ఆంధ్ర రచయితలు/పానుగంటి లక్ష్మీనరసింహరావు

పానుగంటి లక్ష్మీనరసింహరావు

1865 - 1940

మధ్వమతస్థులు. తండ్రి: వేంకటరమణాచార్యుడు. తల్లి: రత్నమాంబ. నివాసము: రాజమహేంద్రవరము, పిఠాపురము. జననము: 1865 సం. నిర్యాణము: 1-1-1940. రచితగ్రంథములు: సారంగధర చరిత్ర, వృద్ధ వివాహము, రాధాకృష్ణ, నర్మదా పురుకుత్సీయము, సరస్వతి, దుష్టప్రధాని, ఆనందనాథ, కల్యాణ రాఘవము, కంఠాభరణము, విజయరాఘవము, కోకిల, విప్రనారాయణ చరిత్ర, విచిత్ర సమావేశము, విచిత్ర మరణము, బుద్ధబోధసుధ, వీరమతి, పూర్ణిమ, ప్రచండ చాణక్యము (ఇత్యాది నాటకములు). హాస్యవల్లరి, పతనము, మంజువాణి, జగన్నాథ మూర్తి, మోసము, జలజ, సాక్షి (6 భాగములు)

సాక్ష్యుపన్యాసములు చదువనియాంధ్రు లుండరు. జంఘాలశాస్త్రి గంభీరోపన్యాసము, వాణీదాసుడు, కాలాచార్యుడు, బొఱ్ఱయ్యసెట్టిగారల మాటలును తెలుగువా రెల్ల రెఱిగినవే. వారి నాటకముల మాట యటుండనిచ్చి సాక్షివలస బానుగంటివారిని దలచుకొని నవ్వుకొనుచుందుము. ఆంధ్రప్రతికాపాఠకులు సాక్షి వ్యాసములకొఱకు గాళ్లు విఱుగద్రొక్కు కొనినదినము లెన్నియో యున్నవి. కాని పంతులుగారి షష్టిపూర్తిసందర్భమున కొకయాంధ్రు డేని నడుము గట్టినపాపాన బోలేదు. సాక్షి యాంగ్లములోని spectator అను గ్రంథమునకు డెలిసికొనజాలని ఛాయమని చెప్పుదుముగాక! అయిన నేమి? తెలుగుజాతికి 'సాక్షి' యొక యుజ్జ్వలవిజ్ఞాన దీపము. మన సంఘమును, మనజాతిని, మనవాజ్మయమును, మనదురాచారములను మెత్తమెత్తగా నెత్తిపొడుచుచు సంస్కరింపజూచిన మహాగ్రంథము 'సాక్షి'


లక్ష్మినరసింహరావుపంతులుగారు స్త్రీలు - మతము - నాగరకత - వేదాంతము - విద్యావిధానము - రాజకీయములు - మున్నగు విషయము లను గూర్చి యెక్కువ చర్చింతురు. పంతులుగారికి దేశభాషయందింతింత యనరాని యభిమానము. దేశీయభాషలో నుపన్యసింపలేని యధ్యక్షునిగూర్చి పంతులుగారు ప్రకటించిన యాగ్రహ మనుపమానము. ఇది 'స్వభాష' యను (సాక్షి మూడవసంపుటము) వ్యాసమున గాననగును. స్నానసంధ్యాదినియమములు వదలివేయుట భారతీయులకు ధర్మము కాదని చెప్పు ప్రాచీనాచారపరాయణులు శ్రీ పంతులుగారు. వారివేదాంతోపన్యాసములను బట్టిచూచిన వారద్వైతవాదులు. కాని వస్తుత: వీరు ద్వైతమతస్థులు. నేటి విద్యావిధానమున దైవభక్తికి సంబంధించినగ్రంథములు లేవనియు గనుకనే విద్యార్థులలో నాస్తికత ప్రబలుచున్న దనియు వీరు పలుమారు వ్రాయుచుందురు. రాజకీయ విషయములనుగూర్చి యెన్నికలనుగూర్చి వ్రాయుచు గాంధిగారి సిద్ధాంతములను దాము వివేకించునట్లు విలిఖించిరి. సాక్షిలో 'తోలుబొమ్మలాట' వ్యాసము చదివిన వీరి జానపదవిషయవివేకత వెల్లడియగును.


పానుగంటిపంతులుగారు శబ్దవైచిత్రవలచినకవి. ఆంధ్రవచనరచనలో వీరొకక్రొత్తదారి త్రొక్కిరి. కందుకూరి వీరేశలింగము పంతులుగారు గద్యతిక్కనయేగాని యావిషయము వేఱు. చిలకమర్తికవి పెద్దనవలా రచయితేగాని యదియునువేఱే. పానుగంటివారి రచన మఱియొక విలక్షణమైనది. వీరు వ్యావహారికమునకు దగ్గఱగనుండు గ్రాంథికము వ్రాయుదురు. ప్రతిపదము పరిహాసగర్భితము. ఆక్షేపణ భరితము. చెప్పినదే మార్చి మార్చి భంగ్యంతరముగా జెప్పుట వీరి రచనలో గ్రత్తదనము. చదివినకొలదిని జదువుట కుత్సాహము పుట్టించు రచనమే రచనము. అది పానుగంటికవి సొమ్ము. విషయము గప్పిపుచ్చకుండ, విసుగుపుట్టింపకుండ వేలకొలది నిదర్శనముల జూపుచు వ్రాయుటలో బానుగంటి వారిదే పై చెయ్యి. పాఠకున కొకవిధమైన యుత్సాహము చిత్తసంస్కృతి యావేశము గలిగింపజేయుట కీయన రచన యక్కటైనది. వీరికి బాశ్చాత్య వాజ్మయమున గూలంకషమైన ప్రజ్ఞ. పంతులుగారు, భాషలోనేగాక వ్యవహారమున గూడ దిట్టమైనప్రజ్ఞకలవారు. కొంతకాలము 'అనెగొంది' యాస్థానమున, గొన్నినాళ్లు ఉర్లాము ప్రభుత్వమున, గొంతకాలము లక్ష్మినరసాపురము సంస్థానమున మంత్రిగా పనిచేసిరి. తరువాత బీఠికాపురసంస్థానప్రభువులు వీరి వై దుష్యమున కానందించి చివరివఱకు నెలకు 116 రూప్యముల నిచ్చుచు సన్మానించిరి. పాశ్చాత్యభాషాప్రవీణులయ్యు నాంధ్రభాషాసేవ యమూల్యముగా నొనరించి తరించిన పండితు లీయన. అనుకరణము లీయన యామోదింపలేదు. అనువాదములు గావింపలేదు. 'ఆంధ్రి' ని మఱవలేదు. వీరు తీసికొనిన గాథలు పౌరాణికములు. కావ్యచిత్రణములు మాత్రము నవీనములు. వ్యాసములలోనేకాదు నాటకములలోనే కాదు హాస్యమునకు బ్రాధాన్యము. సాక్షిలోని వ్యాసములకు హాస్యరస మతిమాత్రమైనను బ్రమాదములేదు. కాని వీరి కొన్ని నాటకములలోని హాస్యము ప్రధానరసతిరోధానము చేయుచు నత్యధికమైనది.


శ్రీ లక్ష్మినరసింహము పంతులుగారి నాటకములలోని పద్యములు బండివానినుండి పండితునివఱకు బాడుకొని యానందించుచుందురు. నాటకరచనకంటె సాక్షివ్యాసములతో బానుగంటివారికి గొప్పపేరువచ్చినది. సాక్షి వ్యాసములకంటె నాటకరచనలో నరసింహరావు పంతులుగారిని రసవిదు లెల్ల మెచ్చుకొనిరి. పానుగంటివారి నాటకములకు కూచి నరసింహముగారు 'నాంది' వ్రాయుట యొక యాచారము. పంతులుగా రాంగ్లవిశేఖరుడగు 'షేక్‌స్పియరు' వ్రాసిన యన్నినాటకములు వ్రాయవలె నని సంకల్పించి యొకటిరెండించు మించులో దమ సంకల్పము పూరించుకొనిరి. వానిలో నయిదాఱు 'నాటకములకు--------వచ్చినది. 'రాధాకృష్ణ' వీరి నాటకములలో నాయక రత్నము దానియందు వీరి కవిత పండినది. మెఱుగు గుండలముల మిసమిసల్ గండభా

గములపై నిట్టిట్టు గంతులిడగ

రంగారుకటినుండి బంగారుపుట్టంబు

చిఱుబొజ్జనుండి కొంచెముగజాఱ

బవనపూరణమున జవుజవ్వుమని లేత

బుగ్గలు బూరెలై పూరటిల్ల

నిగనిగల్ గల గుజ్జుసిగ నున్న శిఖిపింఛ

మొయ్యారమున దలయూపు చుండ

నుత్తమోత్తమజన్మమై యొప్పుమురళి

నధరమున మోసి జలుజల్లుమనగ జగతి

గానమును జేయుకకల్యాణకాంతు లొలుకు

నీదువదనంబు జూపింపు నీరజాక్ష!


ఈపద్యమున గవికి వేణుగానలోలుని విశ్వరూప మగపట్టినది. ఈ నాటకకర్తకు గోపాలబాలుని మురళీరవముపై నభిమానము. ఒక్కచో రాధకృష్ణు నిట్లు ప్రార్థించినది.


సరససంగీత మాధురీ సాధురీతి

నింక నొకసారి మురళి వాయింపుమయ్య

త్వన్ముఖామృతపూరంబు ద్రావుదాన

ఘనఘనాంబువు చాతక కాంతవోలె.


సుమధురము సుప్రసన్నము నగుభాషలో నాటకపద్యములు వ్రాయునేర్పు పానుగంటి లక్ష్మీనరసింహరాయనికే చెల్లినది. తరువాత చిలకమర్తి లక్ష్మీనరసింహరాయనికే తగినది. అన్యులు కాశైలి యసహజము. వీరి నాటకములలోని సంభాషణములు సన్ని వేశములు చాల సరసముగ నుండును. ఒక్కొక్కవిషయముద్రేకముతో రచింతురు. అట్టి సందర్భములయందు కొంత విరసముగనుండుటయు దటస్థించును. పానుగంటి కవి సీసములు విశేషించి గీతములువ్రాయు చుండును. ఆగీతములు వచనమువలె నడచుట వీరి కభిమతము. ప్రతిపద్యమున నుపమాన ముండి తీరును. ఆయుపమలలోను నీచాధికభేదములు పాటింపని యుపమలు. అందులకే వీరి పద్యములు పండిత పామరరంజకములు. ఒక్కొకచో వీరిహాస్యరసము వఱ్ఱోడి పరిహాసాస్పద మగుచుండుటయు గలదు. రాను రాను సాక్షి వ్యాసములలో నీగుణము మనకు గనుపించును. కల్యాణరాఘవము, పట్టభంగరాఘవము, వనవాసరాఘవము, విజయరాఘవము, రాథాకృష్ణ, సారంగధర, సరోజిని, నర్మదాపురకుత్పీయము, విప్రనారాయణ ఇత్యాదులు పౌరాణికములు. ప్రచండచాణక్యము, చూడామణి ఇత్యాదులు చారిత్రకములు. కోకిల, సరస్వతి, వృద్ధవివాహము, మాలతీమాల, రాతిస్తంభము ఇత్యాదులు కల్పితములు. వీరి 'కంఠాభరణము' నాటక వాగ్దేవతకు గంఠాభరణము. వీరికి బౌద్ధవాజ్మయమున గలయభిరుచికి 'బుద్ధబోధసుధ' నాటకమే సాక్షి.


పానుగంటికవి చాటూక్తి చతురుడు. 1922 లో ఆంధ్రసాహిత్యపరిష దేకాదశ వార్షికోత్సవసభకు వీరి నగ్రాసనాధిపతులుగా నెన్నుకొనిరి. అపుడు వా రుపన్యాసారంభమున నిటులుచెప్పిరి.


"........నేనుపండితుండనుగానని యీ యూరివా రెఱుగుదురు. పైగ్రామములవా రెఱుగుదురు. సాహిత్యహీనతలో జగమెఱిగిన వాడను గాని సాధారణుడను గాను. ఇట్టినన్ను బరిషత్తువా రేల యెన్నుకొనవలయునో నాకు దెలియదు. తెలిసిన విషయ మేమియో యంతకంటె దెలియదు. వెనుక జరిగిన పదిపరిషత్సభలకు బండితుల నెన్ను కొంటిమి గదా, యీసారి యపండితు నెన్నుకొందము. ఇంతలో జెడిపోవున దేమున్నదని యూహించి మార్పుకొఱకై నన్నెన్నుకొని యుందురేమో, ఎటులైన నేమి? అవిలంఘ్యమైన మహాజనులయాజ్ఞ తులసీదళము వలె శిరమున ధరించి యిట నిలువబడితిని........"


ఈ సంభాషణ మెంతయభిప్రాయ గర్భితము! లక్ష్మీనరసింహరావుగారు 'స్వీయచరిత్ర' వనవాస రాఘవ రచనము వఱకు వ్రాసికొని రని తెలిసినది. అది తుదముట్టకుండగనే వారుగతించుట తెలుగువారి దురదృష్టము.

                            _______________