ఆంధ్ర రచయితలు/వజ్ఝుల చినసీతారామస్వామి శాస్త్రి

వజ్ఝుల చినసీతారామస్వామి శాస్త్రి

1878


ఆరామద్రావిడ శాఖీయుడు. తల్లి: వేంకటాంబిక. తండ్రి: ముఖలింగేశ్వరుడు. నివాసము: విశాఖపట్టనము. జననము: 1878 జూను 25వ తేదీ, బహుధాన్య సంవత్సర జేష్ఠ బహుళ చతుర్థి. గ్రంథములు: 1. చింతామణీ విషయ పరిశోధనము. 2. వైయాకరణ పారిజాతము 3. కర్ణచరిత్రము 4. మార్గోపదేశిక 5. స్త్రీవివాహవయోనియమనము. 6. వీరసింహుడు (కావ్యము) 7. బాలసరస్వతీయ, అధర్వణకారికావళి, హరిశ్చంద్ర నలోపాఖ్యానాది గ్రంథములకు భూమికలు.


సీతారామశాస్త్రిగారిలో మహావిమర్శకునకుండవలసిన లక్షణములు సంపూర్ణముగ నున్నవి. కావున వీరు లక్షణవాజ్మయమున కఖండమగు సేవ గావింపగలుగుచున్నారు. తమ సిద్ధాంతములపై రాద్ధాంతములు పత్రికలలో వెలువడుచుండును. వానికి సాధారణముగా బ్రతివిమర్శనములు ప్రకటించుటకు వీరిచ్చగింపరు. తానొకధోరణిలో వ్రాసికొని పోవుచు, వచ్చిన ' టపా ' కూడ బరికింపడని వీరినిగూర్చి చెప్పుకొందురు. అంత యేకతానత ! వీరిమేధ నిరంతరము నాలోచనానిమగ్నము. ఐరోపామహాసంగ్రామము వారి కలజడి కలిగింపదు. ప్రత్యేక రాష్ట్రాందోళనము వారి చెవుల కెక్కదు. వారి పరిశోధనమే వారిది. తెలుగు వ్యాకరణముల యాస్తికతకు వీరు పెట్టినది భిక్ష. పాణినీయము, ముగ్ధబోధము మున్నగు సంస్కృతవ్యాకరణములు పరిశ్రమించి పఠించినవారగుటచే బాలవ్యాకరణ-చింతామణ్యాదులు బాగుగా విమర్శించి నిగ్గు వెల్లడింప గలుగుచున్నారు. వీరు రచించిన " చింతామణీ విషయ పరిశోధనము " వలన వీరి విశ్వతోముఖాంధ్ర వ్యాకరణ సమీక్షాపాటవము సుస్పష్టమగుచున్నది. చింతామణికి బూర్వము తెలుగు వ్యాకరణములు లేవని వీరాధారములు చూపిరి. " వైయాకరణ పారిజాతము " తొలిసంపుటము ఆంధ్రవిశ్వవిద్యాలయము వెలువరిచినది. ఇది సమగ్రముగా వ్రాయబడినచో శాస్త్రిగారి యభిప్రాయ వ్యక్తీకరణమునకు నిలువుటద్దము వంటిది కాగలదు. వీరి యభిప్రాయ సామ్రాజ్యమున నన్నయభట్టారకునకు బ్రాజ్యగౌరవమున్నది. అతని శబ్దశాసన బిరుద పౌర్వాపర్య విషయమున బ్రచురించిన వీరి సిద్ధాంతములు మెచ్చుకోలు పడయదగినవి.


బాలసరస్వతీయమునకు, అధర్వణకారికావళికి, హరిశ్చంద్రనలోపాఖ్యానమునకు వీరు వ్రాసిన పీఠిఅక్లు విపుల విషయములను జర్చించుచున్నయవి. వీరి యొక్కొక పీఠిక యొక్కొక గ్రంథము. సమాజ సారస్వతమునగూడ గొన్నాళ్లు వీరు పరిశ్రమము సలిపిరి. " స్త్రీవివాహ వయోనియమము " దీనికి సాక్షి. " రజస్వలానంతర వివాహమే ధర్మశాస్త్రముచే నుత్తమకోటి నధిరోహించుచున్నది. ప్రకృతమున ఋతుమతీ వివాహ మంతరించిన మాత్రమున నది యావత్కల్పమనుత యసంగతము. శారదాబిల్లు క్షేమకరము." ఇది సీతారామశాస్త్రిగారి యాశయము. సహజముగా నీయనకు వైదిక కర్మనిష్ఠ తక్కువ. కర్మిష్ఠులనిన గౌరవము లేనివారు మాత్రము కారు. వ్యావహారికవాదము నిష్టపడరు. కాని, వ్యావహారికముపై కత్తినూరువారి నొకపట్టుపట్టును. గిడుగువారి ' ప్రాదెనుగుకమ్మ ' పై ' అంపగమి ' పరపిన పండితుడీయనయే.


పెక్కేండ్లు విజయనగర సంస్కృతకళాశాలాంధ్ర పండిత పదవి నిర్వహించిరి. అప్పుడే వీరిమూలమున బెద్దశిష్యులు బయటబడిరి. స్వర్గీయులు దూసి రామమూర్తి శాస్త్రిగారు వీరి శిష్యులు. ఆయన రచించిన "బాలవ్యాకరణ సారస్యసర్వస్వపేటిక " లో " వజ్ఝుల వారిశిష్యు " డన్న విషయము పుట పుటకు దట్టుచుండును. విజయనగరసంస్కృత కళాశాలలోనే యుద్యోగించి విశ్రాంతి గయికొనుచున్న ఆకొండి వేంకటశాస్త్రిగారికి వీరు గురువులు. ఆంధ్రవిశ్వ విద్యాలయముచే నే డాదరింపబడుచున్న పండితులు శ్రీ దువ్వూరి వేంకటరమణశాస్త్రిగారు వజ్ఝులవారి యనుయాయులు. ఈ తీరున నెందరో మనశాస్త్రులుగారి యాచార్యకముచే విద్వత్పదవులలో నున్నారు.


వీరు చెన్నపురి విశ్వవిద్యాలయాంధ్ర భాషాపరిశోధకసభ్యులు, ఆంధ్ర విశ్వకళా పరిషదాంధ్ర పరిశోధకపండితులు నై ప్రతిష్ఠ సంపాదించినారు. విశ్వకళాపరిషత్తు నుండి విశ్రాంతితీసికొని ప్రస్తుతము వ్యాకరణ సమగ్రతా రచనకు బూనుకొని యున్నారు.


ఈయన కాంగ్లభాషాప్రవేశము లేక పోయినను, పాశ్చాత్య విమర్శన విధానములు తెలియును. వసుచరిత్ర విమర్శనములో నిది తెల్లము కాగలదు. వీరివ్యాకరణ శాస్త్రపరిశోధనము నేటి భాషాతత్త్వశాస్త్రము ననుసరించియుండును. కవిత్వము కూడ వ్రాయగలనని ' వీరసింహుడు ' కావ్యముగా గట్టి చూపిరి. శ్రీశాస్త్రిగారి పితామహభ్రాతృసుతుడైన చింతామణిశాస్త్రి యుపదేశమహత్త్వము, మహామహోపాధ్యాయ తాతా సుబ్బారాయశాస్త్రిగారి యుపదేశ మహత్త్వము వీరిలోబడి ఫలవంతము లైనవి. తెలుగు వ్యాకరణముల కొరకే యవతరించిన విచక్షనులు సీతారామస్వామి శాస్త్రిగారు !