ఆంధ్ర మహనీయులు/విశ్వనాథనాయకుఁడు

విశ్వనాథనాయకుఁడు.

పదునేనవశతాబ్దాంతమున దక్షిణహిందూదేశమునఁ బ్రవర్థమానమై వెలుంగుచుండిన విజయనగరసామ్రాజ్యమును సాళువ నరసింహరాయలవా రప్రతిమాన ప్రతాపాధ్యులై పరిపాలనము సేయుచుండ నాచక్రవర్తికార్యకర్తలలో నొక్కండుగానుండి పే రెన్నికగాంచినవాఁడు కోట్యము నాగమనాయకుఁడు. పవిత్రపుణ్యక్షేత్ర మగుకాంచీపుర మీతని జన్మస్థానము. ఇతనిది కాశ్యపగోత్రము; బలిజ కులము. ఈ తెలుఁగునాయఁడు చక్రవర్తిసైన్యమున కధ్యక్షుడును, కార్యకర్తలలోఁ బ్రముఖుండును, తుళువవంశదీపకుండును నగునరసనాయనికిఁ జేదోడు వాదోడుగా నుండి సామ్రాజ్యముపట్ల వైరవభావముతోఁ బ్రవర్తించెడు చోళ పాండ్య రాజులపై నతఁడు దండయాత్ర వెడలినప్పు డాతనితోఁగూడ నుండి సామ్రాజ్యమునకు విజయవైభవముల సమకూర్చి మన్ననకుఁబాత్రుఁడైన నేస్తగాఁడు. ఇంతియ గాక సాళువ నరసింహరాయల మరణానంతరము సామ్రాజ్యము తుళువ వంశమువా రాక్రమించుకొనుటకుఁ బ్రయత్నించినపుడు సర్వవిధములఁ దోడ్పడిన దండనాథుఁడు. తన వంశ మున కీతఁడు గాంచినది యుపకృతిని మఱువక కృష్ణదేవరాయలు విశ్వాసపాత్రుఁ డయిననీతనియెడ నధికప్రేమను జూపుచుఁ దన 'తోషేఖానా' (ధనాగారము) కధికారిగ నియమించెను. కృష్ణదేవరాయలు విజనగరసామ్రాజ్యమునకుఁ బట్టాభిషిక్తుఁడు గాకపూర్వమె నాగమనాయఁడు తనకు సంతానము గలుగ లేదని పరితపింపుచు నూఱుదేవుళ్లకు మ్రొక్కుచు, పుణ్యయాత్రలు సేవింపసంకల్పించి, కాశీ క్షేత్రమున వెలసియున్న విశ్వేశ్వర దేవుని సందర్శింపవలె ననుమనోనిశ్చయముతో నొకనాడు తన మనోవాంఛితమును ప్రభువునకు విన్నవించి యాతనియనుజ్ఞఁ బడసి తనయుద్యోగ భారము నంతయు దన మిత్రుఁడైన రామభద్రనాయనిపైఁబెట్టి కాశీయాత్రకుబయలుదేఱి వెళ్లెను. అట్లు బయలుదేఱి సురక్షితముగా గొంతకాలమునకుఁ గాశీనగరముఁ బ్రవేశించి గంగను సేవించి గంగాస్నానమువలనఁ బునీతుఁడై విశ్వేశ్వరదేవునికి నమస్కరించి విధ్యుక్తవిధానములఁ బూజించి మరలి వచ్చినతరువాత గొంతకాలమునకు నీతనికొక్క కుమారుఁడు గలిగెను. ఈ కుమారుఁడు విశ్వేశ్వరుని వరప్రసాదమునఁ బుట్టినవాఁడను విశ్వాసముతో నీతనికి విశ్వనాథుఁ డని నామకరణముఁ జేసెను. ఈతనికి వయస్సు పెఱిఁగిన కొలఁది సుందరాకృతియుం దీనితోఁబాటు దేహబలధీబలమనోబలంబులు క్రమముగా వర్థిల్లుచున్నందునఁ దండ్రి సంతోషముతోఁ దగు విద్యనుగూడఁ జెప్పించెను. ఇతని కిరువదియేండ్లు రాకపూర్వమె యొకనాఁడు చక్రవర్తి కొల్వుకూటమునకుఁ గొనిపోయి యాయన సందర్శనభాగ్యమును లభింపఁజేసి యాయనకుఁ గృతప్రణాముఁ డగు నట్లుద్భోధించెను. ఆ సుందరబాలవిగ్రహమునుఁ జూచినతోడనే యతఁ డొకబలాఢ్యుఁడైన శూరశిఖామణియనియు, బుద్ధిమంతుఁడనియుఁ జక్రవర్తికిఁ దోఁచుటయె గాక రాజకీయపరిజ్ఞాతయై మున్ముం దింకను నభివృద్ధికి రాఁగలఁడను నూహతట్టి యాతని స్వకీయభృత్యునిగ గ్రహించి తమలపాకులు, వక్కలు నందించు సేవకావృత్తియందు నియోగించెను. ఇట్లు వినయనయభయభక్తులతోడ సార్వభౌముని సేవింపుచుఁ దనపుణ్యవిశేషమున నాతనిచిత్త మెపుడును తనయందే లీనమగునటుల ప్రవర్తింపుచుండెను. కృష్ణదేవరాయలు పూర్వ దిగ్విజయయాత్రకు బయలు వెడలినపుడు విశ్వనాథనాయఁ డాతనితోఁగూడ నుండి తనకు నియమించిన నెట్టిదుస్సాధ్యకార్యమునైన నవలీల శూరశిఖామణులు మెచ్చునట్లుగాఁ జేసి విజయమును గొనుచు సర్వజనసంశ్లాఘనకుఁ బాత్రుఁడగుచు వచ్చెను. ఈ దండయాత్రలో నీతఁడు సూపిన పౌరుషపరాక్రమములే 1520 వ సంవత్సరమున రాయల రాయచూరుదండయాత్రలో నొక సేనానిగఁ బాల్కొనుట సంభవింపఁజేసెను.

కృష్ణదేవరాయలవారు కటకము మొదలుకొని కన్యాకుమారిదాఁక దేశము లోపఱుచుకొని విజయనగరసామ్రాజ్యము నవక్రపరాక్రమముతో నేలుచు సుఖసత్కధావినోదములతో విజయనగరమునఁ బ్రొద్దుపుచ్చుచున్న కడపటి కాలమున నొక వింతసమాచారముఁ దెలియవచ్చెను. చిరకాలమునుండి దక్షిణహిందూదేశమున సుప్రసిద్ధములైన చోళ పాండ్యరాజ్యములవారు తమలోఁ దా మైకమత్యములేక నిరంతరము పోరాడుకొనుచున్నను దమస్వాతంత్ర్యమునుఁ గోల్పోవక పదునాలుగవశతాబ్దివఱకు నెట్టెటో నెట్టుకొనుచు వచ్చిరి గాని యా శతాబ్దిమొదట తురకలదాడికి నిలువఁజాలక తమ స్వాతంత్ర్యమును గోల్పోయిరి. వాటితోఁ దొల్లింటి వైభవలక్ష్మియుఁ దొలఁగిపోయినది. కాని యాశతాబ్దిమధ్యమున విజయనగరసామ్రాజ్యమునుఁ బరిపాలించు సంగవంశీయులైనరాజు లాతురకలను జయించి యారాజ్యముల రెంటిని తమ సామ్రాజ్యమునఁ గలుపుకొన్నవా రయినను, ఆరాజ్యములకు హక్కుదారు లయినపూర్వరాజవంశీయులనే రాజులనుగా నియమించి వారివలనఁ గప్పములఁ గొనుచుండిరి. అట్లే కృష్ణదేవరాయలకాలమునాఁటివఱకు జరుగుచు వచ్చెను. వీని కడపటికాలమున మధురాపురము రాజధానిగఁ బాండ్య దేశము నేలుచున్న చంద్రశేఖరపాండ్యుని పైదండెత్తి తంజాపురము రాజధానిగఁ జోళరాజ్యము నేలు వీరశేఖరచోళుఁడు పాండ్యుని జయించి వానిరాజ్య మాక్రమించి వానిని రాజ్యమునుండి వెడలుగొట్టి తానే రెండు రాజ్యములను బరిపాలనముసేయ సమకట్టెను. అట్లు రాజ్యమునుఁ బోగొట్టుకొన్నవాఁడై చంద్రశేఖరపాండ్యుఁడు విజయనగరమునకుఁ బాఱివచ్చి రాయలపాదములను దన కన్నీటిధార తోఁ దడుపుచుఁ దన దౌర్భాగ్యదశనంతయు నేకరువుపెట్టి "ఓమహాప్రభూ! సార్వభౌమా! 'దుర్బలస్యబలంరాజా' యను న్యాయము మీ రెఱుంగనిది కాదు; మాకు దిక్కు మీరు గాని యన్యులు గారు; ఏమియాజ్ఞ? యని మొఱలెత్తెను. వీని మెఱల నాలించి రాయలు జాలిగొని కోపోద్దీపితమానసుండై తన 'తోషేఖానా' కధికారి యైన నాగమనాయని రప్పించి వింటివా వీరశేఖరుని దుండగము? వీఁడు మనలఁ గాదని యలక్ష్యభావముతోఁ దిరస్కరించి బలాత్కారముగా పాండ్యరాజ్యము నొడిసిపెట్టి చంద్రశేఖరపాండ్యుని సాగనంపి రాజ్యము నేలుచున్నవాఁడఁట! నీవు తత్క్షణము మాయాజ్ఞ శిరసావహించి తగుసైన్యముతోఁ బోయి యా దుండగీని శిక్షించి వీనిరాజ్యమును వీని కిప్పించి చోళరాజ్యమును మాకుఁ బ్రతినిధిపాలకునిగా మఱియొకరిని నియమించి సామ్రాజ్యమునకుఁ జెల్లింపవలసిన కప్పములను, దారిబత్తెముల మీకగుఁ వ్రయమునంతయు రాఁబట్టి రాజ్యమున శాంతినెలకొల్పి రావలయునని యాజ్ఞచేసెను. అపుడు సార్వభౌమునియాజ్ఞ శిరసావహించి నాగమనాయఁడు చంద్రశేఖరపాండ్యుని వెంటఁగొని రెండువేలయాశ్వికులను, ఆఱువేలపదాతులను దోడుచేసికొని పాండ్యరాజ్యముపై దండయాత్ర వెడలెను. తొలుత నాగమనాయఁడు తంజూవూరికిఁ బోయి వీరశేఖర చోడుని నోడించి వానిని శిక్షించి వాని రాజ్యమును దాను వశపఱుచుకొని మధురాపురముపైకి పోయి చోడునిఠాణాలనుఁ దఱుమఁగొట్టి యారాజ్యమునుఁ గూడ వశపఱుచుకొని రాయలయాజ్ఞ నుల్లఘించి చంద్రశేఖర పాండ్యునికి రాజ్యము నొసంగక రెండురాజ్యములనుగూడఁ దానే పరిపాలనము సేయుచుండెను. అంత నాగమనాయని చర్య కచ్చెరువందుచు చేయునదిలేక నిరుత్సాహుఁడై పాండ్యుఁడు మరల విజయనగరమున కేతెంచి రాయలకు యావద్వృత్తాంతము నివేదించెను.

అంతట రాయ లాశ్చర్యమునుజెంది "ఇది యేమి చిత్రముగా నున్నది! నీవు మా యాజ్ఞాను నెఱవేర్పక పాండ్యునిరాజ్యము పాండ్యునికీక నీవే యపహరించి పరిపాలించుచున్నావు. ఇట్లు చేయుమని నీకాజ్ఞ నొసంగి యుండ లేదే! ఈ యాజ్ఞాపత్రమునుఁ జూచికొన్న వెంటనే పాండ్యరాజ్యమును పాండ్యుని కిచ్చివేసి మాసన్నిధానమునకు రావలసినది." అని యొక యాజ్ఞాపత్రమును వ్రాయించి పంపించెను.

ఇట్లు పంపించిన యాజ్ఞాపత్రమును జదివించుకొని విని మరల తా నీక్రింది విజ్ఞప్తిని బంపుకొనియెనఁట.

"దేవరవారియాజ్ఞ నుల్లంఘించుటకు నే నెంతవాఁడను; నావిషయమై దేవరవారికి విన్నవింపఁబడిన విషయము లన్నియు సత్యములు గావు; నేను పాండ్యరాజ్యముఁ జేరునప్పటికి రాజ్య మంతయు నరాజకమై యుండెను. ఇంతకుఁబూర్వము చంద్రశేఖరపాండ్యుఁడు రాజ్యముచేయునపుడుకూడ నరాజకముగనే యుండెనఁట! రాజ్య మరాజకముగ నుండుటచేతనే వీర శేఖరచోడుఁ డీ రాజ్యము నాక్రమించెను. ఇందుకుఁ గారణము పూర్వపురాజున కీతఁ డౌరసపుత్రుఁడుగాక యుంపుడుగత్తె పుత్రుఁ డగుటవలన నీరాజ్యమునందలి ప్రభువులును, ప్రజలును నీతని పాలన మంగీకరింపక నలుప్రక్కల స్వతంత్రసీమల నేర్పాటుచేసికొని పాలన సేయుచుండిరి. ఈ కారణమున వీరశేఖర చోడుఁడు మంచిసమయము దొరికినని వీనిపై దండెత్తి వచ్చి యీ రాజ్యము నాక్రమించి వీని నావలకుఁ బాఱఁదోలినవాఁడు. నేను వచ్చి దేశములోని యరాజకము నడచి నా స్వంతద్రవ్యము నెంతో వెచ్చించి రాజ్యమునంతయు స్వాధీన పఱచుకొని దేశమున శాంతిని నెలకొల్పి కొంతకాలమయిన దేశము నెమ్మదిగానుండఁగోరియు, ఇందుకై నేను వెచ్చించిన ద్రవ్యమును మరల రాబట్టుకొనువఱకు రెండురాజ్యములను నేనే పరిపాలింపఁ గోరియు నీ దేశమున నిలిచియున్నాను గాని మఱియొక కారణముచేతఁ గాదు. వీనికి రాజ్యము నొప్పగించినను సామర్థ్యముతో బరిపాలించుశక్తి యీతనికి లేదు. మరల దేశము నరాజకము పాల్పఱచుటయెగాక కప్పము రూమునఁ చెల్లింపబడుచున్న ద్రవ్యమును గోల్పోవలసివచ్చును. ఏతన్మూలమున సామ్రాజ్యమునకు ద్రవ్యనష్టము గూడ సంభవించును. ఈ పాండ్యరాజ్య మరాజకముగ నుండినఁ దక్కిన రాజ్యములుగూడ నరాజకములై చెడిపోఁగలవు. అపుడు సామ్రాజ్యభారము దుర్భరమై గోటితోఁ దునిమినఁ బోగలి గినదానిని గొడ్డళ్ళతోఁ దునుమవలసివచ్చును. మహాప్రభూ! నేను చేసినద్రోహ మేమియును లేదు. నే నింతవఱకు నాజీవితము సామ్రాజ్యసేవయందే గడిపి కష్టపడి యున్నవాఁడను గావునఁ గొంతలాలమయిన సుఖపడ నభిలషించుట తగదా? ఈరాజ్యాభివృద్ధికై నా ద్రవ్యమంతయు వెచ్చఁ బెట్టియున్నాను గనుక నాద్రవ్యమును రాఁబట్టుకొనునంతవఱకు నిచటనేయుండి సామ్రాజ్యమున కేవిధమయిన నప్రఖ్యాతియుఁ ద్రవ్యనష్టము గలుగుకుండఁ బరిపాలనముచేసి నేను జేయవలసినకార్యముల నన్నిటిని నెఱవేర్చుకొని దేవరసాన్నిధ్యమునకు దేవరవారి యాజ్ఞాప్రకారము వచ్చుచున్నాను. ఇప్పుడే దేశమును విడిచి వత్తునేని నా ద్రవ్యమునంతయు నేను గోల్పోవుటమాత్రమె గాదు. ఈ దేశమంతయు నరాజకమై యల్లకల్లోలము గాఁ గలదు. తరువాత దేవర చిత్తమువచ్చినట్లు గావింపుఁడు."

ఈవిజ్ఞాపనముఁజదువుకొన్నమీఁదట గృష్ణదేవరాయలు తోకఁ ద్రొక్కఁబడిన త్రాఁచువలె లేఁచి "ఔరా! నాగమనాయఁ డెంతపనిచేసెను. నమ్మించి స్వామిద్రోహమునకుఁ గడంగెను; ఇంకనేల వీని మన్నింపవలయును; ఈద్రోహి తలఁబట్టి యీడ్చుకొని రాఁ గలిగినవీరపురుషుఁ డెవ్వఁడయిన నీ దర్బారులో నుండెనా యని ప్రశ్నింపుచుఁ గొల్వుకూటము నంతయుఁ దేఱిపాఱఁజూచెను. అందఱు నివ్వెఱపడి చూచు చుండ నాగమనాయనికుమారుఁడే విశ్వనాథనాయఁడు నువ్వెత్తు గలేచి 'అహో! మన ప్రభూ! దేవరవారియుత్తరు వైనయెడల నిదెపోయి నాగనాయనిఁ గొనివచ్చుచున్నా' నని తడువుకొనక ప్రత్యుత్తర మిచ్చెను. సభ్యులెల్లరు విశ్వనాథనాయని ధైర్యసాహసముల కబ్బురపడసాగిరి. "ఓహో! నాగమనాయని కుమారుఁడవా? ఇదే సందుగాఁ జేసికొని నీతండ్రిని నీవు గలియఁగోరి మాయాజ్ఞనడుగుచున్నావా?' అని యధిక్షేపించెను. అంత విశ్వనాథనాయఁడు "దేవరవారిసొమ్ము తినుచున్న నాకు దేవరవారికార్యము ప్రధానముగాని నాకు తండ్రియెక్కువకాదు." అని ప్రత్యుత్తరము పలికెను. రాయలచ్చెరునందుచు మాఱుపల్కక మౌనము వహించెను. అంత నాతని మౌనమే యంగీకారసూచనగా గ్రహించి రాయల రాణువ తోడ్పాటుగొనక తనస్వాధీనమున నున్నసైన్యమునేగొని తనప్రతిజ్ఞ తీర్చుకొనుటకై పాండ్యరాజ్యమీదికిఁ బోయెను. అట్లు విశ్వనాథనాయఁడు మధురాపురము సమీపమునకుఁ బోయి యొక విశాలమైనప్రదేశమున దండు విడిసి తన తండ్రి కిట్లు జాబు వ్రాసి పంపెను.

"మీరు రాయలవారి యుత్తరువును దిరస్కరించి స్వతంత్రముగాఁ బ్రవర్తించుచున్నారు. మిమ్మును తలకొట్టి తెమ్మని యుత్తరు వైనది. అయిన నేమాయను. ఇంతటనైన నుపేక్ష వహింపక పాండ్యుని పాండ్యరాజ్యమునకుఁ బట్టముగట్టి మీరు రాయలవారి సాన్నిధ్యమునకు వచ్చిన యెడల వారితోఁ జెప్పవలసినవిధముగాఁ జెప్పి వారి యాగ్రహము ముడివ రక్షించునటుల ప్రయత్నింతును రండు." ఈ జాబు అందినవెంటనే నాగమనాయఁ డాశ్చర్యమును జెంది కుమారునికి రాయలయెడఁగల భక్తివిశ్వాసములుఁ దలపోసి తనలోఁ దాను మెచ్చుకొనుచు నిట్లు ప్రత్యుత్తర మంపెను.

"కుమారా! నావలె నీవును సామ్రాజ్యమునకు శత్రువులయినవారిని సాధించి సామ్రాజ్యమును విస్తరింపఁ జేసినావు. రెండుతడవులు సామ్రాజ్యము చిక్కులపాలఁ బడినపుడు నిలువఁబెట్టినాము. నీ వెట్టియుపకారము చేసినను దానివలనఁ గలిగిన ఘనత నన్నుఁగూడఁ జెందవలయును గదా! రాయలు మనపట్ల విశ్వాసముగలవాఁ డయినపుడు పాండ్యరాజ్యమును నొక దాసీపుత్రుఁ డనుభవించిన నాయనకు గలిగెడు లాభమేమి? మన మనుభవించినఁ గలిగెడు నష్టమేమి? నేను విశ్వేశ్వరుని గూర్చి తపస్సుచేసి నిన్నుఁ గని యా దేవదేవుని పేరే నీకు పెట్టి యున్నాను. నీ వొక్కండవే నా కుమారుఁడవు. నాతో నెందుకు యుద్ధమొనర్తువు? ఈ రాజ్యనిర్మాణమంతయు నీ కొఱకేగాని నానిమిత్త మెంతమాత్రమును గాదు. నీవు రాయలను విడిచి నాతో నుండుము.

ఈ ప్రత్యుత్తరమును జదువుకొని విశ్వనాథనాయఁడు మరల యిట్లు సమాచార మంపెను.

"మీరుచేయునదిస్వామిద్రోహము. మిమ్మునమ్మిసమస్త భారము మీ పైని పెట్టిన ప్రభువును మోసపుచ్చి రాజ్యముఁ గట్టుకొని ద్రోహి నాకు తండ్రియని సహించి యపకీర్తి భరిం పఁజాలను. మీరు నాకు తండ్రిగాదు. నేను మీకుమారుండను గాను. మీరు సంపాదించిన రాజ్యముతో నాకుఁ బనిలేదు. నా మాట విని మీరు నాతోడ వచ్చెదరా మీకును నాకును శ్రేయస్సు కలుగును. మీ ప్రాణములకు భయములేకుండఁ జేసికొన వచ్చును. ఒకవేళ మీరు యుద్ధమునకే సంసిద్ధులయిన యెడల మీకు దైవము జయము సమకూర్పఁడు. ఏవిధమున నైన నా ప్రతిజ్ఞను నేను నెఱవేర్చుకొని పోదునుగాని మీరు తండ్రు లని మన్నించి విడిచిపెట్టువాఁడను గా నని తెలిసికొని మఱి ముందుకు సాగుడు. మిమ్మును సజీవముగ రాయలవారి సాన్నిధ్యమునకుఁ గొనిపోవుటయే నేను సకలసామ్రాజ్య మేలుటగా భావించుకొనువాఁడను."

ఇట్టి పల్కులు చెవి సోకఁగా నాగమనాయఁడు కటకటం బడుచు 'ఆహా! నాదురదృష్టము! పుత్రబిక్ష పెట్టుమని విశ్వనాథునిఁగూర్చి తపస్సు చేసినందుకు నా మహాదేవుఁడు తనపై కత్తిచేపట్టు కుమారునిఁ బ్రసాదించెగదా' యని దుఃఖపడి తుదకు ధైర్యము తెచ్చుకొని 'ఇట్టికొడుకు బ్రదికియుండియుఁ జచ్చినవానితో సమానుఁడే యని తలపోసి యెట్టకేలకు నర్జునుఁడు బబ్రువాహనునితోఁ బోరాడినవిధమును స్మరించి వానితో యుద్ధముచేయుటకే నిశ్చయించుకొని రాణువకూర్చుకొని యుద్ధసన్నద్ధుఁ డయ్యెను. ఈ రీతిగాఁ దండ్రికిఁ గొడుకునకు మహాభయంకరమైన యుద్ధము జరిగెను. ఇట్లు మహాఘోరముగా జరుగు సంకులసంగ్రామమున వృద్ధసేనాని నాగమనాయఁడు పట్టువడి విశ్వనాథనాయని కడకుఁ గొనిపోఁబడియెను. అప్పుడు కుమారుఁడు తన తండ్రి సజీవుఁడై యుండఁ బట్టువడుట తన యదృష్టముగా భావించి సంతోషముతో నతని నొక యంబారీమీఁద నెక్కించి వానిచుట్టును తనపారాకడాయించి విజయనగరమునకుఁ గొనిపోవుచు యావద్వృత్తాంతమునుఁ బూసగ్రుచ్చినటుల యొక జాబులో లిఖించి ముందుగా నాలేఖను రాయలవారికిఁ బంపించెను. కృష్ణదేవరాయలవా రాలేఖను గాంచి యపరిమితానందమునుఁ జెంది యానాఁడు సేనానాయకుల నెల్లరను రప్పించి వారలతో నిట్లు పలికెను.

"విశ్వనాథనాయఁడు స్వామికార్యము నెట్లు నిర్వహించుకొని తనప్రతిజ్ఞను మఱువక తనతండ్రిని సజ్జివునిగాఁ జెఱపట్టి దర్బారునకుఁ గొనివచ్చు చున్నాఁడో విన్నారు గదా? నాఁడు మీ రెల్లరును నాగమనాయనికి వెఱచి యీ మహాకార్యము నిర్వహింప శక్తి చాలనివార మని చెప్పఁగా యువకుఁ డగువిశ్వనాథనాయఁడు తాను నిర్వహింతునని లేచినపు డాతఁ డెందఱపరిహాసములకుఁ బాత్రుఁడు కాలేదు? ఇతరులప్రశంస యెందుకు? మాకే సంశయము కలిగినది. ఇదిగో నేఁ డతఁడు మాపేరవ్రాసి పంపించినజాబు".

అని యాజాబును దనకొల్వుకూటమున నున్న వారి కెల్లరకుఁ దెలియునట్లుగాఁ జదివింపఁ జేసెను. ఎల్లవా రాశ్చర్య నిమగ్నులైరి. ఇతఁడు మనుష్యమాత్రుఁడుగాఁ గన్పట్టఁడు. కేవలము విశ్వనాథుఁ డీరూపమున నవతరించి యుండఁబోలు" నని బహువిధముల నాతని శ్లాఘించిరి. కృష్ణదేవరాయలవారు తనసంతోషమును బట్టజాలక యిరుబుజములు పొంగిపోవుచుండ "ఓహో! ఇటువంటి బంటునకు నేలికనై యుంట నేను ధన్యాత్ముఁడ నగుటచేతనేగదా సంభవించెను! మీవాక్కులు నిక్కువములు. ఆతఁడు మనుష్యులలోఁ బరిగణింపఁ దగినవాఁడు గాఁడు. ఇతఁ డొకనాడు అడవి దున్నపోతును నఱకి నాప్రాణమును రక్షించినవాఁడు. ఇటువంటి మహాపురుషునిచేత నింకఁ గొలువు చేయించుకొనుట మహాదోషముగాఁ గన్పట్టుచున్నది. ఈతని కెదియైన రాజ్యము నొసంగి నాతో సమముగాఁ గూర్చుండబెట్టికోఁ దగినవాఁ డని మనంబునకు దృఢముగాఁదట్టుచున్నది." అని స్పష్టముగా నిండుకొల్వున బలికెను. అంత సభవా రిట్లేకగ్రీవముగాఁ బలికిరి.

"స్వామీ! విశ్వనాథనాయనికి రాజ్యపేక్ష లేదు. ఉన్నచో నాతఁడు తండ్రితో నేకమై మన మీఁదికి దాడిచేసియే యుండును. అపుడు వారిని మనము జయించుటయు సుసాధ్యము గాకుయుండును. అతఁడు విశ్వేశ్వరాంశ సంభూతుఁడు గనుకనే విద్వౌసపాత్రుఁడై స్వామికార్యమును నిర్వహించుకొని వచ్చు చున్నాఁడు. ఈ కలికాలమున నిట్టి వీరకృత్యములను వినఁజాలము, కనఁజాలము. తలపోసినకొలఁది మా కెంతయు నచ్చెరువు గలుగుచున్నది. దేవరవారు సర్వజ్ఞమూర్తులు. తమకుఁ దెలియనియంశ మేమి గలదు. దేవరచిత్తము వచ్చినట్లు గావింపుఁడు." ఇట్టి సంభాషణము జరిగినవెనుకఁ బదిదినములకు విశ్వనాథనాయఁడు స్వసైన్యములతో విజయనగరముఁ బ్రవేశించి తనతండ్రి యైన నాగమనాయనిఁ గొనివచ్చి రాయలవారి యెదుట నిలువం బెట్టెను.

అపుడు కృష్ణదేవరాయలవా రాగ్రహమునుఁ జూపక మందహాసముసేయుచు 'ఓయీ నాగమనాయఁడా! నీవు స్వామి భక్తిపరాయణులలో నగ్రగణ్యుడవని మేము విశ్వసించి చంద్రశేఖరపాండ్యునిరాజ్యము వీరశేఖరచోడుఁ డాక్రమించినందున వానిజయించి పాండ్యరాజ్యమును చంద్రశేఖర పాండ్యుని కొసంగి పాండ్యరాజ్యమున శాంతి నెలకొల్పి రావలసినదిగా మే మాజ్ఞాపింప విశ్వాసఘాతకుఁడవై పాండ్యరాజ్యమును పాండ్యునికీక చోళపాండ్య రాజ్యముల రెంటిని నాక్రమించి నీవే యేలుటకుఁ బ్రారంభించి మాపై కత్తిగట్టఁ బ్రయత్నించిన వాడని నిదియేమి యాగడ'మని హెచ్చరించెను.

అంత నాగమనాయఁడు రాయలవారి కిట్లు విన్నవించు కొనియెను.

"స్వామీ! నేను చేసిన మహాపరాధ మేమియును లేదు. మీ తండ్రిగారు పాండ్యరాజ్యమును మా --------- కుదునయుంచినారు. అప్పటినుండి పాండ్యరాజ్యమునుండి తగిన రాబడి వచ్చుటకై మాస్వంతద్రవ్యములతో వ్రయపెట్టి నష్టపడియున్నాము. ఇదిగాక యిప్పుడు దేవరవారు చోళరాజునుఁగొట్టి పాండ్యరాజునకు రాజ్యమిమ్మని సెలవు దయచేసి నారు. ఈ మహాకార్యమును నిర్వహించుటకై దేవర పంపినద్రవ్యము చాలక నాస్వంతద్రవ్యమునుకూడ విశేషముగా వ్రయపెట్టి యున్నాను. ఇట్లెంతో శ్రమపడి చోళుని జయించి పాండ్యరాజ్యమును పాండ్యునికిచ్చి పట్టాభిషిక్తుని గావింపఁ బూనితిని గాని, చంద్రశేఖరపాండ్యుఁడు నా కడకు వచ్చి ఈ వీరశేఖరచోడుని జయించుట తమ కొక్కరికే సాధ్యపడినదిగాని యితరులకు సాధ్యపడునది కాదు; ఇప్పటికిని రాజ్య మరాజకముగనే యున్నది. చోళుఁడు పాండ్యరాజ్యము జయించినాఁ డనుమాటయె కాని రాజ్యములోని గ్రామము లన్నియు వానిస్వాధీనమునకు రాలేదు. ఆకాలమున గ్రామములన్నియు నెట్లు స్వతంత్రముతోఁ బ్రవర్తించినవో చోళునికాలమునఁగూడ నట్టిస్వతంత్రముతోనే ప్రవర్తించుచున్నవి. అయినను మాశత్రువునుఁ గొట్టి రాజ్యమును స్వాధీనపఱుచుకొన్నారు. ఇదియె మాకు పదివేలు. నాకు సంతానము లేదు. ఉన్న వారందఱు నుంపుడుకత్తెకొడుకులు. నాజీవ మున్నంతవఱకు మర్యాదగాఁ గాలక్షేపము చేయుట కన్నవస్త్రాదులకు లోపము లేకుండ నిచ్చి నా యీ రాజ్యము నా పగవాఁ డైనచోళరాజునకుఁ జెందనీక నా పేరుమీఁదుగా మీరే యీ రాజ్యమునుఁ బరిపాలించుకొనుచుండినఁ జాలు" నని చెప్పియున్నాఁడు. అప్పు డీ రాజ్యాలు రెండు నరాజకముగా నుండియుండుటచేత నా ధనము విశేషముగా వినియోగించి యల్లరుల నడంచి శాంతి నెక్కొలిపి రాఁబడి వృద్ధిచేసి సకలవిధముల రాజ్యమును బందోబస్తూచేసిన వెనుక తమవద్దకు ఫిర్యాదు చేసికొనుటకు వచ్చినాఁడు." అని యావద్విషయములను విపులముగా విన్నవించి సత్యమును శ్రుతపఱిచెను. అటుపిమ్మట రాయలవారు చంద్రశేఖరపాండ్యుని గాంచి నిజ మేమని ప్రశ్నించెను. ఇదంతయు సత్యమే యని యతఁ దొప్పుకొనియు మర్యాదగా జీవనము జరపుకొనుటకు భంగము గలిగినది గావున దేవరవారితో మనవిచేసికొనవలసి వచ్చినదని మొఱవెట్టుకొనియెను. మొదటనే యిట్లేల చెప్పవైతి వని రాయ లాగ్రహము పడియెను. ఏమిచేసినను పాండ్యుని క్షమింపుఁడని విశ్వనాథనాయఁడు రాయలనుఁ బ్రార్థింపఁగా నాతఁడు క్షమించి యూరకుండెను.

"మహాప్రభూ! నే నింక నీపాండ్యరాజ్యమును బరిపాలింపఁజాలనని యూహించి నాగమనాయనికుమారుఁడైన యీ విశ్వనాథనాయనికి నారాజ్యమునుఁ బరిపాలించుకొమ్మని వ్రాసి యిచ్చినాను. ఇప్పటికి నామాట తప్పియుండ లేదు. ఈ రాజ్యమునకు విశ్వనాథనాయనివారిని ప్రభువును గాఁవించి పట్టముఁగట్టిన నాకునుఁ బరమసంతోషకరమె యగు" నని చంద్రశేఖరపాండ్యుఁడు రాయలతో విన్నవించుకొనియెను.

"తండ్రి యని యించుకయైన సంకోచింపక స్వామి కార్యమునుఁ బ్రధానముగాఁ దలంచి చెఱపట్టిగొనివచ్చి సమర్పించినవాఁడవు గనుక నిన్నుఁ జూచి మీతండ్రిని క్షమించి నారము. ఇఁక మీరింటికి పొం" డని రాయలు విశ్వనాథనాయని కుత్తరువు చేసెను. అంత విశ్వనాథనాయఁడు తన తండ్రిని చెఱనుండి విడిపించి యింటికిఁ దీసికొనిపోయి 'ఇఁక నేను మీ కుమారుఁడను; మీరు నాకు తండ్రులు; ఇంత పర్యంతము నేను మీకు శత్రువునుగాఁ బ్రవర్తించితిని; నన్ను క్షమింపు'మని శతవిధముల వేడికొని తండ్రిగారిని స్నానముచేయించి నూతనవస్త్రములనుఁ గట్టిపెట్టి బ్రాహ్మణ సమారాధనములను, దానధర్మములను గావించి సుఖముగా నుండునటుల చేసెను.

ఇటులు సుఖసంతుష్టుఁడైయుండి యొకనాఁడు నాగమనాయఁడు కుమారుని రప్పించి "నీవు రాజ్యము చేయవలయునను తలంపుతో నింతయెత్తు యెత్తినాను గాని మఱియొకటి గాదు. నాకు రాజ్యకాంక్ష లేదు. ఇంక నేను పరలోక సాధనమును జూచికొనియెదను. ఇంతవఱకు నేను సంపాదించిన ద్రవ్యమంతయు నున్నది. దీనిని తీసికొమ్ము. నీకు రాయలవారు రాజ్యము నిచ్చెదరు. చక్కఁగా నేలుకొమ్ము" అని పలికెను.

అంత నతఁడు "నాయనా! మీరార్జించిన ధనమును మీరే దానధర్మములు చేసికొని మీరే యనుభవింపుఁడు. నా కక్కఱలేఁదని ప్రత్యుత్తరము పలికెను. అందుకు సమ్మతింపక నాగమనాయఁడు తనపెద్దలు కూడబెట్టిన ధనమును, తా నార్జించినధనమునుఁ గూడఁ జూపించి దానినంతయు గైకొని సద్వినియోగమునకుఁ దెమ్మని కుమారునికి బోధిం చెను. విశ్వనాధనాయఁ డాధనము నంతయుఁ గాంచి యెట్లీతఁడింత ధనమార్జింపఁగలిగెనా యనియాశ్చర్యముఁ జెందెను.

ఇ ట్లచ్చెరువందుచున్న కుమారుని జూచి 'పుత్రా! ఈ మధురానగరము నాకిష్టదైవములగు మీనాక్షీసుందరేశ్వరులకు నిలయమై దివ్యస్థలముగాఁ బేరుగాంచి యున్నది. ఒకనాఁడా మీనాక్షీదేవి నాకు స్వప్నములోఁ గానుపించి నీకుమారుఁడు విశ్వనాథనాయఁడు నా సన్నిధానముననుండి యీపాండ్యరాజ్యమునంతయు నేలుటకు సమర్థుఁ డయి యుండు నని చెప్పియున్నది. ఈ యర్థమునంతయుఁ దీసికొనిపోయి పాండ్యదేశములోని దేవస్థానమునకును, తీర్థప్రదేశములలోని యేళ్ళుకుఁ గట్టు ఱాతిమెట్లకును ఇంక ననేకధర్మకార్యములకొఱకును వినియోగ పఱచినయెడల నాకు పరలోకసౌఖ్యము గలుగఁగలదని బహువిధముల బోధించెను. అటుతరువాత రాయలవారొకనాఁడు విశ్వనాథనాయనివారిని, పాండ్యుని రప్పించి పాండ్యునితో నిట్లు ప్రశంసించెను. "ఓయీ! నీకు సంతానము లేదనియు నుంపుడుకత్తెకును నొక్క కొడుకుమాత్రము గలడనియు, విశ్వనాధనాయనికి రాజ్యమొసంగుట సమ్మతమేయని చెప్పి యాయనకు పత్రము వ్రాసియిచ్చియున్నావనియుఁ దెలిపితి నైన నింకొకమా ఱడుగుచున్నాను. నీ యభిప్రాయమేమో స్పష్టముగా విప్పి చెప్పుము."

ఇట్లు రాయలు ప్రశంసించిన వెనువెంటనే చంద్రశేఖరపాండ్యుఁడు వినమ్రుఁడై లేఁచి సభాసదులెల్లరు విను చుండఁ దన యభిప్రాయమంతయు విస్పష్ట మగునట్లుగా 'మహా ప్రభూ! ఈ రాజ్యపరిపాలనము నావలన నగునది కాదని నే నెఱుంగుదును; ఒకవేళ నే నీరాజ్యమును కోరినా చోళరాజు నన్నుఁ బ్రాణముతో విడిచిపెట్టువాఁడు కాఁడు; ఇదియుఁగాక మాతండ్రితాతలకు నుంపుడుసంబంధాలవలనఁ బుట్టినవారు శ్రీవిల్లిపుత్తూరు, తెంగాశి, రాచపాళియము మొదలగుస్థలములలో నున్నవారు; వారు నన్ను తలయెత్తుకొననీయరు; నాగమనాయనివారు సయిత మన్నిస్థలములను సాధింపగలిగినారు. కాని యైదుస్థానములను సాధించలేకపోయినారు. ఇంతకు నా పగవాండ్రయిన చోళునకుగాని వీరలకుఁగాని రాజ్యము నొసంగక నాబదులుగా విశ్వనాథనాయనివారే యేలుకొనుట నాకు పరమసంతోషముగా నుండును. ఇపుడు విశ్వనాథనాయనివారు నాతండ్రివంటివాఁడు గావున నన్ను శత్రువుల బాఱిపడకుండ సంరక్షింపఁగలఁడు. నాస్థితినిబట్టి గౌరవమర్యాదలకు భంగములేకుండ నన్ను బోషించినఁజాలు' మమి విన్నవించుకొనియెను.

కృష్ణదేవరాయలవా రందులకు సమ్మితించి విశ్వనాథనాయనివారిని గాంచి యిట్లు పలికిరి.

ఇదివరకు నీవు మాకును, మా సామ్రాజ్యమునకును పెక్కులుపకృతులు గావించి యున్నావు. ఇంతియగాక మీ తండ్రిగారు మమ్మును లక్ష్యముసేయక మాయాజ్ఞను నిరాకరించినపుడు స్వామికార్యమే పరమ ధర్మమని యెంచి పట్టితెచ్చి యెదుటఁబెట్టి మా యుత్తరువు శిరసావహింతునని పలికినావు. ఇంతమేలుగావించిన నిన్ను మఱచుట మాకు శ్రేయస్సుగాదు. దైవమును దోడ్పడఁదు. పూర్వము మాఁకుపకారముచేసి మాదయను సంపాదించుకొన్నప్పుడు కొంత దేశమునకు ని న్నొక పాలకునిగా నియమింతు మని వాగ్దత్తముకూడ చేసియున్నాము. మఱియు నీపాండ్యరాజ్యము నీపరముగానుండి శాంతముగానుండినఁగాని నగరికి 'తోఫారూకలు' కూడా రావు. ఇంక నీవు పాండ్యరాజ్యమునకుఁ బోయి దేశమును 'బందోబస్తు'లో నుంచినఁగాని యనుకూలపరిస్థితు లేర్పడఁజాలవు. నీవుతత్క్షణమపోయి పాండ్య రాజ్యమున కాధిపత్యము వహించి యారాజ్యము నభివృద్ధికిఁ దీసికొనివచ్చుటయెగాక మాసామ్రాజ్యముపట్టున నిదివఱలోవలెనె భక్తివిశ్వాసములు చూపుచు యశస్సు నార్జించుటయె నీకు మేము చేసెడి యుత్తరు"వని చెప్పి యొప్పించెను. అంతట విశ్వనాథనాయనివారు దుర్గామహాదేవిని వెంటఁగొని దక్షిణమధురాపురమునకు వెడలునపుడు కృష్ణదేవరాయలవారు వానికి బహు సైన్యముల నొసంగి సాగనంపెను. అట్లు విశ్వనాథనాయనివారు క్షేమముతో మధురాపురముఁ జేరినవెనుక దేశమంతయుఁ బాడువడి యుండుటయు, కోటలు కొమ్మలు శిధిలావస్థయం దుండుటయు, దేవళములు సంరక్షణములేక వికలస్థితిఁజెంది యుండుటయు, రాజ్యమంతయు నడవులతో నల్లుకొనిపోయి దొంగల కాకరమైయుండుటయు, ప్రజలు మానప్రాణధనరక్ష ణలేక వ్యధలం బడియుండుటయుఁ గన్నులారఁ గాంచి మిక్కిలి విచారించెను. వీని నన్నిటిని జక్కపఱచి రాజ్యమును సౌభాగ్యస్థితికిఁ గొనివచ్చుటకు రాణువలోనిబొక్కసము చాలదని తలపోసి తనతండ్రి యొసంగిన ద్రవ్యమునంతయు నాతనియిష్టాను సారముగా వ్రయపఱచి సఫలీకృతమనోరథుఁ డగుటకు సంకల్పించి మిక్కిలి సమర్థుఁడయిన 'అరియనాధ మొదలారిని ముఖ్యమంత్రిగను, దళవాయిగ నేర్పఱచి కార్యసాధనకుఁ గడంగెను. ఇతఁడు విజయనగరసామ్రాజ్యపక్షమునఁ బ్రతినిధి పాలకుఁడుగ మాత్రమె నియమింపఁబడినవాఁడు గనుక చోళపాండ్యరాజ్యముల రెంటిని పాండ్యరాజ్యము పేరిటనే స్వతంత్రుఁడై పరిపాలనముచేసినను విజయనగరసామ్రాజ్యమునకు లోఁబడియె పరిపాలనము చేసినని మనము గ్రహింపవలయును. విశ్వనాథనాయఁడు రాజ్యపరిపాలనకు వచ్చినకొలదికాలమునకే చంద్రశేఖరపాండ్యుఁడు మృతిఁబొందెను. విశ్వనాథనాయని వారియాజ్ఞను శిరసావహించి దళవాయి అరియనాథ మొదలారియు, దళవాయి బిసపాకము కేశవప్పనాయఁడు ననువా రిరువురును చుట్టునుబురుజులు గలిగి యష్టద్వారములతో నొప్పెడు మధురాపురదుర్గమును బునర్నిర్మాణముఁ గావించుటయెగాక మీనాక్షిసుందరేశ్వరుల కోవిలలను సొగసుగా గట్టించిరి. మధురాపురమునంతయుఁ గలకలలాడుస్థితికిఁ దీసికొనివచ్చిరి. ఇట్టికాలమునఁ గృష్ణదేవరాయలవారు 1530 వ సంవత్సరమున విజయనగరములో స్వర్గస్థుడుకాఁగా నాయని తమ్ముఁ డచ్యుతదేవరాయలవారు విజయనగరసామ్రాజ్యమునకుఁ బట్టాభిషిక్తులయిరి. అప్పుడాయన తన మఱదలి పెనిమిటి యైన చెన్వప్పనాయనివారిని చోళ రాజ్యప్రతినిధిగా నియమించిరి గావున నప్పటినుండియు నారాజ్యము విశ్వనాథనాయని వారి పరిపాలనమునుండి తొలఁగిపోయెను. రాయలవారి యుత్తరువు ననుసరించి తిరుచునాపల్లె మధురరాజ్యమునకును వల్లము తంజాపురరాజ్యమునకును జేరిపోయినవి. ఆకాలమున తిరుచునాపల్లెకు సమీపమునఁ గావేరినది కిరుపార్శ్వముల నడవులు బలిసి దొంగల కునికిపట్టులై శ్రీరంగ మనుపుణ్యక్షేత్రమునకు వచ్చుచుబోవుచుండెడు యాత్రికుల కపాయకరములై యుండుటచేత విశ్వనాధనాయనివారియాజ్ఞ ననుసరించి దళవాయి కేశవప్పనాయఁ డా యడవులన్నిటిని భేదింపఁజేసి దొంగల నిలువరమునెల్ల నాశనము గావించి రక్షకభటుల నందందు నెలకొల్పి యాత్రికులకు మానప్రాణరక్షణముల నొసంగెను. ఇంతియెగాక తిరుచునాపల్లెదుర్గముచుట్టును రెండు ప్రాకారములను నిర్మించి వానిప్రక్కను నొక పెద్దకందకమును ద్రవ్వించి పురమునకు మంచిరక్షణ కలుగఁజేసెను.

మఱియు విశ్వనాథనాయనివారు శ్రీరంగము, తిరుచునాపల్లె దేవాలయముల విషయమై మిగుల శ్రద్ధవహించి యనేకరీతులుగా వానినభివృద్ధికిఁ దీసికొనివచ్చెను. ఈయనకాలముననే సుందరమైన తెప్పాకుళమనెడు కోనేరు నిర్మింపఁబడి తిరుచునాపల్లె కొకవినూతన మైనసౌందర్యమును గలుగఁజే సెను. శ్రీరంగదేవాలయము ననేకనూతనభవనములతో నలంకరింపఁజేసి కన్నులపండు వౌనట్లుగా దిద్ది తీర్పరింపఁజేసెను. ఈదేవాలయ రక్షణకొఱకు మూఁడులక్షలపొన్నుల ద్రవ్యమును వెచ్చించెను. ఈప్రాకారములలోపల జనులు నివసించుటకై యనేకగృహములను గట్టించెను. ఇట్లు ప్రధాన దుర్గములను ముఖ్యములయిన దివ్యక్షేత్రములను చక్కపఱచుకొనుటకై విశేషద్రవ్యమును వెచ్చబెట్టి కృతకృత్యుఁడై ప్రజానురాగమును బడయుటయెగాక రాజ్యములోఁ దిరస్కార భావముతో నొప్పెడు ప్రభువతంసుల నెల్లర జయించి సరయిన మార్గమునకుఁ గొనివచ్చి రాజ్యము నలుప్రక్కల శాంతి నెలకొల్పఁ బూనుకొనియెను. ఇతఁడు రాజ్యభారమును వహించి పరిపాలనము చేయుటకుఁ బ్రారంభించిన కొలదిదినములలోనే చోళరాజ్యమునఁ జోళవంశీయుఁడ నని చెప్పుకొను నొక చోళ సామంతుఁడు కంబము, గూడలూరుసీమ నాక్రమించుకొని విశ్వనాథనాయని పరిపాలనమును దిరస్కరించి కప్పమును జెల్లించక చిక్కులు పెట్టుటకుఁ బ్రారంభించెను. అంతట విశ్వనాథనాయకుఁ డాతని శిక్షించి రాజ్యమును వశపఱచుకొని కప్పము గైకొని రావలసినదిగాఁ దనతండ్రి ప్రియమిత్రుఁడును, భృత్యుఁడుగ నున్న రామభద్రనాయకుని నియమించెను. అతఁ డట్లు తన కార్యమును జయప్రదమగునట్లుగా నిర్వహించుకొని వచ్చినందుకు సంతోషించి విశ్వనాథనాయఁ డాతనికి 'వడగరై' యను పాళియము నొసంగి సన్మానించెను. దక్షిణపాండ్య దేశమున (తిన్నెవెళ్లి మండలము) కాయత్తత్తూరునకుఁ జుట్టునుండు దేశమున నైదుగురు సామంతులు పంచపాండ్యులను నామకరణము వహించి విశ్వనాథనాయనివారి పరిపాలన మంగీకరింపక కప్పములు చెల్లింపక దేశమున శాంతిలేకుండఁ జేసి ద్వేషమును బెంచి సరకుగొనక స్వతంత్రులై విహరింపసాగిరి. వీరలు ప్రాచీన పాండ్య రాజుల సంతతివారలని కొందఱును, చంద్రశేఖరపాండ్యుని ప్రపితామహుని యుంపుడుకత్తెకుఁ బుట్టినవారని మఱికొందఱును వ్రాసి యున్నారు గాని వాస్తవచరిత్రము దెలిసికొన సాధ్యముకాదు. కాని వీరలను జయించినఁగాని దక్షిణదేశమున శాంతి నెలకొల్ప సాధ్యముగాక యుండెను. ఈకార్యమును నిర్వహించుటకై విశ్వనాథనాయనివారు 'అరియనాథ మొదలారిని నియోగించెను. ఇతడు మొదట సామోపాయముచేత వారలను స్వాధీనపఱచుకొనవలయు నని యనేక విధములఁ బ్రయత్నించి చూచెను గాని వాని ప్రయత్నము లన్నియు నిష్ఫలములైపోయెను. తెంగాశిలో నుండునీపాండ్యులకు తిరువడిరాజ్యాధిపతి యైనభూతల వీరరామవర్మ సమస్త విధములఁ దోడ్పడుచుండుటచేత విశ్వనాథనాయని వారు తిరువడిరాజ్యముపై గూడ దండెత్తవలసి వచ్చెను. అపు డీరెండుకార్యములను నిర్వహించుట విశ్వనాథనాయనివారికి దుర్భరమై యీ వృత్తాంతము నంతయు విజయనగర సామ్రాజ్యధీశ్వరుఁ దయినయచ్యుత దేవరాయలవారికి దూత మూలముగాఁ దెలియఁజేసెను. పాండ్యులను జయించుట యరియనాథ మొదలారికి సాధ్యపడనందున విశ్వనాథనాయఁడు తానే బహుళసైన్యసమేతుఁడై తెంగాశిపై దండెత్తిపోయి జయింపవలయునని నిశ్చయించుకొనియెను. అచ్యుతదేవరాయల వారు విశ్వనాథనాయనివారు పంపినదూతచే దక్షిణదేశము నందలి రాజకీయపరిస్థితులనన్నిటినిఁ దెలిసికొని యింకను నుపేక్ష వహించి యూరకుండుట ప్రమాదకరమని భావించి యశేషసైన్యములతో తిరువడి రాజ్యముపై దండెత్తివచ్చెను. ఈ సమయమున నీతనికి విశ్వనాథనాయనివారును, నీయనకుమారుఁడు కృష్ణప్పనాయనివారును స్వాగతమిచ్చి బహువిధములుగాఁ దోడుసూపి రాయలవారి మన్ననకుఁ బాత్రులయిరి. అచ్యుత దేవరాయలవారు తిరువడి రాజ్యాధిపతియైన భూతల వీరరామవర్మను యుద్ధములో జయించిరి. అతఁడు విజయనగరసామ్రాజ్యాధీశ్వరునితోఁ బోరాడి నిగ్రహించుట వ్యర్థమని తలంచి సుచీంద్రముకడ సంధి చేసికొని సామ్రాజ్యమునకుఁ జెల్లింప వలసిన కట్నమును జెల్లించి మైత్రికలిగి యుండుట కొప్పుకొనియెను. తెంగాశి పాండ్యులుగూడ విశ్వనాథనాయనివారితోఁ బోరాడలేక యాతనితో సంధిచేసికొని మైత్రి నెఱపవలసిన వారయిరి. అచ్యుతదేవరాయలవారు తమకార్యమును సాధించి దేశము స్వస్థతఁగాంచిన వెనుక విశ్వానాథనాయనివారినే పాండ్యమండలాధీశ్వరునిగాఁ నంగీకరించి యారాజ్యభారము నంతయు వానికి విడిచిపెట్టి విజయనగరమునకు మరలిపోయిరి. ఇట్లు తెంగాశి పాండ్యులను జయించినవెనుక విశ్వనాథనాయని వారు తన ప్రధానమంత్రితోఁగలసి రాజ్యాభివృద్ధి మార్గముల నాలోచించి యందుకుఁ దగినకృషి ప్రారంభించెను. తిన్నెవెల్లి పట్టణమును విస్తరింపఁజేసి యభివృద్ధి పఱచెను. దేవాలయములను నిర్మించెను. ఎట్లు గ్రామపరిస్థితులఁ జక్కచేసి పరిపాలనము నడుపవలసియుండునో యారీతి నడుపునట్లు గావించెను.

చెఱువులను, కాలువలను ద్రవ్వించి తనరాజ్యము నందలి గ్రామాదులలోని వ్యవసాయకులను భూములనిచ్చియు, ధనము నొసంగియుఁ గృషివ్యాపారము లభివృద్ధి నొందునటులు మనఃపూర్వక మైనప్రేమను జూపుచుఁ బ్రవర్తించెను. అందువలన వ్యవసాయ మభివృద్ధిని గాంచెను. దేశమునందంటట క్రమమైనశాంతి నెలకొనియెను. ఇతనిపరిపాలనమునఁ బ్రజలు సంతృప్తిఁ గాంచిరి. ఈతనిరాజ్యమున కుత్తరమున ఉఱ్ఱాత్తూరు, వలికొండపురములును, దక్షిణమునఁ గన్యాకుమారియు, పశ్చిమభాగమున కోయంబత్తూరు, ఈరోడు, ధారాపురము, మేలమలై, తూర్పున సముద్రమును రామేశ్వరమును సరిహద్దులుగా నేర్పడి రాజ్యము వ్యాప్తిఁ జెంది యుండెను. అనఁగా నిప్పటిమండలము లగు మధుర, రామనాథము, తిన్నెవెల్లి, తిరుచునాపల్లి, కోయంబత్తూరు, సేలము, నా కాలమున విశ్వనాథనాయని పాండ్యరాజ్యముగా నుండె నని చెప్పఁదగును. విజయనగరసామ్రాజ్యమువారి పదునాఱవశతాబ్దిలోని శాసనములన్నియు నీమండలములలోఁ గానుపించుచున్నవి. ఈమండలములుగాక తిరువనంతపుర (ట్రావెన్కూరు) రాజ్యములోని యొకింతప్రదేశముగూడ నీతని రాజ్యమునఁ జేరియుండెను.

అప్పటి దేశకాలపాత్రస్థితుల ననుసరించి పరిపాలన సౌష్టవమునకుఁగాను విశ్వనాథనాయఁ డొక నూతనపరిపాలనా పద్ధతినవలంబింపవలసివచ్చెను. ప్రభువర్గములోఁ బ్రాచీనపాండ్య రాజులకు సామంతులుగనుండిన వారిసంతతినవారలుగలరు. వారల గౌరవమర్యాదలఁ గాపాడవలసి యుండెను. ఉద్యోగాపేక్షవలన నేమి, తురకలవలన నెట్టిహానియుఁ బొరయకుండ రక్షించుకొనఁ గోరియైననేమి యుత్తరము నుండివచ్చిన నాయకులు కొందఱు గలరు. తనకును, తనరాజ్యమునకును నధికముగాఁ దోడ్పడి సేవచేసిన ప్రభువర్గమువారుగలరు. వీరలెల్లరు నైకమత్యముగలిగితనకును, తన రాజ్యాంగమునకును, సకలసామ్రాజ్యమునకును దగు రీతిని దోడ్పడునట్లుగా వీరలెల్లరకును దనరాజ్యాంగమునందు జీవనోపాధులు గల్పింపవలసియుండెను. దేశమునందలి వ్యవసాయపద్ధతులు గడుహీనస్థితియం దుండుటచేత భూమి బంజరుగానుండి యధికభాగ మడవులచే నావరించుకొనబఁడి యుండెను. ఇందువలన దేశప్రజల క్షేమసౌకర్యములకు భంగము కలుగుచుండెను. దీనినంతయును జక్కపఱుపవలెనన్న రాజ్యాంగప్రభుత్వము సామంతప్రభువర్గమువారికి స్వతంత్రాధికారము నెక్కువగా నొసంగినఁగాని సాధ్యమగునది కాదు. అందువలన విశ్వనాథనాయనివా రొక నూతనవిధానమున రాజ్యాంగనిర్మా ణమును గావించెను. దీనినే పాళయము పద్ధతి యందురు. ఒక్కొక్కపాళయమున కొక్కొకయధికారి యుండును. వీరిని పాళెగాండ్రందురు. ఇట్లు నాయనివారు తనరాజ్యము నంతయు డెబ్బదిరెండుపాళయములుగా విభాగించి డెబ్బది యిర్వురునాయకుల కొసంగెను. ఈపాళయములయందు పాళెగాండ్రకుమాత్రమెగాక వీరిసంతతివారికి వారసత్వాధికార ముండవలయు నని శాసించెను. రాజ్యాంగమునందు రాజునకెట్టి యధికారముండునో యాపాళయములందు పాళెగాండ్రకు నట్టిస్వతంత్రాధికార మిచ్చెను. ఎచ్చుతగ్గుభేదముల ననుసరించి యాపాళెగాండ్రందరు ప్రధానప్రభుత్వము లేక కేంద్రప్రభుత్వమునకుఁ గప్పములు గట్టుచుండవలయును. యుద్ధములు తటస్థించినపుడు వీరలు తమసైన్యములతో రాజ్యాంగమునకుఁ దోడ్పడవలయును. మఱియును శత్రువులచే మధురాపురదుర్గము ముట్టడింపఁబడినపు డొక్కకదుర్గమును సంరంక్షిచుటకు నొక్కక పాళెగాఁడు బద్ధుఁడై యుండవలయును. ఇట్టి నిబంధనలతో నీ పాళెగాండ్రపద్ధతి యాదరణమునకుఁ దేఁబడినది. అయ్యది కాలపరిస్థితులకు దగియుండి యుపయుక్తముగా నుండెను గాని తరువాత నాపద్ధతి యనర్థదాయకముగాఁ బరిణమించెను. అయిన నిట్టిపద్ధతి యవలంభించుటవలన విశ్వనాథనాయనివారు దన పరిపాలనమునకుఁ గల యడ్డంకుల నన్నిటిని నరికట్టి స్వేచ్ఛగాఁ బరిపాలింపసాగెను. ఈ పాళెగాండ్రు తమరాఁబడిలో మూఁడవ వంతు కప్పముక్రింద రాజ్యాంగమునకుఁ జెల్లించుచుండిరి. యుద్ధకాలములందుఁ దమ ప్రభువాజ్ఞయైనయెడల మఱియొక మూఁడవ వంతు రాఁబడి సైన్యముల క్రిందను వినియోగించి వారికిఁ దోడ్పడుచుండిరి. తక్కిన రాఁబడిని వారు స్వేచ్ఛగా ననుభవింపుచుండిరి. రాజ్యాంగమునం దిట్టిపద్ధతు లవలంబించుటవలన పాళెగాం డ్రందఱును విశ్వనాథనాయనివారిపట్ల భక్తివిశ్వాసములతోఁ బ్రవర్తింపఁ గలిగిరి. ఒక్కొక్కప్పుడు రాజ్యాంగమునకు నెక్కువ సేవచేయఁగలిగిన పాళెగాండ్రకు విశ్వనాథనాయనివారు వారి కప్పములను గొనకయె వారలకు బహుమానములుగా విడిచిపెట్టుచుండెను. ఇతఁడు తనపాళయగాండ్రతోసహా విజయనగరసామ్రాజ్యమునకుఁ దోడ్పడుచు భక్తివిశ్వాసములతో సేవించుటచే నచ్యుతదేవరాయలవారి కాలమునఁగాని సదాశివదేవరాయలవారి కాలమునఁగాని వారి యాగ్రహమునకుఁ బాత్రుఁడు గాక యర్హ మర్యాదలకు భంగము లేకుండఁ దన పదవిని జక్కఁగాఁ గాపాడుకొనఁ గలిగియుండెను.

ఇత డత్యంత బాహుబలాఢ్యుఁ డని తెలుపుటకుఁ గాఁబోలు స్థానిక చరిత్రములయం దతిచిత్రము లగు కథలు కొన్ని వక్కాణింపఁబడి యున్నవి. అట్టివానిలో నొక్కిఅకథను మాత్రము చదువరుల వినోదార్థ మిందుఁ దెలుపుచున్నారము.

పాండ్యరాజ్యమునకుఁ దామే హక్కు దారులమని తొలుదొల్త విశ్వనాథనాయనివారి నెదుర్కొని పోరాడినవారు తెంగాశి పాండ్యులని యింతకుఁ బూర్వము తెలిసికొనియున్న వారము. తెంగాశి పాండ్యు లైదుగురు వీరు పంచపాండ్యులని పరఁగినవారు. పంచపాండ్యులనునది ప్రాచీనకాలమునుండి వ్యవహరింపబడుచున్న సమాసపదముకాని నేడు క్రొత్తగ సృజింపఁబడినది కాదు. వీరిలోఁ బరాగ్రమపాండ్య దేవపెరుమాళ్లనునతఁడు ప్రముఖుఁడుగా నుండెను. వీరికి కులశేఖరదేవుఁ డను నామాంతరము గలదు. ఇతఁడు 1543 వ సంవత్సరమున తెంగాశిలోఁ బట్టము గట్టుకొనియెను. ఇతఁడే విశ్వనాథనాయనివారిని ప్రతిఘటించి నిలిచినవాఁడు. తక్కినవారు వీనికిఁ దోడ్పడిరి. వీరి ప్రతిఘటన వృత్తాంతమును దెలిసికొని విశ్వనాథనాయనివారు వీరినిజయించుటకై తమ దళవాయియగు 'అరియనాథ మొదలారి' నిఁ గొంతసైన్యముతోఁ బంపించెను. అప్పుడు తెంగాశి పాండ్యులకును, విశ్వనాథనాయనివారి సైన్యములకును బెనుపోరాటము జరిగి యా యుద్ధములో దళవాయి యరియనాథమొదలారి వారిని జయింపలేక యవమానముతో మధురాపురమునకుఁ బాఱివచ్చి తనప్రభువునకు తలవంపులు గొనితెచ్చెను.

అట్టితలవంపులను విశ్వనాథనాయనివారు భరింప జాలక రెండవమాఱు తానే మహాసైన్యముతో దండెత్తిపోయి వారల దుర్గమును ముట్టడించి యాఱుమాసములవఱకు ఘన ప్రయత్నములు గావించినను దుర్గము స్వాధీనమురాకపోవుటయెగాక యుభయసైన్యములును నాశనమునొందుచుండుటఁ గన్నులారగాంచెను. 'అయ్యో! నాయొక్కనిలాభమునిమిత్త మెన్నోకుటుంబములు దిక్కులేక దుఃఖభాజనము లగుచున్నవి. ఒక్కనిసంతృప్తికై పెక్కుకుటుంబములను దుఃఖపరంపరలలో ముంచెత్తివిడుచుట ధర్మముగాఁ గన్పట్టుచుండలేదు' అని తలపోసి పశ్చాత్తాపమును దెలుపుచు నీ క్రింది జాబును వ్రాసి యొక దూతచేఁ దనప్రతిపక్షులకుఁ బంపెను.

"మీరైదుగురు, నేనొక్కఁడను. మననిమిత్తమై ప్రజలు దుఃఖపరంపరల పాలగుచున్నారు. అట్లు జరుగరాదు. మనము యుద్ధములను జాలించి మనసైన్యములను దూరముగా నిలిపి పోరాటముడిగించి యుభయసైన్యములనడుమ నొక శిలాస్తంభమునాటి మీరైదుగురును నాయొక్కనితో ద్వంద్వ యుద్ధమునకుఁ గడంగవలసినది. మీరు జయించిరా యీరాజ్యమును గైకొనుఁడు. నేను జయింతునా మీ రాజ్యమును విడిచి కట్టు పుట్టములతో మాత్ర మావలకుఁ బొండు. ఈ ప్రకారము మనము దైవసాక్షిగ ప్రతిజ్ఞలనుఁజేసి తామ్ర శాసనము వ్రాయించి యాశాసనము మీశిలాస్తంభమునకుఁ గట్టి బాహుయుద్ధమునకుఁ గడంగుదము. ఈ సమస్య యీ విధముగా మనయుభయుల నడుమ పరిష్కారమగుట నా కోరిక."

ఈ పయిజాబును వారు చూచుకొని 'మీ రొక్కరును మా యైదుగురుతోఁ దలపడుటధర్మము కాదు; మాలో నొక్కఁడు మాత్రము వచ్చును. మీరు వచ్చి వానితోఁ దల పడుదురా! అట్లయినపక్షమున మీకోరికప్రకారము నడువంగలవార' మని ప్రత్యుత్తరము వ్రాసి విశ్వనాథనాయనివారికిఁ బంపిరఁట. విశ్వనాథనాయనివారి పౌరుషపరాక్రమములుపాండ్య వీరులైదుగురు దలపడినను వెనుదీయ నట్టివికావు. కనుక మరల యతఁడు 'మీరైదుగురు నైదుసీమలకు ప్రభువులుగ నున్నారు. నే నొక్కఁడనైయుండియు మిమ్ములను జయించి మీసీమల నొడిచికొనవలయు నని వచ్చియున్నాను. కనుక మీర లైదుగురును గలిసి నాయొక్కనితోనే పోరాడుట న్యాయము.

వా రంగీకరింపక తమలో బాహుబలపరాక్రమ వంతుడైనవాని నేరుకొని యంగరక్షకై కవచమును దొడిగి యశ్వారూఢుని గావించి వాని కొక ఖడ్గము నొసంగి యుద్ధముచేయుటకై నిర్ణీతరంగస్థలమునకుఁ గొనివచ్చిరఁట!

ఈద్వంద్వయుద్ధము ముగియుట కెంతోకాలము పట్టలేదు. విశ్వనాథుఁడు తుదకంగీకరించి తానును యుద్ధసన్నద్ధుఁడై రంగస్థలమున కుఱికి 'మొట్టమొదట నీవే కొట్టుమని పాండ్యవీరుని నాహ్వానించెనట! ఆతఁ డట్లే యొక్కవ్రేటువేసెను. విశ్వనాథుఁడు తనఖడ్గముతో నావ్రేటు తప్పించుకొనియెనట. అంత పాండ్యుఁడు విశ్వనాథనాయని వ్రేటువేయమని పలికెనఁట! అతఁడు నిరాకారించి పాండ్యునే వ్రేటు వేయమని ముమ్మాఱు పలికెనట! పాండ్యుఁ డట్లుగావించెనఁట! అంత విశ్వనాథనాయఁ డెప్పటియట్ల తప్పించుకొని పాండ్యునితో 'ఇదిగో వ్రేటువేయుచున్నాను త్రప్పించుకో'యని పలికి యొక్కవ్రేటు వేసెనఁట! ఆ వ్రేటుతోఁ బాండ్యుని దేహము రెండుతుండములై క్రిందఁ బడెనఁట!

ఈ విధముగాఁ 'గర్ణాటపాలకులచరిత్ర'మను స్థానిక చరిత్రమునందుఁ దెలుపఁబడినది గాని యియ్యది సత్యమని విశ్వసింపరాదు. ఇయ్యది విశ్వనాథనాయఁడు భీమబలుఁడని తెలుపుటకై యీ కథ కల్పింపఁబడి యుండవచ్చును. దీని వాస్తవ మెట్టిదైనను నీపాండ్యులలో మొదటివాఁడయిన పరాక్రమపాండ్య దేవపెరుమాళ్ళ మరణానంతరము తెంగాశి పాండ్యులు విశ్వనాథనాయనివారితో సంధి గావించికొని యాతని సామంతులై కప్పము చెల్లించువారుగ నుండిరనుట సత్యము. వీనితమ్ముఁడు తిరునల్వేలి కులశేఖర పెరుమాళ్లను నతఁడు 1553 లో తెంగాశిలో బట్టాభిషిక్తుఁ డయ్యెను. వీనికి 'వీరవేలు' అను బిరుదుమాత్రమె వహించెను. వీనికుమారుఁడు 'అతివీరరామపాండ్య అలగన్‌' అను నాతఁడు 1564 లో పట్టాభిషిక్తుడై 'శివలవేలు' అను బిరుదమును బొందెను. వీరి కెవ్వరికిని పరాక్రమ పాండ్యదేవ పెరుమాళ్ళకు వలె నప్రతి హతభువనైక వీరుఁడనియు, ద్రిభువనాధిపుఁడనియుఁ, జంద్ర కులావతంసుఁ డనియు మొదలగు బిరుదములు స్వాతంత్ర్యమును దెలుపునవి యేవియు లేవు గావున విశ్వనాథనాయని వారి బ్రతిఘటించి యుద్ధముచేసి మరణించినవాఁడు పరాక్రమ పాండ్య దేవుఁడే' యనియుఁ దక్కినవారు విశ్వనాథనాయని వారికి సామంతులై మైత్రితితోఁ బ్రవర్తించి రని మనము నిశ్చయింపవచ్చును.

ఈవిశ్వనాథనాయనివా రెంతసమర్థుఁడైనను, ఎట్టిరాజ్య తంతజ్ఞుఁడైనను, ఒకటి రెండుమాఱులు సామ్రాజ్యము వారి సహాయమును గోరక తప్పినది కాదు. ఇతఁడు తెంగాశి పాండ్యులతోఁ బోరాడుచున్న కాలమున పోర్సుగీసువారు సముద్రతీరమునందు నివసింపుచు ముత్తెపు చిప్పలను సముద్రమునుండి దేవి తెచ్చి వ్యాపారము చేసెడి పరవజాతివారిని పెక్కండ్ర క్రైస్తవమత ప్రవిష్టులనుగాఁ జేసి వారిసహాయముతో సముద్రతీరము నాక్రమించుకొని సముద్రవ్యాపార మంతయుఁ దమహస్తగతమగునటుల వ్యవహరింపుచు పరవజాతి వారిని పాండ్యరాజ్యపరిపాలనమునుండి వేఱిపఱచినను నేమియుఁజేయ శక్తిచాలక యుండెను. ఇంతియగాక తిరువడి రాజ్యాధిపతి యైనభూతల వీరరామవర్మ పోర్చుగీసువారి సహాయముచే గర్విష్టుఁడై కప్పముగట్టుట మానుకొనుటయెగాక పాండ్యరాజ్యములోని కొంతభాగ మాక్రమించు కొనుటకుఁగూడ సాహసించెను. ఈ దుస్థితినంతయుఁ దెలిసికొని విజయనగరసామ్రాజ్యసంరక్షణ కర్తయగు అళియరామరాయలవారు విశ్వనాథనాయనివారికిఁ దోడ్పాటుగానుండి పోర్ఛుగీసువారియొక్కయు, తిరువడిరాజ్యాధిపతియొక్కయు, విజృంభణము నడగించి వారినుండి కప్పములు గైకొని యాభాగములందు శాంతి నెలకొనునటుల పాండ్యరాజ్యమును బలపఱచి విశ్వనాథనాయనివారి పరిపాలనమును దృఢపఱచి రావలయునని పెనుగొండరాజ్యాధిపతియైన విఠ్ఠలరాయని, వీని తమ్ముఁడును, చంద్రగిరిరాజ్యాధిపతియైన యౌకు చినతిమ్మరాజును దక్షిణదేశమునకుఁ బంపించెను. విఠ్ఠలదేవరాయలు రాజప్రతినిధిగా నియమింపఁబడియెను. విశ్వనాథనాయనివారు పాండ్యరాజ్యములోపలి వ్యవహారములను జక్కఁబెట్టుకొనుచు, వెలుపలివ్యవహారములయందు సామ్రాజ్యప్రతినిధి యగువిఠ్ఠలదేవరాయనికిఁ దాను గాని తనకుమారుఁడు కృష్ణప్పనాయనివారు గాని యప్పటప్పట తోడుసూపు చుండెను. విఠ్ఠలదేవరాయలు 1558 వ సంవత్సరమువఱకు రాజప్రతినిధిగా దక్షిణదేశమున వ్యవహరించెను. విఠ్ఠలదేవరాయలు తనతమ్ముఁ డయిన చినతిమ్మరాజుతోఁగూడి తిరువడి రాజ్యమును జయించి వానితో సంధికార్యమున కొడంబడి సామ్రాజ్యమునకు రావలసిన కప్పముల నన్నిటిని రాఁబట్టఁ గలిగెను. పోర్చుగీసువారిని, పరవజాతివారిని జయించి పోర్చుగీసురాజ్యమునకుఁగాక పాండ్యరాజ్యమునకు లోబడి కప్పములు చెల్లింప నియమబద్ధులను గావించెను. ఈసందర్భములయందు విశ్వనాథనాయనివారు తా నొక స్వతంత్రరాజువలె, బ్రవర్తింపక సామ్రాజ్యమునకు సామంతుఁడ నను భావముతోనే సామ్రాజ్యప్రతినిధికి సర్వవిధముల తోడ్పడి కృషిసలిపెనుగాని స్వతంత్రభావముతో నుపేక్షించియుండలేదు. విఠ్ఠలరాయలుగాని, అతనితమ్ముఁడు చినతిమ్మరాజుగాని విశ్వనాథనాయనివారి పరిపాలనమునకుఁ బ్రతిబంధకముగా నెద్దియును జేసియుండ లేదు. విశ్వనాథనాయనివారును, విఠ్ఠలరాయలును పరస్పరము సఖ్యభావమును జూపుకొనుచు నైక మత్యముతో వ్యవహరించినట్లు గన్పట్టుచున్నది గాని విరోధ భావములతో గూడియుండి యనైకమత్యముతో వ్యవహరించినట్లు గనుపట్టదు. మహామండలేశ్వర రామరాయ విఠ్ఠలరాయ దేవమహారాజునకుఁ దాను కార్యకర్తనని విశ్వనాథనాయని వారి యొక శాసనమునఁ గన్పట్టినను విఠ్ఠలరాయనికి విశ్వనాథనాయనివారు సామంతుఁడుగా నుండి పరిపాలించెనని చెప్పరాదు. విశ్వనాథుఁడు పాండ్యరాజ్యాధిపత్యము వహించిన రాజుమాత్ర మైయున్నాఁడు. తిరువడిరాజ్యమును, పోర్చుగీసు వారి సముద్రతీరప్రాంతదేశమును సామ్రాజ్యమునుండి తొలఁగి పోకుండ జూచుటకై ముఖ్యముగాఁ బంపఁబడినవాఁడు విఠ్ఠల దేవరాయలు. ఈతఁడును, నీతనితమ్ముఁడు చినతిమ్మరాజును, వీరియనుచరు లయిననాయకులు కొందఱును చేసిన దాన శాసనములు కొన్ని పాండ్యరాజ్యమందును గానవచ్చుచుండుటచేత నీతనిసమ్మతిని గైకొనియె చేయఁబడి యుండవచ్చును గాని యంతకన్న వానికి వేఱగువిపరీతార్థము లిచ్చువ్యాఖ్యానములు చేయరాదు. తిరువడి రాజ్యాధిపతి యగు భూతల శ్రీవీరరామవర్మయును పోర్చుగీసువారును క్రైస్తవమత మవలంబించిన పరవజాతివారును దక్షిణదేశమున సామ్రాజ్యాధికారమును దొలఁగించి యాస్థానమున పోర్చుగీసువారి రాజ్యాధికారమును స్థాపించుటకై ప్రయత్నించిన విధానమును భగ్నపఱచుటకును, ఈ ప్రాంతదేశమున విజయనగర సామ్రాజ్యప్రతిష్ఠను స్థిరముగా నెలకొల్పుటకును విఠ్ఠలరాయలు నియోగింపఁబడి పదిసంవత్సరములకాల మిచట నుండి తనప్రయత్నము లన్నిటిని విజయము గాంచెను. ఈకార్యములయందు పాండ్యరాజ్యమును బరిపాలించు విశ్వనాథనాయనివారును, వానికుమారుఁడు కృష్ణప్పనాయనివారును తోడ్పడినమాట వాస్తవమెకాని విశ్వనాథనాయనివారు పాండ్యరాజ్యమును స్వతంత్రముగాఁ బరిపాలనము చేయలేదని కొందఱు చరిత్రకారులు వ్రాసినది సత్యచరిత్రము కాదు. ఇప్పటినుండియు నీతఁడును నీతనివంశము వారును పాండ్యరాజ్యమునకు వంశపారంపర్యపు హక్కు గలిగి యిన్నూఱు సంవత్సరముల వఱకుఁ బరిపాలింపఁ గలిగిరి. విశ్వనాథనాయనివారు 1496 వ సంవత్సర ప్రాంతమున జనించి 1529 మొదలుకొని 1564 వఱకు పాండ్యరాజ్యమును బరిపాలించి 1564 వ సంవత్సరమున మరణముఁ జెందెను. ఇతనికి 'పాండ్యకుల స్థాపనాచార్య' యను బిరుదము గలదు. ఇయ్యది బహుశః తెంగాశి పాండ్యులను మరల వారివారి స్థానములయందు నిలుపుటచే పొందియుండ వచ్చును. ఎట్లయినను ఈతని పరిపాలన కాలమునఁ బాండ్యదేశ మంతయుఁ నభివృద్ధికిఁ గొనిరాబడి తెలుఁగువానికిని, తమిళులకు నైకమత్యముఁ గలిగియుండి యుభయసంఘములవారును విజయనగరసామ్రాజ్యమునకుఁ దోడ్పడుట కవకాశమును, స్థిమితమునుఁ గలుగఁజేసె నని చెప్పవచ్చును. ఇతఁడు తన కాలమున దనపేరిట సొంత నాణెములనుఁ బ్రకటించెను.


_________