విష్ణుపురాణమును దెనిఁగించినది వెన్నెలకంటి సూరయకవి. ఇతఁడు నియోగి బ్రాహ్మణుఁడు. తాత సూరనామాత్యుఁడు, తండ్రి అమరనామాత్యుఁడు. హరితసగోత్రుఁడు. విష్ణుపురాణముదక్క నితరగ్రంథము లేవి రచించెనో తెలియదు. గద్యములో నీకవి విష్ణుపురాణము బ్రహ్మాండపురాణములోని దని తలంచి కాఁబోలు "ఆదిపురాణం బగు బ్రహ్మాండంబునందలి పరాశరసంహిత యైనవిష్ణుపురాణమునందు” అని వ్రాసినాడు. ఇది యెట్లు పొసఁగునో తోఁపదు. అష్టాదశపురాణములలో విష్ణుపురాణ మొక్కటి. చూడుఁడు—

శ్లో.

[1]“బ్రాహ్మం పాద్మం వైష్ణవం చ శైవం లైంగం చ గారుడం
నారదీయం భాగవత మాగ్నేయం స్కాందసంజ్ఞికమ్
భవిష్యం బ్రహ్మవైవర్తమ్ మార్కండేయం చ వామనమ్
వారాహమత్స్యకౌర్మాణి బ్రహ్మాండాఖ్యమితి త్రిషట్."

పురాణములయందు బ్రహ్మాండాంతర్గతమని విష్ణుపురాణము వేరేని చెప్పిరేమో? విచారణీయము.

విష్ణుపురాణము మూలమును నెనుబదివేలగ్రంథముగా (పరాశరమహర్షి చెప్పినటుల) వ్యాసులవారు రచించిరి. ఇది రెండుభాగములు. దాదాపుగా మొదటి భాగమును వెన్నెలకంటి సూరనకవి తెనిఁగించినాఁడు. రెండవభాగమునందు వివిధధర్మములు, వ్రతనియమాదులు, ధర్మశాస్త్రరహస్యములు, అర్థశాస్త్రము, వేదాంతము, జ్యోతిషము నిరూపింపఁబడెను. రెండవ భాగమును సూరన తెనిఁగింపలేదు. పూర్వభాగము విష్ణుప్రభావాదికములు, శ్రీకృష్ణజీవితము తెలుపుచిత్రకథలు కలది గావుననే యిక్కవి వలయుచోటులఁ బెంచియుఁ గుదించియు నాంధ్రీకరణమునఁ గ్రొత్తత్రోవలు దీసి యొక్కచక్కనికావ్యగ్రంథముగాఁ దెనిఁగించినాఁడు. సంస్కృతముననున్న విష్ణుపురాణమునకుఁ జరిత్రదృష్టితోఁ జూచినను గొప్పవిలువ గలదు. పురాణములన్నియు వ్యాసకల్పితములు గావను పాశ్చాత్యనాగరకులు సైతము భారతముతోబాటు దాదాపుగా విష్ణుపురాణముగూడఁ బూర్వతరమని విశ్వసించుచున్నారు. పురాణలక్షణములని చెప్పఁబడు,

శ్లో.

“సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశమన్వంతరాణిచ
వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణమ్"

అను నైదులక్షణములు విష్ణుపురాణమున సక్రమముగా సరిపడియున్నవి. అన్నివిధముల గణనీయమని పేగొంది. సాత్త్వికపురాణరాజములలో నొకటి యని ప్రసిద్దిగాంచినయీవిష్ణుపురాణమును సరసముగాఁ దెనిఁగించి యాంధ్రలోకమునకుఁ బ్రసాదించిన వెన్నెలకంటి సూరనార్యుఁడు ఆంధ్రలోకమునకుఁ బ్రశంసాపాత్రుడు. విష్ణుపురాణప్రశస్తి నీక్రిందివిధముగా సూరనార్యుఁడు బేర్కొనినాఁడు.

సీ.

“వేదంబులకు నెల్ల వేదంబు ధర్మశాస్త్రంబులలోపల ధర్మశాస్త్ర
మాగమార్థములలో నాగమార్థం బగు జ్యోతిషంబులలోన జ్యోతిషంబు
బహుపురాణములలోపల పురాణం బితిహాసంబులం దితిహాస మఖల
నీతిశాస్త్రములలో నీతిశాస్త్రము మహాయోగవిద్యలలోన యోగవిద్య


తే.

కావ్యములలోనఁ గావ్యంబు భవ్యతరము, సకలలోకైకవేద్యంబు సకలసుకవి
చిత్తరంజనకారణం బుత్తమంబు, క్షోణి నొప్పారు విష్ణుపురాణ మనఘ.”

భాగవతమునందుఁ బేర్కొనఁబడిన విష్ణుభక్తులకథలలోఁ జాలభాగ మిందుఁ గలవు. శ్రీకృష్ణావతారఘట్టము హరివంశమునందును భాగవతమునందును విష్ణుపురాణమునందును గలదు గాని కథాభాగములలోఁ గొంచెము వ్యత్యాసము గలదు. చారిత్రకదృష్టితో నరయువారు విష్ణుపురాణమునుండి శ్రీకృష్ణునిజీవితరహస్యములు గ్రహించుచున్నారు. సకలపురాణసారభూతము పవిత్రతరమునగు నీవిష్ణుపురాణమునందలి యుత్తరభాగము కవితాకళ కంతగా సంబంధించినది కాదని కాఁబోలును సూరనార్యుఁడు తెలిఁగింపక విడిచినది!

విష్ణుపురాణము నంకితముగాఁ గొన్న ధన్యుఁడు రావూరి రాఘవరెడ్డి. ఈయన పంటరెడ్డికులజుఁడు. యానపాలగోత్రుఁడు. రాజధాని గుడ్లూరు. సూరనార్యుఁడు గుడ్లూరు నీ విధముగా నభివర్ణించియున్నాఁడు—

సీ.

“గౌరీసమేతుఁడై గరిమతో నేవీట నేపారు నీలకంఠేశ్వరుండు
వారాశికన్యతో వర్తించు నేవీట గిరిభేదినుతుఁ డైనకేశవుండు
యోగినీసహితయై యొప్పారు నేవీటఁ బసిఁడిపోలేరమ్మ భవునికొమ్మ
పావవినాశ యై ప్రవహించు నేవీట మన్నేఱు మిన్నేటిమాఱ టగుచు


ఆ.

కుంజరములు వేయి కొలువంగ నేవీట, గొడగుచక్రవర్తి పుడమి యేలె
నట్టిరాజధానియై యొప్పు గుడ్లూరి, నొనర నేలుచుండి యొక్కనాఁడు."

(ఆ.1 ప.16)

ఇందుఁ బేర్కొనఁబడిన గుడ్లూరును, భారతాంధ్రీకర్తలలో నొకఁడగు శంభుదాసు నివాసస్థలమగు గుడ్లూరును నొకటియ. శంభుదాసుఁడు తనగుడ్లూరును కూడ నీలకంఠస్థానమని యభివర్ణించినాఁడు.

సీ.

................................................................................
నందనుఁ డిలఁ బాకనాటిలో నీలకంఠేశ్వరస్థానమై యెసఁగ మెసఁగు
గుడ్లూరు నెలవుగ గుణ గరిష్ఠత నొప్పుధన్యుఁడు ధర్మైకతత్పరాత్ముఁ"

డెఱ్ఱనార్యుఁడు (భారతారణ్యపర్వము)

భారత, హరివంశ, నృసింహపురాణాదిమహాగ్రంథరచనమున కాలవాలమైన గుడ్లూరు విష్ణుపురాణరచనమునకుఁగూడ మాతృభూమి యగుట స్థలవిశేషము కానోపు. కృతిభర్తయగు రాఘవరెడ్డి సప్తమచక్రవర్తి యనియు, ధర్మమూర్తి యనియు, భాషాపోషకుఁ డనియుఁ బ్రఖ్యాతిగాంచిన అనవేమారెడ్డివంశమున జనించినవాఁడు. కవియో అనవేమారెడ్డికిని ఆయనసహోదరుఁడగు అనపోతారెడ్డికిని గ్రంథసముదాయ మంకితముగా నోసంగిన వెన్నెలకంటి సూర్యకవివంశములోనివాఁడు. కృతికర్తకును గృతిభర్తకును గల్గిన యీవిష్ణుపురాణవిషయికసంబంధ మాకారణముచే నెంతయుఁ బొసఁగియున్నది. మహాకవియగు సూరనార్యునిచే విష్ణుపురాణము వ్రాయించి యంకితము గొని వాఙ్మయప్రపంచమున యశఃకాయుఁడై పేరొందిన రాఘవరెడ్డిసుకృతము ప్రశంసాపాత్రము. కృతిభర్త వంశావతారము విష్ణుపురాణమును బట్టి నిర్ణయించిన విధ మిది.

వీరిలో బసవన్న ప్రముఖుఁడు. కృతిరచనాకాలమునకు వలయుఁ జరిత్రాంశము లీతని ప్రశంసాపద్యములనుండియే గ్రహింపవలసియున్నది. బసవన్న భార్య అమ్మలాంబ పాకనాటిలోని అల్లూరి అనమారారెడ్డి మనుమరాలు. పెమ్మమహీపతి కుమార్తె. బసవన్నను గూర్చి సూరనార్యుఁ డిటులఁ బ్రశంసించినాఁడు.—

క.

“వారలలోపల బసవ, క్ష్మారమణుఁడు పేరు పెంపు గలమన్నీఁడై
భూరిప్రతాపజయల, క్ష్మీరతుఁడై వెలసె నుదయగిరిరాజ్యమునన్."

(ఆ.1 ప.37)


సీ.

"కటకాధిపతి యైనగజపతిరాజుచేఁ బ్రతిలేనిపల్లకి పదవు లందె
మహిమచేఁ గర్ణాటమండలాధిపుచేతఁ గడలేని రాజ్యభాగములు గాంచె
ప్రౌఢపౌరుషమున రాజిల్లి మెఱయఁగా మలకపజీర్ణ కుమ్మలికఁ జేసె
తెలగాణభూములఁ గల మన్నెవారిచే బలవంతమునను గప్పములు కొనియె


తే.

చాటుధాటీనిరాఘాటఘోటకావ, లీఖురోద్ధూనిబిడధూళీవిలిప్త
మండితాశాంగనాకుచమండలుండు, బాహుబలశాలి తమ్మయబసవవిభుఁడు.”

41

కృతికర్త తండ్రియగు బసవనృపాలుఁడు గజపతులకాలమునందుండి యాందోళికాదిగౌరవములు బడసెను. కర్ణాటనృపులచే రాజ్యములను బడసెను. గజపతులయనంతరము ఉదయగిరిదుర్గాధిపత్యముగూడ వహించెను. కాన బసవభూపాలునికాలము తెలిసికొన యత్నించుదము, కృష్ణదేవరాయలకాలమున కొండవీడు, కొండపల్లి, ఉదయగిరి గజపతుల స్వాధీనములో నుండెను. కృష్ణదేవరాయలే యీమూఁడుదుర్గములను జయించెను; గజపతులమన్ననలను బొందుటయుఁ గర్ణాటరాజులమన్ననలచే నుదయగిరిరాజ్యము బడయుటయు కృష్ణదేవరాయలకు బసవనృపతి సమకాలికుఁడు గాకున్నఁ బొసఁగదు. తరువాత అచ్యుతదేవరాయలకాలముననో రామరాజుకాలముననో కృతికర్తయగు రాఘవరెడ్డి సూరనకవియు నుండియుందురు. ఇందులకుఁ దగు నుపపత్తులను విచారింపవలసియున్నది.

వెన్నెలకంటి వెంకటాచలకవి శ్రీకృష్ణవిజయమను బ్రబంధము రచించుచు నందుఁ దనవంశజుఁడును బూర్వుఁడు నగు ప్రకృతసూరకవి నీవిధముగ స్తుతించెను.

సీ.

“సూరపకాంతిచే సూర్యప్రకాశుండు వేదాదివిద్యల వెలసినాఁడు
విష్ణుపురాణంబు వేడుకఁ దెనిఁగించి విమలయశంబున వెలసినాఁడు
రావూరిబసవన్న రమణతో నిచ్చిన యలమొగుళ్ళూరగ్రహార మందె
వెలుగోటి తిమ్మభూవిభునిచేఁ గొనియె దా నాందోళికాచ్ఛత్ర మగుపదవిని


తే.

కవితపుట్టిల్లు వెన్నెలకంటియిల్లు, ననెడు పౌరుషనామధేయంబు నిలిపె
సరసగుణములు గలిగిన సాధుసుకవి, మాననీయండు సూరనామాత్యవరుఁడు."

ఈసూరనార్యునకు వెంకటాచలకవి ఆఱవపురుషుఁడు. సూరనార్యునికుమారుఁడు లక్ష్మన్న. అతనికొడుకు చక్రప్ప. వానికొడుకు గంగయ్య. వానికొడుకు సూరపరాజు. అతని కొడుకు జగ్గన్న. జగ్గన్న కుమారుఁడు వెంకటాచలకవి. వెంకటాచలకవి తనపితామహునకుఁ బితామహుఁ డని విష్ణుపురాణకర్తను జెప్పి యతనినుండి వరుసగా వంశవృక్షము నొసంగినాఁడు. తనపితామహునివలన వెంకటాచలకవి ఆతనిపితామహుఁడగు నీసూరనకవి పుట్టుపూర్వోత్తరములు వినియుండును. సూరనార్యునియెడఁ జెప్పినవిశేషములు విశ్వాసపాత్రము లనుటలో సంశయింపఁ బనియుండదు. ఈపద్యసహాయమునఁ గవికాల మిఁక స్పష్టపడును. సూరనార్యునకు అందలము గొడుగు ఇచ్చి మన్నించిన వెలుగోటి తిమ్మనృపాలుఁ డెవఁడో శోధింపవలసియున్నది. గురుజాడ రామమూర్తిగారు, రేచెర్ల అనపోతనాయకుని కుమారుఁడగు తిమ్మనాయనినే వెలుగోటి తిమ్మభూపతి యని చెప్పి సూయలు చెప్పినటుల నితనికాలము క్రీ. శ. 1360 కాదనియు 1300 అనియు జెప్పిరి. ఈనిర్ణయము సర్వవిధములఁ బ్రమాదభూయిష్ఠమైనది.

రేచెర్లగోత్రీయులగు వెలమవీరులు ప్రతాపరుద్రదేవుని కాలమువఱకు గాకతీయులకడ సేనానాయకులుగ నుండిరి. ప్రతాపరుద్రుఁడు క్రీ. శ. 1328 లో బంధీకృతుఁ డైనదిమొదలు వీరు స్వతంత్రులైరి. స్వతంత్రరాజ్యస్థాపకులలో అనపోతనాయకుఁడు మొదటివాఁడు. ఈతఁడు మహాసంగరములలో గెల్చి దక్షిణాపథమునందలి యాంధ్రదేశమునంతయుఁ బాలించెను. క్రమముగా నీతనివంశజులు మ్లేచ్ఛరాజుల యొత్తిడి కాగఁజాలక పూర్వార్జితరాజ్యములు గోలుపోయి చివరకు దేవరకొండదుర్గమును రక్షించుకొనిరి. అక్కడ కూడ నిలువ వీలుజిక్కకపోవుటచే దుంగభద్ర దాటి కృష్ణదేవరాయకాలములో కర్నూలుమండలములోని వెలుగోటిలో రాజ్యము స్థాపించి రాయల కంకితులైరి. ఇ ట్లొనరించినది నిర్వాణరాయఁడప్ప. ఈయంశము లోకల్ రికార్డులందును కర్నూలు జిల్లా మాన్యుల్ లోను వెలుగోటివంశచరిత్రమునందును జెప్పఁబడినది. నిర్వాణ రాయఁడప్ప వెలుగోటిలోఁ గోటకట్టినది క్రీ.శ. 1530 ప్రాంతమున నుండె నని చెప్పఁబడెను. అదిమొదలు రేచెర్లగోత్రీయులు వెలుగోటివారని పేరొందిరి తరువాత యాచనామము, వేంకటగిరిసంస్థానపాలనము సిద్ధించినది. ఇందుచేఁ బైని పేర్కొనబడిన వెలుగోటి తిమ్మనృపాలుఁడు క్రీ.శ. 1530 కు ఈవలివాఁ డగుట స్పష్టము. నిర్వాణరాయఁడప్ప కుమారుఁడు మనుమఁడు మునిమనుమఁడు గూడ తిమ్మానాయకులె. ఈమువ్వురికిఁ బైనఁ దిమ్మానాయకుఁడు లేడు. ఉండెఁబో వానికి వెలుగోటివంశనామము లేదు. మువ్వురు తిమ్మానాయకులలోఁ జివర తిమ్మానాయకుని కాలము క్రీ.శ. 1572 - అనఁగా చంద్రగిరిలో తిరుమలదేవరాయలకుమారుడు రాజ్యమేలుకాలము. వెలుగోటి తిమ్మభూపాలుని శాసనములు రెండు లభించినవి. అందొకటియగు నెల్లూరు రంగనాయకులగుడి ఉత్తరపుగోడమీఁది శాసనము.

స్వస్తిశ్రీజయాభ్యుదయ శాలివాహనశకవర్షంబులు 1495 అగునేటి శ్రీముఖసం॥ వైశాఖ శు 15 లు శ్రీమద్రాజాధిరాజ రాజపరమేశ్వర శ్రీవీరప్రతాప శ్రీరంగరాయదేవ మహారాయలు అయ్యవారి కార్యకర్తలయిన వెలుగోటి తిమ్మపనాయనంగారి ముద్రకర్త వెంకటప్పనాయండు రాయలవారికిన్ని తిమ్మపనాయనికిన్నీ పుణ్యముగాను ......... వివరం

వేంకటగిరి సంస్థానమునకుఁ జెందిన పొదిలెదుర్గాలయములో నున్న శిలాశాసనము.

స్వస్తిశ్రీ జయాభ్యుదయ శాలివాహనశకవర్షంబులు 1515 అగు స్వభానుసంవత్సర శ్రావణ శు 10 లు శ్రీనుతు రేచర్లగోత్రోద్భవులైన వెలిగోటి పెదతిమ్మానాయనింగారి పౌత్రులైన కొమారతిమ్మానాయనింగారి పుత్రులైన కుమార కుమార చినతిమ్మానాయనింగారు పొదిలెస్థలం దేవబ్రాహ్మణులకు.................ఇచ్చిన ధర్మశాసనము.

మొదటిశాసనము క్రీ. శ. 1573 లోను రెండది క్రీ. శ. 1583 లోను నెలకొల్పఁబడినవి. నిర్వాణ రాయడప్ప వెలుగోటి యను నుపనామము సంపాదించినది 1530 ప్రాంతమునందు. వెన్నెలగంటి సూరనార్యుఁడు ఈముగ్గురు వెలుగోటి తిమ్మానాయకులలో రెండవతిమ్మానాయకునికాలమునం దున్నందున నీకవి క్రీ. శ. 1530 మొదలు 1555 లోఁగా నుండియుండెననుట సత్యము. ఈనిర్ణయమువలన బసవరెడ్డి కృష్ణరాయలకాలమునను దరువాతికాలమున నాతనితనయుఁడగు రాఘవరెడ్డియు నుండిరనుట సరిపడును ఇదియె నిర్వివాదమగు నిర్ణయము.[2]

గురుజాడ శ్రీరామమూర్తిగారు విష్ణుపురాణరచనాకాలము క్రీ.శ. 1300 అనిరి. వీరేశలింగము పంతులువారు క్రీ.శ. 1350-1360 అనిరి. లాక్షణికకవులలో నెల్ల ప్రసిద్ధులగు నప్పకవ్యాదులు విష్ణుపురాణమునుండి యుదాహరణములు గైకొనలేదు. ఆళ్లయవీరభద్రుని (కాలము 1426-1440) గూడఁ గూటస్థునిగఁ గృతిపతిఁ జెప్పుకొనినాఁడు. ప్రకృతకవికి అనవేముని మెప్పించిన వెన్నెలకంటి సూర్యుండును కృతిభర్తకు అనవేమారెడ్డి కూటస్థులు. ఆవలితరములు తెలియవు. వీని నన్నింటిని సమన్వయించి చూడ విష్ణుపురాణరచనాకాలము పదునాఱవశతాబ్దాంతమనుట పొసఁగియున్నది. వంశీయుఁ డొసంగిన యాధారము కృతిభర్తతండ్రిని కూర్చిన యాధారములు గూడ సాక్ష్యములైనవి. కృతిభర్తగురువగు తిరుమలతాతాచార్యుని బట్టి కాలనిర్ణయము సేయుట నిరాధారశ్రమ. పదునెనిమిదవ శతాబ్దములోని ముద్దుపళని గురువుగూడ నొకతిరుమలతాతాచార్యులే. ఇంక మధ్యకాలమున నెందఱో కలరు. ఇట్టినిర్ణయముల విమర్శించుట వృథాకాలహరణము.

వెన్నెలకంటివారి కుటుంబము పూర్వవాసస్థలము నెల్లూరుమండలము. “కవులపుట్టిల్లు వెన్నెలకంటియిల్లు" అనువిశేషణమున కనుకూలముగా నీకుటుం బమునందుఁ బలువురుకవు లుండియుందురు. మనకు అనపోతరెడ్డికాలమునాటి వెన్నలకంటి సూర్యుఁడు, ప్రకృతగ్రంథకర్తయగు సూరనార్యుఁడు, కృష్ణవిజయకర్తయగు వేంకటాచలకవి మాత్రమె పరిచితులు. ఇంక నీకుటుంబమున నెందఱు కవు లుండిరో యేగ్రంథములు రచించిరో యెఱుంగరాదు. జక్కనచే విక్రమార్కచరిత్రము అంకితముగాఁ గొన్న సిద్ధమంత్రి వెన్నెలకంటివంశజుఁడె. ఈయన కవియుఁ గవిపోషకుఁడును నై యున్నాడు. ఇంక నీకుటుంబములో నెందఱుకవు లుండియుండిరో! వెన్నెలకంటివారి యిండ్లలో నెంతయో తాళపత్రపుస్తకభాండారముగలదు. అది యేనాఁటికి శోధింపఁబడునో యెప్పటికి నూతనవిశేషములను గ్రహింపుగల్గుదుమో!

కృతిభర్తయగు రాఘవరెడ్డి అనవేమారెడ్డి వంశజుఁడని కవి స్పష్టముగాఁ జెప్పినాఁడు గాని వంశసంబంధము చెప్పలేదు. దౌహిత్రసంతతిలోనివాడో పౌత్రసంతతివాఁడో రాఘవరెడ్డిని గురుతింప వీలుగాకయున్నది. రాఘవరెడ్డికి నాతనిపూర్వులకుఁ జెప్పఁబడిన పల్లవాదిత్య, రాయవేశ్యాభుజంగ, చంచుమలచూరకార, హేమాద్రిదానచింతామణి మున్నగుబిరుదములు అనవేమాదులవే! రాఘవరెడ్డియు నతనిపూర్వులును రెడ్డిసామ్రాజ్యము ఆస్తమించినపిదప సామాన్యగృహస్థులుగా నుండి రాజసేవతోఁ గాలము గడిపిన భాషాభిమానులు. కృతిభర్తతండ్రి మఱలఁ గొంచెముగనో గొప్పగనో పూర్వగౌరవము నిలువఁబెట్టినాఁడు. ఇతఁడు సూరకవికి మొగళ్లూరను అగ్రహార మిచ్చినటులఁ జెప్పఁబడినది.

సూరనార్యుని కాలనిర్ణయమును గూర్చి చర్చ యింతతో ముగించి యతని కవితానైపుణ్యమునుగూర్చి యించుక ప్రసంగించుదము. ప్రబంధరచనమునకుఁ బెద్దనార్యుఁడు త్రోవదీసినదాది ఆంధ్రవాఙ్మయమున కొకనూతనపరివర్తన మేర్పడెను. తఱుచుగాఁ గవు లుపజ్ఞను గోలుపోయి వసుచరిత్రమునో మనుచరిత్రమునో దృక్పథమునం దుంచుకొని ప్రాఁతత్రోవలఁ బోవ మొదలిడిరి. సూరనార్యుఁ డీయుగసంధిలో నున్నవాఁడు. ఆదికవుల నిరుపమానధారాశుద్ధియుఁ బ్రబంధకవుల చిత్రకవితావిలాసము సూరనకవియెడఁ జూపట్టుట యొకవిశేషము. ఈతఁడు సంస్కృతసమాసజటిలముగను మిశ్రరీతిగను దేటతెనుంగుగను గవిత రచించుటలో మిగుల గడుసరి. మొత్తముమీఁద నీతనికవిత ద్రాక్షాపాకములో నలరి యాపాతరమణీయముగా నున్నది. తిక్కన, శ్రీనాథుఁడు, ప్రబంధపరమేశ్వరుఁడు కథాభాగములలోఁ జూపునుద్వేగము వర్ణనాంశములలోఁ జూపు భావసౌష్టవము ప్రకృతి వర్ణనములలోఁ జూవునిసర్గరమణీయభావసమృద్ధి సూరనార్యుని విష్ణుపురాణములోఁదక్క నితరాధునికగ్రంథములలోఁ గానరాదు. నిరర్గళమగునీతనిశైలి కొన్నికొన్నియెడల శ్రీనాథునిశైలి ననుకరించినతావులు గలవు. కొలఁదిగ కృత్యాదియందుఁ బ్రబంధకవుల వర్ణనపద్ధతి ననుకరించినాఁడు. అంతియగాని యితరస్థలములలో సూరనార్యుఁడు తనకవిత స్వతంత్రరీతి నలరించినాఁడు. కథాంశములలో వచ్చు నాయారసముల నౌచితి నెఱింగి సమయానుకూలముగ వర్ణించుటయందును గథాంశమును బెంచి గ్రంథప్రశస్తి నినుమడించుటయందును నీకవివరున కుత్సాహము మెండు. ఇంతియగాదు. మధ్యకాలపుఁగవులవలె శృంగారము నతిమాత్రముగ వర్ణించి కథోద్వేగము చల్లార్పుట యీకవియెడఁ గానరాదు. విష్ణుపురాణము వంటి మహాపురాణము వ్రాయుట కీకవి యన్నివిధములఁ దగినవాఁడు. ద్వితీయాశ్వాసములోని మారిషవృత్తాంతము పంచమాశ్వాసములోని తారాశశాంకచరిత్రము జూచిన నీకవికిఁ గల శృంగారరసకల్పనమున నౌచితిఁ గూడఁ గొంతవఱకు బాటించువాఁడని తెలిసికొనవచ్చును.

నరకాసురవధము, ప్రహ్లాదచరిత్రము, ధ్రువోపాఖ్యానము, శ్రీకృష్ణావతారఘట్టము, రుక్మిణికల్యాణము లోనగుకథాభాగము లీవిష్ణుపురాణమున సంగ్రహరూపముగ నున్నవి. పోతనరచనమునకుఁ దీసిపోవుచున్నది. ఈ భేదము పోతన చిత్రకవితాప్రియుఁడు, సూరన నిరర్గళధారావశంవదుఁడు నగుటచే నేర్పడినది. కావున నాయాభాగములు గైకొని తారతమ్యచర్చ గావించుట యుచితము గాదని మాతలంపు.

విష్ణుపురాణమునందలి కథలకును భాగవతమునందలి కథలకును గొంతమార్పు కానవచ్చుచున్నది. కారణము తెలియదు. భాగవతమున ఉత్తానపాదునకు సునీతి పెద్దభార్యగను సురుచి చిన్నభార్యగను జెప్పఁబడియుండ విష్ణుపురాణములోఁ దలక్రిందుగా నున్నది. విష్ణుపురాణములో ధ్రువుఁడు తనంత తపమునకుఁ బోయినటులుండ భాగవతములో తల్లిమాటలమీఁద నేగినటులను, విష్ణుపురాణములో సప్తర్షులు ధ్రువునకు ద్వాదశాక్షరి నుపదేశించినటులుండ భాగవతములో నారదమహాముని వాసుదేవమహామంత్ర ముపదేశించినట్లును గలదు. విష్ణుపురాణములో దేవతలు మాయావిని బంపి ధ్రువునితపము కలచినటులుండ భాగవతములో నావిషయమే లేదు. ఈకథలో నింక నెన్నియోమార్పులు గలవు. ఇటులెఁ దక్కినకథలలోఁగూడ మార్పు లారయనగును. పురాణములను జరిత్రదృష్టితో సమన్వ యించువారి కీభేదములు ముఖ్యముగాఁ బరిగణనీయములు. కథాభాగములందలి యాయాభేదములకతన సంస్కృతవిష్ణుపురాణము ప్రాచీనతరమని సుబోధమగును.

సుధీలోకమున కీకవి విన్నవించుకొనిన ప్రార్థనారూపముగానున్న యీక్రింది

ఉ.

"ఏను పరాశరుండు రచియించిన విష్ణుపురాణ మాంధ్రభా
షానిపుణోక్తులం బలుకఁజాలెదనంచుఁ దలంచినాఁడ శే
షాీనిలభుగ్విభుం డురుసహస్రశిరంబులఁ దాల్చు లోకముల్
హీనపుఁ బూరిపాము ధరియించెద నంచుఁ దలంచు చాడ్పునన్.”

అనుపద్యమును, దానిక్రింద నాల్గుపద్యములును కుకవినింద యొనరింపమియుఁ జూడ సూరనార్యుఁడు సత్త్వగుణప్రధానుఁడనియు విద్యావివాదములలోఁ బాల్గొని జీవితము గడపినవాఁడు కాఁడనియుఁ దోఁచును. విష్ణుపురాణము మొత్తముమీఁద నిర్దుష్టముగా నున్నది. వ్యాకరణదోషములుగఁ బూర్వులచే గణింపఁదగినవి కొన్నితావులలో లేకపోలేదు.

క్వార్థక ఇకారసంధులు

మ. హిమవత్పర్వత కూటసానువులనుం డేతెంచు(ఆ.2 ప.322)

క. ఇయ్యాహారంబులచే, నయ్యా బడలికలు దీరి నాసంతోషం బయ్యున్నదె(ఆ.3 ప.352)

ఇకారసంధులు

మ. బెడఁకుంజూపులు క్లిన్నదంతచయమున్ వెర్ఱాటలున్(ఆ.3 ప.274)

సీ. శైశవక్రీడాప్రసంగముల్ కొన్నేండ్లు కొన్నేండ్లు ముద్దుపల్కులబెడంగు(ఆ.5 ప.187)

ఇటులె యింకఁ గొన్నిస్వల్పలోపములు గలవు. సర్వసుగుణభరితమగు నీయుద్గ్రంథమునఁ గలస్వల్పలోపములు బరిగణనీయములు కావు, మొత్తముమీఁద నీకవిని రౌచికుఁడనియు నుచితజ్ఞుఁడనియు లాక్షణికుఁడనియుఁ జెప్పక తప్పదు. విష్ణుపురాణమున సూరనార్యుఁడు సందర్భానుసారముగా నవరసములకుఁ దావొసంగినాఁడు. ఏరసమునందేని యితరకవుల ననుకరించినటులఁ గానరాదు. దుర్వాసునిశాపము పరశురామకథలో బీభత్సరౌద్రభయానకరసముల యుచ్చస్థితియుఁ బురూరవుఁడు భరతుఁడు లేడికొఱకును ఊర్వశికొఱకును బరితపించుఘట్టమునఁ గరుణరసము. ఇటులె యాయాస్థలములలో నితరరసములు యథాయోగ్యముగఁ బోషించి నాఁడు. భూదేవి పృథుచక్రవర్తికి వెఱచి పారుటయు సముద్రమథనమును జడభరతచరిత్రమును మనోహరముగా నున్నవి. రామకథయుఁ గృష్ణాదులు బ్రాహ్మణకుమారుల బ్రదికించినకథయు నరకాసురవధయు మిగుల సంక్షేపింపఁబడుటచే నాభాగములలో రసము కొఱఁతపడినది. అవకాశమును బురస్కరించుకొని సూరనార్యుఁడు కవితానైపుణ్యము ప్రదర్శించినతావులు గోన్ని కలవు.

అంత్యనియమము

“మ.

కనియెన్ భాగవతోత్తముండు త్రిజగత్కళ్యాణవర్ధిష్టునిన్
వనజాతాసనవాసవప్రభృతిదేవప్రాభవాధిష్ణునిన్
ఘనగర్వాంధనిశాచరేంద్రవరభాగ్యప్రక్రియాజిష్ణునిన్
కనదంభోధరకృష్ణునిన్ సుజనరక్షాతృష్ణునిన్ గృష్ణునిన్."

(ఆ.7 ప.335)

ఉత్ప్రేక్షాలంకారము

"చ.

పడమటివంకఁ గ్రుంక నురుభాస్కరబింబము తూర్చుకొండపైఁ
బొడిచిన చంద్రమండలముఁ బొల్పెసలారెఁ బయోజసంభవుం
డెడపక రాశి మానగతు లెక్కువ తక్కువ లైనకాలముల్
తడఁబడు నంచుఁ దూఁచు నెడఁ ద్రాసునఁ దేలెడుచిప్పలో యనన్.”

(ఆ.7 ప.333)

అచ్చతెనుఁగుఁగూర్పులు

"క.

పచ్చనికసవులు పసులను, విచ్చలవిడి మేయదోలి వేడుకతోఁ గ
నిచ్చకు వచ్చిన యచ్చట, మెచ్చులతాళములలోన మెలఁగుచు నున్నన్.”

(ఆ. 7 ప.192)

విష్ణుపురాణమును ఈసూరనార్యుఁడెగాక పశుపతిపుత్రుఁ డగునాగనాథుఁ డనుకవియు క్రీ.శ. 1380 ప్రాంతమునఁ దెనిఁగించినాఁడు. ఇతఁడు ప్రౌఢకవి యని యాతనిశాసనశ్లోకములును విష్ణుపురాణములోనిదని ప్రబంధరత్నావళిలో నుదాహరింపఁబడిన యీక్రిందిపద్యమువలనను తెలియవచ్చును.

"ఉ.

మాసరమయ్యె నంత మధుమాసము పాంథవిలాసినీజన
త్రాసము పుష్పబాణనవరాజ్యవితానము వల్లరీవధూ
హాసము మత్తకోకిల సమంచితపంచమనాదమంజిమ
వ్యాసము జీవలోకహృదయంగమసౌఖ్యవికాస మెంతయున్."

ఇంతవఱ కీగ్రంథరాజము లభింపకపోవుట సంతాపకరము, ఆధునికుఁ డగు సీతారామసిద్ధాంతికవిగూడ విష్ణుపురాణమును బద్యకావ్యముగఁ దెనిఁగించెనట గాని దానిని మేము చూడలేదు. తుపాకుల అనంతభూపతి విష్ణుపురాణమును వచనకావ్యముగా వ్రాసెను. అది ముద్రితమైనదటగాని మే మాప్రతిని జూడకుండుటచే నందెంతవఱ కీపద్యకావ్యమునకు సంబంధము గలదో నిశ్చయింపలేకపోతిమి.

సూరనార్యుఁడు కవితారచనమున శ్రీనాథాదిపురాణకవులకు జోడైనవాఁడు. కొన్నియెడల ధారాశుద్ధి పద్యగమనము సమాసకల్పనము మున్నగువాని కీకవిరాజు శ్రీనాథునియెడ లక్ష్యభావ ముంచె ననుటకుఁ దార్కాణలు విష్ణుపురాణమున లేకపోలేదు, చర్చింప మొదలిడినవిషయము విస్తరమగునని విడిచితిమి.

విష్ణుపురాణము చిరకాలము క్రిందట బాజారుప్రతిగ ననేకదోషములతో ముద్రితమై ప్రతులు చెల్లిపోయెను. తదాదిగ నీమహాగ్రంథము ఆంధ్రభాషాప్రియులకు లభించుటయే కష్టమయ్యెను. సులలితముగ నాగ్రంథమును వ్రాతప్రతులతోఁ బోల్చి శుద్ధ ప్రతి వ్రాయించి లఘుటిప్పణముగూడ సమకూర్చి యాంధ్రలోకమునకు సమర్పించిన ఆంధ్రభాషాభిమానులగు బ్రహ్మశ్రీ వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రులుగారి ప్రయత్నము ప్రశంసాపాత్రము. ఈ యుద్గ్రంథము మూలముతోఁ బోల్చి చూపుదమున్న ఎంత ప్రయత్నించినను మూలము లభింపకపోయెను. త్వరగ బీఠిక వలయు నని ప్రకాశకులు సెలవిచ్చుటచే విశ్రాంతిభాగ్యమునకు నోచుకొనకున్నను బరిశ్రమజేసి యెటులనో వ్రాసితిమి. సాహసమునకు క్షంతవ్యులము.

నందిగామ.

ఇట్లు భాషాసేవకులు,

20-8-1928

శేషాద్రిరమణకవులు

శతావధానులు

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.

 
  1. బ్రహ్మాండము, విష్ణుపురాణములకు సంబంధము లేదని యీకవియే చెప్పినాఁడు. చూడుఁడు-
    మ. "భువి బ్రహ్మాండము వామనంబు గరుడంబు స్కాందమున్ గూర్మభా
          గవతాగ్నేయకమాత్స్యలైంగములు మార్కండేయమున్ బాద్మవై
          ష్టవశైవంబులు నారదీయము భవిష్యద్భహ్మకైవర్తది
          వ్యవరాహంబులు నాఁ బురాణములు ముయ్యాఱయ్యె విప్రోత్తమా." (విష్ణువు. అ 4 ప 99.)
  2. విష్ణుపురాణ కృతిభర్తయగు బసవయరాఘవుఁడు క్రీ. శ. 1526-29 ప్రాంతమున నుండెననియు నితనిశాసనము బట్టరువర్తుగారి శిలాశాసనముల వాల్యుము 2 లో నెల్లూరుజిల్లా కనిగిరిశాసనములలోఁ జూడుమని వేటూరి ప్రభాకరశాస్త్రి గారు ప్రబంధరత్నావళి పీఠికలోఁ జెప్పిరి. ఆశాసనము చూచి విమర్శించవలసిన యవసరమున్నది. ఈ యంశము పీఠికయంతయు ముగిసినపిదపఁ జూచుటచేఁ జర్చించఁజాలకపోతిమి. ఈ నిర్ణయము మేము నిరూపించినకాలమునకు సరిపడియున్నది.