ఆత్మచరిత్రము/తృతీయభాగము : ఉపన్యాసకదశ/జననీ సంస్మరణము
సంధుఁడును, ఋషిసత్తముని బోలిన జితేంద్రియుఁడును, ఐనను, ఆయన న్యాయ మనుకొనిన పథమునుండి మనుష్యమాత్రు లెవరు నాయనను గదలుపలేరు.
ఇచటికి వచ్చునప్పటికి నాకు మరల ప్రార్థనసమాజాధ్వర్యము సిద్ధ మయ్యెను. నేను బూర్వము బెజవాడలో నుండునపుడు, కృష్ణా, మండల సభా సందర్భమున, వెంకటరత్నమునాయఁడుగారు, నేను మిత్రులును సంస్కృతపాఠశాలలో సమావేశమై నెలకొల్పిన సమాజమె యిపుడు దినదినాభివృద్ధి గాంచుచుండెను. శ్రీయుతులు చల్లా శేషగిరిరావు, చట్టి దుర్గయ్య, ఉన్నవ లక్ష్మీనారాయణగార్లు దీని నిపుడు నడుపుచుండిరి. ఇపుడు నే నీబృందమునఁజేరి పనులు సాగించితిని.
8. జననీ సంస్మరణము
నేను గుంటూరు వచ్చిన కొలఁది దినములకే, మాతల్లికి వ్యాధి హెచ్చెనని తెలిసెను. ఆమెనిచటికిఁ దీసికొని వచ్చుట కేమియు వలను పడకుండెను. ఆమెవ్యాధి ప్రకోపించెనని నాకొకనాఁడు తంతిరాఁగా, సకుటుంబముగ నేను నరసాపురము పోయితిని. నంజు ముదిరినను, మాయమ్మ స్పృహతో నుండెను. ఇంతదూరమున నుండు నేను, అవసానసమయమునఁ దన్ను వీక్షింప వేగముగ వచ్చినందు కామె యమితసంతోష మందెను. అంతకంత కా మెవ్యాధి ప్రబలి, 1908 మార్చి 15 వ తేది రాత్రికి ధాతువు క్షీణించెను. చివరిని మేషమువఱకును స్పృహగలిగి, సంతానమందఱును తన్నుఁ బరివేష్టించియుండఁగా, వారినిఁ జూచి సంతోషించుచు, భగవన్నామ సంకీర్తనముఁ జేసికొనుచు, తెల్లవాఱునప్పటికి మాయమ్మ పరలోక ప్రాప్తిఁ జెందెను. మాజనని మరణమును గుఱించి నే నారోజులలో వ్రాసియుంచుకొనిన యాంగ్ల వ్యాసములోని ముఖ్యాంశము లిం దనువదించు చున్నాను : -
జీవితమునందువలెనే, మరణావస్థలోను, మాజనని వ్యక్తి విశేషమున నొప్పియుండెను. మాజనకునివలెఁ గాక యామె చివర నిమేషమువఱకును స్పృహతోనుండెను. ఇంతియకాదు. ప్రాణోత్క్రమణ సమయమున నాపుణ్యవతి శక్తియుక్తులు తీవ్రపటుత్వము దాల్చెను. తనజీవ మెగిరిపోవుచుండుట తెలిసియు, ఆమె యేమియు విచారము నొందదు. మరణవేదనలోఁ గొందఱు దైవమును దూఱెదరందురు. ఆమె యట్లు చేయలేదు. "నా కీవేదనను సంభవింపఁజేసిన దైవము, కావలసిన యోరిమికూడ ననుగ్రహించెనుసుమీ" అని నుడువునపుడు, ఆమెయాత్మ స్ఫటికాకృతిని దాల్చియుండెను.
మరణము తఱుముకొని వచ్చుచుండునపుడు, తనమంచము చుట్టును నిలుచుండిన కుమాళ్లను, కొమరితలను ఆపుణ్యవతి పలుమా రాత్రమునఁ దేఱిపాఱిచూచెను. సోగకనులా సుదతివదనమునకుఁ గాంతి నిచ్చుచుండెడివి. ఇపు డాముఖబింబము నంతటిని నిడుదకను లాక్రమించినట్లు తోఁచెను. దు:ఖపారవశ్య మందిన నే నామెశిరస్సును బట్టుకొని యుంటిని. స్వేచ్ఛయె యున్నచో, దు:ఖాతిరేకమున నేను నేలఁబడి పొరలెడివాఁడనే ! కాని, యాత్మనిగ్రహము దాల్పవలసిన సమయమిది. నే నామె తొలిచూలి బిడ్డను. ఈప్రాముఖ్యమునకు సదృశమగు బాధ్యతను మఱింత యోరిమితో నేను వహింపవలసి వచ్చెను. నేను దు:ఖానిష్ఠుఁడను కాఁగూడదు. మాతృప్రాణోత్క్రమణ పవిత్ర సమయమున చుట్టును శాంతినిగ్రహములు నెలకొల్పుభారము నామీఁద నున్నది. అధిక జాగరూకతతో వీక్షించెడి మాతల్లి చక్షువులకు, మాకడగొట్టుచెల్లెలి కనుంగవ నేర్పడిన బాష్పకణములంత పొడగట్టి, బాలికదు:ఖమునకుఁ గారణ మేమని యామె యడిగెను. తా నేడువలె దను చెల్లెలిమాటను గొంతసరిది, సంతోషముననే యుంటిమని నేనంటిని. "మీసంతోషమునకుఁ గారణమే" మను జనని ప్రశ్నమునకు, "నీమంచమునుజుట్టి యుండుభాగ్యము మాకు దొరకినందుకు" అని నేను సమాధానము చెప్పితిని. తనకుఁగోరిక లేవైనఁ గలవాయని మాతమ్ముఁడు కృష్ణయ్య యడుగఁగా, తనకేమియు వాంఛలు లేవని యామె చెప్పివేసెను. కోరికయే పునరావృత్తికి హేతువని నమ్మినది గావున, ఆవనిత వాంఛారహితత్వమున నుండెను. ఆసమయమున నాసుశీల యాత్మ దేవభావమునఁ దేజరిల్లెను. మితభాషిత్వ మామానినికి నైజగుణము. ఆమె నిశ్చలదైవభక్తిగల పుణ్యాంగనయని మాకుఁ దెలియునుగాని, తత్త్వవిషయములందు నట్టియజ్ఞానయనియె మేమనుకొనెడివారము. ఆతరుణమున మాత్రము, అట్లామె గానఁబడలేదు. మరణసమయానుగుణ్యమగు "ముప్పున కాలకింకరులు" అనుదాశరధీశతకములోని పద్యమును, మఱికొన్ని పద్యములు పాటలును ఆమె పాడి, హరినామస్మరణము చేసికొనసాగెను.
"దానధర్మము లేమైన చేసికొనెదవా?" అని మాలో నొకర మడుగఁగా, మా కిష్టమున్న నేదైనఁ జేయవచ్చునుగాని, తన కట్టివానితో జోక్యమిఁక లేదని యామె యనెను. భూలోకజీవితము విడనాడి వెడలిపోవు జీవుని దృష్టిని దానధర్మముల వైపునకైన మరలింపఁదగదని మాయమ్మ మమ్ము వారించెను. వెనుకటి నోములఫలితముగ, తన సంతతి బుద్ధిమంతులు, ప్రయోజకులునై, అవసానసమయమున నిట్లు తనను బరివేష్టించి యుండుటయే మహాసుకృతమని యా సుగుణవతి యెంచెను. ఆమె కింతటితోనే సంతృప్తి ! ఇంతకంటె నేమియు పుడమియం దా పుణ్యవతి కక్కఱలేదు !
ఈసమయమున నాధర్మశీల యాలోచనలన్నియు దైవమును గుఱించినవియె. జీవితమునఁ దనకు పరమాప్తుఁడును, ఇపుడు పరమావధియు నైన పరమాత్ముని మీఁదికే మాతల్లి తనదృష్టి నిగిడ్చెను. ఆపద్బాంధవుఁడని దేవునిపాదకమలము లామె యిపు డాకస్మికముగ పట్టుచుండలేదు. భూలోకమునఁ దన విధ్యుక్తములను నెరవేర్చి, భవభారమున నలసినజీవి పరమాత్మను జేరునట్టుగ, నాపుణ్యవతి తన పాటలు పద్యములను పాడుకొనుచుండెను.
ఆవ్యక్తియొక్క ప్రశాంతమనస్సు, సమబుద్ధి, సమధిక భక్తియును, ఈ యంత్యరంగశోభను మఱింత వృద్ధిచేసెను. కాని, వెను వెంటనే మరణము సంభవింపలేదు. ననులుమోడ్చి యాకాంత భగవన్నామసంకీర్తనము చేసికొనుచుండెను. ఆమెచెవిలో నీశ్వరనామము మేము పలుకఁగా, 'నారాయణ' అని యామె మాఱుపలికెను. ఆసమయమున నామనస్సునఁదోఁచిన పాపపుఁదలంపు నొకటియచటఁ బేర్కొనుచున్నాను. ఆమెమరణమునకు మంచి తరుణమిదియే గదాయని నే ననుకొంటిని. తనయుఁడనగు నేను తల్లిచావును గోరితినే యని నే నంత నొచ్చుకొంటిని.
నావలెనే మాతమ్ములును దలపోయసాగిరి. ఈశ్వరధ్యాన నిమగ్నయై యుండునపు డీజీవికి మృత్యు వాసన్న మగుట పుణ్యము గదాయని మే మనుకొంటిమి. కాని, యామె యింకనొకరోజు జీవించునటులఁ దోఁచెను. ఇంతలో నామె నిద్దురపోవునటు లుండెను. కొలఁది నిముషములలోనే యొకటి రెండు మాఱులు దీర్ఘనిశ్వాసములు గానవచ్చి. ఆమె మరణించెను. అవసానసమయమున నీశ్వరనామమును వట్టి యూఁతపదముగఁగాక, ప్రాణపదమగు పవిత్రనామముగఁ జేకొని, జీవితమును విడనాడిన దన్యజీవిత యీ సుదతియని మాకు స్పష్టమయ్యెను.
మాతలిదండ్రులకుఁగల తారతమ్య మిట సంగ్రహముగఁ దెలిపెదను. తండ్రి నిష్కపటుఁడు, హాస్యవచనధోరణిగల వాచాలుఁడు. తల్లియన్ననో, నిగ్రహనిదానములు గల మితభాషిణి. మాజనకుఁడు పొంగారెడి హృదయమున మమ్ముఁ బ్రేమించువాఁడు. మేము నటులే యాయనను బ్రేమించువారము. కాని, యెక్కువ చనవున నొక్కొక్కప్పుడు మే మాయనను జులుకనగఁ జూచుచుండువారము. మాతల్లిపట్ల యట్లుగాదు. ఆమెయెడ మాకుఁగల ప్రేమ భయభక్తులతోఁ గూడియుండునది. ఆమె మా కెంత ప్రేమాస్పదయైనను, మే మామెతో కోఁతికొమ్మచ్చియాట లాడరాదు. అడ్డు వచ్చిన చెట్ల చేమల నెల్లను తనప్రవాహ వేగమునఁ గొట్టివేయునట్టి పర్వత ప్రాంతమందలి సెలయేరువంటిది మాజనకిని ప్రేమము. ప్రేమయం దాయనహృదయ మిచ్చెడివాఁడు. పిల్లల కెవరికైన తీవ్రవ్యాధి సోఁకినచో, శిశువువలె విలపించి, వలసినచో తనయసువుల నర్పింపఁ జూచుచుండువాఁడు. బాలికవలె జాలిగుండెగలవాఁడు. స్వచ్చమును, స్పష్టమును నైన యనురాగము చూపుచుండువాఁడు. మా కెఱుకఁ బడనిలోపము లాయనయందు లేనేలేవు. ఆయన వైపరీత్యములు వైకల్యములును ప్రస్తావించి, మే మెత్తిపొడుచుచుండువారము.
కాని, మాతల్లివిషయ మట్టిది గాదు. ఆమె నిశ్చలబుద్ధియగు ధైర్యవతి. ఆమెకును సుహృదయము లేకపోలేదు. ఐనను, మాతండ్రికిఁ గల భావసంపదయు, భావవైపరీత్యములును గూడ నామె యొద్దలేవు. మితభాషిణియగు మాతల్లి భావవిస్ఫురణ చేయనొల్లని స్వభావము గలది. చిన్ననాఁడు రాజమంద్రిలో నేను నాపెద్ద తమ్ముఁడును ఆమెశిక్షణ మనుభవించినవారమె. ఆమెమాట జవదాఁటఁగూడనది. ఆమెగృహపరిపాలనము భయంకరము గాకున్ననుఁ క్రమశిక్షణముతోఁ గూడుకొనినదియె. ఆమెబుజ్జగింపులు నధికాగ్రహ, మును గూడ మే మెఱుంగము. మాచిన్న నాఁ డామెయాజ్ఞల కింత కాఠిన్య ముండుటకుఁ గారణము, మాతండ్రి యింటిపట్టున నుండక, గృహయాజమాన్య మామెమీఁదఁ బడుటయె. మొదట నిటులుండినను, పిల్ల లెక్కువయైన కొలఁది, మాతల్లికాఠిన్యము సడలెను. ఆమె బలహీన. ఒక్కతెయె యింటిపనులన్నియు నెరవేర్చుకొనవలసివచ్చెను. పిల్లలము మేమామెకుఁ గొంత దోడ్పడుచుండువారము. కాని, గృహకృత్యభారమును, పసివారలతోడి బాధలును, ఆమె మనస్సును మిగులఁ గలఁత నొందించెను. సమష్టికుటుంబమునకు స్వతస్సిద్ధమగు గృహచ్ఛిద్రములు, తరువాతకాలమునందు సంసారమందలి యైక్యమునకు భంగము గలిగించెను. దీర్ఘవ్యాధియు మాతల్లి మనోవ్యాకులతను హెచ్చించెను. ఇంట నిటీవల సంభవించిన మరణములు కూడ దీనికిఁ గారణభూతమయ్యెను.
ఏది యెటు లుండినను, మాజనని స్వభావ సిద్ధగుణములు శాంతత, ఓరిమి, మితభాషిత్వమును. దైవభక్తియందువలెనే ప్రేమ విషయమునందును, ఆమానిని ప్రశాంత గాంభీర్యములతో నొప్పెడిది. విశాలమగు గోదావరీనదీప్రవాహమువలె నామెప్రేమగుణము గంభీరముగనుండి, కుంటువడని గమనమున సాగిపోవు చుండెడిది. మాజనని ప్రేమము, ఆవిశ్వజననిప్రేమమువలెనే సమత్వ సర్వాంతర్యామిత్వములతో మాకుఁ బ్రసరించెడిది. పిల్లలమగు మాశ్రేయస్సుకొఱకును, మావిద్యాభివృద్ధికొఱకునుఁ మాతల్లి సదా పాటుపడెను. ఆపదయందు ధైర్యము, సంపదయం దణవకువయును విడువక, ఆయిల్లాలు సంసార యాత్ర సలిపెను. ఇట్టి సుగుణాన్వితయగు జనని గర్భావాసమున నుద్భవించుట మహాభాగ్యముగదా ! దయామయుఁడగు భగవంతుఁడు మాజననీ జనకుల కాత్మశాంతి యొసంగి, వారి సుగుణములు వంశమున నిలుచునటు లను గ్రహించుఁగాక !
9. నూతనపరిస్థితులు
నేను గుంటూరు వచ్చుటకుఁ బూర్వమే "జనానాపత్రికా" ప్రకటనము నిలిచిపోయెను. పత్రికాధిపత్యమును, పుస్తకముల స్వామ్యమును, వెనుక గున్నేశ్వరరావుగారి కిచ్చివేసితిని. ఇపు డవి తిరిగి వారి నుండి నేను గైకొంటిని. కాని, పత్రికను పునరుద్ధారణము చేయ నెన్ని మాఱులు నేను సంకల్పించినను, ఆకార్యము కొనసాగలేదు. గుంటూరు కళాశాలలోపని యెక్కువగ నుండుటచే మరల పత్రికను నెలకొల్పుటకు నేను వెఱచితిని. సంవత్సరములనుండి జరుగు సంస్థకొక సారియంత రాయమేమైన సంభవించెనా, దానిని బునరుద్ధరించుట కన్నియు ప్రతిబంధములే యగుచుండును. వ్రాయు నభ్యాసము నాకు క్రమక్రమముగ తగ్గిపోవుటచేత, పత్రికాప్రకటనము కష్టముగఁ దోఁచి, దానియం దనిష్టము గలిగెను. ఆపత్రిక కాకపోయిన వేఱొకటి నెలకొల్పరాదాయని మిత్రు లనిరి. ఒకానొక సమయమున మరల పత్రిక నొకటి స్థాపింప నెంచి, పత్రికకు మంచి పేరు కుదుర్చుఁ డని తోడి యుపధ్యాయ మిత్రులగు వంగిపురపు కృష్ణమాచార్యులుగారి నడిగితిని. నాకు స్ఫురించిన "విద్యావిలాసిని" అను పేరు మంచిదని యాచార్యులవారు సమర్థించిరి. "సత్యసంవర్థని"నె యేల పునరుద్ధ