ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/తాళ్ళపాక తిరువెంగళనాధుడు

ద్ధండతరప్రబోధసముదంచితదీపము సర్వలోకనా
ధుం డగుచక్రికిం బ్రియముతోడ సమర్పణ చేసె నయ్యెడన్. అ. 1.

ఉ. ఇంతుల గూడి చిట్టకము లి ట్లొనరింపగ నించు కేనియున్
వింతతెరంగు లేక ధరణీధరముంబలె నున్నయాదృఢ
స్వాంతుని జూచి రాపతిమచక్కిలిగింతలువోలె గంటిరే
మెంతయు రిత్తవోయె మసయిందరిచేష్టలు నంచు నవ్వుచున్. ఆ. 2.

ఉ. దేవుడొ మౌనియో యని మదిం దలపోతలు నాకె కాని నిన్
వేవురు వేయిచందముల నిందయొనర్చెద రిప్డు మూగయన్
పావులనోరు నీయెడమపాదతలంబున దన్నినట్లుగా
నీవొక యింతయావురని యేడ్వగదన్న కుమారరత్నమా. ఆ. 1.


31. తాళ్ళపాక తిరువెంగళనాధుడు

ఇతడు నందవరీకబ్రాహ్మణుడు; ఆశ్వలాయనసూత్రుడు; భరద్వాజగోత్రుడు. ఈకవి పరమయోగివిలాస మనుపేర నాళ్వారుల చరిత్రమును ద్విపదకావ్యముగా నెనిమిదాశ్వాసములగ్రంథమును రచించెను. ఈగ్రంథరచనబట్టియే యితడు విష్ణుభక్తుడని స్పష్టమగుచున్నది. ఇతడు తాళ్లపాక యన్నయార్యుని మనుమడును, తిరుమలార్యునిపుత్రుడును అయినట్టు గ్రంథారంభమునందలి యీక్రిందివాక్యములవలన దెలియవచ్చుచున్నది-


ద్వి. హరిసేవ కాశ్వలాయనసూత్ర నంద
వరవంసభవ భరద్వాజగోత్ర
పావనశ్రీతాళ్ళ పాకాన్నయార్య

ధీవిశారదసూను తిరుమలాచార్య

వినుతనందను దిరువేంగళనాధు.


ఈకవితాత యైనయన్న యార్యుడు కృష్ణదేవరాయనికాలములో నుండి కొన్నియగ్రహారముల నందెను. కవి తనకు వేంకటాద్రిరాయలు కుండలములు వేసినట్లు తనగ్రంథములోని యెనిమిదవయాశ్వాసాంతము నందీవాక్యములచే జెప్పుకొన్నాడు.


ద్వి. అతిలోకమతికి శేషాచలరాజ

పతికి బరాముఖ్య భక్తసంతతికి

నంకితంబుగను శ్రీహరిభక్తనికర

పంకజార్యమ తాళ్ళపాకాన్నయార్య

తనయ తిమ్మార్య నందన రత్నశుంభ

దనవమ శ్రీవేంకటాద్రీశ దత్త

మకరకుండలయుగ్మ మండితకర్ణ-


ఈకవికి మకరకుండలములువేసిన వేంకటాద్రిసుచరిత్రము కృతినందిన తిరుమలదేవరాయని తమ్ముడని తోచుచున్నది. అట్లే యైన పక్షమున కవి 1570 వ సంవత్సరప్రాంతములయం దుండెను. అట్లు గాక యతడు తిరుమలదేవరాయని కొడుకైన వేంకటాద్రి యైనపక్షమున, అతడు 1585 వ సంవత్సరము మొదలుకొని 1614 వ సంవత్సరమువఱకును రాజ్యముచేసినందున కవియు నాకాలమువాడే యయి యుండవలెను. కవియొక్క కవిత్వరీతి తెలియుటకయి ద్వితీయాశ్వాసమునుండి కొంచెముభాగ ముదాహరించుచున్నాను-


ద్వి. భానుకోటిస్ఫూర్తి బ్రహసించుచున్న

మౌనినందను గాంచి మది సంతసించి

పిల్లిగా దోరి జాబిల్లి గాబోలు

జల్లనివెన్నెల జల్లుచున్నాడు;