ఆంధ్ర రచయితలు/వడ్డెపాటి నిరంజన శాస్త్రి

వడ్డెపాటి నిరంజన శాస్త్రి

1877 - 1937

స్వర్ణకారవంశీయుడు. తల్లి: భద్రమ్మ. తండ్రి: కోటయ్య. జన్మస్థానము: తెనాలి తాలూకాలోని దుగ్గిరాల. జననము: 14-10-1877, ఈశ్వర సంవత్సరాశ్వయుజ శుక్లాష్టమి భానువాసరము. నిర్యాణము: 17-10-1937 సం. ఈశ్వర సంవత్సరాశ్వయుజ శుక్ల త్రయోదశీ భానువాసరము. ప్రకటిత గ్రంథములు: 1. కల్యంధకౌముది (కావ్యము) 2. కుమారాభ్యుదయము (కావ్యము) 3. బ్రహ్మానందలీలలు (ఎనిమిదంకముల నాటకము 1937 ముద్రి.) ఆముద్రితములు: 1. ధర్మపాల చరితము. 2. భీష్మోదయము. 3. మాఘమాహాత్మ్యము. 4. సూర్యశతకము. 'శ్రీ నిరంజన విజయము ' కొండూరి వీరరాఘవాచార్యులు రచించినది చూడవచ్చును.

వడ్డెపాటి వారిది విశ్వబ్రాహ్మణవంశము. ఆవంశమున బుట్టిన నిరంజనశాస్త్రి తండ్రి కోటయ్య యనునతడు కమ్మరీడు. అతడు కులోచితమగు కమ్మరముచేసికొనుచు స్మార్తము గురుముఖమున నధ్యయనము చేసినవాడు. ధనసంపత్తి విషయములో నతనికుటుంబము సామాన్యమైనది. నిరంజనశాస్త్రి తండ్రికడనే పసితనమున జదువుకొని, యుపనీతుడైన పిమ్మట వేదాధ్యయనమున కుపక్రమించెను. వేదము పాఠము చేయుచునే జ్యోతిశ్శాస్త్రమును గేరళమును సొంతముగ జదువుకొని, తెలియనిది తజ్‌జ్ఞలవలన దెలిసికొనుచుండెను. 'బంగారవంటి కోమటి సంగీతముచేత బేరసారము లుడిగి' నటులు కాకుండ గులవృత్తి యగు కమ్మరమునుగూడ నిరంజనశాస్త్రి వీలుకలిగినపుడెల్ల నలవాటు చేసికొను చుండెను. క్రమముగ వయసు వచ్చుచున్నకొలది సంస్కృతవిద్యపై నభిలాషము పెరిగి నిరంజనశాస్త్రి పండితుల దరికేగి కావ్యములు, నాటకములు, కొన్ని యలంకారగ్రంథములు బహుశ్రద్ధగ జదువుకొని, ఆ సాహిత్యమునకు మెఱుగుపెట్టు కొంచెము వ్యాకరణపరిచయము కలి గించుకొనెను. తరువాత బందరునందుండి 'పర్వతము నృసింహశాస్త్రి' యను పేరుగలవారియొద్ద నాధానపంచకము, శ్రౌతగృహ్యధర్మసూత్రములు మున్నయిన వైదికక్రియావిధానములను సంపూర్ణముగ నభ్యసించెను. మొదటినుండియు సహజమగు కవితచెప్పు నేర్పు కలవాడు గావున బదునెనిమిదవ యేటనే 'కల్యంధకౌముది' యను పేరు పెట్టి కావ్యము వ్రాయ మొదలిడెను. ఇందలి యితివృత్తము వీరేశ్వర లీలావర్ణనము. అది యెన్నో ప్రసారములుగ రచింప నారభించి యొక ప్రసారముతో సమాప్తి చేసెను.


మ.ఇది శ్రీ సానగగోత్ర సంజనిత కోటీశార్య సంతాన సం

పద, వీరేశ్వరయోగి పాదయుగ సేవాశీలి, నిర్వ్యాజకో

విద విశ్వాసి నిరంజనుండు సమవాప్తింజేయు కల్యంధకౌ

ముది లోనం బ్రథమప్రసారము ప్రజామోదంబు సంధించుతన్.


'పౌరుషేయాన్వయ మహాపురుష రత్నమాల' అను గ్రంథము రచింతమని ప్రారంభించెను. ఆ గ్రంథ మనతారికా పద్యములవఱకు వచ్చియాగిపోయినదట. తరువాత 'కుమారాభ్యుదయము' అను నాటకమొకటి శైవమత సమ్మతముగా రచించెను. అది ప్రచురింపబడినది. ధర్మసాలచరితము, భీష్మోదయము, సూర్యశతకము, మాఘమాహాత్మ్యము మున్నగు పెక్కు కృతులు రచించుట కుపక్రమించుటయు, నిందులో నొకకృతియు దుదిముట్టక, నట్టనడుమనో, మొట్టమొదటనో యాగిపోవుటయు, దటస్థించినటులు 'శ్రీనిరంజన విజయము' అను జీవిత చరిత్రమువలన దెలియుచున్నది. నిరంజనశాస్త్రివని ప్రచురింప బడినవి కుమారాభ్యుదయనాటకము గాక, 'బ్రహ్మానంద లీలలు^ అను మఱొకనాటకము. తక్కినవెల్ల సముద్రితములు, నసంపూర్ణములును. ఈరెండునాటకములలోని కవితతీరును, మిగిలిన యసంపూర్ణకావ్యములలోని రచనతీరును బరికింప నిరంజన శాస్త్రిగారు మంచి రచయితలని తోచుచున్నది. తాను రచించు 'మాఘమాహాత్మ్యము' నిడుబ్రోలు వాస్తవ్యులు శ్రీ పాములపాటి సుబ్బరాయుడుగారి కంకిత మీయదలచి 'సుబ్బరాయతారావళి' యను పద్యములు చెప్పెను. అవి యెంత సొగసుగ నడచినవో, రెం డుదాహంచెదను జూడుడు.


మ.అరి నిర్భేద్యము నీదుగుట్టు, సకలవ్యాపారసౌకర్య దు

స్తర పాండిత్యము నీదుకట్టు, నిఖిలాశామండలీ మండన

స్ఫుర కీర్తిప్రభ నీదురట్టు, ముదివేల్పుంజెట్టు నీపెట్టు, బల్

సిరి నీవాకిటి కాటపట్టు, బళిరా ! శ్రీ సుబ్బరాయాగ్రణీ!


మ. కవితాకన్యక లెందఱొ నిను సమాకర్షించి పెంపొంది రం

చు విచారించి బహుప్రియారతుడనై శోభిల్లు నీచూడ్కి వై

భవ మబ్బున్ నిజచాకచక్యనిపుణీభావంబు జూపింప వ

చ్చె వరింపదగు మత్కవిత్వరమణిన్ శ్రీ సుబ్బరాయాగ్రణీ!


అసంపూర్ణమైన వీరి 'మాఘమాహాత్మ్యము' లోని పద్యములు మచ్చుచూపినచో నిరంజనశాస్త్రికి విశ్వబ్రాహ్మణ సంఘసభలో నొసగబడిన 'కవిశేఖర' బిరుద మన్వర్థమే యనిపించును.


[మాఘమహిమ-వర్ణనము]

సీ.పారాడునినువు లబ్రపు ముద్దు బలుకుల

గిలకల లాడు ముంగిళులు గలిగి

సిరులు దుటారింప విరిబోండ్లయాటల

దలతలల్ తొలకుమోసలలు గలిగి

పాఱులప్రామిన్కు పదఱుల మిన్నంది

కనకనల్ గొను శుభధ్వనులు గలిగి

తనివాఱ మెనవి గఱ్ఱున ద్రేపునతిథుల

యెడనెడ దొడరుసందడులు గలిగి వెలయుగీముల నిండారు వేడ్కలలర

రోహిణీదేవీ శచియు నరుంధతియు వె

లందిలోకంబులందు వలంతులగుట

మాఘమున గ్రుంకువెట్టిన మహిమగాదె;

[పెండ్లికాలపు బేరటాండ్రవర్ణనము]


సీ. పసిమి జగ్గుల యొడల్ పసుపునీట దొలంచి

గడిమడుంగులు రింగు లడరగట్టి

జిలుగుపట్టంచురైకలు గుత్తముగ దొడ్గి

వలతికుంకుమబొట్టు లలరవెట్టి

విరిగుత్తిగుబ్బల విరిసరుల్ ఠవణించి

పలుచగందమ్ము చెక్కుల నలంది

క్రొమ్ముడి గెందమ్మి ఱెమ్మ లిమ్ముగ జెక్కి

పసుపు బారాణిని పదముల నిడి

మృదులవాక్కుల వినయమ్ము జదురపఱిచి

కులపురంధ్రుల నట్టింట నిలిచినపుడె

సదన మతిదీప్యమానమై సందడించె

బెండిలికి బేరటాండ్రొకో నిండుసొగసు.


ఈ నిరంజనకవి తన గోత్రఋషియగు సానగ మహర్షిని బ్రతి గ్రంథాదిని ప్రార్థించెను. ఇతడు విశ్వబ్రాహ్మణసంఘము నుద్ధరించుటకు 'ప్రబోధిని' యనుపత్రిక 1907 నుండి నడపనారంభించెను. మహాసభలజేయించెను. ఏతత్పత్త్రికాద్వారమునను, సభాసమావేశమూలమునను విశ్వబ్రాహ్మణ సమాజమునకు నిరంజనకవి గావించినసేవ గొప్పదని చెప్ప విందుము. ఇతడు దుగ్గిరాల స్థానిక సంఘోన్నత పాఠశాలలో బ్రధానాంథ్రోపాధ్యాయుడుగా నించుమించు పదునైదుసంవత్సరములు పనిచేసెను. నిరంజనకవి ఆంధ్ర కర్నాట మహారాష్ట్రాదిదేశములు పర్యటించి శిల్పగ్రంధము లెన్నో సంగ్రహించెను. ఇతడు విశ్వబ్రాహ్మణ సంఘమునకు, సారస్వతమునకు శ్రద్ధమెయి సేవచేసికొని తరించెను. కవిత్వము జానుతెనుగులో బహుమృదు మధురముగ జెప్పి మహాకవులను మెప్పించెను. మొత్తముమీద నిరంజనకవి వ్యుత్పత్తిని దాటిన ప్రతిభ కలవాడని చెప్పనొప్పును. అచ్చుపడిన యతని 'బ్రహ్మానంద లీలలు' నాటకము నుండి మూడు పద్యములిచ్చెదను.


మ. తమ మాయామహిమన్ జనించునవి, కాంతారాంతరావాను లు

త్తమగార్హస్థ్యజనుల్ భజించునవి, యద్వైతా మృతంబున్ సమ

స్తమతాధ్వంబుల గ్రుమ్మరించునవి, సిద్ధశ్రీ మనోమంగళా

డ్యము లైనట్టివి దన్పుగాత! మిము బ్రహ్మానంద లీలావిధుల్.


ఉ. పాటిదొఱంగి వాసనలు పైబడ సంసృతి గ్రుంకు నీప్రజా

కోటి కనంతమోద మొనగూర్పగ మోక్షకవాట పాటవో

ద్ఘాటన దివ్యరంగము బ్రదర్శనముం బొనరించు నాజగ

న్నాటక కర్త యీకథకు నాయకు డౌట యెఱుంగవే సఖీ!


గీ. ప్రకృతి చెలువ వెంట బ్రాకులాడక యున్న

జగము బ్రహ్మమెట్లు జరుపనేర్చు ?

దానగాదె లోకతత్పర క్రీడమై

బాలుడౌట మునులవజ్జ గనుట.

                          ______________