ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/దోనూరి కోనేరుకవి
18. దోనూరి కోనేరుకవి
ఈ కోనేరుకవి తెలుగున బాలభాగవతమును రచియించెను. ఇతడు నియోగి బ్రాహ్మణుడు; శ్రీవత్సగోత్రుడు; ఆశ్వలాయన సూత్రుడు; దోనూరి నాగయ్యమంత్రి పుత్రుడు. కవి తనవృత్తాంతమును బాలభారతములోని యీక్రిందిపద్యమునందు జెప్పుకొని యున్నాడు:-
సీ. శ్రీమదహోబిలశ్రీనృసింహసమగ్రకరుణావివేషప్రకాశమహితు
భానురసంస్కృతప్రాకృతాదికశాస్త్ర భాషాకవిత్వ సౌభాగ్యనిపుణు
జనవర్ణి తాశ్వలాయనసూత్రపావను శ్రీవత్సగోత్రాబ్ధిశిశిరకరుని
సారస్యవినుతు దోనూరి నాగయమంత్రిపుత్రుడనై నట్టి బుణ్యచరితు
జతుర భూనాయకాస్థాన సకలసుజన
వందితుని నన్ను గోనేరు నాథసుకవి
నర్థి బిలిపించి సత్కార మాచరించి
పలికె నిట్లని గంభీరభాషణముల
ఇట్లు కవిని బిలిపించి గ్రంథరచన చేయమన్నది తిరుమలరాజు. ఈ తిరుమలరాజు వసుచరిత్రము కృతినందినయతడుగాక యాతని పెద్దతండ్రి కుమారుడయిన మఱియొక తిరుమలరాజు. బాలభాగవతము నందు జెప్పబడిన వంశానుక్రమమునుబట్టి యార్వీటి బుక్కరాజునకు తిమ్మరాజనియు, కొండరాజనియు, శ్రీరంగరాజనియు ముగ్గురు కొమాళ్లు గలరు. వారిలో నగ్రజు డయిన తిమ్మరాజునకు భార్యయైన గోపమాంబ వలన తిరుమలరాజనియు, విట్ఠలరాజనియు, చినతిమ్మరాజనియు, పాప తిమ్మరాజనియు, నలుగురు పుత్రులు గలిగిరి. వీరిలో జ్యేష్ఠుడయిన తిరుమలరాజు కాలమునం దీ బాలభాగవతము రచింపబడినది. ఈ తిరుమలరాజు తండ్రియగు తిమ్మరాజునకు తమ్ముడయిన శ్రీరంగరాజునకు కోన రాజు, తిమ్మరాజు, రామరాజు, తిరుమలరాజు, వేంకటరాజూ అని యైదుగురు కొడుకులు. వీరిలో మూడవవాడైన రామరాజూ కృష్ణదేవరాయల యల్లుడు. ఈ రామరాజువద్దనే వసు చరిత్రమును రచించిన రామరాజుభూషణుడు మొదట ఆస్థానకవీశ్వరుడుగానుండి యాతని మరణానంతర మతని తమ్ముడైన తిరుమలదేవరాయనికి వసు చరిత్రము నంకితము చేసెను. దీనినిబట్టి చూడగా శ్రీరంగరాయని పుత్రులైన రామరాజు తిరుమలదేవరాజులును, తిమ్మరాజుపుత్రుడైన తిరుమలరాజును పినతండ్రి పెదతండ్రి పుత్రు లగుటచేత సమకాలికులని యేర్పడు చున్నది. వీరిలో రామరాజు క్రీస్తుశకము 1542 వ సంవత్సరము మొదలుకొని 1564 వ సంవత్సరము వఱకును రాజ్యము చేసి యా సంవత్సరమునందు తాలికోటయుద్ధములో మృతుడగుటచేతను, అతనితమ్ముడైన తిరుమలదేవరాయలు 1564 వ సంవత్సరము మొదలుకొని 1573 వ సంవత్సరము వఱకును రాజ్యము చేసియుండుటచేతను, బాల భాగవతమును చేయించిన తురుమలరాజుసహిత మించు మించుగా 1550 వ సంవత్సరప్రాంతమునం దనగా పదునాఱవశతాబ్ద మధ్యమునందుండియున్నా డనుట స్పష్టము, కడపమండలములోని కడప పట్టణమునుకు పశ్చిమోత్తర దిగ్భాగమునందు 16 మైళ్ళ దూరములోనున్న యెఱ్ఱగుడిపాడు గ్రామములోని విష్ణ్వాలయములోని శాలివాహనశకము 1473 వ సంవత్సరమునం దనగా హూణశకము 1551 వ సంవత్సరమునందు తిమ్మరాజు కుమారుడయిన తిరుమలరాజు దానము చేసినట్టున్న శిలాశాసనముకూడ ఈ యంశమును స్థాపించుచున్నది, అయినను బళ్ళారిమండలములోని విజయనగరమునందలి హజారరాముని దేవాలయములో ముఖద్వారముయొక్క దక్షిణపు గోడమీద తిమ్మరాజు కుమారు డయిన తిర్మలరాజు శాలివాహనశకము 1442 వ సంవత్సరమునందు దానముచేసినట్టు శిలాశాసన మొకటి కానబడుచున్నది. దీనినిబట్టి చూడగా నితడు రామరాజు పెదతండ్రి కుమారు డగుటచేత రామరాజుకంటె పెద్దవా డయినట్టును, సామంత రాజయిన యీ తిమ్మరాజు ముందుగా మృతుడగుటచేత నాతని కుమారు డయిన తిరుమలరాజు రామరాజుకంటె పదిసంవత్సరములు ముందుగానే రాజ్యమునకు వచ్చినట్టును, ఊహింపదగియున్నది. అందుచేత నీ తిరుమలరాజు క్రీస్తుశకము 1520 వ సంవత్సరము మొదలుకొని 1551 వఱకును రాజ్యముచేసినట్టు రూఢీగా చెప్పవచ్చును. కాబట్టి దోసూరి కోనేరునాథ కవియు పదునాఱవ శతాబ్దముయొక్క పూర్వార్థమునందే యుండి, తిరుమలరాజుయొక్క రాజ్యారంభదశలోనే బాలభాగవతమును రచియించి యుండును. బాలభాగవతము తిరుమలరాజుయొక్క ప్రేరణచేతనే రచియింపబడినను, అది తిరుమలరాజున కంకితము చేయబడక యాతని ప్రార్థనమీద మృతు డయిన యాతనితండ్రి తిమ్మరాజున కంకితము చేయబడినది. తెలుగు పుస్తకములయందును తామ్రశాసనాదుల యందును తిమ్మరాజునకు తిరుమలరాజనియు, తిరుమలరాజునకు తిమ్మరాజనియు యథేఛ్ఛముగా పర్యాయపదములవలె వాడబడినవి. సంస్కృత పండితులయిన హూణవిద్వాంసు లొకరు రాచూరికోటలో నొక గుమ్మమునకు దక్షిణముగా గోడలో గూర్చిన సుమారు నలువదియొక్క యడుగుల పొడుగును మూడడుగుల వెడల్పును గల రాతిపలకమీద చెక్కిన తెలుగు శాసనములో:
"శ్రీమతు మీసరగండగొఱ్ఱె గంగయ్యరెడ్డివారు పెద్దమానపురము
నందు సుఖసంకథావినోదంబున పృథివీరాజ్యము చేయుచుండగాను
తద్రాజ్య రక్షామణి అయిన శ్రీనారాయణదేవ దివ్యశ్రీపాదపద్మా
రాధక సకలజన ప్రతిపాలక పరబలసాధక సకలదయాసాధక పుణ్య
గుణసనాథ విఠ్ఠలనాథ భూనాథుండు ఆదావాని తుంబికి మాగుద
హాలువదుర్గాలు సాధించి తదనంతరంబు రాచూరి పట్టణ పట్టిసాభి ముఖుండై సుఖసంకథావినోదంబున పృథివీరాజ్యము సేయుచునుండి
శకవర్షంబులు 1216 అగు జయసంవత్సర మార్గశిర శుద్ధ దశమి
రవివాసరంబునందు స్వరాష్ట్ర సమస్త ప్రజారక్షణార్థము గిరిదుర్గము
రచియించెను."
అని కాకతీయప్రభువుల కాలములో శాలివాహన శకము 1216 వ సంవత్సరమునం దనగా క్రీస్తుశకము 1294 వ సంవత్సరమునందు గొఱ్ఱె గంగయ్యయు నొకానొక విఠ్ఠలరాజును ఉన్నట్లు చెప్పబడి యుండుటచేతను.
ఉ. "బొంకనిధర్మజుం డడుగబోవనిపన్నగశాయి యాజిలో
గొంకనియర్జునుండు కఱకుందులు లేనిశశాంకు డెన్నడున్
గ్రుంకనిభాను డన్యసతి గోరనిజిష్ణు డనంగబొల్చు ధ
ర్మాంకుడు విఠ్ఠలక్షితివరాగ్రణి మానధనాగ్రగణ్యుడై
మ. తనకు న్నెచ్చెలి యైనక్రీడిపయి నంతర్మోహబంధంబు పో
వనవాడై హరి విఠ్ఠలేశ్వరుడు తద్వంశంబునన్ సంపదల్
తనర న్నల్వదియేస్తరంబు లగునంతం దిమ్మభూపాలనం
దనుడై విఠ్ఠలరాజమూర్తి పొలిచెన్ ధర్మావనోద్యోగితన్"
ఇత్యాది పద్యములలో బాలభాగవతమునం దొకవిఠ్ఠలరాజు వర్ణింపబడియుండుట చేతను, ఆవిఠ్ఠలరాజే యీవిఠ్ఠలరాజని భ్రమించి యీ కవియు విఠ్ఠలరాజును పదునాల్గవ శతాబ్దారంభమునం దున్నట్లు వ్రాసియున్నారు. కాని వారు వివరించినకాలము సరియైనది కాదు. కాకతీయప్రభువుల కాలములో నున్న విఠ్ఠలరాజు వేఱొకడు కాని యీతడు కాడు. అత డొకవేళ రంగనాథరామాయణకృతికర్తయగు కోనబుద్ధరాజుతండ్రియైన విఠ్ఠలరాజయిన నయి యుండవచ్చును. కోనేరు కవి తనబాలభాగవతము నందు పదునేనవశతాబ్దారంభమం దున్న శ్రీనా థుని బూర్వకవినిగా స్తుతించియున్నాడు. కోనేరుకవియు విఠ్ఠలనాథుడును పదునాల్గవ శతాబ్దారంభముననే యుండినపక్షమున తరువాత నూఱుసంవత్సరములకు పయిగా పదునేనవశతాబ్దములో నున్న శ్రీనాథుని బూర్వకవినిగా పరిగణించుట సంభవించి యుండదుగదా ? కాబట్టి యీ కవి పదునాఱవశతాబ్దమధ్యమునం దున్నా డనుటయే విశ్వసనీయము. ఈతనికవిత్వ మనర్గళధార గలిగి హృదయరంజకముగానే కానబడుచున్నది. ఇప్పుడు బాలభాగవతములోని రెండు పద్యములనుమాత్ర మిందుదాహరించుచున్నాను.
చ. కలియును రాజచిహ్నములు గ్రక్కున మాని భయోపతాపదు
ర్బలు డయి తత్పదాబ్జములపై నిజహస్తము చేర్చి, దేవ! నీ
లలితకృపాణపుత్రిక ధళద్ధళితం బగుచున్న యంతలో
జలమఱియున్ ఝళఝ్ఝళితసంగత మయ్యె మదీయచిత్తమున్. [ఆ.1]
ఉ. మాన్యుల మ మ్మెఱుంగ కవమానముచేతకు దుష్టజన్మతా
దైన్యము కల్గె మాకు ననుతాపము నొందకు డీర లింక నే
మన్యము నొల్ల మేమియును నచ్యుతు గ్రమ్మఱ జేరగల్గు సౌ
జన్య మనుగ్రహింపు డని సారెకు బ్రార్థనసేయ నత్తఱిన్. [ఆ.2]
_______