ఆత్మచరిత్రము/తృతీయభాగము : ఉపన్యాసకదశ/ఉద్యోగప్రయత్నములు
"జరిగినది జరుగనిండు. నలువది సంవత్సరములప్రాయము దాఁటి, ఒకరికొకరు నూఱుమైళ్లదూరమున నున్న మనబోటి యిఱువురు మనుష్యులు, ఒండొరులను కుమ్ముకొనక, కనీసము క్రొత్తవారు మెలంగెడి రీతినైన నింక మర్యాదతో సంచరించుట కభ్యంతర ముండఁగూడదు. నే నెట్టి తులువనైనను, ఇంకముందు మనోవాక్కర్మలయందు నిగ్రహము పూనియుందు ననియును, మీయొక్కయు, నితరుల యొక్కయు చిత్తశాంతిని తొలఁగింప కుందుననియును నమ్మించు చున్నాను.
రా. వెం. శి."
11. ఉద్యోగప్రయత్నములు
నేను గుంటూరు కళాశాలలో నాపనులు సక్రమముగ నెరవేర్చు చుంటిని. అధ్యక్షులగు డాక్టరు ఊలుదొరగారు నాయందు ప్రేమగౌరవములు చూపుచుండెడివారు. విద్యాబోధనమునందును కళాశాలా పరిపాలనమునందును, వారి సమర్ధత నా కంతగఁ నచ్చకున్నను, సత్యసంధత న్యాయవిచక్షణ విధి కార్యనిర్వహణములం దాయన యుత్తమోత్తముఁడని, నేనేకాదు, చూచినవారందఱును విశ్వసించియుండిరి. ఆయన మునిసత్తమునివంటి పవిత్రవర్తనమున నొప్పువాఁడు. అట్టి సుజనుఁ డేమత మవలంబించినను, ఏసంఘమున నుండినను, ఆయాసంస్థలకు వన్నెయు వాసియుఁ గలువగలసినదే ! ఆయనమంత్రులగు నొకరిద్దఱు బోధకులు తమదుర్మంత్రముల నాయన కుపదేశించి, ఆయనను పెడదారులను ద్రొక్కించెడివారు. ఇది చూచి నాకు విచారము కలిగెడిది. కాని, యితరుల కార్యములలో జోక్యము కలిగించుకొనక, నాపనులు చక్క పెట్టుకొనుటయే నీమముగఁ జేసికొని నేనె వరితోను, ముఖ్యముగ నధ్యక్షునితోను, తగవులు పెట్టుకొనువాఁడను గాను. సామాన్యముగ నిట్టి తటస్థభావ మవలంబించియె నేను మనశ్శాంతి ననుభవించుచుండువాఁడను.
నాచెల్లెండ్రు కనకమ్మ కామేశ్వరమ్మలు గుంటూరువచ్చి, నాయొద్దఁ గొంతకాలము నివసించి వెడలిపోయిరి. ఇటీవలనే కామేశ్వరమ్మకు విశ్వనాధ మను పుత్రుఁడును, కనకమ్మకు జనార్దనమను పిల్లవాఁడును గలిగిరి. ఇదివఱకు కనకమ్మకు నరసయ్య సీతమ్మలను కొమార్తెలు గలరు.
1908 వ సంవత్సరము డిసెంబరునెలలో చెన్నపురిని దేశీయ మహాసభ జరిగెను. నే నచటికిఁ బోలేదు. తమ్ముఁడు వెంకటరామయ్య ఆనెలచివరను గుంటూరువచ్చి, తన వైద్యమునకు మద్రాసు నన్ను రమ్మనఁగా, మే మిరువురము నచటికి వెళ్లి, కొన్ని దినములుండి, మరలి వచ్చితిమి. చెన్నపురి వైద్యమువలన నతని కేమియు మేలు కలుగ లేదు. తనకు లేనిపోని జబ్బు లున్నవని యాతఁ డనుమానపడుచుండునట్లు తోఁచెను.
1909 వ సంవత్సర ప్రారంభమున గుంటూరులో దేవగుప్తాపు శేషాచలపతిరావుగారియింట జరిగిన వితంతు వివాహమునకు మేము దంపతులము పోయి తాంబూలము స్వీకరింపఁగా, పొరుగున నుండిన పూర్వాచారపరుఁడగు న్యాయవాదియొకఁడు మాయింటి కెవ్వరును భోజనమునకు రాకుండఁజేయఁ బ్రయత్నించెను. కాని, మాయింట జరిగిన యొక శుభకార్యసందర్భమున ననేకులు వచ్చి భుజించిరి. ఆన్యాయవాదియు, ననుచరులును తమపంతము నెగ్గకుండుటకు విషాదమందిరి. 1909 వ సంవత్సరమున దొరతనము వారి తెలుఁగు ట్రాన్సులేటరగు సమర్థిరంగయ్య సెట్టిగారు రైలుప్రమాదమున మరణింపఁగా, ఆయుద్యోగము ఖాళీ యయ్యెను. నన్నీపనికి దరఖాస్తు చేయుఁడని మిత్రులు ప్రోత్సహించుటచేత, జూలై నెలలో నేను అర్జీ నంపితిని. కళాశాలాధ్యక్షులు ఊల్ దొరగారును, పరీక్షాధికారులు గరికిపాటి సుబ్బారాయఁడు శాస్త్రిగారును నాకు గట్టి సిఫారసులు చేసిరి. వీరేశలింగముగారును, కిళాంబి రామానుజాచార్యులుగారును నన్ను గుఱించి సర్టీఫికేటు లొసంగిరి.
అంత కొన్ని నెలలకు ధరఖాస్తుదారులలో నెల్లమిత్రుఁడు కనకరాజునుగూర్చియు, నన్నుగుఱించియు దొరతనమువారు సదభిప్రాయులై యుండిరనియును, ఈతరుణమున నుదకమండలము వెళ్లి స్వయముగ నధికారులఁ జూచినచో నాకు లాభము గలుగుననియును స్నేహితులు చెప్పుటచేత, నేను గుంటూరునుండి బయలుదేఱితిని. నే నిదివఱ కెపుడును నీలగిరులు చూచియుండలేదు. ఇపుడు శీతకాలము సమీపించుటచేత, నేనచటనుండిన రెండు మూఁడు దినములును రాత్రులందు ఉదకమండలము ఉదకమండలమె యయ్యెను. అచ్చటి గొప్ప యుద్యోగస్థులకు నేను సిఫారసు ఉత్తరములు పట్టుకొని వెళ్లితిని. తక్కినవారినిగూడఁ జూచితిని. వారందఱు సుహృద్భావముఁ జూపిరి. అందఱికంటె నెక్కువగ శ్రీ గాలట్టీదొరగారు మనసిచ్చి నాతోమాటాడిరి. ఆయన దొరతనమువారికి 'అండరుసెక్రటరీ'. ఆయన నాతో నాంధ్రసారస్వతమును గూర్చి ముచ్చటించి, నన్నుగుఱించియు కనకరాజునుగూర్చియుఁ దమకు సదభిప్రాయము కలదని చెప్పిరి. నేను మంచి జీతము తెచ్చుకొని కళాశాలలో గొప్పయుద్యోగము చేయు చుండఁగా, నామిత్రుఁడు కనకరాజు అంగవైకల్యమునొంది న్యాయ వాదివృత్తిని ఏలూరున 'గాలి' జీవనము చేయుచుండెను గావున, అతనికే యీయుద్యోగ మగుట శ్రేయము కదా యని వారు నాతోననిరి. నాస్నేహితుని కీయుద్యోగము లభించుట నాకు నభిమతమే యని నేను జెప్పివేసితిని. అంత కనకరాజునకీ యుద్యోగ మయ్యెనని కొలఁదిరోజులకె తెలిసెను.
1910 వ సంవత్సరము మేనెలలో గుంటూరున జరిగిన మండల సంఘ సంస్కరణసభకు శ్రీ వింజమూరి భావనాచార్యులుగారు అగ్రాసనాధిపతులు. నేను ఆహ్వాన సంఘాధ్యక్షుఁడను. పండ్రెండు సంవత్సరముల క్రిందట నీ పురమున జరిగిన మండల సంఘసంస్కరణ సభలో వితంతూద్వాహమును గూర్చిన తీర్మానము ప్రజాసమ్మతము గాకుండుటయును, అతి బాల్యవివాహనిషేధమును గుఱించిన తీర్మానమున కంతరాయము గలుగ సిద్ధ మగుటయుఁ దలపోసినచో, ఇంత స్వల్పకాలమున నీ మండలమందలి సాంఘిక వాతావరణము సంస్కరణానుకూలముగ మాఱుటకు నే నెంతయు సంతసించితిని.
రాఁబోవు సంవత్సరప్రారంభమున గుంటూరున "విద్యావిషయక ప్రదర్శనము" జరిపింప నొక సమాజము 1910 వ సంవత్సరమున స్థాపిత మయ్యెను. దానికి పాఠశాలా పరీక్షాధికారులు సుబ్బరాయశాస్త్రిగారు అధ్యక్షులు. మువ్వురు కార్యదర్శులలో నేనొకఁడను. కార్యభారము తొలఁగించుకొన నే నెంత మొదట వాంఛించినను, అందఱికంటె నెక్కువగ నేనే పరిశ్రమింపవలసివచ్చెను.
కురుపాంరాజాగారగు శ్రీ వీరభద్రరాజాగారికి అంతరంగిక కార్యదర్శి కావలె నని తెలిసి నే నాయుద్యోగమునకుఁ బ్రయత్నించితిని. నే నాడిసెంబరులో మాతమ్మునితో వాల్తేరు వెళ్లి, రాజావారి దర్శనము చేసితిని. వారి యాంతరంగిక కార్యదర్శియె చట్టనిర్మాణ సభలో సభ్యులగు రాజాగారికిఁ గావలసినపనులు, సంస్థానపుఁబనులు తదితర విధులును చేయవలెననిరి. జీతము నూటయేఁబది రూపాయిలు తమతో నింగ్లండు పోవలెననియుఁ జెప్పిరి. ఇంతవఱకును విద్యాబోధకవృత్తిని ఋజుమార్గమున నుండిన నే నిపు డీక్రొత్త యుద్యోగమునఁ జేరుట యుక్తము కాదని, మార్గమధ్యమున గాకినాడలో నాయఁడుగారు మాకు నచ్చఁజెప్పిరి. కావున నేను మనసు మార్చుకొంటిని.
1911 జనవరినెల తుదిని గుంటూరులో "విద్యావిషయక సభలు" జరిగెను. పలుచోట్లనుండి విద్యార్థులు చేసిన వస్తువులు తెప్పించి, వానిని కళాశాలా భవనమునఁ బ్రదర్శించితిమి. సభలకుఁదగిన యేర్పాటులన్నియుఁ జేసితిమి. రెండవ సర్కిలులోని కృష్ణ, గుంటూరు, నెల్లూరు మండలములనుండి వచ్చిన నూఱులకొలఁది బోధకులకు వసతిగృహము లేర్పాటు చేసితిమి. ప్రదర్శనమునకు వచ్చెడి యుపాధ్యాయులకు భోజనసౌకర్యమును జేయుటకు పాలక సంఘమువారు మొదట సమ్మతింపలేదు. ఇట్టి సౌకర్యము లున్నఁగాని సభ జయప్రదముగ జరుగదని ఏకారామయ్యగారు నేనును గట్టిపట్టు పట్టుటచేత, మాపంతము నెగ్గెను. కాని యీభోజనసదుపాయము గలిగించు భారము మా యిరువురిమీఁదను బడెను. రామయ్యపంతులుగారు సాహసముగలవాఁడు. గొప్పసమావేశములకుఁ దగిన యేర్పాటులు చేయుటయం దాయన సమర్థుఁడు. అంత మావిధులను మేము సక్రమముగఁ జెల్లించితిమి.
1911 జనవరి 24 నుండి 28 వ తేదీవఱకును బహిరంగ సభలు, ప్రదర్శనమును జరిగెను. సమర్థు లయినవారు సభలలో నుప న్యాసకులుగను, అధ్యక్షకులుగను నుండిరి. విద్యాశాఖ డైరెక్టరు స్టోను దొరగారు ప్రదర్శనము నారంభించిరి. సుబ్బారాయఁడుశాస్త్రిగారు స్వాగతోపన్యాస మిచ్చిరి. "పాఠశాలలోని పని-తలిదండ్రుల" ను గూర్చి నేనొక యాంధ్రవ్యాసమును రచించి చదివితిని.
12. చెల్లెలి మరణము
1911 వ సంవత్సరమున కళాశాలలో విద్యాబోధనమునకంటె నితర వ్యాసంగములే నా కెక్కువ భారమయ్యెను. విద్యావిషయక సభలనుగుఱించి యిదివఱకె ప్రస్తావించితిని. ఆ జనవరిలో సభలు ప్రదర్శనములు జరిగెనేగాని, ప్రదర్శనమునకు సంబంధించిన పను లెన్నియో మిగిలియుండెను. ఆ సంవత్సరపు "ఆంధ్ర పత్రిక : ఉగాదిసంచిక"లో "ఉత్తమబోధక లక్షణము" లను గూర్చి నే నొక వ్యాసమును వ్రాసితిని. ఈశ్వరముఖముఁ జూచియు పారమార్థిక చింతతోడను, ఉపాధ్యాయ ధర్మనిర్వహణమునకుఁ గడంగిన బోధకుఁడె బోధకుఁ డనియు, అట్టి గురుముఖమున శిష్యునికి లభించిన విద్యయే విద్యయనియును, గురువు విద్యాపారంగతుఁడు గావలెననియు, విద్యాబోధనమువలని ముఖ్యప్రయోజనము విద్యార్థికి జ్ఞానమునకంటె నయసంపద సమకూర్చుటయే యనియు, మంచి యుపాధ్యాయుఁడు మానుషస్వభావమును గ్రహించి శిష్యుని మన:కుసుమమునకు వికసనము గలిగించి, శ్రీకృష్ణుఁడు అర్జునుని పట్ల మెలంగినట్లు మెలంగుననియును నేను వ్రాసితిని.
ఆ సంవత్సరము 16 ఏప్రిలున, నరసాపురమున జరిగిన "కృష్ణా గుంటూరుమండల సంఘసంస్కరణసభ"కు నానగ్రాసనాధిపతిగఁ గోరు