ఆంధ్ర శాసనసభ్యులు 1955/ఎన్నికల సమీక్ష

ఎన్నికల సమీక్ష

శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులుగారి నాయకత్వాన నవ్యాంధ్ర రాష్ట్రంలో ఏర్పడిన తొలి మంత్రివర్గం పదమూడు మాసముల పదిహేను రోజులు అనంతరం మధ్య నిషేధ సమస్యపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం ఒక్క ఓటు తేడాతో నెగ్గటంతో పతనమయింది.

భారత రిపబ్లిక్ అధ్యక్షుడు డా|| రాజేంద్రప్రసాద్ ప్రత్యేక శాసనం ద్వారా ఆంధ్ర శాసనసభను రద్దుచేసి గవర్నరు పరిపాలనను ప్రవేశపెట్టారు. షుమారు నూట ముప్పది ఐదు రోజులు గవర్నరు పరిపాలన తదుపరి తిరిగి ఆంధ్ర శాసనసభకు ఫిబ్రవరి, మార్చి నెలలలో ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికలలో అర్హతకలిగిన ఓటర్ల సంఖ్య మొత్తం 1,15,68,859, ఇందు పోలైన ఓట్లు 86,30,311, ఎన్నికల కొరకు నిర్నయించిన నియోజకవర్గాలు 167, అందులో 29 ద్విసభ్య నియోజక వర్గాలు, కనుక ఎన్నిక జరుగవలసిన మొత్తం స్థానాలు 196. వీటిలో 26 షెడ్యూల్డు తరగతుల వారికి, 5 షెడ్యూల్డు జాతుల వారికి ప్రత్యేకించబడినాయి. మొత్తం దాఖలు అయిన నామినేషన్లు 950. అందులో నిరాకరించబడినవి 25, ఉపసంహరించబడినవి 344, ఇక పోటీ లేకుండా ఎన్నికైన ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్ధులుపోను, ఎన్నికల రంగస్థలంలో చివరిదాకా నిల్చి పోటీకి సన్నద్ధమైన వారి సంఖ్య 578, యిందు ఐక్య కాంగ్రెస్ అభ్యర్ధులు 185, కమ్యూనిస్టులు 169, ప్రజా సోషలిష్టులు 42, స్వతంత్రులు 162, జనసంఘం 6, ఎన్నికలలో పోలైన మొత్తం ఓట్లు పక్షాలవారీగా పొందుపరిస్తే కాంగ్రెస్ కు 42,65,814, కమ్యూనిస్టులకు 26,95,562, ప్రజా సోషలిస్టులకు 4,82,825, స్వతంత్రులకు11,73,745, జనసంఘానికి 4,201.

రద్దయిన ఆంధ్ర శాసనసభలోని 117 మంది సభ్యులు ఈ ఎన్నికలలో పోటీచేశారు. వీరిలో 54 మంది మాత్రమే తిరిగి ఎన్నికైనారు. వారిలో పార్టీలవారీగా ఐక్యకాంగ్రెస్ 40, కమ్యూనిస్టు 8, ప్రజా సోషలిస్టు 3, స్వతంత్రులు 3, గెలుపొందారు. శ్రీ ప్రకాశం మంత్రి మండలియందలి ఏడుగురు సభ్యులలోని ఒక్క తెన్నేటి విశ్వనాధంగారు మినహా మిగతా వారందరూ ఎన్నికైనారు. గడచిన ఆంధ్ర శాసనసభలో ఒక్క ముస్లిం శాసనసభ్యుడు కూడా లేని లోటును, ప్రస్తుత శాసనసభలోని నల్గురు మహమ్మదీయ సభ్యులు తీర్చారు. పార్టీలక్రమంగా ఐక్య కాంగ్రెస్ 3, కమ్యూనిష్టు పార్టీ 1. నూతన ఆంధ్ర శాసనసభలో స్త్రీ సభ్యురాండ్ల సంఖ్య 3. ఐక్య కాంగ్రెస్ 2, ప్రజా సోషలిస్టు 1.

ప్రజా సోషలిస్టు పార్టీ గరపున గజపతి నగర ద్విసభ్య నియోజక వర్గంనుండి ఎన్నికైన విజయనగరం రాణి శ్రీమతి కుసుం గజపతిరాజుతో పోటీచేసిన అభ్యర్ధులందరికీ ధరావత్తులు పోవటం ఒక విశేషమనే చెప్పాలి.

ఈ ఎన్నికలలో పోటీచేసిన అభ్యర్ధులందరిలోను అత్యధిక ఓట్లు సంపాదించిన గౌరవము, ప్రతిష్ట " దివి " ద్విసభ్య నియోజకవర్గంలోని కాంగ్రెస్ కూటమి అభ్యర్ధి శ్రీ మల్లెపూడి రాజేశ్వరరావుకి దక్కుతుంది. వీరికి పోలైన ఓట్లు 61,128.

ఆంధ్ర శాసనసభలోని 29 ద్విసభ్య నియోజకవర్గాలలోను, అన్నిటికన్నా ఎక్కువ ఓట్లు పోలైన ద్విసభ్య నియోజకవర్గం కృష్ణాజిల్లా " దివి " ఇక్కడ మొత్తం పోలైన ఓట్లు 1,19,502. ఆంధ్రలో యిన్ని తడవలు ఎన్నికలు జరిగినప్పటికి కొండజాతి ప్రజలు ఎన్నికలలో పాల్గొని తద్వారా ప్రజాస్వామ్య ప్రభుత్వస్థాపన యందుగల తమ బాధ్యతను యింకా తగినవిధంగా గుర్తించలేదనే విషయం ఈ క్రింద పొందుపర్చిన సంగతులవలన మనకు విశదమవుతుంది. కొండజాతులకు ప్రత్యేకించిన ఐదు (నాగూరు, సాలూరు, శృంగవరపు కోట, గూడెం, భద్రాచలం) నియోజకవర్గాలలో చాలా తక్కువ ఓట్లు పోలైనాయి. ముఖ్యంగా గూడెం నియోజకవర్గంలో 76,000 ఓట్లు ఉండగా 6,000 మాత్రమే పోలైనవి. ఈ ఐదు స్థానాలు పార్టీవారీగా కాంగ్రెస్ 1, ప్రజా సోషలిస్టు 1, కమ్యూనిస్టు 1, స్వతంత్రులు 2 సంపాదించుకొన్నారు.

ఈ ఎన్నికలలో కాంగ్రెస్, కమ్యూనిష్టు ముఖా ముఖీ పోటీలు రమారమి 70 నియోజకవర్గాలలో జరిగింది. ఈ పోటీలలో ముఖ్యమైన నియోజకవర్గాలు దివి, గన్నవరం, వుట్లూరు, ఒంగోలు వగైరా ప్రదేశాలు. సత్తెనపల్లి, నందిగామ, వుయ్యూరు, తిరువూరు, కూచనపూడి, మాడుగుల మొదలగుచోట్ల కూడా పోటీ చాలా తీవ్రంగా జరిగిందనే చెప్పాలి. పుట:Aandhrashaasanasabhyulu.pdf/14 పుట:Aandhrashaasanasabhyulu.pdf/15
పుట:Aandhrashaasanasabhyulu.pdf/17