ఆంధ్ర రచయితలు/ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి

ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి

1860-1916

ఆరామద్రావిడ శాఖీయులు. ఆశ్వలాయన సూత్రులు. ఆత్రేయస గోత్రులు. జన్మస్థానము: ఖండవిల్లి. నివాసస్థానము: కాకరపర్రు (తణుకు తాలూకా). రాజమహేంద్రవరమున నుద్యోగము. తల్లి: వేంకటాంబ. తండ్రి: వేంకటశాస్త్రి. జననము: 1860 సం. నిర్యాణము: 2-2-1916 స. కవికర్తృక గ్రంథములు: శ్రీమహాభారత నవనీతము (పదమూడు పర్వములు), ప్రబోధచంద్రోదయము, అనర్ఘరాఘవము, శుద్ధాంధ్ర ఋతుసంహారము, గంగాలహరీ స్తోత్రము, భామినీ విలాసము, ఆధ్యాత్మ రామాయణము, సూర్యశతకము (మయూర విది-ఆంధ్రీకృతము), భారతఫక్కి (విమర్శ), పరాశరస్మృతి (తెనుగు వచనము), కృష్ణా పుష్కర మహాత్మ్యము.

చవులువుట్ట బ్రబోధచంద్రోయము జేసె

దెలుగులలోని నిగ్గులు ఘటించి

తెలిగించె దలలూప బలుకుల దులదూచి

రమ్యభంగి ననర్ఘ రాఘవంబు

పండితరాజప్రబంధమ్ము లాంధ్రీక

రించె దత్త ద్భావరీతు లెఱిగి

పరివర్తన మొనర్చె బాసలోనికి ఋతు

సంహారకృతి నదోషత నెసంగ

నాంధ్రవాగ్దేవతా చతురాన్యు డతడు

సంస్కృతోక్త్యభినవపతంజలి యతడు

ప్రథిత వాగర్థరసమహోదధి యతండు

ధూర్తరిపుశస్త్రి యావ్యానమూర్తి శాస్త్రి 'వ్యాసమూర్తి శాస్త్రిగారి కవిత్వము స్వయంపాకమువలె శుచిగా నుండునేగాని ద్రాక్షాపాకమువలె రుచిగానుండ' దని యొకవాడుక. ఈ వాడుకకు వారు మహాపండితులగుటయే కారణము. శాస్త్రులుగారు రాజమహేంద్రవర పురవీథిని నడచుచుండునపుడు ప్రక్కప్రక్కల బోవు పండితులు 'అదిగో విజ్ఞానసర్వస్వము' అని చెప్పుకొనుచుండెడివారు. ఆ మహాశయునకు జోహారులనందుకొనుటయే సర్వకళాశాలలోని యుపాధ్యాయత్వమునకు మించిన పెద్దయుద్యోగ మైపోయినది. ఆ దివ్యతేజస్వి సారస్వతపీఠమున గూరుచుండి సాహిత్యగోష్ఠి సలుపునపుడు సరస్వతి పుంభావమును బడసినటులు కనులపండు నయ్యెడిది. ఆయన మహామహోపాధ్యాయులు కారు. కళాప్రపూర్ణులునుగారు. ఈ మహా బిరుదములను దాటి యన్వర్థనాముడైన పండిత మూర్ధరత్న మాయన. సంస్కృతాంధ్రములలో నఖండమైన పాండిత్యము. కవితారచనలో నసమానమైవేగము. భాష్యత్రయమునకు బాఠములు సెప్పినారు. ఆఱుశాస్త్రములలో దగిన పరిచయము. వారినాట సంస్కృతాంధ్రములలో నెవరి కే సందేహమువచ్చినను వీరు తీర్చు చుండెడివారు. ప్రమాణములు కావలసినను బ్రయోగములు కావలసినను నిఘంటువులు తిరుగవేయనక్కఱలేదు ఆయనదర్శనమునకు బోయిన జాలును.

వ్యాసమూర్తి శాస్త్రిగారి కనర్ఘ రాఘవ మభిమానగ్రంథము. దాని నాంధ్ర్రీకరించిరికూడను. వ్యానేశ్వరు డిష్టదైవము. తమకృతులన్నియు గేశనకుర్తి వ్యానేశ్వరునకే యంకితములు. ఈ యాంధ్రవ్యాసు డొక తుంగచాపపై నొక యుత్తరీయమును బఱుచుకొని యొకవంకసంస్కృత మహాభారతమును జూచుకొనుచు సులోచనములజోడు జారిపోవు చుండగా నిట్టె సవరించుకొనుచు 'మహాభారతనవనీత' రచనా నిమగ్నుడై యున్నపుడు-ఆమహాశయుని దివ్యదృశ్యమును గనులారగాంచు భాగ్య మాంధ్రులకింక దురాసము. ఒకతుడుపుగాని యొక సవరింపుగాని లేక తూచాలు తప్పక పుల్ స్టాపులతో - శకటరేఫములతో - నరసున్నలతో నిప్పటికిని నవనవముగానున్న వారి భారతపువ్రాత ప్రతిని నక్షిపర్వముగా నవలోకించువారిదే యదృష్టము. పదమూడు పర్వములు మాత్రము వ్రాతలోనున్నది. అచ్చుపడినది యాదిపర్వమొక్కటియే. మహాభారతమునుండి నవముగా నీతమైనదనునర్థము వచ్చునట్లును, మహాభారతములోని నవనీత తుల్యమైన సారతరపదార్థ మనునూహ కలుగునట్లును దీనికి 'మహాభారతనవనీత' మనునామకరణము శాస్త్రులుగారు చేసి యుందురు. ఇదిమూలమునకు ముక్కకు ముక్కగా జేసిన యాంధ్రీకృతి గాదు. ఈ వ్యాసభారతమునకు బీఠిక వ్రాయుచు బీఠికాపురసంస్థాన కవులు ఓలేటి వేంకటరామశాస్త్రిగా రిట్టులనిరి.

" శ్రీవ్యాసమూర్తి శాస్త్రులవారు తొలుదొలుత నీభారత రచనమున కారంభించినపుడు నేనును నామేనత్తకుమారుడు రామకృష్ణశాస్త్రియు నస్మద్గురుదేవసమానులు, నత్యంతాప్తబంధువులు నగు శ్రీ శాస్త్రులుగారి యొద్ద మాకు గలిగిన చనవునంజేసి 'ఆర్యా! కవిత్రయాంధ్రీకృతమహాభారతము సర్వాంగసుందరమైవిరాజిల్లుచుండ మరల నీభారతనవనీతరచనకు బూనుకొనుట యెందుల' కని నిర్భయముగా నడిగితిమి, అప్పుడు వారు సెలవిచ్చిన యుపవత్తు లివి: "వ్యాసభట్టారక ప్రోక్తమైన శ్రీ మహాభారతమును నన్నయభట్టారకాదులు నవరసభరితముగ నాంధ్రీకరించిన సంగతి వాస్తవమే. వారి కవితారచనాదులు నిరుపమానములై సర్వజనాహ్లాదకరములై యుండుటయు యథార్థమే. నేనిప్పుడు వారికవనమున లోపములు గలవనుతలంపుతో గాని,వారికవిత్వము నతిశయింప వలయుననుకోరికతో గాని యిందులకు బూనుకొనలేదు. పంచమ వేద క్షీరవారాశినుండి నేనును నాశక్తికొలది కొంత నవనీతము నెత్త దలచితిని. ఆ గభీరవారాశిగర్భమున విలీనములైన నీతిరత్నముల గొన్నిటి నాంధ్రులకు వెల్లడిసేయుట యవసరమనితోచినది. ఇదియును గాక, నాయంతరంగమున నొకవిచిత్రమైనయభిలాషము సైతమున్నది. అది యేమనగా వ్యానేశ్వరుడే మాకు గులదేవత. ఆ వ్యాసభట్టారకుని యెడల నాకెంతయో భక్తికలదు. సంస్కృతభాషయందు వ్యాస ప్రోక్తమైయున్న మహాభారతమును దెనుగునగూడ వ్యాసప్రోక్త మొనరింపవలయు నని నాకు ముచ్చటగా నున్నది. ఆయీ కారణములచే నేనీగ్రంథమును రచింప నారంభించితినిగాని మఱియొకటిగాదు. నాయీగ్రంథము శ్రీమహాభారతమునకు మూలానుగుణమగు నాంధ్రీకరణమునుగాదు. ......"

వ్యాసమూర్తి శాస్త్రిగారికవిత్వము అన్వయకాఠిన్యము కలిగి యభూతపూర్వ మైనదని కొందఱవిమర్శ. ఇంచుమించుగా నందఱ యభిప్రాయము నదియే. దానికి గారణము తొట్టతొలుత బేరుకొంటిని.వ్యర్థపదములు వారికవితలో నుండవు. అదిగాక భారతనవనీతము నిర్వచనము. మొత్తముమీద శాస్త్రిగారికవితారచనము విలక్షణతాపాదకమనిచెప్పవలయును.

ఎఱుగక మేను, గిన్క ధరణీశుల నే బొరిగొన్న పాతకం

బఱుత మనన్ ఋచీముఖు లావర మిచ్చిరి ; తత్సగోంత మే

పఱగు శమంతపంచకము ; భారతసంగరమందె సెల్లె ; రూ

పఱి రిరుతొమ్మిదుల్బలము లక్షపదాదిమలైన యూహినుల్. "భారతనవనీతము"

వీరిపద్యములన్నియు నిట్లే నడచును. శాస్త్రిగారు తమకుమారుని వివాహమున కాహ్వానపత్రికపై వ్రాసిన యీపద్యమెంతపొందికగా నిమిడినదో!

వినుడీ ! కీలకమాఘశుద్ధదశమిన్ వేగ న్విధిన్ గుంభరా

శిని మత్పుత్రుడు కోటవెంకటసుతన్ జేనందికో వృద్ధమా

ననమయ్యెన్ జరుగున్వివాహము జగన్నాథాచలంబందు గా

వున విచ్చేయుడు ! బందులీనవయుగంబున్ లెస్సదీవింపగన్. ఈపద్యము చదివి యాహూతులు కొందరు వేగన్ విధిన్ అనుపదముల కర్థ మెఱుగక వ్యర్థపదములని యాక్షేపించిరట. సహజసాత్త్విక స్వరూపులగుశాస్త్రులుగారు నవ్వుకొని వేగన్ అనగా దెల్లవారుజామనియు, విధి యనగా రోహిణీనక్షత్రమనియు వారి కెఱుగ జెప్పిరట వీరికవిత్వములోనేగాక మాటలలోగూడ నిట్టిపొందికయు జమత్కారములు నుండును. 'తమకు జీత మెంతయిత్తురండి' యనియడుగ 'వయసునకు మించలేదు లెండి' యనుచుండువారు.

ఈ శాస్త్రులవారు వేదుల సోమనాథశాస్త్రులవారితో దర్కాలకారశాస్త్రములు చదివిరి. ఉపనిషద్వేదాంతములు ఆదిభట్ట రామమూర్తి శాస్త్రులవారిసన్నిధిని పఠించిరి. వీరు మొట్టమొదట ఖండవిల్లిలోను, క్రొత్తపేటలోను గల పాఠశాలలోను నధ్యాపకులై యుండిరి. తరువాత 1880 మొదలు 1915 వఱకు రాజమహేంద్రవరము బోధనాభ్యసన పాఠశాలా కళాశాలలలో సంస్కృత భాషాదేశికులై విద్యార్థుల నెందఱనో విద్వాంసుల నొనర్చి యుపకారవేతనము గొన్నారు.

వీ రనువదించిన అనర్ఘ రాఘవము - ప్రబోధచంద్రోదయము సూర్యశతకము చూచిన కవిప్రతిభాపాండిత్యాదులు వెల్లడియగును. 'భారత ఫక్కి' యనుపేర భారతముపై విమర్శ గ్రంథము నొండు వ్రాసిరి. అది భాషోపానకుల కుపయోగకరమైన కూర్పు. వ్యాసమూర్తిశాస్త్రిగారి భారతనవనీతము సంపూర్ణముగ నచ్చునకు వచ్చునట్లు వ్యానేశ్వరుడనుగ్రహించుగాక ! పీఠికాపుర సంస్థానకవులు శతావధానులునగు వేంకట రామకృష్ణకవులలో నొకరగు వేదుల రామకృష్ణశాస్త్రిగా రీమహాభారత నవనీతకవికి అల్లుడని వెల్లడించుట యవసరము.

అదియటుంచి, శాస్త్రులుగారి సూర్యశతకము తెనుగు సేత నుండి గొప్పపద్యములు కొన్ని యెన్ను కొందము. మ. వసివాళ్వాడు బిసాభమంచుదయనో, వాతాశిలోకంబు, వే

రనమర్థం బగునంచు నే వరము లోకాలోక భూభృత్తటి

న్వెన నూర్ధ్వాబ్జజ భాండఖండదళనా వేగంబునన్ ద్యోస్థలి

న్బొసగంగా జొర కెందునేగు రవిరుక్పూరంబు మేల్మికిడున్.

మ. జలధి న్విద్రుమముల్ ద్రుమాళి జివురుల్ శైలంబునంజేవురుల్

బలభిత్కుంభ శిరంబునం దవిరళ ప్రత్యగ్రసిందూర ధూ

ళుల వింటన్ హరు వింటి పై డితళుకుల్, శోణద్యుతిన్ భాను దీ

ప్తి లవంబుల్ వఱువాత నేవవి భవత్ప్రీత్యావహంబయ్యెడిన్ !

మ. కులదైవంబొ, గురుండొ, తండ్రి, చెలియొక్కో, యర్యుడాచార్యుడో

వెలుగో చుట్టుమొ రక్ష దివ్వె బ్రతుకో బీజంబొ నేత్రంబొ వే

వెలుగి ట్లేమని నిర్ణయింపనగు నేవేళన్ సమస్తంబు లో

కుల కెల్లన్ సమకూర్చు గోరికలు మీకు న్దేవు డాతండిడున్ !

                             ___________