ఆకాశవీధిలో హాయిగా
మల్లీశ్వరి సినిమా కోసం దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన పాట.
భానుమతి:
ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు
దేశ దేశాలన్ని తిరిగి చూసేవూ
ఏడ తానున్నాడొ బావా
జాడ తెలిసిన పోయి రావా
చందాల ఓ మేఘమాలా
ఘంటసాల:
గగన సీమల తేలు ఓ! మేఘమాలా..
మావూరు గుడిపైన మసలి వస్తున్నావా
మల్లి మాటేదైన నాతో..
మనసు చల్లగ చెప్పి పోవా...
నీలాల ఓ! మేఘమాలా
రాగాల ఓ! మేఘమాలా
భానుమతి:
మమత లెరిగిన మేఘమాలా..ఆ...
నా.. మనసు బావకు చెప్పి రావా
ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతో రేపవలు
ఎదురు తెన్నులు చూసెనే... బావకై
చెదరి కాయలు కాసెనే ఏ..ఏ..
నీలాల ఓ! మేఘమాలా ఆ..ఆ..
రాగాల ఓ! మేఘమాలా
ఘంటసాల:
మనసు తెలిసిన మేఘమాలా..ఆ..
మరువలేననీ చెప్పలేవా మల్లితో
మరువలేననీ చెప్పలేవా
కళ్ళు తెరచిన గాని కళ్ళూ మూసిన గాని
మల్లి రూపే నిలిచెనే నా చెంత
మల్లి మాటే పిలిచెనే
భానుమతి:
జాలి గుండెల మేఘమాలా..ఆ..
బావ లేనిదీ బ్రతుకజాలా..
జాలి గుండెల మేఘమాలా
కురియు నా కన్నీరు గుండెలో దాచుకుని
వానజల్లుగ కురిసిపోవా..
ఆనవాలుగ బావ మ్రోల