ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/తెనాలి అన్నయ్య
శా. తావు ల్గుల్కెడుమేనుతీవకు బరీతాపంబు గావించునీ
జీవంజీవమనోజ్ఞ మూర్తి యకటా శీతాంశువా కాదు శో
భావై రూప్యమునన్ జనభ్రమదమౌ భస్మానృతానంగతే
జోవై శ్వానరవిస్ఫులింగముసుమీ చూడన్ దిశానాయకా.
38. తెనాలి అన్నయ్య
ఈకవి సుదక్షిణాపరిణయమనెడి యైదాశ్వాసముల ప్రబంధమును రచియించెను. ఇతడు తెనాలి పురనివాసుడు; శైవాచార సంపన్నుడు; రామపండితపుత్రుడు.
శా. శ్రీలీలాహరినీలపీఠరుచిరశ్రీవత్ససంపన్నవ
క్షోలాలిత్యుడు వేంకటేశుడు కృపం గోనేటిరామక్షమా
పాలస్వామిసమస్తరాజ్యభరణోపాయాధికున్ హృద్యవి
ద్యాలోలున్ బులిజాలరామవిభుసోమామాత్యునిం బ్రోచుతన్.
సుదక్షిణాపరిణయములోని యీప్రథమపద్యమునుబట్టియే యీకావ్యము కోనేటి రామరాజు మంత్రియైన పులిజాల సోమామాత్యున కంకితము చేయబడినట్టు తెలిసికోవచ్చును. ఆసోమామాత్యు డొకనాడు సభాసీనుడయి తన్ను రావించి కృతి వేడిన ట్లీక్రిందిపద్యములలో గవి చెప్పుకొనియున్నాడు-
మ. కవులున్ గాణలు జాణ లార్యులు హితుల్ కాంతానమూహంబు లు
త్సవలీలం దను గొల్వ నిండుకొలువై సత్కావ్యగోష్ఠీవిశే
షవినోదై కపరాయణత్వమును రాజ్యశ్రీవిహారంబు బ్రా
జ్యవివేకంబు దనర్ప రామవిభుసోమామాత్యు డత్యున్నతిన్.
గీ. నవ్యసుగుణాభిరామ తెనాలిరామ
పండితాగ్రణిసత్పుత్రు భవ్యమిత్రు
హరపదాంభోజసౌముఖ్యు నన్న పాఖ్యు
నన్ను బిలిపించి యాదరోన్నతి వహించి.
చ. పలుకులకల్కి కప్పురపు బల్కులుచల్లినరీతి బండువె
న్నెలతళుకుల్ విభుండు హవణించినమించున శంబరారి చెం
గలువలతూపుకోపుల ముఖాముఖి జూపినయేపునం గృతుల్
పలుకగ నేర్తు పూర్వకవిపద్ధతి రామయయన్న సత్కవీ.
గీ. సరససాహిత్యసౌహిత్యపరత నీవు
పరిడవించుసుదక్షిణాపరిణయంబు
కీర్తి విలసిల్ల మాకు నంకితము సేయు
తేట యగువాగ్విలాసంబు కోటిసేయ.
ఇక దీనినిబట్టి కృతికర్తయొక్క కాలనిర్ణయము చేయవలసి యున్నది. కృతిపతియొక్క కాలము తెలియునేని, కవియొక్క కాలమును దెలియును. కృతినాథుని ప్రభువైన రామరాజుయొక్క వంశము గ్రంథమునం దీవిధమున జెప్పబడినది-
గీ. చంద్రవంశాబ్ధిపూర్ణిమాచంద్రు డారు
వీటి బుక్కయరామభూవిభునిసుతుడు
తిమ్మరాజేంద్రు డన్వయదీపకుండు
కనియె బినకొండభూపాలు ననఘశీలు.
చ. కులనిధి యానృపాలకుడు కోనమదేవి వరించి కాంచె జే
కొలది నరాతులం దునుముకోనేటితిమ్మనరేంద్రు భూమిభృ
త్తిలకము జిన్నతిమ్మవిభు ధీరసుధానిధి నప్పరాజు ని
ర్దళితవిరోధిభూవరకురంగుని రంగనృపావతంసమున్.
క. కందాళ భావనార్యుల | నందను శ్రీరంగగురుని నతబుధరక్షా
మందారంబు నుతింతును | మందారమరందబిందుమధురారభటిన్.
సుదక్షిణాపరిణయకవిత్వము సలక్షణమయి కర్ణ రసాయనముగా నున్నది! కవిత్వ మాధుర్యము తేట పడుటకయి కొన్నిపద్యము లిందుదాహరింపబడుచున్నవి-
చ. పలుకగ నేర్చుచిత్రములు పాడగ నేర్చినపుష్పవల్లికల్
మెలగగ నేర్చురత్నములు మెల్లన నడ్వగ నేర్చుచంచలల్
నిలుకడ నేర్చువెన్నెలలు నెయ్యముతియ్యము నేర్చుపై డిక్రొం
దళుకు లనం జెలంగుదురు తామరనేక్షణ లప్పురంబునన్. [ఆ.1]
చ. ఏనొకవింతయే రఘుకులేశ్వర యాదిమవిష్ణుమూర్తివై
యీనిఖిలావనీతలము నేలెడు నిన్ గనుగొంటి నేడుగా
నానియమంబు నాజనము నాతపమున్ ఫలియించె భక్తి స
న్మానధురంధరత్వమున నా జననాయక యిట్లుపల్కుటల్. [ఆ.1]
ఉ. విప్రకులావతంస వినవే యనుమానము మాని పుత్రకుం
డప్రతిమప్రభావనిధి యన్వయదీపకు డుద్భవిల్లు న
వ్యప్రచురాంగకాంతిభరయౌ వనలక్ష్మీయు నిన్ను జెందు ని
త్యప్రమదంబు చేకుఱుమహౌషధ మొక్కటి నీకు నిచ్చెదన్. [ఆ.2]
చ. నృపవర నిన్ను మీ దెఱుగనేరక వేడితి గాక చంచలా
చపలము లైన రాజ్యసుఖసంపదలన్ మదినమ్మి కీర్తియుం
గృపయు వివేకమున్ నయము గేవలధర్మపరత్వమున్ సదా
కపటమతిం దొఱంగుమహికాంతుల కేడ పరోపకారముల్. [ఆ.2]
మ.జలకంబుం దగగూర్చి నెన్నుదుట రక్షాకాంక్ష బాదాంగుళీ
స్థలమృత్స్నాతిలకంబు దీర్చి రుచులం దట్టాడువజ్రంపుటు
య్యలపై బొత్తుల నుంచి యోకుధరకన్యాధీశదివ్యాంశపే
శలమూర్తీ నిదురింపవే యను సుతుం జంద్రాస్య జోకొట్టుచున్. [ఆ.2]
ఉ. వాడినమోముతోడ గయివాలినచూపులతోడ దీనతం
గూడినపల్కుతోడ నెఱిగూడనిగందపు బూతుతోడ గీ
లూడినయందెతోడ బిగియూడినతాలిమితోడ వచ్చె గీ
గ్గాడియుబోలె గామగవిగాడిగలయ్య నృపాలువీటికిన్. [ఆ.3]
ఉ. విన్న దనం బిదేమి నెఱివీడినచిత్త మిదేమి వేయిక్రా
ల్గన్నులవా డిదేమి శరఘాతల నెత్తు రిదేమి వెంబడిం
గిన్నరసిద్ధకింపురుషఖేచరవీరులురా రిదేమి మీ
యున్నవిధం బిదేమి నిఖిలోన్నతశాసన పాకశాసనా. [ఆ.3]
ఉ. భానుమతీకుమారకుడు పల్కు మహేంద్రుని దేవ యె
వ్వానికి గెల్పు నోటమియు వచ్చు నొకానొక వేళ దీనికై
దీనత యింతయేటికి మదీయభుజాగ్ర ధనుర్విము క్తనా
నానిశితాస్త్రపాతముల నాకుల నే నవలీల గాచెదన్. [ఆ.3]
ఉ. మేలు బళీ చతుర్ముఖుడు మిక్కిలి నేర్పరి యెట్టులన్న నీ
బాలిక మాదిలీపనరపాలకుదేవిగ నిశ్చయించె ల
క్ష్మీలలనేశునాభిసరసీరుహమందిరవర్తి యైనవా
డేల యొనర్చు వేదజడు డేనియు నీడుకురానిచేతలన్. [ఆ.4]
చ. కుడిచెవి జేరి మంచుమలకూరిమియల్లుడు తారకంబు మున్
నొడుపున గూర్చి పల్కుచు వినోదము సల్పగ సేదదేఱి చె
ట్టడచిన జేటెడన్నినిటలాంబకమూర్తులు కానవచ్చు నా
మడ పరుగెత్త నేల యఘమర్దననిర్దయ మైనకాళికన్. [ఆ.4]
శా. ఏణాంకోపలసౌధవీధికలపై నింపొంది చిత్రంబులౌ
వీణ ల్కేల ధరించి రాగలహరీతస్ఫూర్తిమై జొక్కుచున్
జాణల్ సాధ్యకుమారు లాగమవిధానస్నిగ్ధగానంబులన్
ద్రాణ ల్మీఱగ నాలపించెదరు చిత్తప్రీతిమై వింటిరే, [ఆ.5]
మ. కమలామందమరందబిందుకణికాకల్లోలడోలావిలో
లమరాళీగరుదంచలత్సవనబాలక్రీడనప్రోల్లస
త్కుముదామోదిపరాగవాసితదిశా కుంభీంద్రగండస్థలీ
సముదాయం బలరున్ నృపాల యొక కాసారంబు దూరంబునన్. [ఆ.5]