ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/రెంటూరి రంగరాజు
శా. బాలు న్మంజులతాలవాలచపలాపాంగోల్లసల్లీలునిం
గాళిందీపులినాంగణప్రణయశృంగారై కఖేలున్ శుభ
శ్రీలోలుం గరుణావలోకనసుధాశీలున్ వినీలప్రభా
జాలుం గొల్చెద రామణియకరసస్వారాజ్యపాలు న్మదిన్. ఆ. 1.
చ. ఉదరము నింపగోరి ఖలు లుండెడితావులు చేరి వారిక
ట్టెదుట నశాంక నిన్ను నటియింపగ జేసిన పాతకంబులన్
సదయత నోర్వగావలె బ్రసన్నమతిన్ ననుగన్నతల్లి శా
రద యదువంశనాయకుని ప్రస్తుతి నిష్కృతి నే నొనర్చెదన్. ఆ. 2.
ఉ. చల్లనివాని నవ్వు వెదజల్లెడువాని దయారసంబు జొ
బ్బిల్లెడువాని గెంపుజిగిపెంపు చెలంగెడుమోవివాని సం
ఫుల్ల సరోజనేత్రముల బొల్చినవాని బయోధివీచికా
వేల్లి తనీలనీరదనవీనతనుద్యుతివాని గాంచెదన్. ఆ. 3.
50. రెంటూరి రంగరాజు
ఇతడు భానుమతీపరిణయమను నాలుగాశ్వాసముల ప్రబంధమును రచియించి వేంకటగిరి ప్రభువగు వెలుగోటి రామభూపాలున కంకితము చేసెను. ఈకవి యారువేలనియోగిబ్రాహ్మణుడు; శ్రీవత్సగోత్రుడు; చినగంగనామాత్యపుత్రుడు. కృతిపతి తన్ను గూర్చి పలికినట్టుగా కవి తనశక్తిసామర్ధ్యాదులను భానుమతీపరిణయమునం దిట్లు తెలుపుకొని యున్నాడు -
సీ. వ్యస్తాక్షరీధుర్యవిస్తీర్ణభావంబు క్రముకసంఖ్యాఖ్యాన కౌశలంబు
నారోహణావరోహణలేఖనప్రౌఢి యగ్రపద్యగ్రహణాభిరక్తి
యనవలోకితశారికాభిఖేలనరీతి వరసమస్యాపూర్తి వైభవంబు
సముదగ్రవీక్షితచతురంగబలకేళికావిలాసము నేక కాలముననె
యలర బ్రకటింపనేర్తు పష్టావధాన కలితశత లేఖినీపద్యగద్యశక్తి
సాటిమీరితి వాంధ్రకర్ణాటచోళ రాజసభలను రెంటూరి రంగనార్య.
గోలకొండ మహమ్మదీయులను, కొండవీడు వినుకొండప్రభువులను జయించి 1579 సంవత్సరమునందు విజయనగరరాజుల పక్షమున బోరాడి విపక్షరాజబృందము నోడించిన కస్తురి రంగనాయనికి కృతిపతియైన రాయభూపతి పెదతండ్రి మనుమడు. భానుమతీ పరిణయము కృతినందునప్పటికి రాయనృపాలునికి యుక్తవయస్సువచ్చిన కొడుకు లుండుటచేత గ్రంథరచన చేసిన కాలము 1620వ సంవత్సరప్రాంతమని చెప్పవచ్చును.
చ. అనుపమభద్రలీల వెలమాన్వయవార్థి బ్రతాపలక్ష్మితో
నెనసినరాయశౌరి జగదేకవదాన్యశిఖావతంస మౌ
ననుచు నుతించుటేమియరు దావిభు డిచ్చినభూరిసంపదన్
ధనదులు రాజులున్ ఘనులు దా రగుచు న్నిఖిలార్థు లుండగన్.
ఇత్యాది పద్యములతో గవి కృతిపతిని బహువిధముల వర్ణించి యున్నాడు. ఈతని కవనము ద్రాక్షాపాకమయి మనోహరముగా నున్నది. శైలిని జూపుటకయి భానుమతీ పరిణయములోని కొన్నిపద్యముల నిందు జూపుచున్నాను.
ఉ. తీరినజాతినీలములతిన్నెలపై బ్రతిబింబితంబులౌ
తారకసౌధమౌక్తికవితానము లొప్పగ జూచి బాలికల్
చారుమృగీమదం బలది చక్కనికప్రపుమ్రుగ్గు లిప్పు డి
చ్చో రచియించినామనుచు సూటిగ నాత్మ దలంతు రప్పురిన్. ఆ. 1.
చ. సుమముల వ్రాలివ్రాలి పరిశుద్ధవసంతకళా ప్తమత్తరం
గములను దేలితేలి యతికాంతసుధామధురోల్లసన్మరం
దము చవి గ్రోలిక్రోలి నవదక్షిణగంథవహానుకూలసం
భ్రమమున సోలిసోలి మదబంభరము ల్విహరించు వామనిన్. ఆ. 2.
చ. అలరె జకోరముల్ ప్రియతరాబ్జముఖీమణిదృక్చకోరముల్
కలగె సరోజముల్ మదనకంపితపాంథమనస్సరోజముల్
తొలగెను భీతి జక్రములు ధూర్తగుణోజ్జ్వలజారచక్రముల్
నలినవిరోధినూత్నకిరణంబులు కొన్ని దివిం దలిర్పగన్. ఆ. 3.
చ. అతిముద మొప్ప ధర్మతనయాదులు చూచిరి కేకికోకిల
ప్రతతివతంసహంసమదబంభరడింభరథాంగనాదమం
డితబహుగంథబంధురపటీరతటీరతటీరమమాణగోపికా
ధృతమణిదీపికానికరతేజము రైవతకాద్రిరాజమున్. ఆ. 4.
51. సింహాద్రి వేంకటాచార్యుడు
ఈకవి లక్షణావివాహమను నామాంతరముగల చమత్కారమంజరిని రచించెను. చమత్కారమంజరి మూడాశ్వాసముల ప్రబంధము. ఈకవి శ్రీవైష్ణవుడు; చెన్నకేశవాచార్యుల పౌత్రుడు; తిరుమలాచార్యులపుత్రుడు; గౌతమగోత్రుడు. "భధ్రాచలస్వామి రామచంద్రుడొసర నాడెందమున నిండియుండు గాత" అని భద్రాచలరామస్వామి నిష్టదైవతముగా స్తుతియించి యుండుటచేత కవి గోదావరిమండలములోని వాడని తోచుచున్నది. ఇతడు తనగ్రంధమును వైష్ణవమతోద్ధారకుడైన రామానుజాచార్యున కంకితము చేసెను.అప్పకవికి బూర్వికులయిన లాక్షణికు లెవ్వరు నీతిగ్రంధమును పేర్కోనకపోవుటన నితడు 1630-40 వ సంవత్సరప్రాంతముల యందుండెనని యూహింపదగియున్నది. అక్కడక్కడ గొన్ని వ్యాకరణదోషము లున్నను, ఈతని కవిత్వము మొత్తముమీద ప్రౌడముగానే యున్నది. చమత్కారమంజరినుండి రెండుమూడు పద్యముల నిందుదాహరించుచున్నాను.