ఆంధ్ర రచయితలు/మేడేపల్లి వేంకటరమణాచార్యులు

మేడేపల్లి వేంకటరమణాచార్యులు

1862 - 1943

గోలకొండవ్యాపారి వైష్ణవుడు. భారద్వాజసగోత్రుడు. ఆపస్తంబసూత్రుడు. తండ్రి: రఘునాథాచార్యులు. తల్లి: లచ్చమాంబ. జననము: 10-7-1862 సం. నిర్యాణము: 1943 సం. వీరి పూర్వుల నివాసము అనకాపల్లి (విశాఖపట్టనము జిల్లా). వీరి నివాసము: విజయనగరము. గ్రంథములు: పార్థసారధి శతకము, దేవవ్రత చరిత్రము (ప్రబంధము), సేతుబంధ మహాకావ్యము (ప్రవరసేన రచిత ప్రాకృతకావ్యమున కాంధ్రపరివర్తనము), అలంకారశాస్త్ర చరిత్రము, హర్షచరిత్రము (వచనము), లౌకికన్యాయ వివరణము. సంస్కృతకృతులు: షేక్స్పియరు నాటకకథలకు సంస్కృతానువాదము, వకుళాభరణుల ద్రావిడగాథా సహస్రమునకు సంస్కృత శ్లోకములు- ఇత్యాదులు.

వేంకటరమణాచార్యులుగారు ప్రబంధకవి. ప్రాచీన సంప్రదాయములు దాటకుండ 'దేవవ్రతచరిత్రము' పద్య కావ్యముగా రచించిరి. కవిత్వము నాతికఠినముగ నుండి రసవంత మని పెక్కుపండితులచే బ్రశంసింపబడినది. గ్రంథకర్తలు సంస్కృతాంధ్రములయందు దలస్పర్శియగు పరిజ్ఞానముకలవా రగుటచే నిందెన్నియో ప్రయోగవిశేషములు వాడిరి. 'చేతు' మున్నగునవి ధారాళముగా నుపయోగించిరి. ర. ఱ లకుబ్రాసములు ర. ల లకుయతులు, అఖండవిరామములు వీరు త్రోసివేయలేదు. భీష్మునిచరిత్రము నింతకుముందు రచించినవారు లేరు. భీష్మునిచరిత్రమేగాక సందర్భానుసారముగా ద్రౌపదీవస్త్రాపహరణాదు లభివర్ణితములు, తిక్కనకు వచ్చినట్లే యీకవికి గల వచ్చినది. కలలో శేషశైలపతి కనబడి దేవవ్రతచరిత్రము రచింపుమని చెప్పెనట. స్వప్నవృత్తాంతము, షష్ఠ్యంతములు మున్నగునిబంధనములను మీఱక నగరార్ణవశైలర్తుచంద్రార్కోదయాది సమస్త వర్ణనములు గావించి వీరరసప్రధానమైన యీప్రబంధము భావ భాషా బంధురముగా విరచించిరి. కవిత్వమున నూతనత్వమును దెచ్చుటకు బ్రయంత్నించిన కవులుగారు వీరు. కాని శైలి ధారాళమైనది.

లీలాపాంగవిలోకనంబుల ద్రపాలీలాన్యసందర్శన

భ్రూలాస్యంబుల మంజువాజ్మధుధునీపూరాప్లుతిన్ బూరుషున్

లోలుంజేసి మృషాప్రతిజ్ఞల సతుల్ లోభంబు బుట్టించి దు

ర్లీలం బ్రీతిని జూపి చేయరె నిజక్రీడాశకుంతబుగన్.

"దేవవ్రత.1 - 30"


ఈకావ్యమున మూడవయాశ్వాసములో జామదగ్న్య భీష్ముల కొక సంభాషణ మున్నది. అచట గొన్నిపద్యములు ప్రబంధపద్ధతిని గాక నాటకపద్ధతిని రచింపబడినవి.


భీష్ముడు:- మేలా యీసంరంభము

హేలానంతర్జితావనీశ్వర ! నీకున్

జామ:- బాలామణి గైకొనుమీ

భీష్ముడు:- వాలాయయు సేయనౌనె భార్గవ ! చెపుమా.


ఈ రకపు సంభాషణము నాపుడు, అనపుడు ఇత్యాది పద విరహితముగా బ్రబంధములలో నున్నట్లు కానము. ప్రవరసేన మహాకవి ప్రాకృతమున రచించిన సేతుబంధమహాకావ్యము వీరు తెనుగున రచించిరి. పాకృతమున గూడ నీయాచార్యకవికి మంచిపాండిత్యమున్నది. సంస్కృతమున మహామహోపాధ్యాయులైనను బ్రాకృత మెఱుగనివా రెందఱోకలరు. వీరట్లుగాక ప్రాకృతము గురుముఖమున నభ్యసించి యందు కృషిచేసి 'ప్రాకృతభాషాత్పత్తి' యను గ్రంథము కూడ రచించిరి.


ఆచార్యులుగారు వ్రాసిన 'లౌకిక న్యాయవివరణము' ను ఆంధ్రసాహిత్యపరిషత్తువారు 1939 లో వెలువరించిరి. అందు 232 సంస్కృత సూక్తులు, న్యాయములు, ఆభాణకములు కలవు. ఇది విద్యార్థులకు----------బఠనీయమగు గ్రంథము.


భాషావిషయగ్రంథములు ప్రబంధములు వ్రాసి ------------------ విజయనగరము మహారాజాంగ్ల -------------------సంస్కృతో పాధ్యాయులుగా-

(ఖాళీలలోని అక్షరములు కనబడుట లేదు) బ్రవేశించి క్రమముగా నాంధ్రపండితపదవికూడ నలంకరించి వందలకొలది విద్యార్థులను బండితులనుగా జేసి యించుమించు నలువది వత్సరములుద్యోగధర్మము నిర్వహించిన యాచార్యశేఖరులు.


ఈయన విజయనగర సంస్కృతకళాశాలలో గావ్యనాటకాదులు చదివెను. తరువాత నాంగ్లకళాశాలలో బ్రవేశించి 1884 లో 'మెట్రిక్యులేషన్‌' లో దేఱెను. పిమ్మట దండ్రిగారు మరణించుటచే జదువు కట్టిపెట్టి యుద్యోగము చేయవలసివచ్చెను. కొన్నాళ్లు భాండాగారికుడుగా బనిచేసి క్రమముగా గళాశాలాపండితు డయ్యెను. ఈలోపున నిరంతరసాహిత్య కృషిమాత్రము మానలేదు.


వీరు సామాన్యసంస్కృత కావ్యనాటక సాహిత్యమే గాక సంఖ్యాది శాస్త్రజ్ఞానము, ఉత్తమసాహిత్యపాండిత్యము విజయనగరసంస్థానాస్థానవిద్వాంసులై మహాప్రఖ్యాతి నందిన ముడుంబై వేంకటరామ నృసింహాచార్యస్వామివారి సన్నిధినినేర్చిరి. మనపండితాచార్యులు ప్రస్థానత్రయము. నిరంతరము పఠించుచు వ్యాసంగముచేయు నలవాటు కలవారు. స్వీయమతమున నభినివేశము కలవారైనను బరమతములను దూలనాడు వారు కారు. వీరి భగవద్భక్తి చాల గొప్పది. ప్రాచీనాచారములు వీసమైనను వ్యతిక్రమించుట కీయన యిచ్చగింపరు. విశిష్టాద్వైతద్రావిడ వేదాంతగ్రంథములు వీరు చక్కగా జదివిరి. అందు వీరి గురువులు మహామహోపాధ్యాయ పరవస్తు వేంకటరంగాచార్యులవారు. శ్రీ పురాణము సూర్యనారాయణతీర్థులు మున్నగు విద్వత్కవు లెందఱో వేంకట రమణాచార్యులవారి యంతేవాసులు. శ్రీమాన్ ఈయూణ్ణి వేంకట వీర రాఘవాచార్యులుగారికి వీరు గురుపాదులు. ఎంతశక్తికలవారైనను నీయనవినయవాదము, గురుభక్తి గొప్పవి. ఇదిచూడుండు:


ప్రతిభ లేదు పెద్దపాండిత్యమును లేదు

శబ్దశాస్త్రవిథులజాడ నెఱుగ

శ్రీ ముడుంబ నారసింహుని కృపయె నా

కన్ని గూర్చి కృతికి వన్నె దెచ్చు. [ దేవవ్రతచరిత్ర ]

                         _________________