ఆంధ్ర రచయితలు/పింగళి లక్ష్మీకాంతము & కాటూరి వేంకటేశ్వరరావు
పింగళి లక్ష్మీకాంతము
కాటూరి వేంకటేశ్వరరావు
1894
1895
ఇరువురు ఆరువేల నియోగులు. లక్ష్మీకాంతముగారు గౌతమసగోత్రులు. అభిజనము: కృష్ణాజిల్లా చల్లపల్లి తాలూకాలోని చిత్లూర్పు. నివాసము: విశాఖపట్టణము. తల్లి: కుటుంబమ్మ. తండ్రి: వేంకటరత్నము పంతులు. జననము: 10-1-1894 సం|| తేదీ.
వేంకటేశ్వరరావుగారు శ్రీవత్ససగోత్రులు. తండ్రి: వేంకటకృష్ణయ్య. పాలించిన తలిదంద్రులు: లక్ష్మమ్మ, కొండయ్య. జన్మస్థానము: కృష్ణామండలములోని కాటూరు. జననము: 15 అక్టోబరు 1895 సం|| రచనలు: 1. సౌందరనందము 2. పౌలస్త్యహృదయము 3. తొలకరి (ఈ మూడు కావ్యములు ఇరువురిపేర ప్రచురితములు) 1. బగ్ బౌరలు (ఆంగ్ల నవలకు ఆంధ్రీకరణము) 2. ప్రతిజ్ఞాయౌగంధరాయణము 3. స్వప్నవాసవదత్త (భాసనాటకములకు దెలుగుసేతలు) 4. నల్లగలువ (ఆంగ్లము నుండి తెనుగు-పయిని, ఒక వేంకటేశ్వరరావుగారి పేరనే ప్రకటితములు) 1. మధుర పండితరాజ్యము-ఇత్యాదులు లక్ష్మీకాంతముగారి సొంతము.
ఇటీవలి సంప్రదాయము ననుసరించి 'లక్ష్మీకాంత వేంకటేశ్వరకవులో - 'పింగళికాటూరి కవులో కావలసినవారు వీరు. అదీగాక, వీరు తిరుపతి వేంకటకవుల శిష్యులగుట కారణముగా, విధిగా జంటపేరు సంధించుకొనవలసి యున్నది. అటులు నేయక - స్వచ్చముగా నిరువురు వేఱు వేఱు పేరుల కృతుల ముఖవత్త్రములపై వేసికొనుట - వీరి గతాను గతికధర్మాసహిష్ణుతకు, పురాతన సంప్రదాయకృతశ్రద్దాగౌరవ దృష్టికిని గుఱుతులు. తెలుగున బ్రబోధచంద్రోదయ ప్రబంధ రచయితలగు జంట కవుల హృదయము లంటుకొనియుండ లేదా! వట్టి - పేళ్ళు జతపఱచి నంతమాత్రమున గాదుచ కవితా స్నిగ్ధములయిన యెదలు శబ్ధార్థముల వలె విడదీయరానివి కావలయును; అదియే జీవాత్ములజంట వంటి జంట. నాకొక విషయము ముచ్చటగా నుండును. సౌందరనందాదులగు కొన్ని కావ్యములు పింగళి - కాటూరి కవులు కవగా వ్రాసిరి. కొన్ని యెవరి మట్టునకు వారు విడిగా వ్రాసికొనిరి. తత్త్వదృష్టికి నిదియొక యందమేయని నా యానందము. "ఒక్కరు రచియించిరేని యది కాదగు దిర్పతి వేంకటీయమై" అన్న జంటకవుల ప్రతిజ్ఞలోని పరమార్ధము హార్దము కావలయును గాని, కాపీరైటు తగువులాటలకు దిగునది కారాదు కదా! ప్రకృత కవులు గురువులు తిరుపతి వేంకటకవులు సర్వధా అభిన్నులెట్టులైరో, పింగళి కాటూరి కవులు నట్టివారని రుజువు చేయుదును. ఇందులకు సౌందరనందములోని - యీ పద్యములు నాకు ప్రధానమైన యాధారముగా గనిపించినవి.
మేలేర్చి నందుండు పూలు గోసి యొసంగ
నరము లందముగ సుందరి రచించు
మెలత వర్ణమ్ములు మేళవించి యిడంగ
హరువుమై నతడు చిత్తరువు వ్రాయు
బతి యపురూపభావము వచించిన నను
రూప పద్యమును గూర్చును లతాంగి
అతివ చక్కనిరాగ మాలపించిన వీణ
పలికించు నతడు మై పులకరింప
నెఱ్ఱసెరల నందుని చూపులింతి యాన
నేందునకు గెంపుల నివాళులెత్త, నతివ
కజ్జలవు జూడ్కి ప్రియుని వక్షఃవాటి
గట్టు దోరణములు నల్లకల్వపూల
60 స్రాలేయ గిరికందరా వినోదవిహార
వరులైన సిద్ధ దంపతు లనంగ
విబుధ తరంగిణీవీచికా డోలల
దూగెడి రాయంచదోయి యనగ
కవి మన:పంకజానవ సొక్తమై రసా
గ్రముల నాడెడీ ఫాదార్థము లనంగ
నానంద పరిపుల్ల మౌనీంద్ర దహర తా
రాధ్వమం దాడు జీవాత్ము లసగ
జీకుచింతల దిగ ద్రావి, చెన్నుమిగిలి
హృదయ సంవేద్య మయ్యు నాత్మైకగమ్య
మైన యద్వయ సౌఖ్య రసామృతమ్ము
ననుభవింతురు వారు నిరంతరముగ.
*
ఈ అభినవ కవుల కవ తొలుత మైత్రీబంధము తోను, పిదప బాంధనముతోను గలసి వచ్చినది. అనగా, కాటూరి కవి మేనకోడలు పింగళికవి బావమఱదికి భార్య. ఈ చుట్టఱికము సాహిత్య బంధుత్వము గట్టిదని నే ననను. ఇట్టివీరి కలయిక నవ్య కవితా లోకమునకు తొలకరి. అదే హేతువుగా వీరి తొలికృతికి దొలకరి యని పేరు వచ్చియుండ వచ్చును. ఇది కొన్ని ఖండ కావ్యముల రాశి. అవి యన్నియు భిన్న విభిన్న విషయకములు. ఈ ఖండ కావ్య రచనాఫక్కి వీరి నుండియే వచ్చెననగాదు. మఱికొందరును, దారు లేరుపఱిచిరి, వానిలో వీరిదియు నొకటి. పాశ్చాత్యసంపర్క లబ్ధమైన యీమేలి వెలుగు తెలుగునాట మిక్కిలిగా నేడు నెలకొన్నది. రసిక మానసాకర్షకమైన పదబంధము పింగళి కాటూరి కవుల కవితలో దొట్టతొలుత దొలకరించిన గుణము. అది మెల్లగా 'సౌందర నందము' నకు జేరుసరికి భావరస వర్షావారివాహ మైనది. 'తొలకరి' నాడు, కవితను గురించిన యీ జంట కవుల తలపు లిటులున్నవి:-
సీ. చూతురా, దీనిని జూతపల్లవ ఖాది
ని పిగాంకనా గాన నిన్వనంబు
కొందురా, దీనిని గ్రొమ్మెఱుంగుల జిల్గు
పనికి గాదగిన కుందనపు దళ్కు
కావలెనా, యిద్ది, కలువపూరేకు పొ
త్తముల జిప్పిలెడు మెత్తందనమ్ము
వలయునా, మలయ పర్వత సానువులనుండి
దిగుమతి యగు కమ్మ తెమ్మర లివి
తీయుదుర, దీని బచ్చ కప్పురపు దావి
కోరికొందుర, దీని బటీరజలము
త్రావిచూతుర, తీయని పూవుదేనె.
'తొలకరి' కి దొలిపలుకు వ్రాయుచు శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి చిట్టచివర నిట్టులని ముగించెను.
" ఈకవులు నిక్కముగా స్వతంత్రులు. ఆర్యాంగ్లేయాది వాజ్మయముల సారముల బీల్చి తమయందు లీనమగునట్లు చేసి దానిచే గలిగిన పుష్టిచే బుష్కలముగా వ్రాయువారు. వీరి కవిత్వమున నిక్కంపు మంచి సీలము లున్నవి. తళుకు బెళుకు ఱాళ్ళు లేవు. అయినను, రత్న పరీక్షయందు సమర్థులగువారికి గాని సామాన్యులకు వానిగుణము నెఱుంగ నలవికాదు. నుకవిభోగ్యము లిచటి వస్తువులు, నలిపివేయక డటు నిటు కలచివైచి-"
'సౌందరనంద' రచనతో వీరికి, సిద్ధహస్తులయిన మహాకవులుగా బరిగణనము వచ్చినది. ఆకావ్యమునకు దెలుగు దేశమున రావలసిన స్థానమును వచ్చియున్నది. ప్రతిభావ్యుత్పత్తులు నికరముగా నున్న నాడు కాని కవి రాణింపడు. వీనిలో, దేనిపాలు వెలితిపడినను, అది కవికి గొఱతయే. ప్రకృతము, పింగళి కాటూరి కవులను గుఱించి. వారు మంచి ప్రతిభావము గల మేధావులు.దానికి దగినటులు వ్యుత్పన్నతయు జక్కనిది. ఈ గుణద్వయమునకు దోడు వీడని యభ్యాస మొకటి. 'సౌదరనంద' మీ సమ్మేళనము పండినపంటయై, నందనారామమై పండువుచేయుచున్నది. 'బుద్ధచరిత్ర' రచయితలు తిరుపతి వేంకటకవుల కీకావ్యము గురూపహారముగా నీయబడినది. కాదేని, వారిలో నభిన్నులుగానుండిన చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారికే 'గురుదక్షిణ' యనుకొందము. గురువుగారి షష్టిపూర్త్యుత్సవావసరమున నీకబ్బ మప్పనము సేయబడ్డది. అప్పటి సమర్పణ పద్యము, లీశిష్యుల జంట యగాధవినయ మధురహృదయములను దోయిళ్ళ బట్టికొన్నది. అందలివి కొన్ని:-
కేతనతోడి పొత్తునకు గేల్ కలపం దలపోసికాదు, నీ
చేతము మెచ్చగా గవిత చెప్పగ నేర్తు మటంచుగాదు, వి
ఖ్యాతికిగా, ది కేమనిన, నద్యతనాంధ్ర కవిప్రపంచ ని
ర్మాతకు భక్తిమై నుడుగరల్ ఘటియించెడి పూన్కియే నుమీ!
*
సంచితపూర్వపుణ్యము లొసంగు ఫలమ్ములు వోలె వాసనల్
మంచుకొనన్ నవప్రసవముల్ విరబూచుచునున్న దీవు క
ల్పించిన పాదులందు బ్రభవించిన నూత్న కవిత్వ వల్లి; యీ
కొంచెపు బూలమాలగయికొమ్ము గళాభరణమ్ముగా గురూ !
భావ విశుద్ధి దోపగ భవత్పదముల్ భజియించునాటి మా
సేవలు మెచ్చి యాదర విశేష మెలర్పగ సల్పినట్టి మీ
దీవన నిక్కమై యొసగె దియ్యని కావ్యఫలమ్ము నేటికిన్ ;
నీ విడిన భిక్ష యిది నీకె యొసంగెద మిప్డు విందుగాన్. సంస్కృతమున అశ్వఘోష మహాకవి సౌందరనంద కావ్యము సంతరించెను. అందముగా నున్నదని యాగ్రంథనామము వీరు పెట్టుకొనిరి ఇతివృత్తములో దానితో గొంత పోలిక. ఇంతే. ఇంక మిగిలిన యావత్కవితాచమత్ర్కియము వీరిసొంతము. కథావస్తువు ధర్మనిష్ఠ కలయది. కవిత్వము తగినట్లు రసపుష్టమైనది. కావ్యము, రాశిలో వాసియైనది కాకపోవచ్చును, గుణసంపత్తిలో నుత్తమజాతికి జెందుచున్నది. ప్రాచీన సంప్రదాయములు తూలనాడక పోవుట - క్రొత్త దారులలోని మేలు నేరుకొనుట యీజంటకవులకు గల విశాలగుణము. అభ్యుదయపథములో సంగలు వేసికొనుచున్నార మన్నకొందఱు వీరి కవిత నేమందురు ! - కవిత నిత్యనవీనము కావలయును, అనగా పురాణము కావలయును. నేలవీడి సాముచేసిన వీలుకాదు. 'సౌందర నందము' పురాతనాధునాతన కవితలకు నేతుబంధము.
అలనాటినడిరేయి నశ్వరాజము వెన్ను
చమరి వీడ్కొని నట్టి స్థలము దాటి
చెన్నఱి దౌల దోచిన రాజగృహలక్ష్మి
వుల్కు వుల్కున దన్ను బోల్చికొనగ
నెలగోలు మూకల యెల్గుల సౌధ వా
తాయనమ్ము లసావృతములు గాగ
దలుపులు తెఱచి పౌరుల కిమితి బ్రువా
ణులగుచు వెఱగంది నిలిచి చూడ
నా త్తపరతత్త్వ బోధమౌ నాత్మతేజ
మాననేందుని పరివేషమై భజింప
బురము చొత్తెంచి నిలిచిన బోధి సత్వు
గనుకనిన్ గని పౌరులు గములు గూడి_
' ప్రథమవర్గము'
* నడపుల రాజహంస, తెలినవ్వుల వెన్నెలవాక, ప్రేమలూ
రెడు నునుబల్కు దేనెపెర, రెమ్మలువై చు విలాసవల్లి, వ్రే
ల్మిడి హృదయమ్ము నుచ్చిచను మేలిమిచూపు మదాళియైన యా
పడ తుక నందభాస్కరుని బాయగ నోర్వదు ఛాయయుం బలెన్.
తానా, నుందర నందు ; డవ్వెల దియా, తన్వంగ మాధుర్య లీ
లా నందైక నిధాన ; మొండొరుల ప్రేమాలాప కేళీ వినో
దానూనాను భవమ్ములా, మదన విద్యా దైశికమ్ముల్ ; సముల్
కానన్ రారుగదోయి, కామిజనలోకమ్మందు నాదోయికిన్.
*
పద్యములకు బ్రకరణము స్పష్ట పడుచుండుటచే వ్రాయుటలేదు. మఱి కొన్ని యుదాహరించుటకు మనసు పడుచున్నాను. రసభావాభ్యుదయ మిందెంతదాక సాగుచున్నదో మీరే యెన్ను కొనవలయును.
బ్రతుకు నిక్కమ్మయేని యవ్వారిపట్ల
విరతిలేని స్వప్నమ్మునా జరుగ బోలు
బ్రతుకు నిక్కముగాక స్వప్న మగునేని
సత్యమై తోపబోలు నాజంపుతులకు.
*
రాగరంజిత మన్మనోరత్న మింత
యింత శకలమ్ము లొనరించి యింతి! నీదు
కంఠహారమ్ము నొనరింతు, గడమ యిడక
వినుతు హృదయ ప్రబంధమ్ము విశద ఫణితి!
వెలది! యీ రాగలతలు పుష్పించు నట్టు
లీ మనోరథములు ఫలియించు నట్లు
దరు లొరసి పాఱు నీ మమతాస్రవంతి
దేలిపోదము పెఱతలంపేల మనకు?
* ఎన్ని విధాలనో హృదయమిచ్చి భజించితి విట్టి క్రూరునిన్
నిన్ను దలంచి చిత్త సరణిన్ విలపింతున, జాలి నింతునా ?
ఇన్ని విధమ్ములన్ హృదయ మిచ్చిన ప్రేయసి వీటి బుచ్చితిన్
నన్ను గుఱించి పల్లటిలనా, పెనుసిగ్గున మ్రగ్గిపోదునా ?
ఎన్నగరాని కూర్మి నిలువెల్ల నొకింతగ రాగపూర్ణమౌ
సొన్నపు బానపాత్రయగుచున్ గరయుగ్మమునందు నిల్చు నా
పెన్నిధి, నిష్టదైవమును వీఱిడినై యిటు పాఱవైచికొం
టి, న్నిరుపేదనై యలమటించెద దిక్కఱి రిత్తజోగినై.
వలపుల్ వడ్డికి బాఱ గౌగిట గదింపం బాత్రవై, నిండుచూ
పులకున్ వెన్నెలవై, శ్రవోయుగళి, కింపుల్ నింపు గానమ్మవై
యలరుందావివియయ్యు నూర్పులకు, బై నాత్మైక భోగ్యంబవై
తలపుల్ దాటి, యభిన్నవై, తుది మదాత్మా! నాకు లేవైతివే.
*
వసివాళ్వాడ, దొకప్పుడు
గను గందదు, మేల్మిచాయ కగ్గదు, తావుల్
కొసరు, మరందము చిలుకును
వినువక యెద దాల్తు నట్టి ప్రేమనుమమ్మున్.
నాకీలోకముతో బనేమి, వినుమన్నా ! పాలమున్నీటిలో
నేకాంత మ్మగుచో బ్రవాళములచే నేపారు ద్వీపమ్ములో
నాకుల్ రాలని పూలువాడని వసంతారామ మధ్యమ్ములో
రాకాచంద్ర సహస్రముల్ వెలుగు హర్మ్యాగ్రంబునం దొక్కటన్.
నాకుం బ్రాణము ప్రాణమైన చెలితో నానానుఖమ్ముల్ లతా
నీకమ్మె పెనగొన్న డోలికలలో ని:ఖేద దివ్యామృత
స్వీకారమ్ము భజింపుచున్ సమయముల్ సీమల్ వెసన్‌దాటి,
కాకారమ్మును నిత్యమై నెగడు నయ్యానంద మర్థించెదన్.
* ఇటు లుదాహరించుకొనుచుబోవుచో, సౌందరనందము సమగ్రముగా నిచట బ్రతివ్రాయవలసినవాడ నగుదును. తొంటి కవిత్వమున కనుకరణముగా గనిపించు పద్యములిందు తక్కువ. వానిలో గూడ ననుసరణచ్ఛాయలు తో పనీయని స్వతంత్రతయే యెక్కువ. కథావస్తువు, గ్రథననైపుణి శుచిత్వ రుచిత్వ సంవలితములగుటవలన సౌందరనంద ముత్తమకావ్యమయినది. మఱి, యేతత్కావ్యకర్తల గురుకులవాస శ్లేశము లెంతటివి !
పింగళిలక్ష్మీకాంతముగా రాముష్యాయణులు. వీరి తండ్రి చల్లపల్లి జమీకి జెందిన 'ఆముదార్లంక' లో మనుగడ సాగించుచు, నాయూర బెత్తనము వహించిన వ్యవహర్త. అన్నదానములో నాయన పలుకుబడి గొప్పది. ఆయన యన్నదాన వ్రతమును ఫలింప జేసిన కుటుంబిని కుటుంబమ్మగారు. లక్ష్మీకాంతకవి యా దొడ్డతల్లి కడుపు. ఆమె మోచర్ల వారి యాడుబడుచు. మోచర్ల - పింగళి వంగడముల వారికీ వియ్యము నాలుగైదు తరములనుండి వచ్చుచున్నది. లక్ష్మీకాంత కవిగారి భార్య లక్ష్మీనరసమ్మగారు కొంత సాహిత్యము తెలిసిన యామె. శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారు కంటిజబ్బు చికిత్సకై 1933 లో విశాఖపట్టణమున గొంత కాల ముండెను. మకాము లక్ష్మీకాంతముగారి యింట. అపుడు వారికి లక్ష్మీకాంతముగారి యిల్లాలు చేసిన యుపచార గౌరవము గొప్పదనియు, శాస్త్రులుగారు ఆమెకు సంస్కృతకావ్యములు పాఠములు చెప్పి శిష్యురాలిని జేసికొనిరనియు 'జాతకచర్య' ఇటీవలి భాగమున గనబడినది.
లక్ష్మీకాంతముగారి యాంగలపు జదువు స్కూలుఫైనలు దాక బందరు హిందీస్కూలులో. ఎఫ్.ఏ;బి.ఏ లు బందరునందే యున్న నోబిలు కళాశాలలో. మూడవ 'ఫారము' చదువుచుండగా 1909 లో లక్ష్మీకాంత మున్న హైస్కూలులో తిరుపతి వేంకటకవులు శతావ ధానము చేయుట తటస్థించినది. ఆప్రదర్శనము చూచినవెంటనే యీతనికి గవితాస్థ యంకురించినది. అదియాది, వేంకటశాస్త్రిగారి యాదరాశీస్సులంది మూడేండ్ల మూడునెలలు గురుకులక్లిష్టుడై సంస్కృతాంధ్రములు చదువుకొనెను. ఆ గురు సేవాప్రసాదము లక్ష్మీకాంతమును నేడు మహారచయితగా దిద్దగలిగినది. 1912 లో , స్కూలుఫైనలు పరీక్షోత్తీర్ణతనంది, వెంటనే 'ఇంటరు'న, చేరజాలక రెండేండ్లకు జేరి 1919 నాటికి పింగళికవి బి.ఏ పట్టభద్రుడయ్యెను. ఆవెంటనే 'నోబిలుపాఠశాల' లో బ్రధానాంధ్రపండితస్థానలాభము. మఱి నాలుగేండ్లకు, కళాశాలలోగూడ నధ్యాపకత. అచట నొకనాలుగేండ్లు. పదపడి మదరాసు విశ్వవిద్యాలయమున దెలుగు పరిశోధక శాఖలో 'ఫెల్లో' పదవి. అది మూడేండ్లతో నయిపోగా, తంజావూరు సరస్వతీమహాలున గూరుచుండి నాయక రాజులనాటి తెలుగు తాటియాకు బొత్తములు చదివి యెన్నో క్రొత్తవిషయములు లక్ష్మీకాంతకవి సేకరించెను. మదరాసులో నుండగనే 1930 లో ఎం.ఏ మొదటి తరగతిలో నుత్తీర్ణుడై యుండిన హేతువున, 1931 సంవత్సరముననే ఆంధ్ర విశ్వవిద్యాలయమువారు - ఏర్పాటు చేసిన తెలుగుశాఖలో నాచార్యస్థాన మొసగిరి. తంజావూరిలో లక్ష్మీకాంతకవి నాడు చదివిన చదువే, ఆంధ్రవిశ్వవిద్యాలయము అచ్చటి వాజ్మయ మంతయు 'కాపీ' చేయించి తెప్పించి ప్రకటింప బూనుకొనునటులు సేయుటకు హేతువైనదని చెప్పెదరు. ఆమహాప్రయత్నమున మొదటిదిగా 'ద్విపదభారతము' మొదటిసంచిక యచ్చునకు వచ్చినది. దానికి లక్ష్మీకాంతముగారి పీఠిక విపులమైనది యున్నది. తంజావూరి యక్షగానములను గురించి యీయన యెంతో వ్రాయగలవారు. శ్రీ ప్రభాకరశాస్త్రి పరిష్కృతమైన 'రంగనాథరామాయణము'నకు వీరి భూమిక యాభరణమై యున్నది. ఎన్నో పీఠకలలో, ఎన్నో పత్త్రికా ప్రచురిత రచనలలో లక్ష్మీకాంతముగారి వాజ్మయపరిశ్రమము విశదమగుచున్నది. శ్రీ కాటూరి వేంకటేశ్వరరావుగారిదియు సుపరినిష్ఠితమైన సారస్వతవ్యాసంగము. ఆయన భోగ త్యాగములకు వలయునంత యున్నవాడు. ఆదిలో, వీరు కలపటపువారు. నాలుగైదు తరములుగా 'కాటూరు' చేరిన తరువాత 'కాటూరి' యని యింటిపేరు మాఱినది. పినముత్తాతగారికి దత్తుడై వేంకటేశ్వరరావుగారు పెంపొందెను. సంపత్తితోపాటు మహాకవిత్వమునకు వలయునంత వ్యుత్పత్తియు నున్నవాడు. గురువుల నాశ్రయించి చదువుకొన్నవాడు. పింగళి కవియు, నీయనయు నతీర్థ్యులు కావుట విశేషము. వీరికిని చెళ్ళపిళ్ళశాస్త్రులుగారే సంస్కృతాంధ్ర సాహిత్యభిక్షా ప్రదాతలు. వేంకటేశ్వరరావుగారు బి.ఏ సీనియరు చదువురు. 1921 లో, సహాయనిరాకరణోద్యమమున జదువు విరమించివైచిరి. 1930 లో జరిగిన యుద్యమమున నాఱు నెలల కారావాసదండనము. కాటూరికవి దంతటి దేశాభిమానము. 1932 మొదలు 39 వఱకు ఆంధ్రోపాధ్యాయుడుగా, 39 సం. మొదలు 43 సం. దాక ప్రిన్సిపాలుగా బందరు ఆంధ్ర జాతీయ కళాశాలలో నుద్యోగనిర్వహణము. ప్రకృతము కృష్ణాపత్రికా సంపాదకత. ఆంగ్లభాషలోని యుదాత్త సాహిత్యము నీయన తనివార జూఱలాడియు, నార్యసంప్రదాయములు వీడక కవితాగ్రంథనము గావించెను. కావలసినంత స్వస్థాన వేషభాషాభిరతి కల వ్యక్తి వేంకటేశ్వరరావుగారు. మెత్తని హృదయము, మఱీమెత్తని పలుకుబడి. ఒడలెఱుగని యుపన్యాసధోరణీ సాగించు గుణములేదుకాని, తియ్యతియ్యగా బద్యపాఠముచేసి సభ్యుల నూరించును. నిర్లిప్తుడు ; ఒకరి లక్ష్యములేదు. అట్లని, ఎవరిని జెందనాడడు. వచనశైలిలో పింగళివారిది, పద్యశైయ్యలో కాటూరి వారిది పై చేయిగా నుండునని దేశమున బలుచనైన యొక వాడుకయున్నది. రసజ్ఞల చెవుల కిట్టి వాడుకలు విన బడవు. వారిరువురిది సరియగుజత. సౌందరనంద మొకటి మాత్రము, యీ యిద్దఱి కీర్తికిని పతాక. కలసి వ్రాసిన 'పౌలన్త్యహృదయ' మను చిన్న కావ్యమునుండియు రెండు రత్నముల నిచ్చి యిక జాలింతును.
[శ్రీరాముడు లంకపై నెత్తివచ్చుట చూచి సముద్రుడు రావణునితో జెప్పబోగా రావణు డనినమాటలు]
వసవల్చు చెక్కిళ్ళ వయనున లజ్జమై
ముని యాజ్ఞ దాటక తునుము సొగను
జునపాలువ్రేలు నీడున శైవచాపమ్ము
విఱిచిన శృంగార వీరమహిమ
పసపు బట్టల నిగ్గుపన భార్గవక్రోధ
సంధ్య మాయించిన శౌర్యసార
మాలి బాసిన క్రొత్త యలతమై వజ్రసా
రుని వాలి నొక కోల దునుము పటిమ
వింటియేకాని - ఇన్ని టికంటె రాచ
పట్టముదొరంగి నారలు గట్టి కాన
మెట్టినట్టి వెక్కసమైన దిట్టతనము
వింటి - సామికే తగుననుకొంటెకాని,-
శ్యామలకాంతి మోహనము, సౌమ్యగభీరము సుప్రసన్న రే
ఖామృదు హాసభానురము, గన్నులపండువునైన రాము నె
మ్మోమును మిమ్ముబోలె గన నోమను గాదె; కఠోరవృత్తినై
సామిని మున్నె ఘోరరణనత్రనిమంత్రితు జేసి యుంచుటన్.
____________