ఆంధ్ర రచయితలు/కొచ్చెర్లకోట రామచంద్ర వేంకట కృష్ణారావు
కొచ్చెర్లకోట రామచంద్ర వేంకట కృష్ణారావు
1871 - 1919
ఆరువేలనియోగి. దత్తతగొన్నతల్లి: కామాయమ్మ. తండ్రి: వేంకట జగన్నాథరావు. జన్మస్థానము: గోదావరీ మండలములోని పోలవరము. జననము: 1871 నవంబరు 11 వ తేది. నిర్యాణము: 1919. గ్రంథములు: 1. రాజతరంగిణి (కల్హణుని కాశ్మీర దేశప్రభుల చరిత్రమునకు దెలుగు వచనము) 2. అపవాద తరంగిణి (షెడిడనుకవి రచించిన స్కూల్ ఆఫ్ స్కాండల్ అను నాంగ్ల నాటకమునకు వచన రూపాంధ్రీకరణము. (1901 ముద్రి.) 3. సాహసిక కథార్ణవము (రాజపుత్రస్థానములోని చక్కని కథలు) 4. ప్రభువిశ్వాసము (ఆంగ్ల రాజ్యారంభము నుండి నేటిదనుక మన దేశమునకు గలుగు నుపకారము లిందు వర్ణితములు) వీరు సరస్వతి యను మాసపత్రికను వెలువరించిరి.
తెలుగుదేశమునగల జమీందారులలో భాషాపాండితియుండి కవిత రచింప గలవారలసంఖ్య మిక్కిలి కొలది. ఆ కొలదిమందిలోను పోలవరము ప్రభువులు వేంకటకృష్ణారావుగారు పేరుగన్నవలతి. ఆంగ్లములో నీయన బి.ఏ. పట్టము నందెను. సంస్కృతాంధ్రములలో నీయన పట్టములులేని భద్రులు. పండితుడై, పండితపోషకుడై, కవియై కవిపాలకుడై, రాజకీయవేత్తయై, ఈ కవిప్రభుని జీవితము తెలుగురచయితల కెందఱకో వెలుగుచూపినది.
పోలవరమున కధిపతులైన జగన్నాథరావుగారు పాతికయేండ్ల వయస్సు మీఱకుండగనే కాలధర్మము నందిరి. ఆయనధర్మపత్ని కామాయమ్మగారు తమ చెల్లెలికుమారుడగు మన వేంకట కృష్ణారావుగారిని దత్తపుత్త్రునిగ స్వీకరించి యైదవయేట నుండియే పెంచి పెద్దవానిని జేసి చదువుచెప్పించి పోలవరము జమీకి బ్రభువును జేసినది. చిన్న తనమున మన కృష్ణారావుగారికి సంస్కృతాంధ్రములు, ఆంగ్లము నొకగురువునుంచి తల్లిగా రింటికడనే చెప్పించిరి. పిమ్మట రాజమహేంద్రవరము చదువునకు విడువలేక కుమారుని పంపిరి. అక్కడ నుండి మనప్రభుకిశోరుడు శ్రద్ధగ జదివి 1887 లో బ్రవేశపరీక్ష 'మెట్రిక్యులేషన్ ఎగ్జామినేషన్' యం దుత్తీర్ణు డయ్యెను. గణితమందును, భాషావిషయమందును మొదటినుండియు వీరికి బట్టుదల హెచ్చు. 1888 లో రాజమహేంద్రవర కళాశాలలో ఎఫ్.ఏ. చదువుట కుపక్రమించిరి. కాని, కాలకర్మవశమున దల్లి కామాయమ్మగారు కాలధర్మమందుటయు, కృష్ణారావుగారి దత్తత చెల్లదగినది కాదని యెవరో యభియోగములకు దిగుటయు, ఆయా చిక్కులు తటస్థించుటచే మనోవైకల్యము కలిగి వ్యాధిబాధ కలుగుటయు గారణములుగ మూడేండ్ల దాక విద్యాభ్యాసము సాగినదికాదు. 1891 వ యేటి చివర వ్యవహారములెల్ల సానుకూలముగ బరిష్కరింపబడి కృష్ణారావుగారికి మరల చదువుపై నభిలాష పెంచినవి. చెన్నపురి క్రైస్తవకళాశాలలో బ్రవేశించి 1893 లో ఏఫ్.ఏ.యందు నెగ్గి 1896 నాటికి బట్టభద్రులైరి. దేశచరిత్రలయందును బట్టము నందగోరి 1900 లో జరితార్థులైరి. కృష్ణారావుగారు పట్టభద్రులైన తరువాత 'కాకినాడ' లో మేడకట్టించుకొని యుండి సంస్థానమును స్వయముగ బరిపాలించుకొనుచు నుండిరి. అక్కడనుండి పోలవరము జమీందారుగారి పేరు పతాకనెత్తినది.
ఈయన దేశచరిత్రమందు మేరలేని యభిమానము కలవాడగుట భారతదేశ సంచారము గావించి ప్రధాన పట్టణముల నన్నియు జూచి చారిత్రకముగ నాయావిశేషములెల్ల గనిపట్టెను. ఇంకను బెద్దచదువేదో చదివికొందమని యింగ్లండుదేశమునకు బ్రయాణముకట్టెను గాని, దైవికముగా గారణాంతరములచే నది చేకూరలేదు. భారతస్వాతంత్ర్య సంపాదనమునకు నడుముకట్టిన సంఘములతో నీయన చెలికారము చేసెను. శ్రీకందుకూరి వీరేశలింగంపంతులుగారి సంస్కరణములు కొన్నిటిపై నీ ప్రభువునకు బరమప్రీతి. పంతులుగారు చెన్నపురిలో నెలకొలిపిన అనాథశరణాలయమునకు వీరు వేయిరూపాయలు విరాళమిచ్చిరి. 1895 లో నిలుపబడిన 'ఆంధ్రభాషోజ్జీవనీ' సంఘమునకు మన వేంకటకృష్ణారావుగా రుపాద్యక్షులు. ఇంక నీప్రభువు సాంఘికముగను, సారస్వతముగను జూచినచో దెలుగుదేశమునకు మంచి యుపకృతిగావించెను.
1898 లో నీకవిరాజు సంపాదకత్వమున 'సరస్వతి' తలసూపినది. ఆ పత్రికయే యీప్రభువునకు గల సారస్వతాభిమానమునకు గీటుఱాయి. తిరుపతివేంకటకవులు, వడ్డాది సుబ్బారాయకవి, కొమఱ్ఱాజు వేంకటలక్ష్మణరావు మున్నుగాగల యాధునికు లెందఱో సరస్వతి' నికృతిప్రసూనములచే నారాధించిరి. అదిగాక, శ్రీనాథునివి, అనంతభూపాలునివి, పినవీరభధ్రునివి, మారనవి, కందుకూరి రుద్రయ్యవి కృతు లీ 'సరస్వతి' ద్వారమున బ్రచుర ప్రచారము నందినవి. ఇటు లీ సరస్వతి యిరువదేండ్లదాక నడచినది. శ్రీకృష్ణారావుగారి 'సరస్వతి' కారణమున దెలుగు కవుల కెందఱకో యుత్సాహము పెరిగినది. దానితో సాహిత్య పత్రికల కఱవు తీరినది. పోలవరము జమిందారుగారు గొప్పరాజకవు లన్నపేరు నాలుగు ప్రాంతములందును మీఱినది. తిరుపతి వేంకటకవులను జేరదీసి యాస్థానకవులుగ నాదరించుచు వేంకటకృష్ణారావు గారు మఱింత ప్రఖ్యాతి నందిరి. విశేషించి, దివాకర్ల తిరుపతి శాస్త్రిగారు మన కవిప్రభుని సరస్వతికి జేదోడువాదోడై యుండువారు. 'సరస్వతి' లో బ్రచురింపబడిన గ్రంథములన్నిటియందును శ్రీతిరుపతి శాస్త్రిగారి పరిష్కరణముద్ర పడినదనవచ్చును. 'సరస్వతి' ఘనతకు శ్రీ శాస్త్రిగారును హేతుభూతు లనుట యిప్పుడు మనము చెప్పవలసినమాట. తిరుపతి వేంకటకవుల గ్రంథములలో దేవీభాగవతము తరువాత బుద్ధచరిత్ర మొకటి బహుకాలము జీవించుగ్రంథమని విమర్శకుల యభి ప్రాయము. అట్టి బుద్ధచరిత్రము కృతినందు నదృష్టము మన వేంకటకృష్ణారావుగారికి బట్టినది.
సీ. ఎవని హూణాగమాతివిభూతి తెల్పు ద
త్ప్రాపకంబైన బి.ఏ పదంబు
ఎవని భాషాభిమాన విభవంబు వచించు
నెంచి చేయించు సత్కృతిచయంబు
ఎవని కవీంద్రగౌరవము చాటించు ము
ద్రాపిత ప్రాక్కవిగ్రంథపటలి
ఎవని యగణ్యపుణ్యవిశేష మెఱిగించు
నత్తకోడండ్ర యన్యోన్యమైత్రి
యతడు కొచ్చెర్లకోట వంశాంబురాశి
చంద్రు డురుకిర్తి సాంద్రుడు శాంతిపరుడు
రామచంద్ర వేంకట కృష్ణ రామచంద్రు
డనితరప్రతిభాశాలి యనియు దలచి.
అంకిత మిచ్చిరి గాని, సామాన్యుల కీ బుద్ధ చరితము కృతిగొనుటకు వీలులేనిది. ఈ కృత్యాది పద్యములు రెండిటివలనను దిరుపతి వేంకటకవుల కీ ప్రభువుపై గల గౌరవముతీరు విస్పష్టపడును.
చ. ఎవరికి నేని నిచ్చుపనియే మనవృత్తి యటంచు నెంచి స
త్కవులను బండితోత్తముల గాయకులం దనియించుగాని పో
లవరవిభుండు రక్షితకళావిదధీశుడు కృష్ణరావు మె
ప్పు వడయునంతపాటి బుధ పుంగవులుం గలరే జగంబునన్.
క. ఇత డతికవితాలోలుప
మతి యని వర్ణింపనేల మాటికి నీ సం గతి ప్రతిమాసమున సర
స్వతియే ప్రతిదేశ మేగి చాటుచునుండన్.
జగత్ర్పసిద్ధులైన యీ కింకవీంద్ర ఘటాపంచాననులను స్వసంస్థానకవులుగా జేసికొనుభాగ్యము పోలవరముప్రభువున కొక్కనికే తక్కినది.
చ. తిరిగితి మెల్లదేశము నదే పనిగా నికమీద దేశసం
చరణ మొనర్పగా వినుపు చాల మనంబున గల్గెనయ్య! యీ
తిరుపతివేంకటేశ కవిధీరుల నొక్కెడనుండజేసి భూ
పరసభలందు ఖ్యాతిని నవశ్యము చెందుమి ! కృష్ణభూవరా!.
అని చెప్పి దేశదేశములు తిరిగి విసిగివిసిగి యొకచో నుండగోరి వీరి నాశ్రయించి యుండిరని యీ పద్యమువలన దేలుచున్నది.
శ్రీ వేంకటకృష్ణరాయ కవిప్రభువు కవిపోషకుడెగాక స్వయము చక్కని కవిత చెప్పగలవాడై కొన్నికృతులుకూడ రచించెను. సంస్కృతములోని కల్హణరచితమైన 'రాజతరంగిణి' ని జక్కని వచనరచనలో సంధానించిరి. అందు దరంగ ప్రారంభమున గావించిన స్తుతులవలన నాయన కవిత సొంపుపెంపు తెలియవచ్చును.
మ. అజగోశృంగములన్ ఘటించి విలుసేయంజాలునో యెవ్వడా
త్మజు దేహంబున గూర్చెనో యెవడు మర్త్యంబు దంతిత్వమున్
నిజదేహంబున దాల్చెనో యెవడు తన్వీపుంస్వరూపంబు ల
ట్టి జగన్మాన్యు విచిత్ర కార్యకుశలున్ డెందంబున న్ని ల్సెదన్.
ఉ. పాములు నీకురుల్ రుచికి బాత్రములే మదపుంస్పికంబు నా
గోమగు తావకీన గళగోవులకు న్వికసించె జూడుమీ
పాములదృష్టియంచు నొకవాక్యము ద్వ్యర్థిగ నిర్వురాడున
-మెయి బల్కు నర్ధవనితేశ్వరు నాలుక మమ్ము బ్రోవుతన్. ఉ. గాలియు నాకులుం దినుచు గానలలో దపమున్న దాని కీ
మేలనుకోకు మట్టివె సుమీ చిలువల్ వృషభంబు వాని కీ
జాలెనె ; ప్రేమచేత జుమి సామెయి నీకిదె భర్గుడంచు స్వ
స్త్రీలు నుతింపగా నలరు శీతగిరీంద్రకుమారి నెన్నెదన్.
ఈ 'రాజతరంగణి'యేగాక సాహసిక కథార్ణవము, అపవాదతరంగిణి, ప్రభువిశ్వాసము మున్నగు పెక్కురచనలు గావించి కవిగా నీప్రభుమణి పేరుగాంచెను. రాజకీయమున గూడ నీయన మంచిపరిశ్రమము చేసి యెన్నో సభలలో నుపన్యాసము లొసగెను. శ్రీకృష్ణారావుగారి రాజభక్తి మెచ్చదగినది. శ్రీజార్జి చక్రవర్తి పట్టాభిషేక సమయమున 1911 లో దెలుగు కవులెందఱచేతనో పద్యములు వ్రాయించి తెప్పించి యా కారొనేషన్' సంచిక శ్రీప్రభువువారి కర్పించుకొనిరి. అప్పటి కృతి పద్య మిది యొకటి.
మ. పదుమూడేడుల యీడువచ్చె జదివెన్ భాషాప్రపంచంబు దొ
డ్డది మా బ్రాహ్మవివాహకాల మది దాటంజేయగారాదు, నీ
పదదాస్యం బొనరించు చున్ ముదమునన్ వర్ధిల్లగా నెంచుచు
న్నది జార్జీశ్వర ! మాసరస్వతిని గాన్కం జేతు గైకోగదే?
ఈ విధముగ రాజభక్తుడు, గ్రంథరచనాసక్తుడు, పండితపాలకుడు, ప్రభువరుడునైన శ్రీవేంకట కృష్ణరాయకవి ప్రభువులలో బ్రభువు. పండితులలో బండితుడు. రచయితలలో రచయిత. పాపము! పోలవర సంస్థానకవి తిరుపతి శాస్త్రి 'శ్రీకృష్ణనిర్యాణము' ను గుఱించి యెంతవగచినాడో పరికింపుడు.
సీ. శతవధాన మొనర్ప సరసులు కబురంప
బంపకుండగ మానిపింపలేదు
సర్వదేశంబుల సభలకు బోవుచో
వెంట రమ్మనకుండ విడువలేదు పీటపై గూర్చుండి పిలువనంపక యుండ
నేదినమ్మున భుజియింపలేదు
మొదటినుండియు దుట్టతుదదాక నొకరీతి
గురుభావమున లోటు జరుపలేదు
ఇట్టిరీతిగ బదు నెన్మిదేండ్లు జరిపి
కృష్ణ భూపాలకుడు దివి కేగె నేటి
కాయనకు నాకుం గల్గు ఋణానుబంధ
మక్కటా ! దైవదౌర్బల్య మణచివైచె.
సీ. రచియించినాడ బుద్ధచరిత్ర కృతిగాగ
మేలినాటకములు మృచ్ఛకటిక
బాలరామాయణ పాండవవిజయము
ద్రారాక్ష నేడ్వర్డురాజమౌళి
పట్టాభిషేకముల్ పావనయుష్మదా
ఖ్యాభూషితమ్ములుగా నొనర్చి
నీకీర్తి కాంత కీలోకమ్మునందు వ
సించుసౌధమ్ము నిర్మించినాడ
బండితుడు కవి మిత్రుడు బాంధవుం డ
నంగమెలగితి దానికి నాకు నీవి
చేయు ప్రత్యుపకార మిస్సీ! మహాత్మ !
వదలి దివి కేగుటా కృష్ణవసుమతీంద్ర!
గీ. శనిమహాదశ మంచియుచ్చదశ యంచు
బల్కు కార్తాంతికుల పల్కుబడు లనృతము
లనగ శనిదశలోని శన్యంతరమున
గుజుడు పాపాత్ముడగుచు మాకొంప దీసె