ఆంధ్ర రచయితలు/ఆకొండి రామమూర్తి శాస్త్రి

ఆకొండి రామమూర్తి శాస్త్రి

1875

ఆరామ ద్రావిడశాఖీయ బ్రాహ్మణులు. ఆత్రేయసగోత్రులు. జన్మస్థానము: కేశనకుర్రు
పోలవరము. తల్లి: లచ్చమ్మ. తండ్రి: రామస్వామి. జననము: భావ సంవత్సర కార్తిక శుద్ధ ప్రథమ.
1875 సం|| రచనలు: 1. స్వప్నానసూయ (కావ్యము) 2. దేవీభాగవత నవమ స్కంధము
(తిరుపతివేంకటకవుల దేవీభాగవతమున తొమ్మిదవ స్కంథము మాత్ర మీ కవి తెనిగించెను)
3. జీవానందన నాటకము (ఆముద్రితము.)

రామమూర్తి శాస్త్రిగారు ప్రత్యేకముగ రచించి ప్రకటించిన కావ్యము "స్వప్నానసూయ" ఈ యొక కావ్యమునిబట్టియే కాదేవీభాగవత నవమస్కంధ రచనవలన గూడ నీయనకు రచయితలలో స్థానమేర్పడినది. నవమస్కంధము తెనిగించుటలో శాస్త్రిగారొకరేకాదు. , వీరికి మఱియొకకవి సాయపడినాడు. ఆయనపేరు నిశ్శంకులకృష్ణమూర్తి. వీరిరువురును కలసి రామకృష్ణకవులు.


తిరుపతి వేంకటకవులను విననివారుండరు. వేంకటరామకృష్ణ కవులను విద్వత్కవు లందఱు నెఱుగుదురు. ఇపు డీ "రామకృష్ణుల జంట నెఱిగినవారు చాల గొలదిమంది. దానికిగారణము వీరు పెక్కు కృతులు రచింపనులేదు; పత్త్రికలలో వీరిపేరు మనము పరికించుచుండుటయు లేదు. చిత్తములు కవిత్వమందున్నను వృత్తులు వేఱగు--గవిలోకములో వీరికెక్కుడు పేరు బెంపులు లేకపోయినవి.ఆకొండి రామమూర్తి శాస్త్రిగారు అనాదిప్రసిద్ధాయుర్వేద వైద్యములో నందెవేసినచేయి. నిశ్శంకుల కృష్ణమూర్తిగారు కాలు కదప నక్కఱ లేకుండ మంచి సగటుగా గ్రామ కరణపుబని చేసికొనుచుండు నేర్పరి ఇరువురు ---------------------కాలవరమే కాపురముగా గలవారు.ఇరువురు

(ఈఖాళీలలోని అక్ష్రములు కనబడుటలేదు) పెద్ద సంసారమునకు జాలినంతయున్నవారు. శ్రీ ఉప్పులూరి రామజోగన గురుముఖమున సంస్కృతాంధ్రములు చదువుకొని నిసర్గజమైన కవిత్వ ధోరణిని బెంపు చేసికొనిరి.

తిరుపతి వేంకట కవులతో రామమూర్తి శాస్త్రిగారికి మంచి మైత్రి. విశేషించి, వేంకట శాస్త్రిగారితో బాంధవము. చెళ్ళపిళ్ళకవి రామమూర్తిశాస్త్రి కడనే తఱచు ఔషధసేవ చేయుచుండుట యలవాటు. 1902 లో వేంకటకవి కనారోగ్య మేర్పడి పోలవరము వెళ్ళి మందు సేవించుచు రెన్నెలలు నిలువయుండెను. శాస్త్రిగారి 'జాతకచర్య' యీవిషయమును దారకాణించుచున్నది. అప్పుడు తిరుపతివేంకటకవుల దేవీభాగవత రచన సాగుచున్న సమయము. నవమస్కంధ్రీకరణము పీఠికలోని యీపద్యము లీ పూర్వోత్తర సందర్భమును బూసగ్రుచ్చినట్లు ముచ్చటించుచున్నవి:


గీ... ... ... ... ... ... ...

ప్రథిత చరకాది వైద్యశాస్త్రప్రవీణు

డమలమతి రామమూర్తి నామాంకితుండు.


క. తిరుపతి వేంకట కవులం

దిరువురిలో నొకడు వేంకటేశ్వరకవికిన్

జిరజీర్ణ కృఛ్ఛ్ర రుజమును

సరసౌషధముల నొసంగి సాధించె వడిన్.


గీ. శ్రీలలితమైన యట్టి మాపోలవరము

నందు మానద్వయం బుండి యౌషధంబు

పుచ్చుకొనియెను వేంకట బుధుడు మాకు

మువ్వురకు నేస్తమయ్యె నప్పుడు దృడముగ.


క. నీరుజుడై విశ్వాసము

ప్రేరేపన్ జెళ్ళపిళ్ళ వేంకటకవి మా లో రామమూర్తి గుణసం

భారము వాక్రుచ్చె నొక్క మత్తేభమునన్.


వ. అది యెట్లంటేని -


మ. కవిత న్నైపుణిగాంచి చక్క జతురంగంబాడగా మించి, గా

న విధిం బద్యములం బఠింపదగు విన్నాణంబు నార్జించి వం

శ వశంబై యెడ బాయకున్న దగు భైషజ్యంబునం జక్రవ

ర్తివినై యొప్పితి రామమూర్తి ! శమితార్తీ ! కీర్తికి న్మూర్తివై.


ఉ. ఈవును గృష్ణమూర్తియును నేకముగా నొకచో బఠించుచున్

భావము కబ్బ మొక్కగతి భాసిలు మిత్రులు మీర లిర్వురున్

గావున నిచ్చవచ్చు నొకస్కంధముజూచి తెలుంగు సేయుడీ

దేవీచరిత్ర మందు భవదీయ గుణొన్నతి వెల్లడిల్లెడున్.


అని వేంకటశాస్త్రిగా రనురాగముతో నీ రామకృష్ణులకు నవమస్కంధము నాంధ్రీకరింప నిచ్చిరి. ఆ కవులకు మెచ్చు వచ్చునటులు వీరాస్కంధము తెనిగించిరి. " ఇ కృతివరంబు, తెలుగుసేయుచు రామమూర్తియును నేను రామకృష్ణులమైనవారము కలయిక" అని స్కంధాదిని వీరు వ్రాసికొన్నటుగా నీ కృతి రచనమునందు మాత్రమే యీ కవ యిటులు కూడినది. దీనికి ముందుగాని, వెనుకగాని, వీరుజతగా విరచించిన గ్రంథము లేదు. ప్రత్యేకముగా, కృష్ణకవి 'కీచకవధ' యనునాటకమును రచించెను. రామమూర్తి 'స్వప్నానసూయ' కావ్యము సంతరించెను.


1929 లో సహపాఠి స్వర్గస్థుడైన తరువాతనే రామమూర్తిగారు స్వప్నానసూయ రచన 1936 లో గావించెను. పాలకొల్లువాస్తవ్యుడు శ్రీకృష్ణ భారతకృతిభర్తయు [కర్ణ-శల్య-సౌప్తిక-స్త్రీ పర్వములు] నగు చుండూరి నారాయణరా వను వైశ్యవరుని కోరికపై పతివ్రతాధర్మ భరితమగు చరిత్రముతో స్వప్నానసూయ రచింపబడినది. కృతిభర్త రామమూర్తికవికడకు వచ్చి సమ్మదాశ్రు పూరిత నయనయుగళుడై


ప్రతినదరమణీయము రం

జిత కమనీయార్థ గుణవిశేషము భవ ద

ద్భుత కవితాగుంఫన మో

కృతమతి ! నీ వెట్టి పరమ కృతకృత్యుడవో!


అనిప్రార్థించి యీ కావ్యము తన ధర్మపత్ని పేర వ్రాయ గోరును. నిర్దుష్టము, భావరసపరిపుష్టము నగు నందలి కవితాసృష్టి యిటులుండును. ఇవి సీతాపాతివ్రత్యప్రభావ వర్ణనములోని పద్యములు.


సీ. అడ్డులే కొకపల్కు నాడింపలేదయ్యె

బ్రాజ్యదై తేయ సామ్రాజ్యలక్ష్మీ

కనుగొననైన గన్గొన జేయలేదయ్యె

భువనరమ్య కుబేర పుష్పకంబు

మాఱుమొగంబేని మరలింపలేదయ్యె

గంభీర దశకంఠ గౌరవంబు

ఒకపాటి తలనైన నూపింపలేదయ్యె

నతి రౌద్రతర చంద్రహాసధార

యద్దిరా! నిర్భర ప్రణయ ప్రపుల్ల

రామచంద్ర పదాంభోజ రాగ భరిత

చరిత యగు సీత సౌశీల్య సద్గుణ ప్ర

తాప మహిత పతివ్రతాత్వ ప్రశస్తి.

     *       *        *

సీ. ఒనర నాగేటిచాలున నయోనిజ యయి

పొడమె నీబోటి యన్ బుద్ధిగాదు

జనక నామక మహా చక్రవర్తి కుమారి

యనియెడు గౌరవంబునను గాదు తులలేని త్రిభువన దుర్లభ సౌందర్య

విభవంబు గలదన్న వేడ్క గాదు

వివిధ విభ్రమ కళా విష్కృతాత్యద్భుత

చాతుర్యవతి యను ప్రీతిగాదు


ప్రేమతత్త్వజ్ఞడైన శ్రీరామమూర్తి

సీతయెడ నట్టి కూరిమి సేత యరయ

ధర్మసతి యంతరంగంబు మర్మ మెఱిగి

కాని, వేఱొండు కతమున గాదు నూవె!


రామమూర్తిశాస్త్రిగారికి 1944లో సప్తతి పూర్తి మహోత్సవసన్మానము గావింప బడినది. ఆసందర్భమున శ్రీ చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రిగారు వ్రాసిన పద్యములలో నీక్రిందివి పారాయణము చేయదగినవి.


మ. ఇతడస్మత్కులు డంతె, శిష్యగణమందేవాడునుం గాడు, తి

ర్పతితోపాటు కవిత్వపున్ రచనలో భాగస్థు, డేతస్మహా

మతిసోదర్యుడొకండు శిష్యుడగుట న్మన్నించి దీవింప న

ర్హత నా కున్నది, వృద్ధు డీత డగుతున్ భ్రాజిష్టుడున్ జిష్ణుడున్.


చ. తిరుపతి శాస్త్రి దక్క గణుతింపని నే నితనిన్ గణించి మా

విరచన నున్న భాగవతవీధిని జోటు నొసంగినట్లు ధీ

వరమణు లెల్లవా రెఱుగు వారలె, వా కొననేల! దీనికిన్

దిరుపతిగూడ నొప్పుకొనె దేవునిసైత మతండు మెచ్చునే?


చ. తిరుపతి యొండె వెంకనయొ తెల్గొనరింపక దంటకూడదు

స్తరమని యెంచి వేఱొక భిషక్కునకున్ స్థలమీరు, రామమూ

ర్తి రసికు డౌటచే నతని తేకువ తా గ్రహియించి వేంకటే

శ్వరుడిడె జోటు తిర్పతియు సమ్మతి జూపె యథార్థమింతియే. చ. నలువురనోళ్ళలో బడుట నచ్చదువో మనరామమూర్తి కి

య్యలఘుని యుత్సవంబునకునై తలపెట్టితి రుత్సవంబు మీ

రలు మహనీయ లీతడు భరంబని మీసభ కేగుదేర సి

గ్గిలి యెట డాగునో, తెలిసి కేల్గన పట్టుక నిల్పు డెట్టులో.


ఉ. ఈయన నూత్న నాగరక తేచ్ఛకు లోగెడివాడె యైనచో

బాయని కీర్తితోడ నిరపాయపు రాబడి పోల్వరంపు జూ

చాయల వేలు లక్షలును సాగుచు మ్రొక్కుచు దాండవించు, నే

మాయయు మర్మమున్ సలుపు మాటలతో బనిలేదు లేశమున్.


గీ. ఈతనికి నాకు వియ్యంబు నెనయుకోర్కి

గలిగియుండెను లే వయ:కాలమందు

కైతలో సప్డు ఘటియించె గడమలోటు

మనుమరాలు శ్రీమతి ద్వారమున ఘటించె.


ఇన్ని పద్యము లిటులు చెళ్ళపిళ్ళ కవివి యుదాహరించుట యెందుల కనగా, వీరిర్వుర హృదయ బంధుత లిట్టి వని చదువరులకు దెలుపుటకే. వాస్తవమున కొకమహాకవిచే మెచ్చబడుటయే ఘనతకు గారణముకాదు. అసలు, రసికమానసములూ పగల శక్తి యేదేని రచయితలో నండవలయును. అదికొంత రామమూర్తిశాస్త్రిగారి స్వప్నానసూయలో గనబడుచున్నది. ప్రధానమైన వైద్య వృత్తిలోనే యుండిపోయి, యధాలాభముగా గవిత వ్రాయుచుండుట జరుగుటచే గాబోలు, వీరిపద్యములు తెనుగునాట హెచ్చుగా నల్లుకొనలేదు. ఈసంగతి వారుకూడ గుర్తింపలేకపోలేదు.


నా పాండిత్యము నాకవిత్వరచనా నైపుణ్యముం గాంచి మీ

రీపాటన్నను సత్కరింపరనియే యేనెంతు ; నొక్కింత యే

దో పేరున్నది నాకుదేశమున నాయుర్వేదమం, దద్దియున్

మాపిత్రార్జితవృత్తియం చెఱిగి సంభావింపుడీ సోదరుల్!

                     ________________