ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/తెనాలి రామకృష్ణుడు
శా. సప్తద్వీపసముద్రముద్రితమహాసర్వంసహాచక్రసం
ప్రాప్తశ్రీకమనీయలక్షణజగత్ప్రావీణ్యసత్యవ్రతో
ద్దీప్తప్రాభవు డైనరాజసుతు డర్థిన్ దైన్యభావోదయ
వ్యాప్తిన్ బెత్తెడునేల కైన దగడే యంచు న్విలాపించుచున్. [ఆ.5]
__________
29. తెనాలి రామకృష్ణుడు.
ఈతనికి మొట్టమొదట రామలింగ మని పేరనియు, ఆపేరుతో నితడు శివభక్తిపరాయణు డయి లింగపురాణమును తెనిగించెననియు, చెప్పుదురుగారి యిది యెంతవరకు నిజమో తెలియదు. ఈతనిచే నాంధ్రికరింపబడినదన్న లింగపురాణ మిప్పు డెక్కడను గానబడదు. అప్పకవి మొదలగువారు రచించిన లక్షణగ్రంథములలో నందలిపద్య మొక్కటియు నుదాహరింపబడి యుండకపోవుటచే పూర్వకాలము నందుసహితమట్టి గ్రంథ మున్నట్టు తోచదు. ఈకవి మొట్టమొదట శివభక్తు డయినను విష్ణుభక్తులగు చంద్రగిరిరాజులను సంతోషపెట్టుటకయి తరువాత విష్ణుభక్తు డయి వైష్ణవులను గురువులనుగా గైకొనె ననియు గూడ జెప్పుదురు. ఈకథ సత్యమైనను గావచ్చును. ఇతడు రచియించినట్టు చెప్పెడు చాటుపద్యములలో గొన్నిటిలో నీతనిపేరు రామలింగమని కానబడుచున్నది. అందొకపద్యము నిందుదాహరించుచున్నాను-
ఉ. లింగనిషిద్ధు గల్వలచెలింగని, మేచకకంధరుం ద్రిశూ
లింగని సంగతాళి లవలింగని, కర్దమదూషిత న్మృణా
లింగని, కృష్ణచేలుని హలింగని నీలకచన్ విధాతృనా
లింగని, రామలింగకవిలింగనికీర్తి హసించుదిక్కులన్. కూర్మపురాణమునందు రాజలింగకవి కవిస్తుతిచేయుచు "రంగనాథుని రామలింగకవిని" అని రామలింగనామమునే వాడియున్నాడు. ఈరామకృష్ణకవి గృష్ణామండలములోని తెనాలిగ్రామమునందు శాలివాహనశకము 1384 వ సంవత్సరమున ననగా క్రీస్తుశకమ 1462 వ సంవత్సరమున జనన మొందెననియు, ఈతనియింటిపే రీశ్వరప్రెగడవారనియు, పయికాలమును సూచించెడి యీతని జన్మపత్రికవలన నితడు మంచిలగ్నమున బుట్టినట్టు కానవచ్చుచున్నదనియు, అఱువదిసంవత్సరములక్రిందట తమదక్షిణహిందూస్థానకవిచరిత్రమునందు కానలి వేంకటరామస్వామిగారు వ్రాసియున్నారు. అయినను మన కీతనికాలమును గూర్చి యిప్పుడు దొరకిన నిదర్శనములనుబట్టి చూడగా పూర్వోక్తకాలము సరియైనదని నమ్ముటకు వలనుపడదు. రామకృష్ణకవి దని చెప్పబడెడు జన్మపత్ర మిటీవలివారిచేత సృష్టింప బడిన దయి యుండవలెను. అటుగాక యితడు పయిని జెప్పబడిన సంవత్సరమునందే జన్మించి యుండినపక్షమున, ఈకవి కృష్ణదేవరాయలు సింహాసనమునకు వచ్చునప్పటికే దాదాపుగా నేబదియేండ్ల ప్రాయము గలవా డయి యుండవలెను. రామకృష్ణకవి యప్పయదీక్షితుల వారితోను తిరుమల తాతాచార్యులతోను సమకాలికు డయి చంద్రగిరిరా జగు వేంకటపతిరాయల ప్రభుత్వకాలములో నుండినవా డయినట్లు కొన్నినిదర్శనములు కనబడుచున్నవి. ఈవేంకటపతిరాయలు వసుచరిత్రమును కృతినందిన తిరుమలదేవరాయల యనంతరమున తనరాజధానిని విజయనగరమునుండి చంద్రగిరికి మార్చుకొని క్రీస్తుశకము 1585 వ సంవత్సరము మొదలుకొని 1614 వ సంవత్సరమువఱకును రాజ్యము చేసినవాడు. కృష్ణరాయని మరణానంతరమున నేబదియైదుసంవత్సరములకు రాజ్యమునకు వచ్చిన వేంకటపతిరాజుయొక్క రాజ్యకాలములో నున్న రామకృష్ణకవి నిజముగా నొకవేళ కృష్ణదేవరాయల కాలములో గూడ నుండుటయే తట స్థించినపక్షమున, అత డప్పుడు బాలు డయియుండెవలెనుగాని జన్మపత్రమునందు జెప్పబడినప్రకారము వయసుమీఱినవా డయియుండ జాలడు. కాబట్టి యాజన్మపత్ర మెంతమాత్రమును విశ్వాసపాత్రమయినది కాదు. ఈ కాలవ్యత్యాసమును సరిపఱుచుట కయి కొంద ఱప్పయ్యదీక్షితులవారుకూడ కృష్ణదేవరాయలకాలమునాటివారే యని చెప్పుచున్నారు. అప్పయ్యదీక్షితులవారు మిక్కిలి వృద్ధు లగువఱకును జీవించినవా రగుటచేత బాల్యమున కృష్ణరాయని దినములలో నుండిన నుండవచ్చునుగాని యీసంస్కృత విద్వత్కవి వేంకటపతిరాయల యాస్థానమునందే యుండి ప్రసిద్ధు డయినవాడు. ఈదీక్షితులవారు కాంచీపురమునకు నలుబదిమైళ్ళ దూరములోనున్న యదెపోల మను నగ్రహారమున నీశ్వరాంశచేత నారాయణదీక్షితులకు పుత్రుడయి పుట్టెననియు, ఇతడు తనపండ్రెండవసంవత్సరమునాటికే వేదాధ్యయనము చేసి "శివార్చనచంద్రిక" "శివతత్త్వవివేకము", "శివమణిదీపిక" "ఆత్మార్పణము" మొదలయిన శైవగ్రంథము లనేకములు చేసెననియు, వాదమునందు వేంకటపతిరాయలసంస్థానమున రాజగురువయిన తాతాచార్యుల నోడించి రజసమ్మానము పొందెననియు కావేరీతీరమునందనేక యాగములుచేసి యవసానదశయందు కాశీవాసము చేయవలెనని యఱువది యేండ్లు నిండినతరువాత ప్రయాణ మయిపోవుచుండగా త్రోవలో చిదంబర పురనివాసు లాతనిపోనీయక తమయూరనుండునట్లు ప్రార్థించి నిలిపినందున నపరకాశి యగు చిదంబరమునందుండి యందే దేహవియోగము నొందెననియు అతడు నూటికంటె నెక్కువపుస్తకములు రచించెననియు చెప్పుదురు. ఇప్పు డీమహాకవి రచించిన గ్రంథము లనేకములు నశించినవి. కువలయానందమనెడి యలంకారశాస్త్రము సుప్రసిద్ధమయి సర్వదేశములయందును వ్యాపించియున్నది. తనతండ్రికి గలిగిన గెలుపులను వర్ణించుచు నీలకంఠవిజయమను సంస్కృతగ్రంథమును జేసిన యయ్యదీక్షితు లప్పయదీక్షితులవారికి మేనల్లు డయి మధురరాజగు తిరుమలనాయకునియొద్ద మంత్రిగా నుండినందున, ఈతితుమలనాయకుడు మధురాపురము రాజధానిగా హూణశకము 1623 మొదలుకొని 1659 వ సంవత్సరమువఱకును పాండ్యదేశమును పాలించినందునను, ఆకాలమునుందుండిన యయ్యదీక్షితుల మేనమామయైన యప్పయ్యదీక్షితులవారు నూఱుసంవత్సరములక్రిందట కృష్ణదేవరాయలసభయందుండిరనుట నమ్మదగినదికాదు. అందుచేత దీక్షితులవారితోడిసమకాలికుడయిన రామకృష్ణకవియు కృష్ణరాయని యాస్థానమునందుండలేదనుట నిశ్చయము.
రామకృష్ణునిగూర్చి తాతాచార్యులవారితో సంబంధించినకథ లనేకములు చెప్పుచున్నారుగాన, దీక్షితులవారి చరిత్రమువలెనే యాచార్యులవారిచరిత్రమును మనకథతో నంతగా సంబంధించినది కాకపోయినను తాతాచార్యులవారినిగూర్చికూడ నిచ్చట గొంచెము వ్రాయుచున్నాను. ఈయనజన్మస్థలము కాంచీపురము; ఈతడు గొప్పవిద్వాంసుడును, సంస్కృతకవియు, ధర్మాత్ముడును అయి యుండెను. అప్పయ్యదీక్షితులవారు శివాంశచేత పుట్టిరని చెప్పినట్లే యితడు విష్ణ్వంశచేత గలిగెనని జనులు వాడుకొందురు. ఇతడు తనధనముతో బీదలకనేకవివాహములు చేయించినందున వీరివంశనామము తిరుమల వారయినను తరువాత కన్యాదానమువారని మాఱినది. ఈతడు గీర్వాణభాషలో "సాత్విక బ్రహ్మవిద్యావిలాసము" అనుగ్రంథమును జేసెను. ఇతడు చంద్రగిరిరాజులకు వంశగురువయి తఱుచుగా కాంచీనగరము నుండి చంద్రగిరికిబోయి వేంకటపతిరాయలసంస్థానమునందు వసించుటచేత, ఈయన కక్కడ రామకృష్ణకవితోడి సంబంధము కలుగుచు వచ్చెను. ఈతాతాచార్యులు మొట్టమొదట రామరాజు యొక్క రాజ్యాంతదశలో దలయెత్తి, వైష్ణవమతమునం దత్యంతాభినివేశము గలవాడయి తనశిష్యులయిన రాజులబలముచేత బలవంతముగా జనులను బట్టి చంక్రాంకణాదులు చేయుచువచ్చెను. అందుచేతనే "తాతాచార్యులవారిముద్ర భుజము తప్పినను వీపుతప్పదు" అనుసామెత నేటివఱకును వచ్చుచున్నది.
రామకృష్ణకవి యొక్క కాలమును నిర్ధారణము చేయుటకు దగిన యాధారములు కొన్ని తద్విరచితమైన పాండురంగమహాత్మ్యమునందే కనబడుచున్నవి. కవి యీక్రిందిపద్యములను కృతిపతియైన విరూరివేదాద్రియొక్క గురువునుగా కందాళ యప్పలాచార్యులవారిని వర్ణించి యున్నాడు.
సీ. వేదమార్గప్రతిష్ఠాదైవతజ్యేష్ఠు డభ్య స్తషడ్దర్శనార్థరాశి
యతిరాజరచితభాష్యగ్రంథనిర్ణేత యఖిలపురాణేతిహాసకర్త
బంధురదివ్యప్రబంధానుసంధాత పంచసంస్కారప్రపంచచణుడు
వాధూలమునిచంద్రవంశవర్ధనమూర్తి సకలదేశాచార్యనికరగురువు
పట్ట మేనుంగు శ్రీరంగపతికి నణ్ణ
గారిగర్భాంబురాశినీహారరశ్మి
సారసాహిత్యసర్వస్వశయ్యపేటి
యాళవందారు కందాళయప్పగారు.
వై జయంతీవిలాసమును రచియించిన సారంగు తమ్మకవియు నీకందాళ యప్పలాచార్యులవారినే తనగురువుగా విప్రనారాయణ చరిత్రముయొక్క ప్రథమశ్వాసమునం దీక్రిందిపద్యముచేత జెప్పియున్నాడు.
క. వందారు దాసజనతా
మందారు న్వేదశాస్త్రమహితప్రజ్ఞా
బృందారకగురు మద్గురు
గందాళాప్పలగురున్ జగద్ధితు గొలుతున్. పయిపద్యద్వయమునుబట్టి చూడగా రామకృష్ణకవియు తమ్మకవియు సమకాలీను లగుట స్పష్ట మగుచున్నది. వీరిలో తమ్మకవి తనవైజయంతీవిలాసమునందు తాను గోలకొండ కరణ మయినట్టును తనకాలము నందాదేశమును మహమ్మదుశాహి పాలముచేయుచుండినట్టును ప్రథమాశ్వాసములో నీక్రిందిపద్యమున జెప్పియున్నాడు.
చ. ఇనసమతేజులౌ నృపులనెల్ల మహమ్మదుశాహియేలు నీ
యెనుబదినాల్గుదుర్గముల నేలినయేలిక గోల్కొండ త
ద్ఘసనగరస్థలిన్ గరణికం బొనరించును దమ్మమంత్రి యా
జనపతి రమ్ము పొ మ్మన ప్రజ ల్జయపెట్ట గృహస్థు లౌననన్.
ఈమహమ్మదుశాహి నవాబుగానుండి గోలకొండరాజ్యమును క్రీస్తుశకము 1581 వ సంవత్సరము మొదలుకొని 1611 వ సంవత్సరమువఱకును పాలించినందున, ఈతని కాలమునందున్న తమ్మకవియు నాకాలమునందే జీవించియుండెను. తమ్మకవితోడి సమకాలికుడయిన రామకృష్ణకవియు నించుమించుగా నీకాలమునందే యనగా పదునాఱవ శతాబ్దాంతమునందును పదునేడవ శతాబ్దాదియందు నుండెననుటకు సందేహములేదు. కవియొక్క కాలనిర్ణయము చేయుటకు పాండురంగమాహాత్మ్యమునం దింకొకయాధారముకూడ కనబడుచున్నది. పాండురంగ మాహాత్మ్యమును కృతినందిన విరూరి వేదాద్రి యొక చిన్నజాగీరుదారయిన పెదసంగమరాజువద్ద ప్రధానిగా నుండెను. ఈవిషయము పాండురంగమాహాత్మ్యమునం దిట్లు చెప్పబడినది.
సీ. తనకులాచారవర్తన వైష్ణవాచారపర్యాయముల కొజ్జబంతియనగ
దనసూనృతముపురాతనసత్యనిధులయున్నతికి బునప్రతిష్ఠితముగా గ
దనబుద్ధి నీతిశాస్త్రరహస్యములు తెల్లముగ దెల్పువ్యాఖ్యానముద్రగాగ
దనవ్రాయుగంటంబుమొనవాడి విశ్వంభరాప్రజలకు బ్రాణరక్షగాగ వెలయు మంగయగురునభూవుభుని పెద్ద
సంగభూపాలమణి వ్రాయసప్రవర్తి
ప్రియయుతుం డైనరామానుజయసుతుండు
భద్రచారి విరూరి వర్దాద్రిశౌరి.
కృతినాయకు డైనవేదాద్రికి ఒరభువగుసంగరాజుయొక్క తండ్రి గురువరాజు సదాశివదేవరాయని రాజ్యకాలములో నుండి యాతని నలన శాలివాహనశకము 1465 వ సంవత్సరమునం దనగా హూణశకము 1545 వ సంవత్సరమునందు దేవుని నిమిత్తము నాలుగుగ్రామములు సంపాదించినట్టు మెకంజీదొరవారు సమకూర్చి చెన్నపురిలో ప్రాగ్దేశలిఖితపుస్తక నిలయమునం దుంచిన స్థానిక చరిత్రమువలన దెలియవచ్చుచున్నది. మంగయకొడుకైన గురువరాజును మంగయతమ్మునిగా జెప్పిన యాచరిత్ర మెంత నమ్మవచ్చునో యాలోచనీయముగా నున్నది. ఈకాలమును బట్టిచూచినను గురువరాజుకొడుకయిన సంగభూపాలుడు పదునాఱవ శతాబ్దముయొక్క కడపటి భాగమునందు రాజ్యము చేసినట్టే యూహింపదగియున్నది. ఆతని యాశ్రితు డగుటచేత రామకృష్ణకవియు 1560-70 సంవత్సరప్రాంతమునుండి కవియై యుండవచ్చును. కవి పాండురంగమహాత్మ్యమును వేదాద్రి కంకితము చేయునప్పటికే వేదాద్రికి కొడుకులు మొదలయినవారు కలిగియున్నట్లీపద్యము వలన దెలియవచ్చుచున్నది.
క.సోదరులు సుతులు సతులును
నేదోదితమార్గచర్య వినయము నయమున్
శ్రీదాంపత్యము నెసగగ
వేదాద్రిమహాప్రధాని వెలయుం గృతులన్.
రెట్టమతమును రచియించిన యయ్యలరాజు అయ్యలభాస్కరుల కాలమునుబట్టి చూడగా రామకృష్ణు డింకను దరువాతివాడని తెలి యవచ్చుచున్నది. పాండురంగ మాహాత్మ్యకృతిపతియగు విరూరి వేదాద్రి కాశ్రయుడగు పెదసంగభూపాలుని మేనల్లునికి రెట్టమతము నంకితమొనర్చిన యాకవులు తమకాలము నీక్రిందిపద్యముచే దెలిసికొనియున్నారు.
సీ. కలియుగప్రథమభాగమునాల్గువేలయెన్మిదినూర్లపైని డెబ్బదియునొకటి
శాలివాహనశకసమలిలవేయునార్నూటతొంబదిరెండు రూడిగా గ
బ్రభ వాదిగతములు పరగ నిర్వదిమూడు నేండ్లయ్యె నెంతయు నెన్నబుధులు
అట్టికాలంబున నయ్యల భాస్కర కవివర్యు లలరాజక మలహితుని
యాజ్ఞ బూర్వోక్త రెట్టమతాఖ్యకావ్య
మునునొనర్చిరి యాచంద్రముగను గీర్తి
వక్తృశ్రోతలకునుగల్గ వసుధమీద
నలయహోబల నృహరికి నర్పణముగ
సంగభూపాలుని యనుగ్రహవలన వేదాద్రిసంపదల నొందినట్లు
గీ. గుఱుతుగలరాజు మంగయ గురువరాజు
పుత్రు బెదసంగభూపాలుశత్రుజైత్రు
భానుసమతేజు విద్యావధానభోజు
గొల్చి వేదాద్రి నిత్యాలక్ష్ముల దలిర్చు.
ఇత్యాది పాండురంగమాహాత్మ్యములోని పద్యములు చెప్పుచున్నవి. పెదసంగభూపాలుడు గురువరాజుయొక్క తొమ్మండ్రుపుత్రులలో జ్యేష్ఠుడు. ఈతని తమ్ములనామము లాగ్రంథమునందు జెప్పబడి యుండకపోవుటచేత గ్రంథరచనకాలమునకు వారు బాలురనియు సంగభూపాలుడు యౌవనదశయం దుండినవా డనియు స్ఫురించుచున్నది. పెదసంగభూపాలుని తమ్ములనుగూర్చి రెట్టమతములో గృతిపతియొక్క తండ్రి యగుపెదతిమ్మరాజును వర్ణించుసందర్భమున నిట్లు చెప్పబడినది. గీ. అట్టి పెదతిమ్మరాజు ధైర్యాద్రిరాజు
మంగవిభుగుర్వశౌరియనుగు గూతు
సంగనాశిరోమణి బాపసంగమాఖ్య
బ్రేమవరియించె విభవాభిరాము డగుచు.
క. గుణనిధి యగుతత్కన్యా
మణిజనకుంబోధజనకు మంజులభాషా
ఫణివరు రణవిజయార్జును
బ్రణుతింప దరంబె గురువపార్ధివనర్యున్.
సీ. పృథులవిక్రమశాలి పెదసంగనృపతియు సత్యసంధుడు చినసంగరాజు
ధర్మగుణాడ్యుండుతమ్మభూపాలుండురుచిరకీర్తిధనుండు రుద్రఘనుడు
ప్రథనాంగణకిరీటి బసవనరేంద్రుండుస్థిరభాగ్యనిధి పెద చిట్టఘనుడు
సింధుగాంభీర్యుండు చినచిట్టవర్యుండు సతతధన్యుడు పొట్టిసంగశౌరి
కలితతేజుండు పాపసంగప్రభుండు
ననగ బరగినతొమ్మండ్రు తనయవరుల
గాంచి విజయసంశీలుడై మించె నౌర
మంగరాజన్యగురువసమ్రాడ్వరుండు.
క. ఆగురువరాజవరునకు|ద్యాగసముద్రునకు నల్లుడయి వెలసె ధరా
భాగధురంధరతను నా | భాగుడు పెదతిమ్మరాజు ప్రజలు నుతింపన్.
కృతిపతితల్లియు మంగయగురువ రాజుకూతురు నైన పాపసంగమాంబ పెదసంగభూపాలాదులగు తొమ్మండ్రుకును జెల్లె లయియుండ వచ్చును. అట్లయినచో నీమె సంగభూపాలునికంటె నిరువది యిరువదియైదేండ్ల చిన్నది కావచ్చును. కృతిపతియైన వేంకటరా జీమెయేడుగురుపుత్రులలో మూడవవాడు. కాబట్టి యితడు తల్లి కించుమించుగా నిరువదియైదువత్సరములప్రాయమునందు జనించి యుండ వచ్చును. అందుచే నీవేంకటరాజు తనమేనమామ యగు పెదసంగ భూపాలునికంటె నేబదియేండ్లు చిన్నవాడగుట యసంభవము కానేరదు. రెట్టమతమునందు కృతిపతియొక్క విక్రమధురంధరులైన యేడుగురు కొడుకులు వర్ణింపబడుటయేకాక కృతిపతియొక్క కొడగొట్టు తమ్మునిపుత్రులుసహిత మేవురు బాహుబలశాలులయి నట్లు వర్ణింపబడియున్నారు. అందుచేత నతడీగ్రంథమును గృతినందినకాలమున కనగా 1769 వ సంవత్సరమునాటికి మిక్కిలి వృద్ధు డయి యుండవలెను. అతని కప్పు డెనుబదిసంవత్సరములవయ స్సుండె ననుకొందము. అట్లనుకొన్నను పాండురంగమాహాత్మ్యము రచియింపబడినకాలము 1650 వ సంవత్సరమునకంటె బూర్వమయి యుండదు. అప్పటికి రామకృష్ణుడు వృద్ధు డనుకొన్నను, అతడు కృష్ణదేవరాయల యాస్థానమునందలి కవుల నాక్షేపించె నన్న కథలన్నియు నసత్యకల్పనములనుట స్పష్టము. అయినను మన మీకవులకాలమునుగూర్చి యింకను విచారింపవలసి యున్నది.
ఈరామకృష్ణకవి యాజ్ఞవల్క్య బ్రాహ్మణుడు; కౌండిన్యసగోత్రుడు; తండ్రి రామయ్య; తల్లి లక్ష్మమ్మ. తాను తెనాల్యగ్రహారనిర్ణేత యయినట్టును, ఆశుకవిత్వాదులయందు మేటియైనట్టును, కృతిపతి తన్నుద్దేశించి పలికినట్టుగా కవియే పాండురంగమహాత్మ్యమునం దీక్రింది పద్యములతో జెప్పుకొనియున్నాడు.
క. నను రామకృష్ణకవి గవి
జనసహకారావళీవసంతోత్సవసూ
క్తినిధి బిలిపించి యర్హా
సనమున గూర్చుండ బనిచి చతురత ననియెన్.
సీ. నలుదెఱంగులకావ్యనవసుధాధారలఘనుడనాశువునందుగరముమేటి
వఖిలభూమీపాలకాస్థానకమలాకరోచ్చయతరుణసూర్యోదయుడవు శైవవైష్ణవపురాణావళి నానార్థరచనాపటిష్ఠైకరమ్యమతివి
లౌకికవైదికలక్షణచాతుర్యధైర్యప్రభారూడకార్యచణుడ
వాంధ్రభూమీకుచాగ్రహారభ మైన
శ్రీతెనాల్యగ్రహారనిర్నేత వగ్ర
శాఖికాకోకిలమ వీవు సరసకవివి
రమ్యగుణకృష్ణ రామయరామకృష్ణ
క. కౌండిన్యసగోత్రుడ వా
ఖండలగురునిభుడ వఖిలకావ్యరససుధా
మండనకుండలుడవు భూ
మండలవినుతుడవు లక్ష్మమావరతనయా.
క. యశము గలిగించు నీమృదు
విశదోక్తుల బౌండరీకవిభుచరిత జతు
ర్దశభువనవినుతముగ శుభ
వశగతి నాపేర నుడువు వరత త్త్వనిధీ.
ఉ. స్కందపురాణనీరనిధికౌస్తుభమై ప్రభవించుదేవకీ
నందనుసత్కథోద్యమము నవ్యకవిత్వకళాకలాపమున్
కుందనమున్ ఘటించి కడుగ్రొత్తగు సొమ్మొనరించి విష్ణుసే
వం దిలకించునప్పరమవైష్ణవకోటి నలంకరింపుమా.
మ. ఉదయం బస్తనగంబు సేతువు హిమవ్యూహంబునుం జుట్టిరా
విదితంబైనమహిన్మహాంధ్రకవితావిద్యాబలప్రౌడి నీ
కెదు రేరీ సరసార్థబోధఘటనాహేలాపరిష్కార శా
రద నీరూపము రామకృష్ణకవిచంద్రా సాంద్రకీర్తీశ్వరా!
ఈపద్యములనుబట్టి చూడగా కవి కొంతవఱ కాత్మశ్లాఘాప్రియుడని తోచక మానదు. ఇత డెంతప్రౌడకవియైనను స్వోత్కర్షప్రకట నము నింతగా జేసికొనక నమ్రతనుజూపినచో నధికశ్లాఘాపాత్రుడయి యుండును. ఈతనినివాసస్థలము కృష్ణామండలములోని తెనాలియగ్రహారము;ఇతనిపూర్వులు కాపుర ముండినచోటు తెనాలికి రెండుక్రోసుల దూరములోనున్న గార్లపాడు గ్రామమనియు, ఇతడు తననివాసము నచ్చటనుండి తెనాలిగ్రామమునకు మార్చుకొనెననియు నొకరు వ్రాసి యున్నారు. ఇతడు చిన్నతనములో బట్టుపల్లెయను గ్రామమునందుండు బట్రాజులతో సాంగత్యముచేసి, వారిచెలిమిచేత సంస్కృతాంధ్ర సాహిత్యమును కవిత్వకౌశలమును సంపాదించి బుద్ధిబలముచేత ప్రబంధ కవీశ్వరుడయి వన్నెకెక్కెనట. ఇతడు రచియించిన పుస్తకము పాండురంగమహాత్మ్య మను స్థలపురాణము. ఇందు గొన్నివర్ణనలు విలక్షణముగానుండును. "పాండురంగ విభుని పదగుంభనంబును" అన్నట్లితని కవిత్వము పదముల కూర్పుచేత మేలిమి గన్నది. అందు నిరర్థకపదము లెక్కడనోకాని కానబడవు.
క. అటు లేనియు జెప్పెద నీ
పొటిపొటితలపోత లెల్ల బోవ నడువు మా
రట ముడుగు నెమ్మనము నొ
క్కటిగా నొనరించి గట్టిగా విను మధిపా.
ఇత్యాదిపద్యములలో గట్టిగా లోనగుపదము లొకానొకటి యక్కడక్కడ వ్యర్థములుగాదోచినను మొత్తముమీద బదసందర్భమితనికి గుదిరినట్లు మఱియొకకవికి గుదిరిన దని చెప్ప వలనుపడదు. ఈపాండురంగమాహాత్మ్యమునకే పాండురంగవిజయమని నామాంతరము గలదు. ఇదిగాక పాండురంగవిజయమని రామకృష్ణకవివిరచితగ్రంథము వేఱొకటియున్నదని కొంద ఱందురుగాని యామాట పాటింప దగినది కాదు. ఈకవికి తరువాత నల్పకాలములోనే యున్నయప్పకవి లోనుగాగలలాక్షణికు లొక్కరును పాండురంగవిజయ మున్నదనిచెప్పి దాని లోనుండి యొక్కపద్యమునైన నుదాహరించియుండలేదు. ఇప్పుడు పాండురంగవిజయములోనివని యందందు జదువబడెడు పద్యములలో ననేకము లితరగ్రంథములలోనివిగాను కొన్ని యప్రౌడకవికల్పితములుగాను గానబడుచున్నవి. ఎట్లనగా,
సీ. భుజగలోకాధీశభోగతల్పశయాన హరిరూపధర మహాపురుష యనుచు
నతులాబ్జమకుటవర్ణితపాదరాజీవ రామార్చనీయ శ్రీరంగయనుచు
మారీచమదభంగ మహితవాయవ్యాస్త్రశరదనిద్రితనేత్రశౌరియనుచు
సముదగ్రవర్షావసరయోగనిద్రాణ కరిరాజవరద శ్రీకాంతయనుచు
దల కు నులుకును నలుకు బెగ్గిలుచు బలుకు
సఖులనయనస్వరశిరోజచరణకలన
పవనకందర్పఘనహంసజవనతురగ
భటనటప్రియసముదాయపటిమదోప
ఈపద్యము పాండురంగవిజయములోనిదని సర్వసాధారణముగా జదువుదురు. నిజము విచారింపగా నిది పైడిమఱ్ఱి వేంకటపతికృతచంద్రాంగదచరిత్రమునందలి చతుర్థాశ్వాసములోనిది. ఇట్లే
గీ. అరుణపల్లవరుచిబోలు నా పదంబు
లాపదంబుల బోలు సయ్యలకజాత
మలకజాతముబోలు న న్నెలతనడుము.
నిత్య ముఖ లీలబోలు న న్నెలతనడుము.
అను నీపద్యము పాండురంగవిజయములోని దని కొందఱు చెప్పుచున్నను. ఇది సింహాద్రి వేంకటాచార్య విరచితమైనచమత్కారమంజరిలో గనబడుచున్నది. ఈప్రకారముగానే పాండురంగవిజయములోని వని చదువబడెడు మఱికొన్నిపద్యము లితరప్రబంధములోనివిగా గనబడు చున్నవి. తాను ప్రబంధరూపముగా బాండురంగమహాత్మ్యములో జెప్పినకథనే స్వీకరించి యాకవియే మరలపాండురంగవిజయమని మఱి యొకప్రబంధము జేయవలసిన యావశ్యకముసహిత ముండదుగాన పాందురంగవిజయమని వేఱొకప్రబంధ మున్న దన్నవార్త కల్లయని నిశ్చయింపవలసి యున్నది. ఇతడు నిరోష్ఠ్యరామాయణము మొద లయిన చిత్రకావ్యములను రచియించెనని యొకప్రవాదము కలదుగాని యదియు నిజమయి యుండదు. ఇతడు వికటకవి యనియు, అనేకుల ననేకవిధముల వంచించె ననియు, పెక్కు కథలు చెప్పుదురుగాని పాండురంగమహాత్మ్యము నంతటి భక్త్యావేశముతో రచియించిన వైష్ణవభక్తాగ్రేసరుడు పామరజనై కాదరణీయములైన తుచ్ఛకార్యములను లోనగునాయని సందేహింపవలసియున్నది. ఈదేశములో పామరజనులు కవులు రసికులని చూపుట కయి వారికి వేశ్యాగమనదోషాదు లారోపించుట చిరకాలమునుండి యాచార మయి యున్నది. ఇతడు వికటకవియని చూపుట కయి యితడు రచియించిన పుస్తక మొక్కటియు లేదు.
"శష్పవిజయంబు చెప్పెద జిత్తగింపు
మేకదంతుండు నీకిచ్చు నింతబొచ్చు."
ఇత్యాదు లగుయతిభ్రంశదోషాదులను గలిగిన పనికిమాలిన బూతుపుస్తకము నొకదాని నెవ్వరో మహాత్ములు "శష్పవిజయ" మనెడి యపాత్రపు పేరితో రచియించి దాని కర్తృత్త్వమును రామకృష్ణున కారోపించిరిగాని యం దొకపద్యము నైనను జదివినవారి కాపాడుపుస్తకమునందు జూపినయహంభావమునుబట్టి యిత డితరకవులగ్రంథముల నాక్షేపించి పద్యములు చెప్పెనన్నంతవఱకు నమ్మవచ్చును.
ఈరామకృష్ణకవికి మొట్టమొదట రాజాస్థానమునందు బ్రవేశము కలుగకపోయినను రాజపురుషుల నాశ్రయించి వారిమీద పద్యములు చెప్పి వారిమూలమున కడపట రాజానుగ్రహము సంపాదించుకొనెనట! అట్లయ్యు నితడు సాధుస్వభావము కలవాడు కానందునను, పరుల వంచించుటయందును పరిహసించుటయందును ఆసక్తికలవా డయినందు నను, ఏవో కొంటెపనులు చేయుచువచ్చి పలుమాఱు రాజుల యాగ్రహమునకు పాత్రు డగుచు వచ్చెనట! ఇందు గొంతసత్య ముండకపోదు. అట్లుకానియెడల నితడు తనగ్రంథములను పేరుగలరాజుల కెవ్వరికి నంకితము చేయక యొకవ్రాయసగాని కంకితము చేయుట తటస్థించి యుండదు. మహమ్మదీయుల దాడిచేత పేరుగల హిందూరాజ్యములు నశింపంగా ధనసంపన్నుడుగాని రామకృష్ణకవి స్వకుటుంబపోషణార్థమయి ధనస్వీకారముచేసి తనగ్రంథమును సంగరాజుజాగీరులోని విరూరి కరణమున కంకితము చేసినను చేసియుండవచ్చును. కృతిపతి యయిన వేదాద్రికి వాసస్థానముగా నుండినవిరూరు నెల్లూరుమండలములో పినాకినీనదికి వంతెనగట్టదలచిన సంగమునకు రెండు క్రోసులదూరమున నున్నది.
రామకృష్ణుడు చేసినయపరాధములను దెలిపెడుకథలలో నొకటి రెంటి నిందుదాహరించుచున్నాను.
ఒకప్పు డితడు రాజగురు వయిన తాతాచార్యులవిషయమున చెప్పరాని మహాపరాధమును జేసినందున, రాజు దురాగ్రహగ్రస్తుడై యీతనిని తలవఱకు భూమిలో పాతిపెట్టి యేనుగుచేత తల త్రొక్కింపుడని రాజభటుల కాజ్ఞ యిచ్చెనట. రాజభటు లాతనిని గొనిపోయి యూరిబయలను కంఠములోతు మంటిలో పాతిపెట్టి, త్రొక్కించుటకొఱ కేనుగును దీసికొనివచ్చుటకై వెళ్ళిరట. ఈలోపల గూనిచాకలి వాడొక డామార్గమున బోవుచు రామకృష్ణుని జూచి యిది యేమని యడుగగా, అతడు తనకు సంభవించిన గూను పోగొట్టుకొనుట కయి వైద్యులయాజ్ఞ చొప్పున దా నీచికిత్సను జేయించుకొనుచున్నా ననియు గూను పోయినదో లేదో పయికితీసి చూడవలసిన దనియు వానితో జెప్పెనట. వా డాప్రకారముగా జేసి యాతనికి గూను లేకుండుట కద్భుతబడి తన కాచికిత్స చేయమని కోరగా, రామకృష్ణుడు వానిని పాతిపెట్టి తాను పలాయితుఁ డయ్యెనట. అటుతరువాత రాజభటు లేనుఁగును గొనివచ్చి దానిచేత చాకలవానితల త్రొక్కించిరట. రాజభటులు పోయి తాము రామకృష్ణుని జంపినమాట రాజుతో విన్నవించిన తరువాత రామకృష్ణుఁడు రాజసభకుఁ బోయి సభవారందఱు విస్మయపడునట్లుగా రాజసందర్శనము చేసి తనయం దీశ్వరుఁ డనుగ్రహించి చచ్చినవానిని మరల బ్రతికించి పంపెనని రాజునకు నమ్మకము పుట్టు నట్లుగాఁ జెప్పి నమ్మించి రాజువలన నూఱుతప్పులు క్షమించునట్లు వరము పొందెనట.
ఇంకొకసారి రామకృష్ణుఁడు తాతాచార్యులను మోసముచేసి తన్ను మూఁపుమీద నెక్కించుకొని రాజమందిరము చేరువనుండి మోసుకొనిపోవున ట్లొడఁబఱిచె ననియు, ఆచార్యులవా రాతనిని మోసుకొని రాజవీధిలోఁ నడుచుచుండగా రాజు మేడమీదనుండి చూచి కోపించి పయివానిని తన్ని యీడ్చుకొనిరండని తనభటులకాజ్ఞ యిచ్చెననియు, రామకృష్ణుఁ డామాటలువిని చివాలున తాను క్రిందకుఱికి గురువర్యుల పాదములమీఁదఁ బడి తానుచేసిన భాగవతాపచారము క్షమింప వేడుకొని పాప పరిహారార్థముగా నాతనిని తనవీఁపుమీఁద నెక్కించుకొని మోచెదనని చెప్పి యొప్పించి తాతాచార్యులను భుజములపయి నెక్కించుకొని నడుచుచుండఁగా రాజభటులువచ్చి పయినున్నగురునే తన్ని రాజసన్నిధి కీడ్చుకొని పోయిరనియు, అందుమీద రాజునకు మఱింత యాగ్రహమువచ్చి గురుద్రోహియైన యాఖలుని వెంటనే శిరశ్ఛేదము చేయుఁడని భటుల కాజ్ఞ యొసఁగె ననియు, రాజభటుల కతడు లంచమిచ్చి తన్నువిడిచిపెట్టి యొకమేనుజంపి దాని నెత్తురు గొనిపోయి రాజునకు జూపునట్లు వారి నొడఁబఱిచెననియు, రాజు కోపముతీఱి బ్రహ్మహత్య చేయించినందునకుఁ బశ్చాత్తాపపడుచున్న కాలములోఁ దాను బ్రహ్మరాక్షసుఁ డయినట్లు వేషమువేసి రాజును జడిపించి తరువాత నిజమును జెప్పి రాజుచే మన్నింపబడి బహుమానముల నందెననియు మఱియొక కథగలదు.
ఇట్లే యిత డనేకకవులను విద్వాంసులనుగూడ నాక్షేపించిన పెక్కుకథలుగలవు. అవి యెంతవఱకు సత్యములో చెప్పజాలము. అయినను వానిలో గొన్ని సత్యములు కావనియు నిటీవలి కాలమున గల్పింపబడినవనియు మనము సులభముగా నూహింపవచ్చును. ఇతడు రచియించినపాండురంగ మాహాత్మ్యకృతికి నాయకుడగు వేదాద్రి---- గురువైన కందాళ అప్పలాచార్యులువారు సభకు వచ్చునప్పుడు వ్యాకరణశాస్త్రమునందలి యాయనపాండిత్యప్రకర్షమును శ్లాఘించిన నొకశిష్యుడు,
శ్లో. "అపశబ్దభయం నాస్తి| అప్పలాచార్యసన్నిధౌ"
అని చెప్పగా రామకృష్ణుడు,
"అనాచారభయం నాస్తి |తిష్ఠన్మూత్రస్యసన్నిధౌ"
అని శ్లోకపూర్తిచేసి పరిహసించెనని చెప్పుదురు. దీనిని తెలుగించినచో శిష్యుడు చేసిన శ్లోకముయొక్క పూర్వార్థము
గీ. "అప్పలాచార్యసన్నిధియందు (వీస
మంతయిన)నపశబ్దభయంబు లేదు"
అనియు, దానిని పూరించిన రామకృష్ణునియొక్క యుత్త----
"నిలిచి మూత్రవిసర్జన సలుపువాని
వద్ద (గూడ) ననాచారభయము లేదు"
అనియు నగును. శబ్దశాస్త్ర పాండిత్యమునుబట్టి యెట్టి శబ్దము నైన సుశబ్దమునుగా సాధింపగల సామర్థ్యముగల తన--వద్ద నెవ్వరును నపశబ్దమునకు భయపడవలసిన యక్కఱలేదని --వచ్చునట్లు శిష్యుడు శ్లాఘించినప్పుడు నిలుచుండి మూత్రము--వానివద్ద సనాచారభయ మెట్లక్కఱ లేదో యట్లే శుంఠయైన యీ యాచార్యునివద్ద నవశబ్దభయ మక్కఱలేదని విపరీతార్థము వచ్చునట్లు శ్లోకము పూరించి యాక్షేపించి వైష్ణవభక్తాగ్రేసడైన రామకృష్ణుడు భాగవతాపచారము చేయునని నమ్మదగియుండలేదు.
"కలనాటిధనము లక్కఱగలనాటికి" అను పెద్దనపద్యముపై రామకృష్ణకవి యాచేపణ చేసె నన్నకథ కల్పితమని యీవఱకే యల్లసాని పెద్దన చరిత్రమునందు జెప్పియున్నాముగదా ? ఆప్రకారముగానే రామకృష్ణకవి ముక్కు తిమ్మనార్యునియెడ గూడ నొకయపరాధము చేసెననియు, తిమ్మన యలిగి పండ్లూడదన్నగా మఱునాడు రామకృష్ణకవి దుప్పికొమ్ముతో నూడినపల్లమర్చుకొని కృష్ణరాయలసభకు వచ్చి కూరుచుండ రామభూషణకవి యెఱిగి రాజు "రవిగాననిచో గవికాంచునేకదా" యన్న సమస్య నిచ్చినప్పుడు
ఉ. ఆరవి వీరభద్రునిపదాహతి డుల్లినబోసినోటికిన్
నేరడు, రామకృష్ణకవి నేరిచెబో మనముక్కుతిమ్మరాట్
క్రూరపదాహతిం బడినకొక్కిరిపంటికి దుప్పికొమ్ము ప
ల్లా రచియింప; నౌర! రవిగాననిచో గవి గాంచునేకదా.
అని పూరించి యతని నవమానపఱిచెననియు, చెప్పెడికథ కూడ రామకృష్ణకవి ముక్కు తిమ్మనకాలములో నుండినవాడు కాకపోవుటచేత నిటీవలి బుద్ధిమంతులచే గల్పింపబడినదనియే నిశ్చ యింపవలసియున్నది. ఇతడు రామరాజభూషణునితో సమకాలికుడే యయినను, రామరాజభూషణుని వసుచరిత్రములోని "శ్రీ భూపుత్రి" యను పద్యముమీద రామకృష్ణుడు చేసెనన్న యాక్షేపణము పండితులు చేయదగినది కానందున దానిని సహితము సత్యమని నమ్ముట కాధారము కనబడదు. ఇతడు రామరాజభూషణుని కవిత్వము నాక్షేపించుచు, క. చీపరపాపరతీగల| జేపలబు ట్టల్లినట్లు చెప్పెడు నీయీ
కావుకవిత్వపుమాటలు| బావనకవివరునిచెవికి బ్రమదం బిడునే?
అని చెప్పినట. నిజముగా రామకృష్ణకవియే చెప్పిన దయిన యెడల నీర్ష్యచేతనే చెప్పినదనవచ్చును. ఒకానొకకవి రాయలయాస్థానమునకు వచ్చినప్పుడు
క. తువ్వట బాబా, తలపై
పువ్వట, జాబిల్లి, వల్వ బూదట, చేదే
బువ్వట, చూడగను హుళి
క్కవ్వట, యరయంగ నట్టిహరునకు జేజే.
అను పద్యమునుజెప్పి తాటాకుమీద వ్రాయమని యిందలి "తువ్వ" "హళుక్కి" అను పదములను వికారముగా జదివి రామకృష్ణు డాకవిని పరాభవించి పంపెనని చెప్పుదురు. ఈకథ కేవలపామరజనై కాదరణీయము. అప్పకవీయమునం దుదాహరింపబడిన రామకృష్ణకవి యొక్క చాటుపద్యముల రెంటిలోను,
క. బసవనకు బుట్టినప్పుడె
పసరము గోవిందరాజు పసరం బైనన్
గస వేటికి దిన డనగా
గసవుం దిను శత్రు లాజి- గదిసినవేళన్.
అను పద్యమువలన నతడు పరులను దూషించుస్వభావము కలవాడయినట్టు కనబడుచున్నను,
క. చిన్నన్న ద్విపద కెరగును
బన్నుగ బెదతిరుమలయ్య పదమున కెరగున్
మిన్నంది మొరసె నరసిం
గన్నకవిత్వంబు పద్యగద్యశ్రేణిన్. అను పద్యమువలన నత డితరులకవిత్వమందలి గుణములను గ్రహించి శ్లాఘించు గుణగ్రహణపారీణు డనియు స్పష్టపడుచున్నది.
తెనాలి రామకృష్ణుని యిందుధరోపాఖ్యానములోనిదని,
మ. ఒకనా డిందుధరుండు బార్వతియు లీలోద్యానకేళిసరి
న్నికటానేకవనప్రదేశముల దైతేయేంద్రకన్యాప్సరో
నికురుంబంబులు పారిజాతకుసుమానీకంబు పై జల్ల ద
ర్పకబాణంబుల కెల్ల నెల్లయగుసౌభాగ్యంబు శోభిల్లగన్.
అనెడి యీపద్యము రంగరాట్చందమునం దుదాహరింపబడి యున్నది. అప్పకవి యీపద్యమునే యాదిపురాణములోనిదని యుదాహరించి యున్నాడు. ఆదిపురాణమును, ఇందుధరోపాఖ్యానమును వేఱు వేఱు గ్రంథములలో, ఒక్క గ్రంథమునకె రెండును వేఱువేఱు పేరులో, మా కాగ్రంథములు లభింపకపోవుటచేత మే మిప్పుడు చెప్పజాలము. ఈపద్యము సోముని హరివంశములోనున్నది. కాబట్టి యిది పై రెండు గ్రంథములలోను దేనిలోనిదియు గానట్టు తోచుచున్నది. ఈకవి యొక్క పాండురంగమాహాత్మ్యములోని కొన్నిపద్యముల నుదాహరించి యీతని చరిత్రము నింకటితో మగించుచున్నాము:-
మ. బొమలెక్కించిన విల్లువంచు నునుజూపు ల్చంచలాచంచల
క్రమరేఖ న్నిగిడింప శాతవిశిఖౌఘంబుల్ మెయిన్నించు నె
య్యమునన్ బల్కగ నల్కమీఱి చటులజ్యాఘోషముంజేయు స
య్యుమప్రా పొంది రతీశ్వరుండు హరు బిట్టోడింప నుట్టాడుచున్. [ఆ.1]
చ. హరిహయదేశికాభు డగునమ్మహిదై వతమౌళియందు బం
గరువునకున్ మృగీమదసుగంధము సంధిలుభాతి నంబుజో
దరచరణారవిందసతతస్మృతిలోలుప యైనబుద్ధియున్
బరిణతి గాంచెసంపదలపై మఱియుం జనియించు సంపదల్. [ఆ.2] శా. ప్రారంభించినవేదపాఠమునకుం బ్రత్యూహమౌనంచునో
యేరా తమ్ముడ నన్ను జూడ జనుదే వెన్నాళ్ళనోయుండి ఛ
క్షూరాజీవయుగంబు వాచె నిను గన్గోకున్కి మీబావయున్
నీరాక న్మది గోరు జంద్రుపొడుపున్ నీరాకరంబుంబలెన్. [ఆ.3]
మ. వలనా యేటికి నాశ్రయించి మనగా నానీరమున్ నీరమున్
దలవెఱ్ఱే పంచరింపనేటికి సమిద్దానంబు దానంబున
చ్చలమా యేటికి నెత్తి గట్టుకొనగా సన్యాసము న్న్యాసమున్
గలి దేజాలు మదీయభక్తిరుచి భక్తశ్రేణి కశ్రాంతమున్. [ఆ.4]
సీ. నిలువున నొలిపించె విలువంగడము నెల్లశరములయాయంబు బొరయు టుడిపె
దగశబ్దమాత్రపాత్రముచేసె గుణలతమ్రాకున గట్టించెమౌలబలము
గంచుకివశము గావించెనేనానాధు గట్టించె సహచరు గటికియెండ
బ్రతిపక్షభావసంగతుడనిహితుజూచె వర కేతసముకీర్తిభరముడులిపె
ధర్మనిర్మలబుద్ధి సుశర్మ గదిసి
గెలువగా లేక చని కోపగించి మదను
డురక తనవార లతనికి నోడు మనిరె?
పతికి గీడౌట బంట్లపాపంబు గాదె?