ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/పిడుపర్తి సోమనాధుడు

శా. వీరాలాపము లాడ నేల వినుమీ విశ్వప్రకాశంబుగా

బారావారము గట్టి రాఘవుడు కోపస్ఫూర్తి దీపింపగా

ఘోరాజి న్నినుడాసి లావుకలిమిన్ గోటీరయుక్తంబుగా

గ్రూరాస్త్రంబుల మస్తముల్ దునిమి భక్తుల్పెట్టు భూతాళికిన్. [సుందరకాం]


మ. అనఘుం డుజ్జ్వలచాపదండమున బ్రహ్మాస్త్రంబుసంధించి యొ

య్యన గర్ణాంతముగా గడుం దివిచి ప్రత్యాలీడపాదస్థుడై

దనుజాధీశ్వరుబాహుమధ్యము వడిం దాకంగ లక్ష్యంబుగా

గొని బిట్టేసె నదల్చి తీవ్రతరమౌకోపంబు దీపింపగన్. [యుద్ధకాం]


14. పిడుపర్తి సోమనాధుడు

ఇతడు శైవబ్రాహ్మణుడు; పిడుపర్తి బసవారాధ్యుని పుత్రుడు. ఇతడు పాల్కురికి సోమనాధుడు రచియించిన ద్విపద బసవపురాణమును తెనుగున నేడాశ్వాసముల పద్యకావ్యముగా రచియించెను. పాల్కురికి సోమనాథుడు రచియించిన పండితారాధ్యచరిత్రము మొదలయిన గ్రంథములను శ్రీనాథాదు లీకవికి బూర్వమునందు బద్యకావ్యములనుగా జేసిన ట్లీబసవపురాణపీఠికయం దీకవి యీక్రింది పద్యముచే జెప్పియున్నాడు.-


సీ. విరచించె జైమిని వేదపాదస్తవం బొకపాదమున వేదయుక్తినిలిపి

హరభక్తి వైదికం బని శ్రుతు లిడి చెప్పె ప్రతిభ సోమేశుడారాధ్యచరిత సరవి శ్రీనాథు డాచరిత పద్యప్రబంధముచేసె ద్విపదలు తఱుచునిలిపి

యాతండె పద్యకావ్యముచేసె నైధష మంచితహర్షవాక్యముల బెట్టి


సోమగురువాక్యములు పెట్టి భీమసుకవి

గరిమ బసవపురాణంబు గణనజేసె

గాన బూర్వకావ్యము వేఱుగతిరచించు

వారి కాదికావ్యోక్తులు వచ్చినెగడు.


"సోమగురువాక్యములు పెట్టి భీమసుకవి...బసవపురాణంబు...చేసె" నన్న పయివాక్యమునుబట్టి వేములవాడ భీమకవి నన్నయభట్టారకుని కాలములోనివాడుగాక పాల్కురికి సోమనారాధ్యున కెంతో తరువాత నుండినవా డయినట్టు విస్పష్టమగుచున్నది. ప్రతాపరుద్రునికాలములో ప్రతాపరుద్రుని మంత్రులలో నొకడును తన శిష్యుడును నయిన యిందుటూరి యన్నదండనాధుని సాహాయ్యముచేత పాల్కురికి సోమనార్యుడు గ్రంథకర్త పూర్వులకు దోకిపర్తియను నగ్రహారమిప్పించెను. ఈయగ్రహారమునకు దరువాత భంగము కలుగగా గ్రంథకర్తయొక్క ముత్తాతయైన సోమనారాధ్యుడు ప్రౌడదేవరాయని రాజ్యకాలములో దానిని మరల సంపాదించెను. ఈసంగతి బసవపురాణములో నీక్రింది పద్యమునందు జెప్పబడినది.


క. ఆదిన్ బ్రతాపు డిచ్చిన

యాదోకిపురంబు నడుమ నంకిలిపడినన్

మోదమున బ్రౌడరాయమ

హీదయితునినలన దెచ్చె నెల్లరు నెఱుగన్.


కృతికర్తయైన సోమనాథుని తండ్రి బసవయ్య, బసవయ్యతండ్రి దేవయ్య, దేవయ్యతండ్రి సోమనాథుడు. కాబట్టి ప్రౌడదేవరాయని రాజ్యకాలములో దోకిపర్తి యగ్రహారమును మరల సంపాదించిన యీ సోమనాథుడు కవికి ముత్తాత. ప్రౌడదేవరాయడు హూణశకము 1422 వ సంవత్సరము మొదలుకొని 1447 వ సంవత్సరము వఱకును రాజ్యము చేసినందున, అతని రాజ్యకాలములో నుండిన సోమనాథుని మునిమనుమడు తరువాత నఱువది డెబ్బది సంవత్సరముల కుండి యుండును. కాబట్టి యీకవి 1510 వ సంవత్సరప్రాంతముల గృష్ణదేవరాయని రాజ్యారంభకాలములో నున్నాడని చెప్పవచ్చును. బసవపురాణకథానాయకుడైన బసవేశ్వరుడు శ్రీశైలమునకు పశ్చిమమున నుండు హింగుళేశ్వరాగ్రహారము నందు వాసము చేయుచుండిన శివభక్తుడయిన మండంగి మాదిరాజను బ్రాహ్మణుని పుత్రుడు. ఇతడు శివుని వాహనమైన నందియొక్క యంశముచేత భూమిమీద నవతరించెనని శైవులు నమ్ముచున్నారు. తల్లిదండ్రు లీయన కుపనయనము చేయబోయినప్పుడు చేసికోక తాను శివుని దప్ప వేఱొకని గురువునుగా నంగీకరింపనని నిరాకరించెను. ఇతడు పెద్దవాడయిన తరువాత పదునొకండవ శతాబ్దమునందు కళ్యాణపురాధీశ్వరుడుగా నున్న బిజ్జలరాజునొద్ద జేరి యాతని దండనాయకుని గూతురయిన గంగాంబను వివాహము చేసికొని కడపట బిజ్జలరాజునకు మంత్రియయ్యెను. ఈతడే యీదక్షిణ హిందూస్థానమునందు వీరశైవమతోద్ధారణము చేసినవాడు. ఈతని మేనల్లుడయిన చెన్నబసవన్న కూడ వీరశైవమును దేశమునందంతటను వ్యాపింపజేసెను. బసవపురాణమునందు బసవేశ్వరుని మహిమ లనేకములు చెప్పబడియున్నవి.

సోమనాధకవియొక్క కవిత్వరీతి జూపుటకయి కొన్ని పద్యముల నిందుదాహరించుచున్నాను:-


ఉ. ఖండశశాంక శేఖరు నఖండమహత్వమెకాని యాత్మ వే

ఱొలకు దలంప యెన్నడు పయోజభవాన్వయదుగ్ధవార్ధిచం