేసి, తమ కిచ్చినశ్రమకు మన్నింపుడని యచటి మిత్రులకు వ్రాసివైచితిని. లాహూరు ఉద్యోగమునకై నేను జేసిన కృషి యంతయు నిట్లు వృథాప్రయాస మయ్యెను !

18. దు:ఖోపశమన ప్రయత్నములు (2)

1916 వ సంవత్సరము డిశంబరు 31 వ తేదీ దినచర్య యందు నే నిటు వ్రాసితిని : - "ప్రార్థన సమాజమున నేను ఉపాసనను జరిపితిని. ప్రార్థనచేయుటకు మిగుల లజ్జ నొందితిని. చిన్నపిల్లవాని మరణమునకుఁ బిమ్మట దేవు నారాధించుట కిదియె