ఆంధ్ర రచయితలు/ఆకొండి వేంకటకవి
ఆకొండి వేంకటకవి
1820
ఆరామద్రావిడ శాఖీయ బ్రాహ్మణుడు. తండ్రి: జగన్నాధ శాస్త్రి. తల్లి: అచ్చమాంబ. నివాసము: విశాఖపట్టన మండలములోని గజరాయనివలస. రచించిన గ్రంథములు: తత్త్వసంగ్రహ రామాయణము. శతకములు: మూడు (ఆముద్రితములు). కవికాలము: 1820 ప్రాంతము.
ఈ కవిచే నాంధ్రీకరింపబడిన "తత్త్వసంగ్రహ రామాయణము" నందలి బాలకాండము ఆంధ్రవిజ్ఞానసమితి వెలువరించినది. ఈ రామాయణము సంస్కృతములో రచించినవారు శ్రీ బ్రహ్మానందభారతీ స్వాములు. ఈయన యెప్పటివారో తెలియదు. భారత, విష్ణు, కూర్మ బ్రహ్మాండాది నానా పురాణములనుండి సంగ్రహింపబడిన కథ లెన్నో యిందున్నవి. ఈ వేంకటకవి మేనమామలు పెద్ద పండితులు. వారిని గూర్చి కావ్యాది నిట్లు చెప్పుకొనెను:
సీ. పండిత దృమ మనఃపల్లవముకుళ వుష్ప వికాస జైత్రుండు పాత్ర సూరి
స్వాభ్యంత నిఖిల శాస్త్రాబ్ధి జిన్ఞానామృతేష్టానుభవుడు కౌరీణ్మనీషి
ప్రభుసభాప్రథిత విద్వజ్జయేద్బవ మహో న్నత నద్యశుడు జగన్నాథ శాస్త్రి
స్వకృత ప్రబంధ పుష్ప గుళుచ్ఛసురభితార్ణవ మధ్య దేశుండు రామసుకవి
గీ.. యనదగు సమాఖ్య లొప్ప భూమ్యధిప దత్త
మణివలయుకుండలాది భూషనము లమర
నలుపు మీఱ జెలంగునా నలుపు రైన
మాతులుల కెఱగెద గీర్తి మాతులులకు.
ఈవేంకటకవి మండపాక పార్వతీశ్వరకవి, కాకరపర్తి పాత్రసూరి కవులకు సమకాలికుడగుట--వ శతాబ్ది యారంభములోని వాడని తెలియవలయును. ఈయన "తత్త్వ సంగ్రహరామాయణము" రచించు చుండుట దెలిసి సాలూరు జమీందారును, కాశింకోట జమీందారును కృతినిమ్మని కోరిరట. నరకృతిగావింప నిష్టపడక తనగ్రంథము శ్రీకృష్ణ భగవదంకితము గావించి యీకవి చరితార్థుడయ్యెను. ఇందలి కవిత సంస్కృతపద ప్రచురము. వ్యాకరణవిశేషము లిక్క వీ యెఱుంగుడనుట కనేక నిదర్శనము లున్నవి.
క. ఏహి గృహన్ పతిభిక్షాం
దేహి దయాక్షీరవారిధే సస్త్రాహి
త్రాహి రవిజం భటం జా
నీహి జహీహి క్రుథా మనీషాం శాంత్యా.
ఇది శుద్ధసంస్కృతకందము. ఇట్టి వింకను గలవు. గ్రంథకర్త స్యాలకుడు వజ్ఘల అన్నయభట్టు ఈగ్రంథము కొంతభాగము పూరించెను.
గీ.స్యాలకుడు మాకు సాహితీపాలకుండు
వజ్ఘల లన్నయభట్టు కవసవిశేష
తులితనన్నయభ ట్టురుబలసహాయ
మొనర జేయగ నీగ్రంథమును రచింతు.
అని కవి చెప్పుకొని, బాలకాండము మొదలు సుందరకాండాంతము-యుద్ధకాండములో గుంభకర్ణ యుద్ధాంతముగను-తరువాత రావణ ద్వితీయ యుద్ధభాగము సీతాపరిగ్రహణ పట్టాభిషేక ఘట్టము వ్రాసి పూర్తిచేసెను. నడుమది వజ్ఝల అన్నయ భట్టు ఎనుబదిపద్యములలో బూరించెను. పూరణ శైలి వేఱుగా నున్నది. వార్థకభీతిచే నీకవి యితరునుచే వ్రాయించెనా? యని సందేహించెదము. షష్టిపూర్తి కాకుండగనే యితడు మరణించెననియు, గ్రంథరచనమునకు బదునైదేండ్లు పట్టినదనియ దద్వంశీయులు చెప్పుదురు.
ఈ రామాయణమేగాక వేంకటకవి మూడుశతకములు కూడా రచించెను. "రామా" అనునది యొకటియు, "నారాయణ ! భక్త పోషణా ! శ్రీరమణా !అనున దొకటియు "రామప్రభూ" అనున దొకటియు నా శతకములకు మకుటములు. ఈ రామాయణములో నాయా శతకపద్యములు శ్రీరామస్తప సందర్భమున గలవు. మచ్చున కందలి పద్య మొకటి ప్రకటింతును.
అఘనాశాఖిల దేవతానిచయ సౌఖ్యప్రాపకోద్యత్ర్పభా
వఘనా! దివ్యసువర్ణ చేలమణి భాస్వత్కాంచి కాంచన్మహా
జఘనా! హార కిరీట ముఖ్యవర భూషాభూషిత ప్రోజ్జ్వలా
వఘనా! కీర్తిఘనా! ఘనాఘన సమాభాధామ! రామప్రభూ!
-----------------