ఆంధ్ర రచయితలు/వేదుల సత్యనారాయణ శాస్త్రి

వేదుల సత్యనారాయణ శాస్త్రి

1900

తల్లి: గురమ్మ. తండ్రి: కృష్ణయ్య. జన్మస్థానము: భద్రాచలము. జననము: వికారి సంవత్సర ఫాల్గుణ బహుళ షష్ఠీ బుధవారము. 22-3-1900. రచనలు: 1. దీపావళి 2. విముక్తి. 3. మాతల్లి 4. ఆరాధన 5. ముక్తావళి (కావ్యములు) మరికొన్ని నవలలు, నాటకములు, వ్యాసములు ఇత్యాదులు.

' వేదుల ' వారి పేరు తలపోయగనే ' దీపావళి ' స్మరనకు దగులును. దీనికి గారణము కవితన్మయుడై రచించిన కావ్యకదంబమా కూర్పులో నుండవలయును. నిజమే.

శ్రీ సత్యనారాయణ శాస్త్రిగారు సంస్కృతాంధ్రములలో జక్కని సాహిత్య సంపత్తిగలవారు. గురుకుల వాసముచేసి గొట్టుపుళ్ల శ్రీనివాసాచార్యులవారికడ కావ్యనాటకాలంకారములు పఠించిరి. చిలుకూరి సోమనాధశాస్త్రిగారి సన్నిధానమున వ్యాకరణాధ్యయనము సాగించిరి. చల్లా వేంకట నరసయ్యగారి దగ్గర స్మార్తము కూడ పాఠము చేసిరి. కవితాగురువులు కవిసార్వభౌమ శ్రీపాదకృష్ణమూర్తి శాస్త్రులవారు. దివ్యమైన యీగురుత్వ భాగ్యముతో " వేదుల " వారు సంగ్రహించిన వైదుష్యము ప్రశంసనీయమైనది కదా ! విద్వత్పట్టభద్రులైన శాస్త్రిగారు కాకినాడ, పెద్దాపురము, పేరూరు హైస్కూళ్లలో నిరువది నాలుగేండ్లుగా నాంధ్రోపాధ్యాయ పదవి నిర్వహించుచున్నారు పెక్కురు జమీందారులు వీరిని గౌరవించి వార్షికబహుమానము లిచ్చుచున్నారు. వీరు శతావధానులు. కాని, దేశకాలస్థితులు గుర్తించిన లోకజ్జతవిరియందుండి, ఆగారడీ పనులను కట్టిపెట్టించినది. ప్రకృతము : అద్యతనాంధ్రకవులలో వేదుల సత్యనారాయణశాస్త్రిగారి స్థానము మంచిది. ఆయన ప్రతిభ సమంచితమైనది. వ్యుత్పత్తియు దానికి దీటయినదని తెలిసికొంటిమి. దేవులపల్లి కృష్ణశాస్త్రి ప్రభృతుల చెలికారముతో నీయనకు పాశ్చాత్య కవితారామణీయక మాకళింపునకు వచ్చినది. తనకు, ఆజానజమైయున్న ప్రాచ్యసాహిత్య ప్రతిభ కా యదృష్టము తోడైనది. ఈసన్నివేశముతో నెన్నో ఖండకృతులీయన సంతరించెను. పదముద్రలో నీకవి బహుభద్రత గలవాడు. పలుకుబడి చిక్కగా, చక్కగా, కుదిరికగా నుండును. సంస్కృతవాణిపై మక్కువ పెంచుకొన్నను, వాడిన తెనుగునుడి యెంతో ముద్దుగా నుండును. భావన లోతుకలది. ప్రాక్తన సంప్రదాయములకు సమీపస్థుడై, క్రొత్త చవులు పుట్టించునట్లు కవిత్వము కట్టుటలో ' వేదులకవి ' మంచినేర్పరి. ఆనాడు శ్రీనాథుడు సీసములకు బేరుపడినట్టుగా, ఈనాడు ' వేదుల ' వృత్తములకు బేరుపడెను. శయ్యాసౌందర్యము చంపకుండగా జాగ్రత్తగా, మునువెనుకలు చూచుకొని వ్రాయుట యీయనలో నలవాటు. అందువలన, ఆయనప్రతిపదము మలయమారుతమువలె చదువరిని సుఖపెట్టును. ఈమార్గమునకు సంస్కృతకవులలో జయదేవుడు తెనుగు కవులలో ముక్కు తిమ్మనగారు దర్శకులు. వేదులవారి ' విముక్తి ' కావ్యమునుండి మూడు ముక్తలు.

ప్రాకుల్ వెట్టిన చిమ్మచీకటుల యీపాషాణ కారాగుహా
ప్రాకారమ్ములు వ్రీలి నాబ్రతుకుపై ప్రాభాత శోభామయా
శాకాంతిప్రసరమ్ము సాగెడిని స్వేచ్ఛామారుతాహ్వాన గీ
తా కోలాహల మేదో నాయెడద నుత్సాహమ్ము లూగెంచెడిన్.

ఊపిరి యాడనీని కఠినోపలబంధములో, కలా కలా
లాపముగాని, నర్తన విలాసముగాని, ధరా పరీమళా

వాపముగాని, లేనిపుటపాకపు చీకటి జీవితంబు నె
ట్లోపితినోగదా, యవలియొ డ్డగుపింపని కాల మీదుచున్.

ఎన్నడు సోకునో తరగ లెత్తగ తెమ్మెర తావియూర్పునా
యన్నువమేన, ఎన్నడు దయారుణరాగ మనోజ్ఞతల్ జగా
వన్నె పసిండిపూత చెలువమ్ముల నాపయి గ్రుమ్మరించునో
యన్న నిరంతరాశ బ్రతుకాపిన దాగిరి గర్భవుం జెరన్.


' మాతల్లి ' కావ్యమునుండి మరిరెండు ఉదాహరింపకుండ నుండలేను.


ఆరనికోర్కెగా బ్రతుకునందు రగుల్కొనుచున్న దొక్కటే
కోరిక, నీకృపావనికి కోయిలనై సతమాలపింతు, మం
దార సుమారుణద్యుతి వితానముగొల్పెడి నీమనోహరా
కారమునన్ మధూదయ వికాసము నింపుము తల్లి, నాయెదన్.

ఏయను భూతిలేక రసమెండి, వివర్ణత దోగి వాసనల్
వోయిన నాహృదంబుజములో నొలికింపు మొకింత సర్వ సం
ధాయకమైన నీయడుగుదమ్ముల పుప్పొడి తోడితేనె; త
ల్లీ యదెచాలు నాకు ఫలియించును ప్రోవిడుకొన్న నాకలల్.

ఈ రచనలో భావస్ఫుటత, భాషాపటుత యెటులు వియ్యమందు చున్నవో చూచితిరి. ఎప్పుడో హరీంద్రనాథుడు ' దీపావళినాడు ' అను పద్యములకు దలయూపె నని చెప్పి, యిప్పుడు సత్యనారాయణ శాస్త్రిగారి రచనలు గొప్పగానుండునని బలవంతముగా మన మొప్పుకొన నక్కరలేదు. ఆయన కూర్పులో సాజముగా నట్టి లగువు బిగువు లున్నవి. అట్టి భావానానైశిత్య మున్నది. అట్టి శిల్పసంపత్తి యున్నది. ఈ గుణములుగల కావ్యములకు దిపావళి రాశి. అందుకే, వేదులవారి పేరు విన్నవెంటనే, ఆకూర్పు స్మరణకు వచ్చుట. శాస్త్రిగారు కొన్ని నాటకములు, కథలు, విమర్శనములు వ్రాసిరి. ఏవి వ్రాసినను, ఆయన పద్యకావ్యరచనలోనే శ్రద్ధధానులు.

ఈ ' గౌతమీకోకిలము ' కాంక్ష యిటులున్నది:

కానుకనై ధరాధిపుల కాళ్లకడం బొరలాడి వాడిపో
లేను, ధరాపరాగ పటలీ మలినమ్మగు ద్వారతోరణా
స్థానమునం దురిం బడగజాలను, దోసిటి పేరి ఘోరకా
రా నరకమ్మునం దుసురు రాల్పగలేను నిమేషరక్తిమై.

నీచపు దాస్యవృత్తి మననేరని శూరట మాతృదేశ సే
వా చరణమ్మునం దనువు లర్పణ జేసినవారి పార్థివ
శ్రీ చెలువారుచోట, దదనృగ్రుచులన్ వికసించి, వాసనల్
వీచుచు రాలిపోవగ వలెం దదుదాత్త సమాధి మృత్తికన్.