ఆంధ్ర రచయితలు/వేటూరి ప్రభాకరశాస్త్రి

వేటూరి ప్రభాకరశాస్త్రి

1883


వైదిక బ్రాహ్మణులు. తల్లి: శేషమ్మ. తండ్రి: సుందరశాస్త్రి. నివాసస్థానము: తిరుపతి. జననము: 1883 ఫిబ్రవరి, సర్వజిన్నామ సంవత్సర మాఖబహుళైకాదశి మంగళవాసరము. గ్రంథములు: 1. నీతినిధి (వచనము) 2. కడుపుతీపి. 3. కపోతకథ. 4. విశ్వాసము. 5. మూనాళ్ళుముచ్చట (ఈ నాలుగును ఖండకావ్యములు) 6. ప్రతిమానాటకము. 7. కర్ణభారము. 8. మధ్యమవ్యాయోగము (ఈ మూడును భాసకృతులకనువాదములు) 9. భగవదజ్జుకము (బోధాయనకృతి ప్రహసమునకనువాదము) 10. శృంగారశ్రీనాధము. (శ్రీనాధునికాలము, కృతులు మున్నగు విషయములపై విపుల విమర్శనము) 11. తంజావూరు ఆంధ్ర రాజుల చరిత్రము. 12. కనకాభిషేకము (శ్రీనాధునకు సంబంధించిన చరిత్రము) 13. చాటుపద్యమణి మంజిరి. 14. ప్రబంధరత్నావళి. 15. తెలుగు మెరుగులు ఇత్యాదులు.


ఎడతెఱిపిలేని భాషాపరిశ్రమము - గడిదేఱిన యుభయసారస్వత పాండిత్యములు - వడిగల కార్యాదీక్షా దక్షత - చెడిపోని తలంపులు - ఒడిదొడుకులు లేని తేట తెనుగు కవితారచన - కడదాకిన తాత్త్వికదృష్టి - ఈ విశిష్టలక్షణములతో బుట్టిన మహారచయితలు వేటూరి ప్రభాకరశాస్త్రిగారు. ద్రావిడము నెఱుగుదురు. ఆంగ్లమున వలసినంత పరిచయము. అచ్చుయంత్రముల మొగమెఱుగక మట్టిబ్రుంగిన తాటియాకులను బట్టుకొని కన్నులు చిల్లులుచేసికొనెడి నిరంతర వ్యవసాయము. దానికిసాయము చెన్నపురి ప్రాచ్యలిఖిత పుస్తకశాలలో బరిశోధకపదవి. పెక్కు వత్సరములు ప్రభాకరశాస్త్రిగారాపదవిలో నుండి మదరాసు పండితులచే జోహారులు చేయించుకొనుచు బరిశోధనము గావించినారు. ఈ పరిశోధన ఫలితము శృంగార శ్రీనాథాదిగ్రంధద్వారమున దెలుగువారు చూఱలాడుచున్నారు. శ్రీనాథుడు ప్రభాకరశాస్త్రిగారికి నచ్చిన మహాకవి. ఆయనపద్యములలోని రహస్యపుమెలకువ లెన్నో యెన్నుకొని శాస్త్రిగారి శరీరము పులకితమగును. 'క్రీడాభిరామము' నకు సువిశాలమైన పీఠికవ్రాసి దానికి వెలుగుచూపిన మహాశయులు వీరు. "హరవిలాసము" వీరు సరిపఱుపగా నానందముద్రణాలయమువా రచ్చువేసిరి. వీరొకతీరునకు దెచ్చిన కాశీఖండము వావిళ్లవారు వెలువరించిరి. శ్రీనాథుని గ్రంధములలో నెన్నో పాఠములు ప్రభాకరశాస్త్రిగా రమూల్యపరిశోధనము గావించి యెత్తిచూపిరి.


ప్రబంధరత్నావళి - చాటుపద్యమణిమంజిరి - శాస్త్రిగారి పరిశోధనపు బంటలు. 'తంజావూరి యాంధ్రరాజులచరిత్ర' కు వీరురచించిన 'తొడిమ' గొప్పది. ఆంధ్రవిశ్వవకళాపరిషత్తు ప్రకటించిన 'రంగనాథ రామాయణము' నకు వీరిసహాయత పెద్దలు ప్రశంసించిరి. 'తెలుగు మెఱుగులు' అనుకూర్పులో జాలగ్రొత్త విషయములు మనము గ్రహింపగలుగుదుము. 'దేశికవిత' సేకరింపవలెనన్న యాశ వీరికి గొండంతయున్నది. ఇది యిటులుండగా, శాస్త్రిగారి యాధ్యాత్మికదృష్టి సాధారణుల కందరానిది. పరమేశ్వరప్రీత్యర్థమను సంకల్పముతో వీరు ప్రతికార్యము చేయుదురు. యోగనిష్టాగరిష్టత యున్నది. మానసిక శాంతి శారీరకస్వాస్థ్యము వీడినవారు వీరివాగమృతముచే సుపరితృప్తులగుచుండుట కనుచున్నాము. 'స్వయంతీర్ణ: పరాంస్తారయతి' ఈయాభాణకము శాస్త్రిగారి పట్ల వర్తించును. మానవసంఘము విజ్ఞానవిలసితము కావలయు ననగా ప్రభాకరశాస్త్రిగారి వంటి రచయితలే తెలుగునేల కవసరము. గాంధిమహాత్ముని పవిత్రాశయములు వేటూరివారి కొజ్జబంతులు. వీరి 'గాంధిరామాయణ' సంకలనవిషయము నిటీవల వినియుందురు. ఈశ్వర తత్త్వము గుర్తించిన మహాత్ముడు గాంధియేయని వారివిస్రంభము. ఎట్టి శక్తియున్నను, ఆకుమూల పిందివలె నడం యడకువతో దన పాండితీ ప్రతిభలు దాచుకొనుచున్న పండితుడు ప్రభాకరశాస్త్రి - ఈ వినయవాదము వినుడు.


"......అఱవము వాడుకభాష తప్ప గ్రాంథిక భాష నాకురాదు. ఇంగ్లీషు అసలేరాదు. చిరశ్రవణమున నేదో గుఱికి గొంతయెడముగా నర్థమగుట గాని యందు నా కేమాత్రము నెఱుకలేదు. తెలుగులో నేదోకొంత తంటాలు పడితి ననుట తథ్యము. ఆంధ్రవాజ్మయ సౌధనిర్మాణ కర్మకారులలో నేను నొకడ నగుదు ననుకొని కొన్నాళ్లు కూలిపనిచేసి మట్టి ముద్దలు మోసితిని. చేతులు కడిగికొను దశలో నిప్పుడున్నాను - నా యాధ్యాత్మిక పరిశ్రమమునకు సంబంధించిన విషయము లితరులకు దెలియవలసినవి గావు..........తెలుగు నేను నేర్చిన నాలుగు ముక్కలకు పూజ్యులు, గురువర్యులు నగు చెళ్లపిళ్ల వేంకట శాస్త్రిగారి గురుత్వానుగ్రహము ప్రధానకారణము..........వాజ్మయవిషయమున నాపై గొన్ని యప్పులున్నవి. అవి యెప్పుడో తీర్పవలసినవి. కాని పెక్కేండ్లనుండి యుపేక్షతోనే యుంటిని. ఈశ్వరానుగ్రహమున్న నందు గొన్నింటినేని యిక దీర్చుకొనగలుగుదు నేమో!"


'భారతి' ప్రమాధి కార్తికము.


నిరాడంబరమైన యిట్టిబ్రతుకు ఆర్ధికముగా ముందునకు సాగకపోయినను, ఆధ్యాత్మికముగా నందన వనము వంటిది. 'వేటూరి' వారికి నతీర్థ్యులగు విశ్వనాథ సత్యనారాయణగారు 'త్రిశూలము' పీఠికలో బ్రభాకరశాస్త్రిగారి యుపేక్ష కిటులు చింతించినారు.


వేటురి వారి వ్యాఖ్యలును బీఠికలుం దెలుగుం బొలంతికిన్

బేటులురేగు గందవొడి వెట్టిన పూతలు; నంతయయ్యు వా

రేటికొ వట్టి పేదతనమే భజయింతురు, నెంతయయ్యు నో

నాటకు నెక్కుటో! తెలుగునాటికి నాటికి నాటి కక్కటా! భాషాపరిశోధకులు, విమర్శకులు కవులుగా నగుట యసదు. ఆ యదృష్టము ఒక్క ప్రభాకరశాస్త్రిగారికే పట్టినది. కడుపు తీపు-కపోత కథ - మూనాళ్ల ముచ్చట - మత్త విలాసము - భగనదజ్జుకము - ప్రతిమా నాటకము మున్నగు కృతులు శాస్ర్తిగారు వెలయించినారు. వీనిలో సగము ఆంధ్రీ కృతులు - సగము ఖండకృతులును. ఖండకావ్యములు కలకండములు. వేటూరి కవి తెనుగుమడుల కూర్పునేర్పు నబ్బురముగా నబ్బించుకొన్న చతురుడు. పద్య - గద్యముల రచన మంచి చిక్కగ నుండును. పెద్దనవలె రచనకు గొప్ప బింకము నిచ్చు సమర్థత యున్నది. ఎఱుక దవిలిన యొకసీసము వ్రాసెద.


కురులు చిక్కార్చి దిక్కులు గాంచి చేలాంచ

లము లద్దుకొని కంచెలం దొలంచి

మొగము మంగళసూత్రమును నోలగందంబు

పసుపున బూసి మన్ విసరివైచి

గుమురొత్తు పులకల నిమిరి పొక్కిలిబంటి

నీట నీరెండ మైనాటడిగ్గి

గుమ్మడి మూటగా గూర్చుండి చిగురాకు

దొప్పదోసిళ్ళ నీ రప్పళించి


దరని గల బ్రాహ్మణుండు మంత్రములు పలుక

నల కనకగాత్రి కృష్ణలో జలక మాడె

గరగ బోసిన పొంగు బంగార మసగ

సంగ కాంతులతోడ దరంగలాడ.

'కడుపుతీపు' లోనిది.


పదముల కుదిరికను, భావము పొదుపును గ్రింది పద్యములలో నరయవచ్చును. బాలింతతనము తోడనె

సూలింత తనమ్ము వచ్చి సోలించుట ని

ల్లాలికి బని తోడని నెల

కూలికి నొకదాసిపడుచు గుదిరిచె నతుడున్.

ఎల్లిదానిపేరు నల్లనిచాయది

వయసు పదియు నాఱు వత్సరములు

కూలి నాలి చేసుకొనుచుండెడిది గాన

జిక్క నయిన మేని చెలుపుగలది.

'మూనాళ్ల ముచ్చట' నుండి -


ఇవియెల్ల నీలాగుననుండుగా, శాస్త్రిగారు 'నాగతి' యనుశీర్షికతో గొన్ని పద్యములు రచించిరి. వానిలో గొన్నింటినే యిట బ్రదర్శింతును సాహిత్య పరమార్థము నేవిధముగా వారు గుర్తింపగలిగిరో తెలియ గలుగును.


అంబన్ సరస్వతిన్ భా

వాంబరవీథీ విహారసట్టే ధ్యానిం

పం బూనితి నాభావం

బంబరవీధిన్ మహావిహారము సలిపెన్.

           *

ఆకసము కేసి చూచితి

బైకి బయికి నింకంబైకి బయికిం బయికిన్

దూకుచు నెట్టోపోయిన

పోకై నాభావ మెందొ పోయేం బోయెన్.

            *

అనంతమైన యాకసంబునందు నెందొ యెట్లొ యే

మనన్ గలన్ దుపాకి గుంటి యంతకంటె వేగమై కనుంగొనంగ రాక పోక గంద్రగోళమయ్యె; నా

మనంబు, నేను, లేమ - యేమొ మాయమయ్యె నయ్యెడన్.

                  *

మూర్ఛయేమొ లోన మూల్గు వినంబడె

నునుఱు గల దొకింత మసలినాడ

తోచె నొడలిలో నెదో చేతన - యెటో గ్ర

హింప నాస్వభావ మింపు లొలికె

                *

దానిగుర్తు పట్టి యానంద మందితి

నట్టె దాని నంటి పట్టి కొంటి

ప్రజ్ఞ వెలసె గన్ను పఱపితి; నది లోనె

లోనె కాంచు వెలికి రానె రాదు.

ప్రభాకరశాస్త్రిగారి తాత్త్వికదృష్టి యీ పద్యములలో సుస్పష్టపడుచున్నది. కవితాపారమ్యమును గుఱిచి వారి సందేశము మనము మననము చేసికోవలసియున్నది.


"..తాత్త్వికునిలో కవితాంశములును, కవిలో తాత్త్వికతాంశములును గూడ ననుగతములై యుండవచ్చును......తాత్త్వికుల తత్త్వజ్ఞానము పెరుగగా, తన్మూలమున కవితలో తాత్త్వికతాంశములు పెరుగగా పెరుగగా సంఘమున తాత్త్వికతాశ్రద్ధ పెచ్చు పెరుగును. అప్పుడు కవిత తేట దేరి క్రమపరిణామముతో బరమార్థపరాయణ మగును. కృతిమ కవితావిడంబనముల కపుడు తా వుండదు. కవి కపుడు సత్యప్రతికృతి కల్పన మనావశ్యక మగును. సౌందర్య సముచిత మయిన యా పరమార్థమే, అనగా సత్యమే యప్పుడు వాజ్మయాకృతి దాల్చును. పదునాఱువన్నె బంగారమును మించిన మేనిసౌరుగల శుద్ధసాత్త్విక తేజో విరాజితునకు బంగారపు టలంకారములతో బనియేమి?........." ఇట్టి దివ్యసందేశము లందిచ్చు రచయితలు మహాత్ములు కారా? ప్రభాకరశాస్త్రిగారి జీవితము మనరచయితల కొరవడిగానుండవలసినది. తిరుపతి కళాశాలలో నుపాధ్యాయవృత్తిలో నిపు డున్నారు. గ్రంథముల వలన గొంతరాబడి వచ్చుచున్నది. ఇది యంతయు నతిధ్యభ్యాగతుల సత్కారమునకు వినియోగింప బడుచున్నది. భోగ త్యాగములు సరిగా నలవఱచుకొన్నవారిలో శాస్త్రిగారిది యుత్తమస్థానము. మఱియొకటి: సమాజసంస్కారమును వాంఛించుటయే కాక, ఆచరించి చూపుట వీరిలో గొప్ప విశేషము. శ్రీ విస్సా అప్పారావుగారు, ప్రభాకరశాస్త్రులుగారును విభిన్న శాఖియు లయ్యును వియ్యమంది రనుట చెప్పదగిన విషయము. ఎన్నో విశిష్టలక్షణములతో నిండారియున్న వేటూరి పండితుని సాహిత్యసేవ శాశ్వతమైనది. ఆయన రెడ్డి రాజ్య చరిత్రపరిశీలనము, చారిత్రకులకు మేలిబాట చూపినది. ఆయన పీఠికలు మహాగ్రంథములై పొలుపారుచున్నవి. ఆంధ్రకవిత, అరసున్న, ఆంధ్ర లిపి సంస్కారము, వింతనిఘంటువులు మున్నగువిషయములపై వారు చర్చించి ప్రకటించిన సత్యములు మఱచి పోరానివి. ముద్దుముద్దుగా, రస కుల్యలుగా బ్రవహింప జేసిన వారి ఖండకావ్య రచనలు సమాస్వాదింప దగినవి. భాషా- సారస్వత పరిశోధనములందు ప్రసిద్దులైన ప్రభాకరశాస్త్రిగారి జీవనము విద్వత్కవిలోకమునకు విజయ వైజయంతిక.


                        _______________