ఆంధ్ర రచయితలు/మంత్రిప్రెగడ సూర్యప్రకాశకవి
మంత్రిప్రెగడ సూర్యప్రకాశకవి
1808 - 1873
ఆరువేలనియోగి బ్రాహ్మణుడు. హరితసగోత్రుడు. ఆపస్తంబసూత్రుడు. తల్లి: సీతమ్మ. తండ్రి: శరభారాజా మాత్యుడు. జన్మస్థానము: పిఠాపురము దగ్గరనున్న తిమ్మాపురము. జననము: క్రీ.శ. 1808 విభవ సంవత్సరము. నిర్యాణము: 1873 సం||రం మే 11 తేదీ, శ్రీముఖ సంవత్సర వైశాఖ శుద్ధ చతుర్దశి భానువాసరము. గ్రంథములు: 1. సీతారామ చరిత్రము (ఆరాశ్వాసముల కావ్యము- 1851-52) 2. కృష్ణార్జున చరిత్రము (ద్వ్యర్థి కావ్యము - 1863) 3. భీమలింగ శతకము (1869.)
సూర్యప్రకాశకవి శ్రీ కృష్ణభూపాలునాస్థానమున బండితకవి. కృష్ణభూపాలుడు ' మాడుగుల ' సంస్థానప్రభువు. ఈప్రభువు స్వయముగా జదువుకొనిన పండితుడు. ఈయన 1813 లో నుదయించి 1875 లో నస్తమించెను. 1835 లో సంస్థానాధిపత్యము వహించి నలువదివత్సరములు రాజ్యమేలెను. అల్లంరాజుసుబ్రహ్మణ్యకవివరు డీయనపై " కృష్ణభూపతిలలామశతకము " రచించెను. శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి యీ ప్రభువుచే సంభావితుడయ్యెను. బులుసు పాపయ్యశాస్త్రి, ఇంద్రకంటి గోపాలశాస్త్రి మున్నగు విద్వత్సత్తము లీయుత్తమభూపాలుని దర్శించి సంతోషించుచుండెడివారు. సాహిత్యముకలిగి సమర్థు డైనప్రభుని యాస్థానముననుండి గౌరవింపబడుట కవికి మహాభాగ్యము. అట్టి యదృష్టము పట్టుట యెక్కడనోకాని కన్పట్టడు. సూర్యప్రకాశకవి మంచి విద్వాంసుడు. చక్కనికవి. ఇతడు కృష్ణభూపతియోలగమున విద్వత్కవిగా వెలసెను. ప్రభుదర్శనమునకు వచ్చుపండితులను గౌరవించి రాజసన్మానము గావింపించి పంపించుచుండెను. అతని సహృదయత ప్రశంసనీయముగదా ! ఈ కవి విద్యాగురువులు మూవురు. కందర్ప సీతారామశాస్త్రి గారు బాల్యగురువులు. దేవులపల్లి తమ్మయసూరి గారు, వాడవల్లి అనంత పద్మనాభాచార్యులు గారును భాషాచార్యులు. వీరికడ నడకువతో నుభయ భాషలు జక్కగ సాంప్రదాయసిద్ధముగ నభ్యసించెను. కవితా ధార ఇతని కాజానజమైన యలవాటులోనిది. తల్లి వంకవారును, తండ్రి వంకవారును బండితకవులు.
ఈ కవి మేనమామ మంచికవియట. సీతారామచరిత్రలోని ఈ పద్యము చదువుడు.
సీ. ఏమహాత్మునితాత యీశ్వరారధన
ప్రముదితస్వాంతుండు బసవరాజు
ఏగుణాధికుతండ్రి హిమశైలకైలాస
నురుచిరపత్కీర్తి జోగిరాజు
ఏసుధీమణియన్న భాసురాత్మజ్ఞాన
పటుమనీషాశాలి బసవరాజు
ఏధన్యునూనుం డనేక బాంధవజన
సుత్య సద్గుణవార్థి జోగిరాజు
అట్టి విస్సాప్రెగడ సత్కులారత్నంబురాశి
సోము సుకవిత్వధారాభిరాము నాకు
మేనమామయు మామయై మెఱయువాని
నధిపకృతసఖ్యు గామరాజాఖ్యు దలతు.
ఈ కవి తండ్రి నిటు నుతించెను.
క. ప్రవిమలభక్తి నుతింతును
రవిసన్నిభతేజు శరభరాజ సమాఖ్యున్
కవితామహత్వ జితభా
రవికవి మజ్జునకు శరభరాజసమాఖ్యున్
సూర్యప్రకాశకవి తనప్రభునిచే నిటు లనిపించుకొనెను:
చ. ప్రవిమల భక్తి శంభుపదపంకజపూజన మాచరింపగా
నవిరణ శబ్దశాస్త్రములయర్థము లొప్పగజెప్ప నుల్లస
న్నవరసభావ కావ్యరచనాపటిమ న్నృపకోటికి న్మహా
కవులకు మెచ్చుగూర్పగబ్రకాశకవీ! చతురుండ వెన్నగన్
ఈ కవి శివభక్తుడనని తఱచు చెప్పుకొనియు 'సీతారామచరిత్రము' రచించి తన యద్వైతాభిమాన మావిష్కరించెను.
ఇతడు రచించిన 'కృష్ణార్జున చరిత్ర' మను రెండాశ్వాసములు గల ద్వ్యర్థి కావ్యము శ్రీవిక్రమదేవవర్మ మహారాజుగారి టీకతో 1905 లో వెలువడినది. ఇందు పారిజాతాపహరణ విజయవిలాసార్థములు గలవు. శ్లేషకావ్యమైనను పింగళి సూరన కవిత్వచ్ఛాయలలోనుండి కుంటి నడక లేకుండ నున్నది. శబ్దశ్లేష కంటె నర్థశ్లేష ప్రధానముగా గ్రహింపబడినది. శబ్దశ్లేషలో రాఘవపాండవీయ విధానము నాశ్రయించెను. సమయమెన్నక భీష్మకజాత కేళి
నిలయ సన్నిధిజేరుట నలరువార్త
వినిన సత్యవిరక్తి దుర్వృత్తియనుచు
జాల నిందింపకుండునే జగతి నన్ను
(ప్రథమాశ్వాసము 120 ప.)
కృష్ణ: సమయమెన్నక = ఆచారమును గణింపక, భీష్మకజాతకేళి నిలయ = రుక్మిణీ విలాసమందిరమును, సన్నిధిజేరుటన్ = మంచి నిధిని బొందుటయు, అలవార్తన్ = పుష్పవృత్తాంతమును, సత్య = సత్యభామ, విరక్తిన్ = విరాగముచేత, దుర్వృత్తి యనుచున్ = దుర్వ్యాపారము కలవాడనుచు.
అర్జు:సమయమెన్నక = శపథము గణింపక, అభీష్మ = భయంకరుడుగాని కజాత = యమపుత్రుడను ధర్మరాజు యొక్క, కేళి నిలయ సన్నిధిన్ = క్రీడాగృహసమీపమున జేరుటన్ = చేరుటయనందగు వార్త = వర్తనమును సత్య విరక్తి = శపథము నతిక్రమించిన వాడును. (శ్రీవిక్రమదేవవర్మ గారి టీక)
ఈ కృష్ణార్జునచరిత్రము 1908 లో బి.ఏ కును, 1914 లో ఎమ్.ఏ కును బాఠ్యముగా చెన్నపుర విశ్వవిద్యాలయ వారు నిర్ణయించి ఉండిరి.
ఈ పండితుని సంస్కృత చాటువులు మూడు "చాటుధారాచమత్కారసారము" న అల్లంరాజు సుబ్రహ్మణ్యకవి చేర్చి వ్యాఖ్యానించి యున్నాడు. అవి యివి:
శ్లో. చేతులో గోతులే బాలే కాకులే వానముక్కులే
రుచిం వశ్యామి సుశ్యామే కచానాం తవ మంజులామ్
శ్లో. కృష్ణభూపతి సంకాశం కృష్ణభూపతి సన్నిభమ్
కృష్ణభూపతినీకాశం కృష్ణభూపతి సద్యశః
శ్లో. విక్రమేణార్జునముఖాః కృష్ణభూపాల తే హితాః
విక్రమేణార్జునముఖాః కృష్ణభూపాల తేహితాః
తొలి శ్లోకములోని పూర్వార్థము తెలుగుగా భ్రమింపజేయును. రెండు మూడు శ్లోకములు మాడుగుల కృష్ణభూపాలుని గుఱించి ప్రశంసించుచు రచింపబడినవి.
సూర్యప్రకాశ కవి భీమలింగ శతకమునుండి రెండు రత్నములు:
క. కాయలు లేని మహీజము
కోయిల లేనట్టి వనము గుడిలేనిపురం
బాయత మొదము జేయవు
కాయజహర! భీమలింగ! కలుషవిభంగా!
క. జీతంబు లేని కొలువును
దాతలు లేనట్టి పురము తమిలేని కవల్
ఖ్యాతిని బొందక యుండును
కౌతుకయుత! భీమలింగ! కలుషవిభంగా!