ఆత్మచరిత్రము/తృతీయభాగము : ఉపన్యాసకదశ/"చన్నపురి చక్షువులకు బంగాళాపద్ధతులు"
తాత్కాలికముగ మే మొక యింటిభాగమునఁ గాఁపురముంటిమి. నేను కళాశాల చేరి నా పనులు చూచుకొనుచువచ్చితిని. వేసవి సెలవు లీయఁగనె మేము వెలిచేరు వెళ్లితిమి. అచట మా యత్త మామలు, బావమఱఁది కుటుంబమువారు నుండిరి. మా బావమఱఁది పెద్దకొమార్తె చంద్రమతిని మామఱఁదలు చామాలమ్మ కుమారుఁడు కృష్ణారావునకుఁ బెండ్లిచేయ నిశ్చయ మయ్యెను. ఆలగ్నముననే మా తమ్ముఁడు కృష్ణమూర్తి పెద్ద కొమార్తె సీతమ్మవివాహముకూడ జరుగవలసియుండెను. నే నీ పెండ్లి వేడుకలలోఁ బడిపోయితినేని, నా చదువు వెనుకఁబడునని భయపడి, జూను నెల తుదినే నేనొక్కఁడను కలకత్తా వెడలిపోయి, అక్కడ ద్రావిడ భోజనశాలాధికారి శ్రీనివాస అయ్యరున కతిథినై, ఆదాత యిడిన గదిలోఁ జదువు సాగించితిని. మిత్రుఁడు బంగారయ్య చెంతయింట సకుటుంబముగ నుండెను. నే నతి దీక్షతోఁ జదివి, పరీక్ష కేగితిని. పరీక్ష పూర్తియైనతోడనే నేను గుంటూరు వచ్చి కళాశాలలో ప్రవేశించితిని.
14. "చన్నపురి చక్షువులకు బంగాళాపద్ధతులు"
నేను కలకత్తాలో నుండినకాలమున నాకు "మద్రాసు స్టాండర్డు" దినపత్రిక వచ్చుచునేయుండెను. అక్కడ విద్యార్థిగ నుండి ప్రాఁతవడిన కలకత్తావార్తల నంపుటకంటె, చెన్నపురి రాజధాని వాఁడనగు నాకన్నుల కచట నగఁబడిన వింతలు వ్రాయుట సమంజసముగఁ దోఁచి, "చన్నపురి చక్షువులకు బంగాళాపద్ధతులు" అను శీర్షికతో నప్పుడప్పుడు వినోదకరములగు సంగతులు వ్రాయుచుండువాఁడను. ఈమకుటముక్రింద వ్రాసిన వ్యాసములలో, "మాతృభాషా ప్రయోగము" అనునది మొదటిది కాకపోయినను, మొదటివాని లోనిది. అది నేను కలకత్తాచేరిన కొలఁదిదినములకే వ్రాసితిని. చెన్న రాజధానిలో సామాన్యముగ నే బహిరంగసభ జరిగినను, ఆంగ్ల భాషలోనే చర్యయు ప్రసంగములు జరుగుననియు, బంగాళములో నట్లు గాక బంగాళాభాషలోనే కార్యక్రమమంతయు నడచుననియును, నేను వ్రాసితిని. అన్యదేశీయుఁడవగు నీవు బంగాళములో నేసభకైనఁ జనినచో, గంటలకొలఁది నీ కొక ముక్కయైనను దెలియని బంగాళభాషలోనే యుపన్యాసములు జరుగుచుండుటఁ గాంతువు. నీ వెఱిఁగిన యింగ్లీ షుమాట లేమైన వినవచ్చు నేమో యని నీ వాసక్తితో నాలకింతువుగాని, ప్రసంగములన్నియు శుద్ధ దేశభాషలోనే సాగిపోవును ! మనతెలుఁగు దేశమునవలె నింగ్లీషుపదములు వారి మాతృభాషాప్రసంగముల మధ్యనుండి దొరలుచుండవు. ఇంక విద్యార్థులు విద్యాధికులును, తమయింట మాటాడుకొనునపుడు దేశభాషనే వాడుదురు. ఉత్తర ప్రత్యుత్తరములన్నియు బంగాళాభాషలోనే నడచుచుండును. ఒక వేళ వారొక యాంగ్లపదమే యుపయోగింపవలసి వచ్చినచో, దాని కెంతో నేర్పుతో బంగాళీప్రత్యయముచేర్చి, తాము సృష్టించిన నూతన పదమును వాడెదరు. అచట నాంగ్ల విద్యనేర్చిన విద్యాధికులు, గంటల కొలఁది తమ యుపన్యాసములందు సామాన్యముగ సంకరమేమియు లేని బంగాళీపదములె ప్రయోగించి, తమ భాషాభిమానమును నిలువఁ బెట్టుకొనుచున్నారు. కావుననే హిందూదేశభాషలలో నెల్ల బంగాళీ భాషలోనే మంచి నవీన సాహిత్యగ్రంథములు గానవచ్చుచున్నవి.
1913 శెప్టెంబరు 26 వ తేదీ పత్రికలో నేను "ప్రకటన"లను గుఱించి వ్రాసితిని. ఏ జాతియొక్క స్వభావమైనను, పెద్ద సంగతులలోనెగాక చిన్న వానియందును ప్రకటీకృతమగుచుండును. నాగరక ప్రపంచమునకు ప్రకటనము ప్రాణసదృశము. పత్రికలు పుస్తక ములు బహిరంగప్రసంగములును వెలువరింపని యేజాతిరహస్య లక్షణములుగాని ప్రకటనములవలన బహిర్గత మగుచుండును ! బంగాళావారి ప్రకటనలకుఁగొన్ని మచ్చులిచ్చెదను: కలకత్తా వీధులలో నడచిపోయెడి నీకన్నుల కొకసందులో, "రాధా పుస్తకాగారము", "వినయ విద్యాసంస్థ" అనుగది ముందలి బల్లలమీఁది యక్షరములు గోచరమగును. ఈ పుస్తకాలయ రహస్య యేమియో తెలియునా? అది వట్టి పుస్తకముల యంగడియె ! ఆ విద్యాసంస్థ యొకచిన్నపాఠశాలయె! ఇంక వివాహప్రకటనములు విశేషముగ నుండును. పంజాబుదేశీయునిగాని, బీహారు వానినిఁగాని పరిణయ మగుటకు బంగాళావనిత యోర్తు కావలయును. ఆమె కులగోత్రములతోడి ప్రసక్తియె లేదు. ఒక వర్తకసంఘమువారి సరకుల విక్రయమును బ్రోత్సహింప నొక యాంగ్ల సుందరి కావలయును ! ఇంకొక యంగడికి జవ్వనియు లావణ్యవతియు నగు స్త్రీ యుద్యోగి కావలయును ! సరకుల నాణెమును జూచికాదు కాతాదారులు వచ్చుట, సుందరుల నాణెమును వదనబింబముల నవలోకించుటకె !
25 అక్టోబరున వ్రాసిన వ్యాసమున "బంగాళా బాబూ"లను గుఱించి ప్రసంగించితిని. దాక్షిణాత్యులకు, "బాబూ" అను పదమునకుఁ గల యర్థము పూర్థిగ గ్రాహ్యము గాదు. అఱవ వారిలో 'అయ్యరు' 'అయ్యంగారి'వలెను, తెలుఁగువారిలో 'పంతులు' 'శాస్త్రులు' వలెను, 'బాబూ' అనునది గౌరవవాచకపదము. కాని, యిట్టి మన ద్రావిడపదముల కేదో యొక జాతిమతములు గల పురుషుఁ డని యర్థము. 'బాబూ' అనునది యట్లుగాక, బంగాళీయుల కందఱికి ననువర్తించు గౌరవపదము 'గారు', 'అవర్గలు' అనునవి పదాంతములందుండు గౌరవార్థసూచకమగు వర్ణ ములె గాని, 'బాబూ' వలె ప్రత్యేకపదములు గావు. ఇంక, వేషములో, దక్షిణాదివారికిని బంగాళావారికిని జాల భేదము గలదు. దక్షిణదేశమునఁ బురుషులకు సామాన్యముగ జుట్టు బొట్టు లుండును. బంగాళా పురుషులలోమాత్ర మీ రెండు చిహ్నములును లోపించియుండును. దీనికిఁ గారణముగ నిచటివా రొక గాధ చెప్పుదురు. పూర్వ మొక మహమ్మదీయ ప్రభువు జుట్టుబొట్టులు గల హిందువులకు పన్ను గట్టఁగా, అవి రెండును దీసివైచి, జను లీ పన్ను నుండి సులభముగఁ దప్పించు కొనిరఁట ! కాళ్లకు బూట్సుజోడు, నిడుపగుదోవతి, కమ్మీజు, గడ్డము, కత్రింపు జుట్టు, ఇవియె బంగాళా బాబుయొక్క 'ముస్తాబు' !
1914 ఫిబ్రవరి 27 వ తేదీని నేను "బంగాళీపడతి" నిట్లు చిత్రించితిని. స్త్రీచక్షువులు స్త్రీ సౌందర్యమును బాగుగఁ బరిశీలించి విమర్శింపఁగలవు. నవభారత యువకుల హృదయములు చూఱకొను మహాసౌందర్యరాశి బంగాళీకామినియె యని నేఁ జెప్ప సాహసించువాఁడనుకాను. ఇతర రాష్ట్రీయాంగనలవలెనే బంగాళీ సుందరియు నుండును. రాణివాసమువలన బంగాళీ కన్యక యించుక పాలిపోయినట్టుగఁగూడఁ గానవచ్చును. ఈసుందరాంగులకుఁగల తను కాంతి, కనులతీరు, వదనలావణ్యమును, కావేరీ గోదావరీనదీతీరముల కమలాక్షులయందును, మలయాళపు మచ్చెకంటులయందును గాననగును. ఇట్లయ్యును, బంగాళీముదితలందు, తక్కిన వనితలయందుఁ గానరాని కొంత వింత సౌకుమార్యము గానఁబడియెడిని. జ్ఞానాధికత, భావ సంపద, ధారణాశక్తులతోఁ గూడుకొనిన సౌందర్య మామెది. బంగాళీయువతి లావణ్యమంతయు జ్ఞానసంబంధమగునదియె. వట్టి శరీర సౌకుమార్యమున చెన్నపురి చెలు లామెను మించిన మించవచ్చును. తన యున్నతవిద్యకుఁ దోడుగ బంగాళీకన్య, దేహసౌందర్యమును బెంపొందించు రహస్యముల నెఱింగియున్నది. కురులు దిద్దుకొనుట యందు బంగాళీసుందరి యసమాన దక్షిణాదితరుణులవలెఁగాక యిచటి పూబోణులు కేశములు వెనుకకు దువ్వుకొందురు. కొందఱి శిరోజములు వెనుకకు వ్రేలాడుచుండును. కొందఱికొప్పుల నిత్తడిదువ్వెన గూర్పఁబడి, కనకపుఁ గిరీటమువలెఁ గాంతు లీనుచుండును. మద్రాసు మగువలకంటె నిచటి సుదతలు సౌందర్యరహస్యమును బాగుగ గుర్తెఱిఁగి రనుట కొకగుర్తు, వీరంతగ నొడలిమీఁదను, కొప్పులోను నగ అలంకరించుకొనకపోవుటయె. ఇచట ప్రాచీనాచారము లనుసరింపని సుందరులు సామాన్యముగ నుదుట కాశ్మీరతిలక మిడరు. కొందఱి మేలిముసుఁగునఁ గొన్ని చిన్ని యాభరణములు మెఱయుచుండును.
పూర్వాచారపరాయణయగు బంగాళీభామిని బట్టకట్టు అంత బాగుగనుండదు. ఆమె ధరించు చిన్నచీరలోఁ జాలభాగము మేలి ముసుఁగునకె సరిపోవుటచేత, శరీరమునకు మంచి మఱుఁగు గలుగ కున్నది. ఇంక రవిక లేనెలేదు. కాని, నవనాగరకతచేఁ జెన్నొందు వంగవనితలు వన్నెవన్నెలవలువ లలంకరించుకొందురు. మద్రాసు ప్రాంతములందలి గొప్పయింటి క్రైస్తవకాంతలు వేసికొనునట్లు వీరి దుస్తులు ధరింతురు. కాని, యచ్చటి చానలకు చీరల సొగసు బాగుగఁ దెలిసియున్నది కాన, విదేశపు లంగాలకుఁగల వికృతరూపమును వీరు చక్కఁగ సరది, మఱి వానిని గుట్టుచున్నారు. రంగు గుడ్డలు, మజ్లిసు పట్టువస్త్రములును వీరు ఉపయోగింతురు. తమ చీరకొనలకు చిన్న నగలు సింగారించుకొందురు.
1914 వ సంవత్సరారంభమున కలకత్తా నగరమున జరిగిన బ్రాహ్మసమాజమువారి వివిధశాఖల మాఘోత్సవ వార్షికసభలు నేను సందర్శించితిని. అదిబ్రాహ్మసమాజమువారి పెద్ద సభకు కుటుంబ సహితముగ నేను బోయితిని. ఆ సమయమున శ్రీ రవీంధ్రనాధ తాకూరు కవి గొప్ప ప్రసంగము చేసెను. వారి సోదరు లిరువురును గూడ నా సభలో పాల్గొనిరి. నేను ఆ ఫిబ్రవరి 6-17 వతేదీల స్టాండర్డు పత్రికలలో, "బ్రాహ్మసమాజము"ను గుఱించిన వ్యాసములు వ్రాసితిని. బంగాళములో బ్రాహ్మసమాజము మూఁడుశాఖలై యున్నది. "ఆది బ్రాహ్మసమాజము" న కిప్పుడు తాగూరువంశము వారె పట్టుఁగొమ్మ ! మహర్షి దేవేంద్రనాధతాగూరుగారును, నారి తనయులును బ్రాహ్మసమాజము నుద్ధరించిన మహనీయులు. తాగూరు వంశము ప్రతిభాశాలుల వంశము. బ్రాహ్మసమాజస్థాపకులగు రాజారామమోహనరాయల పిమ్మట, ఆసమాజమును భరతదేశమునఁ బునరుద్ధరించినవారు దేవేంద్రనాధతాగూరుగారు. తమ యపార దైవభక్తి ప్రభావమువలన వీరు 'మహర్షి' యను గౌరవ నామమును గాంచిరి. వీరి కుమారరత్నమె ప్రస్తుతమున భారతదేశ కవి సార్వభౌము లగు రవీంద్రనాధ తాగూరుగారు. కవులు లేని మత సంస్థ యభ్యున్నతి గాంచనేరదు. భారత కవిపుంగవు లగు రవీంద్రుఁడు బ్రాహ్మసమాజకవియె. వీరి సోదరులగు ద్విజేంద్ర సత్యేంద్ర నాధులును మహిమాన్వితులె.
బ్రాహ్మసమాజస్థాపకులలో మూఁడవవాఁడగు కేశవచంద్రసేనుల వారు బ్రాహ్మమతమునకు సాంఘికత్వమును నెలకొల్పి, బ్రాహ్మ సమాజము నొక సంఘముగ స్థాపించినవారు. వీరు తమ గురువులగు దేవేంద్రనాధునుండి చీలిపోయి, "నవవిధాన సమాజము" నేర్పఱిచిరి. ఈ సమాజములో నుండు కేశవచంద్రుని సహచరులు భగవద్ధ్యాన పరాయణు లని పేరు వడసిరి. మూఁడవ శాఖ యగు "సాధారణ బ్రాహ్మసమాజము" నకు పండిత శివనాథ శాస్త్రిగారును, వారి యనుచరులును స్థాపకులు. "ఆదిబ్రాహ్మసమాజము" ప్రాచీన సంప్రదాయములకును, "నవవిధానసమాజము" భావవైశాల్యమునకును బ్రఖ్యాతినొందెను. తక్కిన రెండు శాఖలకంటెను, ఈశాఖ యధిక సంఖ్యాకు లగు సభ్యులతో నలరారుచున్నది.
నేనంతట బ్రాహ్మసమాజమువారి మాఘోత్సవములను వర్ణించితిని. శాక్తేయ చైతన్యవైష్ణవమతములలోనుండి బంగాళాములో ప్రభవించిన బ్రాహ్మమతమునకు, ప్రాచీనమతములలో నుత్తమధర్మము లంతట సంక్రమింపఁగా, దేశారిష్టకములగు విగ్రహారాధన, జాతివిభేదములు, రాణివాసము మున్నగు నాచారమునతో నది పోరుసాగించెను. కాని, బ్రాహ్మమతము సాధించిన మేలంతయు బ్రాహ్మసమాజము వారె యనుభవించుచుండుట లేదు. ఆ సమాజములోకంటె వెలుపలనే యెక్కువమంది బ్రాహ్మమతస్థులు గల రనవచ్చును. హిందూమతము నచ్చకుండెడి వందలకొలఁది యువకులకు, ప్రతియాదివారమును జరుగు బ్రాహ్మసమాజారాధనయె యాదరవగుచున్నది. సాంఘిక విషయములందుఁగూడ బ్రాహ్మసమాజము జనుల కాదర్శమయ్యెను. కాని, యిది కారణముగ బ్రాహ్మమతస్థుఁడు విఱ్ఱవీఁగుటలేదు. అతనిలోపము లాతనికి బాగుగ గ్రాహ్యమె. ఏమికారణముననో కాని, ప్రస్తుతమున సమాజమందలి యువకుల కనేకులకు బ్రాహ్మమతమం దంతగ నభిమానము లేకున్నది. ఇదిగాక, బ్రహ్మమతమునకు మాతృమతమునం దంతగ భక్తిలేనట్టుగ నున్నది. ఇదివఱకే శాఖలక్రిందను, జాతుల క్రిందను చీలిపోయిన హిందూసంఘమున కీక్రొత్తశాఖయగు బ్రాహ్మ సమాజమువలనఁగూడ చెడుగురాదని యెవరు చెప్పఁగలరు? భోజనాది యాచారములందు బ్రాహ్మసమాజమువా రేతిన్నని త్రోవత్రొక్కి, దేశోద్ధరణమునకుఁ దోడుపడిరి? పూర్వమందు బౌద్ధమతమువలె ప్రస్తుతమున బ్రాహ్మమతము జంతుహింసనరికట్టనేల ప్రయత్నింప రాదు?
నేను కలకత్తా కాలేజివీధి చౌకునందు షికారుచేయునప్పుడు, నాకు, బరిచితులగు బ్రాహ్మసమాజమిత్రులు గొందఱు సామాన్యముగ నగపడుచుండువారు. వీరిలో "అభినవపత్రికా" ధిపతులగు రామానంద చాటర్జీగారొకరు. వీరు మద్రాసు స్టాండర్డుపత్రిక చదువుచుండువారు కావున, అందలి "చన్నపురి చక్షువులకు బంగాళాపద్ధతులు" అను వ్యాసములు వ్రాయువా రెవరో తెలియునా యని యపుడపుడు నన్నడుగుచువచ్చిరి. ఉపవిలేఖకుల గుట్టు బయలు పెట్టుట వట్టి యలౌకికకృత్యము గాన, నిజము చెప్పుటకును, అనృతమాడుటకును వలనుపడక, నేను, "ఆరచయిత మోముచూడ నాకును గుతూహలమె" అని పలికి, తప్పించుకొనువాఁడను. ఈ మద్రాసురచయిత, బంగాళాజనుల సమాచారములు బాగుగఁదెలియక, వైరభావమున వారల నెగతాళి చేయుచుండెనని చాటర్జీగా రనుచుండువారు. "బ్రాహ్మసమాజము"ను గూర్చిన నా మొదటి వ్యాసములు చదివిన యాయన యొకనాఁడు, "ఈవ్రాఁతకాఁడు తప్పక బ్రాహ్మసామాజుకుఁడె !" యని నాతోఁ జెప్పినను, అందునుగూర్చిన తక్కిన వ్యాసములు చదివి, "ఈ సాహసికుఁడు బ్రాహ్మాసమాజములోఁగూడ నెరసులు వెదకుచున్నాఁడె !" అని మొఱపెట్టెను !
15. సభలు, సమావేశములు.
నేను కలకత్తాలో నిటీవల పరీక్షకుఁ జదువుచుండునపుడు, మా పిల్లవానికి వెలిచేరులో జబ్బు చేసె నని నాకు జాబు వచ్చి, మిక్కిలి