ఆంధ్ర రచయితలు/గడియారము వేంకట శేష శాస్త్రి

గడియారము వేంకట శేష శాస్త్రి

1897


ములికినాటిశాఖీయ బ్రాహ్మణుడు. మైత్రేయసగోత్రుడు. ఆపస్తంబ సూత్రుడు. తల్లి: నరసమాంబ. తండ్రి: రామయ్య. జన్మస్థానము: కడపజిల్లా జంబులమడుగు తాలూకాలోని ' నెమళ్ళదిన్నె '. నివాసము: ప్రొద్దుటూరు. జననము: 3-4-1897 సం.


కృతులు: 1. శ్రీ శివభారతము (8 ఆశ్వాసముల శివాజీ ప్రబంధము. 1943 ముద్రి.) 2. మురారి. 3. పుష్పబాణ విలాసము. 4. వాస్తుజంత్రి (ఈ మూడును ముద్రితములు కాలేదు.) 5. మల్లికామారుతము. 6. వాల్మీకి (అసమగ్రములు) 7. శ్రీకృష్ణదేవరాయ చరిత్రము (ప్రస్తుతము రచనలో నున్నది.)


1943 సంవత్సరమునకు బూర్వము 'గడియారము వేంకట శేషశాస్త్రి' యనిన పేరు తెలుగువారిలో నెఱిగినవా రేకొందఱో. నామట్టుకు నేను వారినిగూర్చి విన్నవాడను గాను. ఎన్నడో, ఆయన 'కవధానిపంచానస' యని బిరుదమిచ్చి పండితులు మెచ్చుకొనిరట. ఆపేరైనను రాయలసీమ దాటి రాలేదు. మాడభూషి వారు, దేవులపల్లి వారు, తిరుపతివేంకటకవులు అవధానపుగారడీతో నూరూర బేరుగాంచిరి. వారినిజూచి, అందులో విశేషించి తిరుపతికవులను జూచి కవితచెప్ప నేర్చినవాడెల్ల నవధానము చేసినగాని ముక్తిలే దనుకొని, ఆ కళ నభ్యాసము జేసెను. అప్పటి యాతెలుగులోకము గతానుగతికము. పలువురతోపాటు శేషశాస్త్రిగారును విద్యాధ్యయన మైన పిమ్మట, సహజకవితలో బ్రవీణత నందినపిమ్మట శతావధాన వ్యాయామముచేసెను. మఱియొక కవితోడుతీసుకొనిగాని, యవధానములుసేయుట నాడు తక్కువ. అప్పటియాచారప్రకారము తనకన్నింట పరిపాటియగు శ్రీ దుర్భాక రాజశేఖరకవితో జతపడి యవధానములు చేయసాగెను. 1920-1930 సంవత్సరముల నడిమికాల మది. 1932 నుండి ప్రొద్దుటూరు మ్యునిసిపలు హైస్కూలులో శేషశాస్త్రిగారికి బండితపదవి కుదురుపడినది. నాలుగయిదవధానములు చేసినంతమాత్రాన, పాఠశాలలో బండితులైన మాత్రాన, అనుకరణధోరణిలో నేవో ప్రబంధములు రచించినంతమాత్రాన శేషశాస్త్రిగారి ప్రతిభోన్నతి తెలుగు జగ మేమియెఱుగును?


వసంతమునగాని రసాలమువైపు తుమ్మెదలు చూడవు. కోకిలము గొంతెత్తదు. "..వృక్షన్య సంపుష్పితన్య దూరాద్గంధోవాతి.-" పేరుప్రతిష్టలకు దేశకాలములు ప్రధానకారణము. 1943 లో 'శ్రీ శివభారతము' వెలువడినది. అదిచూచి, తెలుగుమహాకవులెల్ల తెల్లతెల్ల వోయిరి. 'ఇట్టి మహాకవి యీవఱకు బుట్టలేదని కాదు,' ఇన్నాళ్ల దాక నీ కవితావసంతు డేసందులోనుండె" నని. క్రమముగా నేటికి శేషశాస్త్రిగారి నెఱుగని పండితుడు, తెలియని కవి, వినని తెనుగు రసికుడు కోటి కొకడుండునేమో! ఆయన 'శివభారత' కవిత సాహిత్య సభలలో గానముచేయుచున్నారు. హరికథగా బాడుకొనుచున్నారు. పురాణముగా బారాయణము గావించుచున్నారు. విన్నంతలో, కన్నంతలో శేషశాస్త్రిగారి యీడు అయిదవపడి పై బడినది. శివభారత మించుమించు నాలుగు దశాబ్దుల భారతీతపస్సు. ఈకృతి శతాబ్దులు, సహస్రాబ్దులు తెలుగువారల కడుపులు నిండించు రాయలసీమ పంట. గ్రంథకర్త విజ్ఞప్తి యిటు లున్నది:


   '......ఈగ్రంథరచనవఱకు నదియొక కవితాతపస్సు. మూడుపర్వముల ప్రాయముతో అరణ్య - అజ్ఞాతవాసముల సంస్కారముతో బక్వమయిన భారతగాధ-అది. సోమయాజి కవిత్వమున ఉత్తరగోగ్రహణముతో విధిగా వీ శివ్రభారతరచనయారంభమైనది. ఇంతయు ధర్మదేవతా వరప్రసాదము. అప్పటి నాయితరకృతులు లోకమెన్నడో చదువవచ్చును. నాకవిత్వ మనుపేర నిప్పటి కీ శివభారతము చాలును......'


ఈ పలుకులు విలువ గట్టరానివి. శివభారత మంతయు నొకయెత్తు, ఈ యక్షరములన్నియు నొకయెత్తు. ఇది చిత్తస్ఫూర్తిగ వ్రాసినమాట, వారికృతి పూర్తిగ జదివి చూచి నామనస్సులో నే ననుకొంటిని "శేషశాస్త్రిగారూ! నన్నయ్యమూర్త్యంతరమగు సోమయాజులా మీరు? కవిత్రయభారతమువలె 'జగము లున్నంతవఱ కెల్లజనులు చదివి తనియుటకు' శివాజీ ప్రబంధము రచించి శివభారత మని పేరుపెట్టుకొంటిరా? ఎంత గడుసుదనము! ఔను. తిక్కన రాజకీయపరిజ్ఞానము మీ రొక్కరే తక్కించుకొంటిరి కాబోలు! కానిచో, మీగ్రంధాది విజ్ఞప్తిలో నటులు వ్రాసికొనుట కెన్నిగుండె లుండవలయును!" అని-


శేషశాస్త్రిగారు 'నాంది' లో నన్నయాదిప్రక్త నాద్యతనాంధ్ర కవుల నభినుతించినపిమ్మట బ్రత్యేకముగ సోమయాజి కీ చంపకము కాన్క నిచ్చెను.


హరిహరనాథ శాంత మధురాకృతిలోపలిచూపునన్, బురా

చరిత తప:ఫలం బుభయ సత్కవిమిత్రత వెల్గ, ధ్యాన త

త్పరుడయి భారతాగమము పల్కెడు తిక్కన వాక్కువెంట ద

త్కరమున దాండవించు వరదాయిని లేఖిని, నే భజించెదన్.


తిక్కశర్మ పలుకుబడి యొరవడిగ, ఒక్కొకయెడ నూతనభావములు మెఱవడిగ, "ఉభయమార్గసమన్వధోరణీ గుణధ్యేయముగ," "భారతామ్నాయము దీటుగ" శివభారతము రచించి మాతృపితృ పూజానుమస్రజంబు జేసి కృతకృత్యులైరి. శివభాతము మహాకావ్యము. ఇందలి యెనిమిది యాశ్వాసములందును మొత్తము 2500 పద్యము లించు మించుగ నున్నవి. దీనికి ఉపోదాతము వ్రాసిన శ్రీ రాళ్లపల్లి అనంత కృష్ణశర్మగారి హృదయ మిట్లున్నది: "......ఆధునికాంధ్ర సాహిత్యమందు నాకుగల యల్పానుభవములో మహాకావ్య మనుపేరున కింత తగిన గ్రంథమును నేజూడలేదు......ఈభారతము భాష గొప్ప వర్చస్సుతో ప్రసన్న మధురముగా ప్రవహించుచున్నది. పలుచోట్ల 'తెలుగు కింత లగువు బిగువు కలదా' యని యాశ్చర్యపడునట్లు చేయు నుడికారము లిందు గలవు..."


శ్రీ శాస్త్రిగారికి వశమైన కవితాకళ యెట్టిదో, యీ పద్యము స్పష్టపఱుచును.


చ. పరహిత, మాత్మనిర్వృతి, యపారయశోధన గౌరవాది వి

స్ఫురణము లందజేసి యిహమున్ బరమున్వెలయించి, మాధవున్

థర జరితార్థు జేయు కవితాకళ నావశమౌట బంచమ

స్వరమున నాలపించెద వసంత వనాంతర సాలశాఖలన్.


'శ్రీ శివభారతము' వసంతకోకిల పంచమస్వరలావము. దాని మాధుర్యము నూరక పేరుకొనుట వ్యర్థలాపము. అయినను, నాహృదయము విప్పక మానలేను.


'శివభారతము' మొదటినుండి తుదిదాక నొకే తీరుదీయముగల కవితతో సాగినది. గ్రంథమంతయు రసఘటిక. విశేషించి, లుకజీ-జీజియాల సంభాషణము, దక్కనులో బహమనీ రాజ్యములు - పరిపాలన పరిస్థితి, శివాజీ పునహాలో రాజ్యాంగ శిక్షణము, దాదోజీ చరమదశ-శివాజీకృతజ్ఞత, రామదాసుదర్శనము-ధర్మోపదేశము, సయీబాయి సలహా-భవానీప్రార్థనము, శివాజి పాదుషా కుత్తరమువ్రాయుట, షాజీ విడుదల, బాజీప్రభు మరణము, శివాజి సానుభూతి, షాజీ మరణము, శివాజీవిచారము, శివాజీ పాదుషా కొల్వున కేగుట, తానాజీ ప్రతిజ్ఞ-సింహగడము లగ్గవట్టుట, సూర్యాజీ సింహగడము గెల్చుట, తానాజీ నిర్యాణము, శివాజీ సంతాపము, పట్టాభిషేక పూర్వరంగము, శివాజీ భవాని కోవెల కేగి చేసిన విన్నపము - ఇవి బహు రసవద్ఘట్టములు, జాతీయసూక్తులు వాడుటలో జిక్కనిపలుకు లేఱికొని పొదుగుటలో, వైపువాటము లెఱిగి పద్యములు నడపుటలో, నడుమనడుమ బానకములో మిరియపు బలుకులవలె సంస్కృతపదములు సంధానించుటలో, నాటి, నేటి రాజ్యాంగవిధానముల సమన్వయ పఱచుటలో, ఔచితి పాటించుటలో శివభారతకవికి గల జగజాణతనము మన తెనుగునేలలో నీనాడు పలుచగ నున్నది. ఉభయ స్కంధముల బలిమితో సారస్వతసాగరము లోతులు ముట్టి రసామృతకలశమును జేపట్టిన మహాకవులలో శేషశాస్త్రిగారు నొక మహాకవి యని, శివభారతము జెండా నెగురవైచినది. కొన్ని మచ్చులు.


లుకజీ తన్ను జంపవచ్చినపుడు కూతురు జీజియా యనుచున్న మాటలు:


ఉ. కెవ్వున హుంకరించి యడికించెద, వాయుధ మెత్తనుంటి వీ

వెవ్వరిపైన ? నీయెడద కింత వివేకము చాలదయ్యెనే ?

గువ్వలుగూడ గాన్పులను గూరిమి బెంచు జగంబునందు నీ

వెవ్వడవయ్య ? యాదరణ కెక్కరె యల్లుడు నాడుబిడ్డయున్.


చ. కనికర మింతలేని కొటికాడపు నన్నిటు పెంచనేల? పు

ట్టినయపుడే గళ మ్మటమటించిన బోవదె ? వెంటనంటి యి

య్యనుపున వేటలాడ మనసయ్యెనె? కన్న నిసుంగుమ్రింగు వ

ర్తన మది సర్పజాతికి గదా ! యొకమానపు డిట్లు సేయునే?


సీ. అనురాగ నిలయ నాజనని మాల్యాదేవి

కడుపులో గార్చిచ్చు గనలజేసి

కన్నీటిబుగ్గ బుగ్గలజాఱ గుమిలిపో

యెడు నన్న 'యక్లోజి' యెడద ద్రుంచి తల్లిఱెక్కల ప్రోవు దలగని సాంభాజి

భావి జీవితనౌక భంగపఱచి

కమియమాగినపండు గర్భపిండ మగల్చి

కఱకు గాకలదాలి గ్రాగ జేసి

ఇంత ప్రళయంబు గలిగింప నేలనయ్య

కనికరము లేదొ, పాపసంకటము రాదొ,

కన్న తండ్రివికాదొ, యక్కసముపోదొ,

వలదు వలదయ్య పచ్చని యిలు రగుల్ప. [ప్రథమశ్వాసము]


జీజియాబాయి చంటిబిడ్డ శివాజి కుగ్గుబాలతో, జోలపాటతో, వీరచరితములు నూఱిపోసినది. దాదోజీ గురుత్వమున శివాజి చక్కగ జదువను వ్రాయను నేర్చి, అంకగణితము నెఱిగి రాజ్యాంగవిధానముల మెలకువలు తెలిసికొనెను. మాతౄపదేశము కరడుగట్టిన శివాజికి మతముమీద - దేశముమీద నున్నంత యభిమానము, పట్టుదల శాస్త్రములమీద నుండకపోవుట వింతగాదు-


మ. కలతం జెందెడు నాత్మదేశమతముల్ గాపాడ, శస్త్రాస్త్ర వి

ద్యలు జాణక్య తవంబులున్ జదువు విద్వాంసుల్, మహారాష్ట్ర వీ

రులు వేదాంగము లెత్తి యర్థముల మార్పుం దీర్పు చర్చించు తా

తల తాటాకుల మీది గంటముల వ్రాతల్ గోతలున్ మెత్తురే!


ఈ నాలుగు పంక్తుల పద్యములోను గవివారికి దేశస్వాతంత్ర్య కాంక్ష యెంత యున్నదో వెల్లడియగుచున్నది. వేదములు, వేదాంగములు, కళలు అన్నియు నొకమెట్టు - ఆత్మ దేశ సంరక్షణ మొకమెట్టు. శేషశాస్త్రిగా రీఘట్టమున శివాజీయయి వ్రాసియుండిరి.


పునహాలో శివాజీకి దాదోజి రాజ్యాంగపద్ధతులు శిక్షించినాడు. ఆ శిక్షణక్రమ మిటులున్నది: సీ. ప్రత్యూష పవనముల్ పారాడ జిలువ లూ

రిన వాలుకా వితర్ది కలయందు

ఫలితో పవనవాటికల శీతలచ్ఛాయ

లలమిన హరిత శాద్వలములందు

బరువంపు వెన్నెలల్ వాఱి చుక్కలుదేలు

పఱపైన మేడ యుప్పరిగలందు

బొగజోపి చిఱువత్తు ల్వ్గ ద్రోసి చమురు దీ

పాలిడ్డ వీధి సోఫాలయందు


శిష్యగణముతో శివరాజు జేర్చికొనుచు

భారతాదుల భావసంపదల దెలిపి

ఘనుడు దాదోజి తనవిమర్శనము లిచ్చి

నవ్య సాహిత్య యోధసంతతులు నడిపె.


సీ. ఆవులించిన మాత్ర బ్రవు లెంచగ నేర్చి

నీటిలో జాడలు నెమక నేర్చి

పాలు నీరును వేఱుపఱుచు నాణెము నేర్చి

కనుపాపనీడల గాంచ నేర్చి

బాలెంత బెబ్బులి పాలు పిండగ నేర్చి

దళము లంటక తేనె ద్రావనేర్చి

యెండసోకుల దప్పి వెడలింపగా నేర్చి

శిలలకు గిలిగింత గొలువనేర్చి


పొత్తమునగాక ప్రకృతిలో బుటలు విప్పి

పదములనుగాక భావముల్ పట్టి తరచి,

యన్వయ వ్యతిరేక దృష్టాంత గతుల

నరసి, భాపుక పండితుం డయ్యె శివుడు. ఈ పద్యములో 'నవ్యసాహిత్య యోధసంతతుల నడిపె' "భాపుక పండితుండయ్యె శివుడు" అనుటలో నెంతో యంతరర్థ మున్నది. కవిగారి సాహిత్యదృష్టి కీ పద్య్ములు రెండును గన్నులు.


సప్తమాశ్వాసమున:--శివాజీపాదుషా కొలువునకు వెళ్ళినపుడు, వారియమర్యాదసహింపక-

"పాధుషా యొక్క డొకమాట పల్కకున్న

గొదువ మాకేమి? తన కేమిగొప్ప కలదు?

నమ్మికొలువున్న వారి మనంబులందు

మేలుకొనుగాక యిర్వుర మేలు కీడు."

అనెను. పాధుషా కోపించి యెవరత డనును. అప్పుడు రామసింగు పాధుషాతో నిట్లు చెప్ప్సను: అక్కడి పద్య మిది:


మ. అమృతప్రాయ దరీఝురీ విపిన సహ్య స్వైర సంచార ధీ

ర మహారాష్ట్ర మృగేంద్రు డీయవన సమ్రాడంచితాస్థాన దు

ర్దమ సమ్మర్ద నిదాఘ దాహులులిత ప్రత్యగ్ర ధూమాయితాం

గములన్ గర్జిల సాగె, శీతల కటాక్షం బిందు సారింపుడీ!


వీరరస స్ఫోరకమగు నిట్టి దీర్ఘ సమాసములు పొడులవలె నక్కడక్కడ బొదిగించిరి. తక్కినపట్టుల నెక్కడ జూచినను జాను తెనుగు నొడి కారమే గౌరవస్థానమున నున్నది.


తానాజీ సింహగడము మీదికి యుద్దయాత్రకట్టుట, కోట బ్రాకిలోనికి వెళ్ళుట, అక్కడ వెనుదీయక ఘోరముగా బోరుట మొదలగు ఘట్టములు చూచినచో దిక్కనసోమయాజి స్మరణమునకు రాక మానడు. 'శివభారతము' పేరుసార్థకముగ నెన్నోఘట్టము లుదాహరింప వచ్చును. తానాజీ నిర్యాణానంతరము తమ్ముడు సూర్యాజీ పోరుసలుపును. ఆ ఘట్టము మఱియు రమణీయతరము. తానాజీ మరణము విని శివాజీ పలవించిన ప్రకరణము చదివికొని కటికవాడు కంటనీరు పెట్టుకొనును. భారతములో, నభిమన్యువధ విన్న యర్జునుడు సైత మట్టు లేడువలేకపోయినాడేమో!


సీ. పరతంత్రతాభుగ్న భారతోద్ధరణోద్య

మమున నా నాయకత్వము వరించి

యెనలేని నీసర్వధన జనబల జీవి

తముల నర్వార్పణ ధారవోసి

రణరంగముల సంగరక్షకతన్ బొంచి

కనుఱెప్పవోలె నన్న నుసరించి

దుస్సాధతర వైరి దుర్గ భేదన వజ్ర

పాతమై బహుళాహవముల గెలిచి


యనుచరుండు-చమూనాథు-డంగరక్ష

కుడు-బహి:ప్రాణ మనగ నన్ గొలుచు నిన్ను

గోలుపోయినయపుడ నే గోలుపోని

దొకటి యున్నదే? తానజీ! యొంటినైతి.


గీ. శివపతి యెవండు? తానాజీస్నిగ్ధహృదయ

బలము ద్రావి, పెన్పొందిన భద్రమూర్తి,

నిజము : తానాజీ! యీనాడు నీవులేని

శివపతి యెవండొ! యెంతలో పవలు-రేయి.

                  *


శా. తానా! నీవిక బల్క, నీహృదయ బాథల్ తీఱు తీరేది? నీ

దీనానాథ కుటుంబ శోకదహనార్తిన్ బాపు ప్రాపేది? నా

పైనం బైకొను శత్రుసంహతుల గూల్పం డెంపు పెంపేది? య

న్నా! నీయొక్కనిలేమి యెల్లెడల దానై యెంత గుందించెడిన్. శా. నా కీవంత-కొఱంత వో; దయిన దానా! నీవుధన్యుండ ; వ

ఱ్ఱాకల్ లోకువ లన్నియున్ దులిపి వీరస్వర్గముం గొంటి ; వే

కైకస్థాన ముదాత్తవీర పురుషత్యాగార్హ భోగాంకమై

నీ కాహ్వానము పెట్టె, నేల్కొనుము తండ్రి! వీరభోగ్యంబుగన్. [సప్తమాశ్వాసము]


అష్టమాశ్వాసములో శివాజీరాజు పట్టాభిషేకము, గాంగభట్టు ధర్మనిర్వచనము మున్నగు ఘట్టములు కవిగారి శ్రుతిస్మృతిపురాణనివిష్ట బుద్ధిని ప్రస్ఫుటీకరించుచున్నవి. ఎట్టి శుష్కవిషయమునైనను కళకట్టించి కవితలో లలిత మనోహరముగా బెట్టగల నేర్పు తీర్పు వేంకటశేషశాస్త్రిగారి కతివేలముగ నున్నది. నిజమునకు, శివాజీ చరిత్రములో వచ్చు వ్యక్తులలో గవితకెక్కదగ్గ కళాశక్తిలేదు. వారెల్ల మనకవి వసంతుని చేతిలోబడి పుష్పించి పరిమళించిరి.


పట్టాభిషిక్తుడగు శివరాజు భవాని కోవెలకేగి యిట్లు ప్రార్య్హించినాడు-


చ. చిఱునగపూరుమోవి, వికసించిన చెక్కులు, సోగకన్నులం

గురియు దయామృతం బలిక కుంకుమరేఖయు జంద్రమ:కళా

పరిగత మౌళియున్ నయన పర్వముగా మది గోచరించి నా

యరగలి బాపు నీయభయహస్తమునీడ భజింతు శాంకరీ!


ఈ శివాజీ ప్రబంధమునకు 'భారతము' అని పేరిడుటలో నొక విషేశమున్నది. ఇందు దఱచుగ భారతములోని యుపములే యీయబడినవి. అవియెల్ల నిట నేఱిచూపను. తత్త దుదాహరణములకు గ్రంథము పఠింతురుగాక!


శ్రీ వేంకట శేష శాస్త్రి గారి జీవిత ప్రబంధములో 'శివభారతము' కీర్తనీయమైన స్వర్ణ ఖండము. దానిని తొలుత బేర్కొనిగాని, వారి చరిత్రవిషయములు ముచ్చటించిన సొగసు లేదు. శాస్త్రిగారు 1897 లో జన్మించిరని తెలిసికొంటిమి. ఈగ్రంథము నాటికి వారికి, ఏబది మూడేండ్ల వయస్సు. శాస్త్రిగారు పదుమూడేండ్లు వచ్చిన తరువాత 'నెమళ్ళదిన్నె' నుండి ప్రొద్దుటూరు వచ్చి యచ్చట రూపావతారము శేషశాస్త్రులుగారి సన్నిధికి జేరి కావ్యనాటకాలంకారసాహిత్యము, తర్కవ్యాకరణశాస్త్ర నైపుణ్యము సంపాదించిరి. పిమ్మట షడ్దర్శనము వాసుదేవావధానులుగారిని సేవించి యుజుస్సంహితామూలము, యుజురారణ్య కోవనిషత్తులతో సప్రయోగ స్మార్తమంత్రపాఠము అధ్యయనించిరి. జాతక-ముహూర్త-సాను ప్రకరణములు చదువుకొనిరి. సంస్కృత పాండితిలో గురుకుల క్లేశమందుపడి గడిదేఱినతరువాత, ఆంధ్రకావ్యములు చూచి, మహాభారతము పారాయణము చేసి, ఛందశ్శాస్త్రము నెఱిగి, తొలిజన్మములో వలచి వెంట వచ్చిన కవితాసుందరిని గిలిగింతలు బెట్టి చేరదీసికొన్నారు శాస్త్రిగారు.


1912-13 సంవత్సరప్రాంతములో శ్రీ దుర్భాక రాజశేఖర కవితో మన ప్రకృతకవికి నేస్తము తటస్థపడినది. "రాజశేఖర వేంకటశేషకవులు" అను జంట యేర్పడి కవితావ్యాసంగమున కుపక్రమించినారు. తపస్సున కొకడే యుండవలెను. అథ్యయనమున కిరువు రున్నగాని ససిపడదు. 1915 లో బృందావనమున శరన్నవరాత్రమహా--సందర్బమున జరిగిన కవిత్వపుబోటీలో దొలి బహుమానము మన కవులు సంపాదించిరి. ఈకవులజంట విడనప్పుడు 'వీరమతీచరిత్రము' అను పద్యకావ్యము, సీతాపహరణము, కీచకవధ అను నాటకములు రచించి యుండిరి. 1920 మొదలు 1926 దాక జతవిడక 'రాజశేఖర-వేంకటశేష కవులు' అష్టశతావధానములు పలుచోట్ల గావించిరి.--------------------------------సువర్ణకంకణములు కాన్కబెట్టిరి------------------------------------------------------------------- ......... .......... .................. ........... (పై ఖాళీలలోని అక్షరములు కనబడుటలేదు) బిరుద మొసగిరి. వేయి బిరుదము లిచ్చి నాలుగువేల సన్మానములు చేయనిండు. వేంకటశేషశాస్త్రిగారికిగల 'శివభారతకవి' యన్న బిరుదముతో నవిసరిరావు. రాజశేఖరకవిగారికున్న 'ప్రతాపసింహచరిత్ర కవి' యను బిరుదముతో నవి సరిరావు.


శేషశాస్త్రిగారు జన్మభూమిలోనుండి పోతనవలె హాలికవృత్తి జేసికొనుచు, వీలుపడినపుడు పురములకుబోయి యవధానములు ప్రదర్శించుచు భారతి, మల్లికామారుతము, పుష్పబాణవిలాసము తెలుగు పఱిచిరి. 'హరికథలు' రచించి తమ అన్నగారు వేంకటసుబ్బాశాస్త్రులు గారిచే నాపరిసరమున నచట నచట గాలక్షేపములు చేయించిరని వినుకలి.


1930 లో నెమ్మళ్ళదిన్నె విడిచి ప్రొద్దుటూరు చేరుకొని 'కన్యాకాపరమేశ్వరీ సంస్కృతపాఠశాలలో నధ్యాపకత నిర్వహించుచు, 'బ్రహ్మనందినీ' పత్రికకు బ్రచ్ఛన్న సంపాదకత సాగించుచు గాలము గడపిరి. 1932 లో, ప్రొద్దుటూరు 'మ్యునిసిపల్ హైస్కూలు' న ఆంధ్రోపాధ్యాయులుగా బ్రవేశించి నేటికిని ఆపదవియందే యుండిరి.

వాస్తుజంత్రి, ఔర్మిళాలక్ష్మణము, అనర్ఘరాఘవాంధ్రీకరణము మున్నగు రచనలు రచించిరని తెలియవచ్చెను. కొన్ని యసమగ్రములు, కొన్నియప్రకటితములు, కొన్ని యుత్పన్నములును ఈనాటికి సంపూర్ణముగ రచితమై చక్కగ బ్రచురితమైన గ్రంథ మొక శివభారతము మాత్రము. గడియారము వేంకట శేషశాస్త్రిగారి కీర్తి తెలుగున గలకాలము నిఱుపుట కీ కృతి చాలును. ఇటీవల వారు రచించుచున్న 'శ్రీకృష్ణదేవరాయ చరిత్ర' పూర్తియై వెలువడినచో నది తెలుగు బాసకు దొడవుపై తొడవు.


                             _______________