ఆత్మచరిత్రము/తృతీయభాగము : ఉపన్యాసకదశ/కథావిరచనము
కుమారుఁడు కృష్ణారావు చెన్నపురికిఁ బ్రయాణము గట్టెను. ఆ పరిక్షలో నతని కపుడు జయము గలిగెను.
మా చెల్లెలి రెండవకుమార్తె సీతమ్మ ప్రసవముకాలేక బాధనొందుచున్న దని నాకు డిశెంబరు 5 వ తేదీని కాకినాడనుండి తంతివచ్చెను. నేను మఱునాఁటి రెయిలుమీఁద కాకినాడ చేరునప్పటికె సీతమ్మ సుఖప్రసవ మయ్యెననియు, మగపిల్లవాఁడు కలిగె ననియును నాకుఁ దెలిసెను. వారిని గుఱించి కొన్ని యేర్పాటులు చేసి, నేను నెల్లూరు వచ్చివేసితిని.
డిసెంబరు సెలవులలో పోడూరి వెంకయ్యగారి రెండవ చెల్లెల్లిపెండ్లి, నెల్లూరిలో మాయింటనె జరిగెను. ఆ వివాహసందర్శనార్థమై వచ్చిన మాతమ్ముఁడు వెంకటరామయ్య, భార్య, పిల్లలును మాతోఁ గలసి మద్రాసువచ్చిరి. ఆనగరమున వినోదములు చూచుచుఁ గొన్ని దినములు గడపి, మే మంత గుంటూరు వెడలి పోయితిమి.
25. కథావిరచనము
1922 వ సంవత్సరము ఫిబ్రవరి 12 వ తేదీని మాతమ్ముఁడు కృష్ణమూర్తియొద్దనుండి నాకు తంతిరాఁగా, నేను మఱునాఁడు కొండపల్లి పయనమయితిని. కొండపల్లికిఁ జేరువనుండు వెలిగలేటిలో కృష్ణమూర్తి పెద్దయల్లునికి మిగుల జబ్బుగనుండెననియె యావార్త. కాని, నేనచటికిఁబోవునప్పటికె యా యువకుఁడు చనిపోయెననియు, అతనికుటుంబము, మాతమ్ములు, ఆఁడువాండ్రును వారిగ్రామము జగన్నాధపురము వెడలిపోయిరనియు నేను వింటిని. చనిపోయిన ద్రతీరమునఁ గల కొండలవంటి యిసుకదిబ్బలమీఁద నుండి క్రిందికి దొరలుచు మే మమితానంద మందితిమి. మధ్యాహ్న సమయమున మే మొక దోనెలో బకింగుహాము కాలువమీఁద పయనము చేసి, ఆ ప్రాంతమందు పొట్టి యడవియావు లుండెనని విని, వానిని జూచుటకై వనమునఁ దిరిగితిమి. కాని యానాఁడు మాకంటి కా జంతువు లగఁబడలేదు.
ఈ సంవత్సరమున మా తమ్ముఁడు వెంకటరామయ్య మూఁడవ కుమారుఁడు సూర్యనారాయణ వివాహము జరిగెను. మా బావ మఱఁది వెలిచేటి వెంకటరత్నము రెండవకుమార్తె మాలతి నిచ్చి వీనికిఁ బెండ్లి చేసిరి. పెండ్లి నిడదవోలు సత్రములో జరిగెను.
మా తమ్ముఁడు వెంకటరామయ్య నాకు మంచిభూములు కొనిపెట్టుచు వచ్చెను. ఏలూరులోని రామా ముద్రాక్షర శాలాధికారి ఈదర వెంకటరావుగారు, తమ ముద్రాలయమున నా తెలుఁగు పుస్తకములు పునర్ముద్రణము చేయించెద నని కొంతకాలము నుండి నాకుఁ జెప్పుచు వచ్చెను. 1923 వ సంవత్సరము డిశంబరు నెలలో "హిందూ సుందరీమణుల చరిత్రములు" ప్రథమ ద్వితీయ భాగముల పుస్తకముల మూఁడవ కూర్పు నాకొఱకు వారు ముద్రించిరి.
ఆ నెలలోనే కాకినాడ నగరమున దేశీయమహాసభ జరిగెను. మిత్రులు కొండ వెంకటప్పయ్యగారు ఆహ్వానసంఘాధ్యక్షు లగుట చేత సకుటుంబముగ నే నా మహాసభ కేగుటకుఁ బ్రోత్సాహము గలిగెను. అద్దెకు మేము కాకినాడ గాంధీనగరమునఁ బుచ్చుకొనిన కుటీరములో మా తమ్ములు, వారి పిల్లలు, ఇంకఁ బలువురు బంథుమిత్రులును విడిసియుండిరి. ఆదినములలోనె శ్రీ కాశీనాథుని నాగేశ్వర రావుగారి "భారతీ" పత్రిక వెలువడెను. "చెల్లనునియాత్ర" అను శీర్షికతో నేను చెన్నపురి "స్వరాజ్య" పత్రికలో మహాసభకు సంబంధించిన యాంగ్లవ్యాసములు కొన్ని కథారూపమున వ్రాసితిని. దేశీయమహాసభా సందర్భమున నా కన్నుల నమితముగ నాకర్షించిన మహాపురుషుల జంటలు రెండు గలవు. వీరు వరుసఁగా, తండ్రి కొడుకులగు మోతీలాలు నెహ్రూ జవహరిలాలు నెహ్రూలును, అన్నదమ్ము లగు విటాల్బాయి పఠేలు వల్లభాయి పఠేలును. ఈజంటలలో నొకరి కొకరికిఁ గల తారతమ్యములను నేను వర్ణించితిని.
1924 వ సంవత్సరమున నేను చెన్నపురి విశ్వవిద్యాలయపు సెనెటులో సభ్యుఁడ నైతిని. ఆ యేప్రిలు నెలలో రామా ముద్రాలయమున నా "హిందూసుందరీమణుల"మూఁడవ భాగము ముద్రింపఁబడియెను. ఇ ట్లీ ముద్రాలయమున నా "హిందూసుందరుల"మూఁడు భాగముల పుస్తకములును పునర్ముద్రితము లయ్యెను.
మొదటి కూర్పు పుస్తకములవలెనే యీ క్రొత్తకూర్పు "హిందూసుందరీమణుల చరిత్రములును" మా జనని కివ్విధమునఁ గృతి యిచ్చితిని : -
సీ. తనభక్తి కలరి మజ్జనకుండు శ్రీ సుబ్బ
రాయఁ డనూన హర్షమునఁ దేల
తన యపారంబగు దయకు నశ్రాంతంబు
తనయులు మిగుల సంతసము నొంద
తనసుశీలత బంధుజనుల యుల్లంబుల
లలితమౌ నానందలహరి ముంప
తనపూతచరితంబు జనకతమాజాది
వనితల వృత్తంబు ననుకరింప
తే. జీవయాత్రసలిపి జీవితేశ్వరువెంట
దివికి నరిగినట్టి భువనసుతకు
సీతమాంబికకును మాతల్లి కీకృతి
నంకితం బొనర్తు నధికభక్తి.
ఈ సంవత్సరారంభమునుండి నేను తెలుఁగు పత్రికలకు విరివిగ వ్యాసములు వ్రాయ నారంభించితిని. నే నీ 1924 వ సంవత్సరమున "భారతీ" పత్రికకు వ్రాసిన కథలు, "మాణిక్యము", "మాలతి", "నాగరాజు", "కొఱవిదయ్యమును". ఈ కడపటి రెండింటిలోను, చిన్ననాఁడు నే వినినట్టియు, దేశమున వ్యాపించినట్టియు గాథలాధారముగఁ జేకొని కథ యల్లితిని. కాని, మాలతీ మాణిక్యములలోని కథ యామూలాగ్రముగ నా సొంతమె. కథాసందర్భమున దేశీయసాంప్రదాయములను నేను బ్రదర్శింప యత్నించితిని. నవీనాంధ్రదేశమున విద్యాధికుల హృదయసీమల మొలక లెత్తుచుండెడి యాశయములను నే నిందుఁ గనఁబఱచితిని. అనగత్యమగు నీతిబోధనముతోఁ జదువరులను విసివింపక, వారలకు వినోద మొనఁగూర్చుటయె నేను ముఖ్యాశయముగఁ జేసికొంటిని. ఐనను, కొందఱు రచయితల వలె దుర్నీతి కెడమిచ్చెడి యంశములు వర్ణించెడి మాయాకథ లల్లుట నాకు రుచింపదు. చదువరుల మనస్సులకు కథాసంవిధానమందలి వినోదముతోఁబాటు సుగుణజాలమందును, ఉన్నతాశయము లందును నభిరుచి గలిగింపవలె ననియె నా యాశయము.
ఈ కథలు నేను వ్రాయునపుడు, వానిని నా మిత్రులును, నెల్లూరు కళాశాలలో నుపన్యాసకులునునగు శ్రీయుతులు గుఱ్ఱం సుబ్బరామయ్య, దుర్భా సుబ్రహ్మణ్యశర్మగార్లకుఁ జూపించి, భావవిస్ఫురణ భాషాసౌష్ఠవములందు వానిలోఁ గల లోపములను సంస్కరించుచుండువాఁడను. అన్ని విధము లగు సొంపులతో నలరారెడి కథా భూషణమును భాషాయోష కర్పించుటయె నా మహాశయము. కథ ననేకమాఱులు నేను జదువుకొని, దానియం దేమాత్రమగు లోపము గానిపించినను, అది దిద్దక పత్రికలోఁ బ్రచురణకై ప్రతి నంపువాఁడను కాను.
1901 వ సంవత్సరముననే "చిత్రకథామంజరి" అను శీర్షికతో నే నొక కథాపుస్తకమును బ్రచురించియుంటిని. దీనిలో కల్పితకథలు గాని "నూర్జహాను" మున్నగు రచనములు కొన్ని గలవు. ఇపుడు వానిని దీసివైచి, వానికి బదులుగ నే నిటీవల "భారతి" మున్నగు పత్రికలలో వ్రాసిన స్వకపోలకల్పితము లగు 'గౌతమి', 'మాణిక్యము', 'మాలతి' మున్నగు కథలు కొన్ని చేర్చి, 'చిత్రకథామంజరి' రెండవ కూర్పును, ఏలూరు రామా ముద్రాలయమునఁ బ్రచురించితిని.
ఈ "చిత్రకథామంజరి" ప్రథమభాగమందలి కథలలో నేది యత్యుత్తమ మైనదో నిర్ధారణచేయు పట్ల మిత్రులకు నాకును గొంత యభిప్రాయభేదము గలిగెను. కథావైచిత్ర్యమున "కృష్ణవేణి" తమకు హృద్యముగ నున్న దనియు, దానిని నాటకముగఁ వ్రాయఁ దా నొకానొకపు డెంచితి మనియు, ఆపుస్తకమును కళాశాల తరగతిలో పిమ్మట బోధించిన దుర్భా సుబ్రహ్మణ్యశర్మగారు నాకుఁ జెప్పిరి. "శారద" చక్కగ నున్నదని యా కథ చదివిన యొక రిద్దఱు చిన్ని వాలికలు నాతో ననిరి. 'గౌతమి' బాగుగ నున్న దని యొకరును, 'మాలతి' 'నిశ్చల'లు మంచివని మఱి యొకరును నభిప్రాయ మందిరి. కన్నవారికి సంతతి యందఱి యందును సమానప్రేమమె. ఐనను నా కేకారణముననొ "మాణి క్యము" నం దభిమానము మెండు. అది యిందలి కథలలోనె కాదు, నేను వ్రాసిన కథ లన్నిటిలోను నుద్రిక్తభావవర్ణన విషయమున ప్రథమగణ్య మని భావించువాఁడను.
ఈ "చిత్రకథామంజరి" ప్రథమభాగమును నా గురువర్యులగు వీరేశలింగముపంతులుగారికిఁ గృతి యిచ్చుట యుక్త మని తలంచి, యీ క్రింది పద్యమున వారి కది యంకితము చేసితిని.
తే. "గద్య తిక్కన సంఘసంస్కర్త ఘనుఁడు
కోవిదుఁడు రావుబహద్దరు గురువు మాకు
కందుకూరి వీరేశలింగ కవిమణికి
నంకిత మొనర్తు నీగ్రంథ మధికభక్తి."
26. శుభాశుభములు(2)
1925 వ సంవత్సరాంతమున మద్రాసు అడియారులో జరిగిన యొక సభాసందర్భమున నేను శ్రీదేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావుపంతులుగారితోఁ గలసి మాటాడుచు, నేను వ్రాసియుంచిన "కమలాక్షి" నవలను దాము ప్రకటింతురా యని యడిగితిని. వారు బాగుగ నాలోచించి, తా మిటీవల క్రొత్తరకఁపుఁ బుస్తకములు ప్రకటింప యోజించుచుంటిమి గాన, ఆ గ్రంథమాల కేపేరు పెట్టుట యుక్తమో చెప్పుమని న న్నడిగిరి. దానికి "నాగేశ్వర గ్రంథమాల" యని గాని, "ఆంధ్రగ్రంథమాల" యని గాని పేరు పెట్టుఁ డని నే నంటిని. వారి కోరికమీఁద "కమలాక్షి" ప్రతిని వారి కంపితిని. "ఆంధ్రగ్రంథమాల"కుఁ 'గమలాక్షి'యె ప్రథమపుష్ప మైనను, ఆ సమయమునకె సిద్ధమైన మఱికొన్ని పుస్తకము లుండుటచేత, నా పుస్తక మాగ్రంథమాలలో చతుర్థకుసుమ మయ్యెను.
ఈ పుస్తకములో వలసిన మార్పులు చేయుటయందు నాకు శ్రీ దుర్భా సుబ్రహ్మణ్య శర్మగారు ముఖ్యముగఁ దోడుపడిరి. ఇది మాప్రియజనకున కీక్రింది పద్యమునఁ గృతియిచ్చితిని.
తే. "అర్మిలినిబ్రోచి మమ్ము విద్యావివేక
వినయవంతులఁ జేసి, సద్వృత్తి నిలిపి,
స్వస్థ్సితినిగన్న మాకూర్మి జనకుని కిది
అంకిత మొనర్తు సుబ్బారాయాఖ్యునకును."
1925 వ సంవత్సరము ఏప్రిలులో ముద్రిత మయిన యా పుస్తకపుఁ బ్రతులు నాకు నరసాపురమున నా తమ్ముఁడు కృష్ణ